నీటి అన్వేషణలో వన్యప్రాణులు

వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. అడువుల్లోని నీటి వనరులు ఎండిపోతున్నాయి. దాహార్తి కోసం వన్యప్రాణులు విలవిలాడే ప్రమాదం ఉంది.తాగునీటి కోసం ఆరుబయట కొచ్చిన అడవి జంతువులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్న క్రమంలో అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ ప్రణాళిక రూపొందించింది.అడవుల్లో సాసర్‌పిట్స్‌, చిన్ననీటి కుంటల్లో నీరు నింపే చర్యలు చేపట్టారు.అనుమానిత ప్రాంతాల్లో నిఘా తీవ్రతరం చేస్తున్నారు.వేటగాళ్ల బారినుంచి వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. గ్రామాల్లోకి తాగునీటి కోసం వన్యప్రాణులు వస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చేలా చైతన్యం కల్పిస్తున్నారు.
దేశంలోనే పెద్దపులులకు ఆవాస కేంద్రం నల్లమల్ల అటవీ ప్రాంతం. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో వేసవి కాలం వచ్చిందంటే ముందస్తు గానే అటవీశాఖ అధికారులు నామ మాత్రపు చర్యలు చేపట్టి వన్యప్రాణుల దాహార్తిని తీర్చేం దుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. అయితే అడవిలో వన్య వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీరు ఏ మాత్రం సరి పోవడం లేదు. అభయారణ్యంలో ఉండా ల్సిన పెద్దపులి దాహం తీర్చుకునేందుకు జనావాసం లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ నిధులను ఎంత ఖర్చు చేస్తుంది అనే లెక్కల్లో నేటికీ స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద పులుల సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లమల అటవీ ప్రాంతం లోని నాగార్జు నసాగర్‌.. శ్రీశైలం పెద్దపులుల అభయా రణ్యంగా ప్రకటించింది.దేశవ్యాప్తంగా పరిచయమైన ఈ శాంచారి నల్లమల సొంతం. వాస్తవంగా ఇక్కడ పెద్దపులుల సంతతి తగ్గి పోతుండగా.. ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు పులుల లెక్కింపు చేస్తారు. వేసవిలో పెద్ద పులుల మనుగడ దినదినగండంగా మారు తోంది. అడవుల్లో నీటి లభ్యత ఆవాసాలు లేకపోవడంతో జనారణ్యంలోకి వస్తున్న సంద ర్భాలు ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో ఎన్నో ఉన్నాయి. ఆ సమయంలో వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ కోసం నిధులు పుష్కలంగా ఉన్నప్ప టికీ అటవీశాఖ అధికారులు అరకొర చర్యలు తీసుకుంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతం లోని నంద్యాల జిల్లా పరిధిలో గల ఆత్మకూరు డివిజన్‌ ఆత్మకూరు, వెలుగోడు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం రేంజిలో పెద్ద పులుల సంతతి అధిక సంఖ్యలో ఉంటుందని అటవీ శాఖ అధికారుల గణాంకాలు తెలుపు తున్నా యి. ఈ వేసవిలో మాత్రం నీటి కొరత తక్కువ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. 40 డిగ్రీల ఉష్ణోగ్ర తతో ఎండలు మండుతున్న ఈ పరిస్థితుల్లో నంద్యాల, కర్నూల్‌, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో గల నల్లమల్ల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అభయారణ్యంలో 3,568 చదరపు కి.మీ విస్తరించి ఉన్న తమ ఆవాసా లను పెద్ద పులులు వీడి నీటి కోసం మైదానం ప్రదేశాల వైపు వస్తున్నాయి. ఈ వలస పయ నంలో వన్యప్రాణుల మధ్య నీటి యుద్ధం, సరిహద్దుల వివాదం నెలకొంటోంది. ఆధిపత్య పోరులో పెద్ద పులులు చిరుతలు ఎలుగుబంట్లు ఇతర వన్యప్రాణులు మరణిస్తున్నాయి.
వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం..
వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వేసవిలో దప్పిక తీర్చేందుకు అడవుల్లో నీటి గుంతలు, చెక్‌ డ్యామ్‌లు, సాసర్‌లు అవసరాన్ని బట్టి సోలార్‌ బోర్లను ఏర్పాటు చేసింది. నీటి లభ్యత ఉన్న ప్రాంతా లకు దాహర్తిని తీర్చుకునేందుకు వచ్చే జంతువులు వేటగాళ్లకు చిక్కకుండా సీసీ కెమెరాలు, బెస్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తు న్నారు. అడవుల జిల్లాలుగా పేరున్న ములుగు, భూపాలపల్లి జిల్లాలో వన్యప్రాణులను కాపాడేం దుకు అధికారులు కాంపా నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వేసవి దప్పికతో విలవిల..
మండుతున్న ఎండలతో అడవుల్లో ఆకులు రాలిపోతున్నాయి. వాగులు, వంకలు, గుంటల్లో నీళ్లులేక పగుళ్లు పారుతుంటాయి. దీంతో అటవీ ప్రాంతం లో గొంతు తడుపుకునేందుకు నీటిచుక్క కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణుల దప్పికతో విలవిలలాడు తుం టాయి. దుప్పులు, అడవి పందులు, కృష్ణ జింకలు, అడవిదున్న, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, కుందేళ్లు తదితర అడవి జంతువులు నీళ్ల కోసం వేసవిలో దాహర్తితో అల్లాడుతుంటాయి. అడవి జంతువులు నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వస్తున్నాయి.వేటగాళ్ల దృష్టిలో పడితే ఇక వన్యప్రాణులు గాలి లో కలిపి పోవాల్సింది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, ఆజాంనగర్‌, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం,కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లోని అడవుల్లో అడవి జంతువులు వేటగాళ్లకు ఆహారంగా మారుతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రాంతా లకు వచ్చే జంతువులపై వేటగాళ్లు గురి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వన్య ప్రాణులను కాపాడుకునేందుకు ప్రభుత్వం అడవుల్లోనే నీటి వసతులను కల్పించేందుకు కాంపా పథకం ద్వారా నిధులు కేటాయిస్తోంది.
అడవుల్లో నీటి గుంతలు..
వన్యప్రాణులను వేసవి దప్పిక నుంచి కాపా డేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. 2016 నుంచి భూపాలపల్లి, ములుగు జిల్లాలో సుమారు రూ.30 కోట్ల కాంపా నిధులతో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా అటవీశాఖ పరిధిలో 52 నీటి గుంతలు, 119 మినీ పీటీ (పెర్కోలేషన్‌ ట్యాంకు)లు, 65 పెర్కోలేషన్‌ ట్యాంకులు, 134 చెక్‌డ్యాంలు, 102 సాసర్‌పిట్స్‌,9 సోలా ర్‌ బోర్లు,151 రాక్‌ఫిల్‌ డ్యాంలు, 28 చెలి మెలు తదితర నీటి వసతులను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో 100కు పైగా నీటిగుంతలు, 55 సిమెంట్‌ నీటి తొట్టెలు,.660 చిన్నరాతి కట్టడాలు, 50 పెర్కులేషన్‌ ట్యాంకులు, 6 సోలార్‌ బోర్‌ వెల్స్‌ ఏర్పాటు చేశారు. అడవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. వీటిలో ట్రాక్టర్లు, మిని వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటిని నింపుతున్నారు. గ్రామాలకు దూరంగా ఉన్న వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల, మహాముత్తారం అడవుల్లో సోలార్‌ ఆధారిత బోర్లు ఏర్పాటు చేశారు. ఈ బోర్లతో చుట్టుపక్కల చెక్‌ డ్యామ్‌లు, నీటి గుంతలు, నీటితొట్టే (సాసర్‌) లతో నీటిని నింపుతున్నారు. వారానికి ఒకటి రెండు సార్లు తప్పకుండా నీటిని నింపేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించటంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. పైగా నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లో గడ్డి కూడా మొలిచే అవకాశం ఉంటుందని, ఈ గడ్డి జంతువులకు ఆహారంగా ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. అలాగే వన్య ప్రాణులు ఆకలి, దప్పిక కోసం ఎంచుకున్న ప్రదేశాల్లో కృత్రిమంగా నీరునిల్వ ఉండేలా చెక్‌డ్యాంలు నిర్మించారు. నీటి వనరులు లేని చోటబోర్లు వేసి సోలార్‌తో నడిచే మోటర్లను బిగిస్తున్నారు. తద్వారా వన్యప్రాణుల కోసం నీరు, గడ్డి కొరత తీర్చగలుగుతున్నారు.
వేటగాళ్లకు పండుగే..
వేసవి వచ్చిందంటే వేటగాళ్లకు పండుగే. వేసవిలో నీటి లభ్యత ఉండే ప్రాంతాలపై వేటగాళ్లు దృష్టి సారిస్తారు. గోదావరి తీరంతో పాటు అడవుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వేటగాళ్లు ఉచ్చులు, వలలు వేయటంతో పాటు బాణాలు, నాటు తుపాకీలు, మందుగుండు సామగ్రితో జంతువులపై దాడికి వ్యూహలు అమలు చేస్తుంటారు. అడవిశాఖ అధికారులు వన్యప్రాణుల కోసం అడవిలో ఏర్పాటు చేసే నీటి గుంటలు, చెక్‌ డ్యామ్‌లు, సాసర్‌లు, సోలార్‌ బోర్ల సమీపంలోను వేటగాళ్లు దాడులకు పాల్పడుతుంటారు. దీనికి చెక్‌పెట్టి వన్యప్రాణులను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పలిమెల, మహదేవపూర్‌, మహముత్తారం, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం,వాజేడు అడవి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా రు. వీటితో పాటు ఏటూరునాగారం అభయారణ్యం, పలిమెల, మహముత్తారం అడవుల్లో బెస్‌ క్యాంపులతో పాటు రాత్రి వేళల్లో ప్లాయింగ్‌ స్క్వాడ్‌లు తిరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇటీవల కాలంలో ములుగు, భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల అడవి జంతువు లను వేటాడిన వారిని అడవిశాఖ అధికారులు పట్టుకున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ వన్యప్రాణులకు రక్షణ కవచంగా మారిందనే టాక్‌ వినబడుతోంది…
అటవీశాఖ అధికారుల చర్యలు ఇంతేనా..
జనవరి నెల వచ్చిందంటే అటవీశాఖ అధికారులు వరల్డ్‌ వ్డైల్లఫ్‌ నిధులతో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు నిధులు కేటాయిస్తారు. ఇందులో భాగంగా ప్రత్యేక నీటి వసతి ఏర్పాటు- చేయాలి. ఆయా అటవీ రేంజ్‌లలో క్రూ త్రీయ సాసర్‌ పిట్‌లను నిర్మించి వాటిని నీటితో నింపాలి, జంతువుల శరీరాలు జీర్ణ వ్యవస్థ శరీరంలో నీటి శాతం తగ్గకుండా సాల్‌ టు లిరిక్స్‌ (ఉప్పు దిమ్మలను) ఏర్పాటు చేస్తూ 24 గంటలు సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తూ వాటి కదలికలను గమనిం చాలని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వేసవి కాలంలో వేటగాళ్లు మాటువేసి జంతువులను మట్టి పెడుతున్నారు.
పక్షులు,పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండిసెల్వి, సిస్టర్‌, విశాఖ మరియా మేక్స్‌
పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి అని ఆరిలోవ లోని విశాఖ మరియా మేక్స్‌ సంస్థ ప్రతినిధి సిస్టర్‌ సెల్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం సంస్థ కార్యాలయం వద్ద ఎకో వైజాగ్‌ జివిఎంసిలో భాగంగా గ్రీన్‌ క్లైమేట్‌ టీం ఎన్‌ జిఒ పక్షులు, జంతువులు, ఇతర జీవుల కోసం నీరు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకో వైజాగ్‌ గురించి 5వేల కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు కృషి ప్రారంభించామన్నారు. ఈ వేసవిలో పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. విశ్వం లో ఇంత వరకూ శాస్త్రవేత్తల పరిశో ధనల ప్రకారం ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందన్నారు. మానవాళి మనుగడ సమస్త జీవరాసులతో పెనవేసి ఉందని,ఏజీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మను గడకు ఇబ్బంది కలిగిస్తుంది అని హెచ్చరిం చారు. ఏక్షన్‌ ఎయిడ్‌ ఫెలోషిప్‌ ప్రతినిధి కృష్ణకుమారి మాట్లాడుతూ పిచ్చుకల పరిరక్షణకు గూళ్ళు ఏర్పాటు చేయాలని, ధాన్యం, చిరుధాన్యాలు అందుబాటులో ఉంచా లని కోరారు. ప్రతి ఒక్కరూ తాము తినే పండ్ల విత్తనాలు ఆర బెట్టండి.వర్షాకాలంలో కొండల్లో జల్లుదాం అని ఆయన కోరారు. పండ్లు జాతి మొక్కలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలు, పక్షులు, జంతువులకు ఆహారం అందించే, ఆశ్రయానికి ఉపకరించే చెట్లు అధికంగా పెంచాలని కోరారు. గ్రీన్‌ క్లైమేట్‌ టీం ఎన్‌జి ఒ వ్యవ స్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లా డుతూ జల వనరులు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలనిలని, ప్రతి ఒక్కరికీ అవగా హన కల్పించేందుకు కృషి చెయ్యాలి అని ఆయన కోరారు. బెంగళూరు లో ప్రజలు నీటి కోసం అల్లల్లాడి పోతున్నారని, ఆ పరిస్థితి విశాఖ నగరంలో రాకముందే అందరూ భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చెయ్యాలి అని అన్నారు. నీరు, చిరుధాన్యాలు పక్షులు జంతువులకు అందుబాటులో ఉంచే మీ పిల్లలు, మనవళ్ళ ఫొటోలు, మీ ఇంటి వద్ద నీరు తాగుతున్న, ఆహారం తింటున్న పశు, పక్ష్యాదుల ఫొటోలు మీ స్టేటస్‌ లో పెట్టండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్‌ చేయమని చెప్పండి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ప్రతి ఒక్కరినీ స్పందింప చేయండి అని కోరారు. -(జి.ఎ.సునీల్‌ కుమార్‌)