నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రణాలు నిలువెత్తు ప్రతిష్ట
మతానికి ప్రతీకారానికి మణిపూర్ రాష్ట్రం బలి యవుతుంటే ద్వేషంతో దేశ ప్రజలు విడిపో తున్నారు. ‘‘ఉపన్యాస విన్యాసాలతో దేశ ప్రజల శిరస్సులకు చేతబడి జరుగుతుంది’’ అంటూ జూకంటి జగన్నాథం అనే కవి పలికినట్లు.. మణిపూర్ ఘటనలు ఒక ఎత్తైతే దాని పర్యవసానాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలపై చూపుతున్న ప్రభావం మరింత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.
ప్రస్తుత ఈ పదేళ్ల కాల పరిపాలనలో చోటు చేసుకుంటున్న ప్రధాన మార్పు ఏమంటే జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్లపై దాడి జరుగుతుంది. వండి వార్చిన అభిప్రాయాలను ప్రజల ఆలోచనలపై నిండుకుండలా కుమ్మ రించి అంధ భక్తులను తయారు చేయడంలో నేటి మితవాద పాలకులు సఫలీ కృతం అవు తున్నారు. ఇద్దరు మహిళలను వివస్త్రులను చేసి అంగాంగ ప్రదర్శన చేయడమే కాకుండా వాటిని తమ వికృత చేష్టలతో తడుముతూ బహిరంగ మానభంగం చేసి హతమార్చిన సంఘటనను దేశం కళ్ళారా చూసింది. జరిగిన 72రోజుల తర్వాతగాని ఈ అంశం బాహ్య ప్రపంచం దృష్టికి రాలేదు.మే4వ తారీఖున సంఘటన జరిగితే మే18వతారీఖున భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ సంఘటన జూలై 19వ తారీఖున ఒక వీడియో ద్వారా ప్రజల ముందుకు వచ్చిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన అఘాయిత్యాలను, జరగని పోలీసుల చర్యలను ఖండిరచడం ఒక బాధ్యత.అలా సోషల్ మీడియాల ద్వారా ఖండిరచబడుతున్న వాటిని, అంధ భక్తులు ప్రతి ఖండిస్తూ విద్వేషాలతో ఊగిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మరొక రాష్ట్రంలో జరగలేదా, మానభంగాలు మర్డర్లు మరెక్కడా జరగలేదా? అంటూ సమర్ధించుకుంటున్నారు. అబలలపై జరిగిన ఆకృత్యాలను సమర్థించుకు నేదా సంస్కారం అంటే? ఇది ఒక్కటే కాకుండా మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడిన ఒక యువకుడి తల నరికి ఇంటి ముందున్న తడికె కు వేలాడదీసిన ఫోటో జూలై 22వ తారీకు ఆంధ్రజ్యోతిలో దర్శనమిచ్చింది. వెంటనే భక్తులు రంగంలోకి దిగి ‘‘కాశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయం సంగతి చెప్పండి’’ అంటున్నారు. జరుగుతున్న అన్యాయాలన్నింటికీ చారిత్రక తప్పిదాలే సమాధానాలా? భాజపా నాయకురాలు విజయశాంతి తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ లాంటివాళ్ళు ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని ఖండిస్తే వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదేనా సంస్కారం అంటే? జగన్మాత, భారత మాత, కాళీమాత అంటూ ఏవేవో పేర్లు పెట్టి మహిళలకు గౌరవం ఇస్తున్నట్టుగా ఫోజులు కొట్టేవాళ్ళు మహిళలపై జరుగుతున్న దాడులను కనీసం ఖండిరచడానికి మొహం చాటేస్తున్నారు ఇది సిగ్గుచేటు కాదా? మతాలు మత ఛాంద సవాదులు ముఖ్యంగా రాజకీయాలను మతంతో ముడిపెట్టి, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయా లను నడిపిస్తున్న నేటి పాలకులు వారి అనుయా యులు మరియు వారి వార్తల మాధ్యమాలు ఎన్నడూ మహిళల గౌరవానికి ప్రాధాన్యతను ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఆధిపత్య భావజాలం లో అది అసాధ్యం.‘‘ఎత్తి చూపిన పాలిండ్లు కరుణ చూపని కఠిన శిలలయ్యే వరకూ, గగుర్పొడిచేలా గరళ బీజా లు నాటిన గర్భసంచుల్లో గన్నేరు కాయలు కాసే వరకూ, ఈ యాత్ర ఇలాగే కొనసాగుతోంది’’ అంటూ కవయిత్రి పాడిబండ్ల రజిని చెప్పిన ఆగ్రహ వాక్యాలు నిజమనిపిస్తున్నవి. ఇక తమ ఆగడాలను కప్పిపుచ్చుకోవడానికి దేశము, మతము అభద్రతలో ఉన్నాయనే ముసుగును కప్పుకుంటున్నారు. దేశంలోకి మయన్మార్ ప్రాంతం నుండి రోహింగ్యాలు చొరబడుతు న్నారు ఇది మయన్మార్ మరియు చైనా దేశాల కుట్ర అంటూ అసత్య ప్రచారాలతో ఊదరగొడు తున్నారు. పదేళ్ల నుంచి పాలిస్తున్న వారు, దేశ సరిహద్దులను తమ హద్దులలో పెట్టుకున్న వారు,ఈ మాట అంటుంటే నమ్మడానికి మన కున్న వివేకం ఏమైనాట్లు. ప్రతి సంఘటనను విదేశీ కుట్రతో ముడిపెట్టడం కుసంస్కారం కాదా? ఇక మణిపూర్‌లో హిందూ మతం అబద్రతలో పడిరదంటూ క్రైస్తవ మతం ఆధి పత్యం చాలాయిస్తుందంటూ మరో అసత్య వాదనకు నిస్సిగ్గుగా తెర తీస్తున్నారు. మైదాన ప్రాంతంలో నివసించే వారంతా మైతేయులని, వారంతా హిందువులని, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారంతా కుకీ జాతికి చెందిన గిరిజన క్రైస్తవులని తెలుస్తుంది. దేశం లో ఎక్కడైనా కొండ ప్రాంతంలో ఉన్న వారికి రిజర్వేషన్లు అమలులో ఉన్నవి. కొండ ప్రాంతం లో ఉన్న భూమిని ఇతరులు ఎవరు కొనకుండా 370అధికరణం కింద ఆంక్షలు ఉన్నవి. మరి ఈరోజు అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం మైదానంలో ఉండే మైతేయులకు ఎస్టీ హోదా కల్పించడంలో ఉన్న ఆంతర్యం ఏమంటే కొండ ప్రాంతాల్లో కూడా వాళ్ళు భూమిని కొనవచ్చు, సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఉద్దేశంలో సామాజిక అంశం ఉన్నదా,ఆర్థిక అంశం ఉన్నదా?కొండ లోయల్లో విరివిగా పండే నల్ల మందు వంటి వాణిజ్య పంటలను హస్తగతం చేసుకోవడం కోసమే కదా ఈ రకమైన రాజకీ య ఎత్తుగడ భాజపా ప్రభుత్వం వేసింది! పేదరికపు నిష్పత్తి గిరిజనులకు మించిన స్థాయిలో మిగతా సమూహాల్లో ఉన్నదా? అయినప్పటికిని భాజపా రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా తన రాజకీయ నిర్ణయాన్ని ఏనాటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నది. ఇది చాలదా వారి అసలైన అంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి? ఈ అసలైన ఆర్థిక ఆధిపత్యపు అంశాన్ని పక్కనపెట్టి జాతుల మధ్య మతాల మధ్య జరుగుతున్న రచ్చ గా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇది తెలియని అంధ భక్తులు హిందూ మతం ప్రమాదంలో పడిరది, భవిష్యత్తులో ఇతర మతాలు ఆధిపత్యం చెలాయిస్తాయి, అనే న్యూనతాభావంతో అనవసర విద్వేషాలకు లోనవుతున్నారు.
మూడు నెలల నుంచి జరుగుతున్న ఈ సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించి భారతదేశ పరువును బజార్లో పెట్టాయి. భారతదేశంలో మతసహనం లేదని ఒక్క మణిపూర్ రాష్ట్రంలో 250చర్చిలకు పైగా కూల్చబడ్డాయని ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో, ఇంగ్లాండ్‌లోని హౌస్ ఆఫ్ కామన్ సభలో ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఇలాంటి పర్యవసానాలు దేశానికి నష్టదాయకం కావా?అసలు పరిస్థితి ఇంత దాకా ఎందుకు వచ్చింది.‘‘ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్’’ అనే ఇంగ్లీషు సామెత అర్థం ఏమంటే సరైన సమయంలో స్పందిస్తే సమస్య పెరిగి పెద్దది కాదు అని. సరైన సమయంలో స్పందించక పోవడమే కాక రాష్ట్ర ప్రభుత్వం వహించిన అలసత్వం, రిజర్వేషన్లపై కోర్టు తీర్పును పునః సమీక్షించని విధానం, ఈ దుస్థితికి దారితీ సాయి. ఒక రాష్ట్రంలోని ఎన్నికల దృష్ట్యా వ్యవసాయ సంస్కరణల నల్ల చట్టాలపై వెనక్కి తగిన కేంద్రం మణిపూర్ అంశంలో అదే చొరవ చూపలేకపోయింది. మణిపూర్ ప్రజలపై నిప్పుల వర్షం కురుస్తుంటే కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పూలజల్లు కురిపించుకోవడానికి ఇష్టపడిన పెద్దలు దీనికి బాధ్యత వహించాలి. ఒక అమ్మాయిని దుశ్శాసనులంతా కలిసి నగ్నంగా ప్రదర్శిస్తున్న అంశాన్ని కళ్ళారా చూసిన తర్వాత గాని పెద్ద మనిషికి నోరు పెకల లేదు. తెరిచిన ఆనోటి తుంపరలు పక్క రాష్ట్రాల పై వెదజల్లెందుకు తాతహలాడాయి.ఈసందర్భం గా చరిత్రను ఒకసారి గమనించాలి.1946లో బెంగాల్ ప్రావిన్స్ లోని నొవాకలి ప్రాంతంలో జరిగిన మత ఘర్షణలు అత్యంత దారుణ మైనవి. ముస్లిం లీగ్ మరియు హిందూ మహాసభలు భారతదేశ వేరువేరు మత రాజ్యాలుగా ఉండాలని ప్రజల్లో నూరి పోయడంతో, క్షేత్రస్థాయిలో అవి మత ఘర్షణలకు దారితీసాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఆ ప్రాంతంలో అనేకమంది హిందువులను ప్రభుత్వ అండదండలతోనే ఊచకోత కోశారు. హిందువులు మైనారిటీలో ఉన్నప్పటికీ అనేకమంది హిందువులు భూస్వాములుగా చలామణి అవుతూ ఉండే వారు. కానీ హిందువులను ఏనాడు వారు రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. అరకొరగా అందిన వార్తల ఆధారంగా మహాత్మా గాంధీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఎంక్వయిరీ చేయసాగారు. కానీ అప్పటి బెంగాల్ ప్రభుత్వం అసత్య సమాచారాన్ని ఇస్తూ అంతా సవ్యంగా ఉంది అనే సంకే తాలను పంపింది. ఒకానొక రోజు మహాత్మా గాంధీ ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షులు జేబీ కృపలానిని బెంగాల్ సందర్శించడానికి ఆదేశించవలసి వచ్చింది. ఆయన తన సతీమణి సుచేత కృపలాని నీ వెంటబెట్టు కొని వెళ్లారు. అక్కడి దీన వ్యవస్థలోని ప్రజల ఆర్తనాదాలు అభ్యర్థనలు సుచేత కృపలాని నీ అక్కడే మరో ఆరు నెలలు ఉండేలా చేశాయి. పరిస్థితి సద్దుమణి వరకు సుచేత కృపలాని గారిని అక్కడే ఉంచి జేబీ కృపలాని ఢల్లీి వెళ్లారు. మనందరికీ తెలుసు దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో మునిగి ఉంటే,మాత్మ గాంధీ బెంగాల్‌లోని మత కలహాలను తగ్గించేందుకు అక్కడికి వెళ్లి మకాం వేసి, ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయత్నించారని. ఇలాంటి చరిత్రకు వారసులుగా ఉన్న నేటి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా తమకు గర్వభంగము అవునేమో ననే చీకటి గౌర వాన్ని తలపై మోస్తూ దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇది దేశ ప్రజలలో విపరీత వైశమ్యాలకు దారితీస్తున్నది.‘‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’’ అన్నట్లు పాలకులకే సమయమనం లేకుంటే సామాన్య ప్రజానీకానికి ఎందుకుంటుంది. అంచేత పంతాలు, పట్టింపుల కన్నా పరిష్కారానికి చొరవ చూపాల్సిన సమయం సందర్భం ఇది.-(జి.తిరుపతియ్య)