నిస్సహాయంగా ముగిసిన కాఫ్‌`29 సదస్సు

భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్‌29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన వాతావరణ నిధిపై ముసాయిదా సత్వర కార్యాచరణకు ఏ మాత్రమూ అనువుగా లేదని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేలా కొత్త ఆర్థిక లక్ష్యాలతో ముసాయిదా వుండాలని వర్ధమాన, నిరుపేద దేశాలు భావిస్తున్నాయి. ఏడాదికి లక్ష కోట్ల డాలర్లు వుండాలని ఎల్‌ఎండిసి గ్రూపు సూచించింది. ముసాయిదాను క్లిష్టతరంగా మార్చ యడంపై పేద దేశాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న దుష్ప్రభావాలను తగ్గిం చేందుకు అజర్‌ బైజాన్‌లోని బాకులో జరిగిన కాప్‌ 29 సదస్సు ఫలవంతమైన కార్యాచరణను ప్రతిపాదించకుండానే ముగిసింది.ఈనెల 11వ తేదీన మొదలై,22వ తేదీవరకూ12రోజులపాటు జరిపిన చర్చలు సంపన్న దేశాల స్వార్థగుణాన్ని, పర్యావరణంపట్ల వాటి పాక్షిక దృష్టిని మరోసారి బయటపెట్టాయి. తాము సృష్టిస్తున్న కాలుష్యాన్ని,కర్బన ఉద్గారాల పాపాన్ని ప్రపంచం నెత్తిన వేసి,తాము చేతులు దులుపుకోవాలన్న అతి తెలివితోనే అవి వ్యవహరించాయి.
దేశాలకు సరిహద్దులు ఉంటాయి కానీ,పర్యావరణాన్ని హరించే కర్బన ఉద్గారాల వ్యాప్తికీ,వాటి పర్యవసానాలకు నియంత్రణ రేఖలు ఉండవు. ధనిక దేశాలు ఏళ్ల తరబడి అనుభవిస్తున్న సర్వ సౌఖ్యాలకు ప్రకృతి వనరులు దహించి వేసి,కీడు ఉద్గారాలను భూగోళం మీదికి వదులుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 75శాతం వాటా ధనిక దేశాలదే! సహజ వనరుల విచ్చలవిడి వినియోగంతో తరుముకొస్తున్న ఈ ఉద్గారాల విపత్తు భూరక్షక హరిత వలయానికి చిల్లులు పెట్టి, ప్రపంచం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈపాపం పూర్తిగా సంపన్న దేశాలది కాగా,దాని పర్యవసానాలకు బడుగు, వర్ధ మాన దేశాలు బలికావల్సి వస్తోంది.ఈ వాస్తవాన్ని అంగీకరించటానికి, పర్యావరణ పరిరక్షణలో తదనుగుణమైన పాత్ర వహించటానికీ ధనిక దేశాలు సంపూర్ణ సంసిద్ధతను వ్యక్తం చేయటంలేదు.అందువల్ల రోజుల తరబడి సదస్సులు జరిగినా తూతూమంత్రపు తలూపులతోనే అవి తంతుగా మిగిలిపోతున్నాయి.
కాప్‌`29 సదస్సులో వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నిలిచి,సంపన్న దేశాల నిర్దిష్ట బాధ్యతను గుర్తు చేశాయి.‘ఎంత హరిస్తున్నారో అంత భరించాలి’ అన్న న్యాయబద్ధమైన హితవుతో ఏటా 1.3లక్షల కోట్ల డాలర్లను పర్యావరణ రక్షణకు వెచ్చించాలని కోరాయి.కానీ,ధనిక దేశాల సన్నద్ధత 30వేల కోట్ల డాలర్ల దగ్గరే ఆగిపోయింది!ఈపాటిదానికి పన్నెండు రోజులపాటు పర్యావరణ హిత మంటూ ప్రపంచమంత రాగం తీయటం దేనికి?ఏదేశం ఎంత కాలుష్య కారక మవుతుందో,ఏదేశం ఎంతెంత పచ్చదనంతో ప్రపంచపు ఆరోగ్యానికి కారణమవు తుందో పక్కాగా లెక్కలను అనేక నివేదికలు ఘోషిస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు పర్యావరణ ధ్వంస సంపన్న దేశాలు హరిత సౌభాగ్యానికి తోడ్పడుతున్న వర్ధమాన దేశాలకు నిండుగా నిధులిచ్చి, ప్రోత్సహించటం అత్యంత అవసరమైన బాధ్యత. ఆ కనీస వివేచనను విడిచిపెట్టి, కొద్దిపాటి విదిలింపులతోనే సరిపెట్టటం, అదేదో తమ దాతృత్వ గుణానికి దాఖలాలా వ్యవహరించటం సబబు కాదు. పైగా ఈపాటి మాటకైనా ఆచరణ ఏమాత్రంగా ఉంటుందన్నది సందేహాస్పదమే! క్లయిమేట్‌ ఫైనాన్స్‌ కింద ఏటా 10వేల కోట్ల డాలర్లు ఇస్తామని 2009లో సంపన్న దేశాలు ఒప్పు కున్నాయి. కానీ, గడచిన పదమూడేళ్లలో దానిని పాటించింది ఒక్కసారే! ఇలాంటి మాట తప్పుడు తంతుతో పర్యావరణానికి ఏమాత్రమూ మేలు జరగదు.
ధనిక దేశాల పక్షపాత వైఖరిని, బాధ్యతారాహిత్యాన్ని వర్ధమాన దేశాలు గుర్తించి,గర్హించటం దాదాపు ప్రతి కాప్‌ సదస్సులోనూ జరుగుతోంది.ఈసారి కూడా తగిన మొత్తంలో పర్యావరణ నిధిని ఇవ్వాల్సిందేనని సంపన్న దేశాలను వర్ధమాన దేశాల ప్రతినిధులు నిలదీసిన ప్రతిసారీ హర్షధ్వానాలు మార్మోగాయి. ’’సంపన్న దేశాల వద్ద నిధులు లేక కాదుబీ అవి భౌగోళిక రాజకీయాలకు పాల్పడడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది’’ అని కొలంబియా పర్యావరణ శాఖ మంత్రి సుశానా మహ్మద్‌ వ్యాఖ్యానించినప్పుడు ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సదస్సు నీడన సంపన్న దేశాలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటానికి అనేక ప్రతిపాదనలను, ఒప్పందాలను ముందుకు తెచ్చాయి. క్లయిమేట్‌ ఫైనాన్స్‌ని అంతర్జాతీయ పెట్టుబడుల వ్యూహంగా మార్చే పన్నాగాలకు పదును పెట్టాయి. కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రాజెక్టులకు పెట్టుబడులు పెడతామంటూ కార్పొరేటు దిగ్గజాలు బరిలోకి దిగటం ఇందులో భాగమే! అసలు ప్రమాదాన్ని చిత్తశుద్ధితో ఎదుర్కోకుండా లాభార్జన దుర్బుద్ధితో వ్యవహరిస్తే భూగోళం మరింత రుజాగ్రస్తం అవుతుంది.ఈఎత్తుగడలను తుత్తనియలు చేస్తూ,సంపన్న దేశాల మెడ మీద బాధ్యతల కాడిని మోపటం వర్థమాన దేశాల ఉమ్మడి బాధ్యత.– గునపర్తి సైమన్‌