దసరా అందరూ కలిసే సరదా
ప్రకృతి ప్రసాదించే ప్రత్యేక కాలాల్లో మనుషుల సంతోషాలూ, సందళ్లూ పరవళ్లు తొక్కుతుం టాయి. ఆటపాటలూ, ఆనందాలూ ఆకాశాన్ని తాకుతాయి. ఇది పండగల ఆరంభ సంధర్భం. ఆ తరువాత పండగల్లోకి పురాణగాథలు వచ్చి చేరతాయి. కథోపకథల సంగతి ఎలా ఉన్నా.. పండుగ పరమార్థం పదిమందీ కలిసి ఆడటం, పాడటం, చెడును నిరసించి,మంచికి జేజేలు పలకటం. చెడు మీద మంచి గెలిచిన ప్రతిసారీ మనుషులంతా గెలిచినట్టే.అదే నిజమైన పండగ. దసరా సరిగ్గా అట్లాంటి పండగే. మంచి సాధించిన విజయానికి ప్రతీక. మన అమ్మల వీరత్వానికి ఒక మచ్చుతునక. ప్రకృతిని గౌరవించుకుంటూ మనుషులిచ్చే కానుక. ఈ చివరి వాక్యాలను స్కాన్ చేసి, మనసులో సేవ్ చేసుకోవాలి.ఈ చివరి వాక్యాలను టాటూగా హృదయం మీద వేసుకోవాలి. నిజానికి ఇది దసరాని మరింత గుర్తుచేసుకోవాల్సిన సందర్భం.సింధూ నాగరికత కాలం నుంచీ నేటి వరకూ మన చరిత్రను పరిచీ,తరచీ చూసుకోవాల్సిన సందర్భం.ఈ నేల మీద మాతృస్వామ్య వ్యవస్థ తాలూకా ఛాయలు లీలామాత్రంగా కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనం కాస్త ఫోకస్ చెయ్యాలి. మరి కాస్త జూమ్ చేయాలి. లేదంటే నిర్భయలూ, దిశలూ, గృహహింసా బాధితులు, చైల్డ్ అబ్యూజ్‌కు గురవుతున్న పిల్లలూ, ఆఫీస్‌లో చెవులు కట్టేసుకుని బతుకుతున్న ఉద్యోగినులు.. ఇలా వీళ్లే కనబడుతుంటారు. అదీ నేటి పరిస్థితి.ఇది చెడు మీద కత్తి తిప్పిన దుర్గమ్మను తలుచుకోవాల్సిన సమయం. పురుషాధిక్యపు చెట్టు మీద ఎక్కుపెట్టడానికి సమానత్వపు గొడ్డలిని సిద్ధం చేసుకోవాల్సిన సందర్భం. మన అమ్మలఅమ్మలఅమ్మల వీర గాథóలను నరన రానా ఇంకించుకోవాల్సిన సమయం. ఒకసారి దసరానీ, అందులో మిళితమై ఉన్న మన తెలుగు సంస్కృతినీ, మన ఇంటి అమ్మలని మనం గౌరవించుకునే విధానాన్నీ తలుచుకుందాం.
టూకీగా అదీ కథ..
ప్రకృతిని ఆరాధిస్తూ, మాతృమూర్తిని జగన్మా తగా కొలిచే పండగే దసరా. సహజంగా తల్లి తన బిడ్డల పట్ల అపరిమితమైన ప్రేమను కలిగి ఉంటుంది. తన బిడ్డలు మంచిని పంచాలనీ, చెడును అంతరించాలనీ, మనుషులందరి కోసం నిలబడాలనీ కోరుకుంటుంది. దీని కోసం తన జీవితాన్ని హాయిగా ఇచ్చేస్తుంది. కానీ కథ యూటర్న్ తీసుకుంటే ఊరుకోదు. ఆ బిడ్డలే చెడు వైపు నిలబడితే, అడ్డుకోవడానికి సర్వప్రయత్నాలూ చేస్తుంది. విఫలమైతే రౌద్ర మూర్తిగా మారి తానే బుద్ధి చెబుతుంది. టూకీగా ఈ తాత్వికతను చాటిచెప్పే పండుగే దసరా.
నవరాత్రులు..
సీమాంధ్రలో దసరా పండగను నవరాత్రులుగా చేసుకుంటారు. ఒక్కోరోజున ఒక్కోరకంగా దుర్గమ్మను అలంకరించుకుని మాతృమూర్తికి ప్రతిరూపంగా, చెడుపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా కొలుస్తారు. ప్రపంచీ కరణ ప్రభావానికి ముందు జీవం ఉన్న పండుగలను ప్రజలంతా మనసారా ఆస్వాదించే వాళ్లు.వేడుకలన్నీ కమర్షియల్ అయ్యాక ఆ మజా తగ్గిపోయింది. మనిషికీ, మనిషికీ మధ్య పోటీ ప్రపంచం దూరాన్ని పెంచింది. దాన్ని పండగలు కూడా దగ్గర చేయలేకపోతున్నాయి. ఇదంతా మనుషుల మీద పెట్టుబడి సాధించిన విజయం. మనుషులకూ, మమతలకూ మధ్య క్యాపిటలిష్టులు దూరం పెంచిన వైనం. కాలాన్ని కొంచెం వెనక్కి జరిపితే మనం కొన్ని ఆనంద సమయాలనూ, మరికొన్ని కళారూపాలనూ గుర్తుతెచ్చుకోవచ్చు.
విజయవాడలో కనకదుర్గ..
దసరా అనగానే విజయవాడ కచ్ఛితంగా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కాస్త తీరు మారింది కానీ,గత కాలపు ఉత్సవాల్లో కళలకు ప్రాధా న్యత ఉండేది. తొమ్మిది దశాబ్దాల క్రితమే ఇంద్రకీలాద్రి కొండ మీద భేతాళ వేషాలు వేయడం..ఆడటం ఒక సంస్కృతిగా మొదలైంది. అంతరించిపోతున్న సామాన్యుల కళారూపాల్లో ఇదీ ఒకటి. అత్యంత క్లిష్టమైన ఈ కళాప్రక్రియలో కాళికాదేవి వేషం వేసుకుని, ఆడటం కత్తి మీద సాము లాంటిదే. ఆ రూపా నికి అవసరమయ్యే చేతుల బరువు పాతిక కేజీలు ఉంటుంది. వాటిని వీపుకు తగిలిం చుకుని తలపై కిరీటం పెట్టుకుని నృత్యం చేస్తారు. ఆ కళాకారులు పలికించే హావ భావాలు ఇప్పటి తరానికి ఏ ఓటీటీ తెర మీదా కనిపించవు. వెండితెర మీద డబ్బింగ్ సినిమా కాంతారాకు కలక్షన్ల వర్షం కురిపించాం. అలాంటి కళారూపాలు మనకూ ఉన్నాయనీ ఇప్పటికీ వాటి ప్రదర్శనలు జరుగుతున్నాయని ఎవరికో కానీ తెలియకపోవడం విషాదం. తొంభై ఏళ్ల క్రితం బెజవాడలో ఈ బేతాళ వేషాలను బి. గురువులు, చంటీ మొదటగా వేశారు. ఇప్పటికీ వాళ్ల వారసులు ఆ వారస త్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇవే కాకుండా తోలుబొమ్మలాటతో మొదలుకుని బుర్రకథల వరకూ అనేక కళరూపాలకు ప్రదర్శనా వేదికలుగా ఒకప్పటి దసరా ఉత్సవాలు ఉండేవి.ఇప్పటికీ అరాకొరా వాటి ఛాయలు ఉన్నా ఆ స్థాయి ప్రభావం లేదు. ప్రభలు కట్టే సంస్క ృతి కూడా ఇక్కడ వైభవంగా సాగేది. ఎడ్ల బండ్లపై ఎంత ఎత్తుగా ప్రభను కడితే అంత గొప్పగా భావించేవాళ్లు. అందులో కాళికాదేవి వేషం కట్టి కూర్చునే మనిషి అచ్చంగా విగ్రహంలానే ఉండి ఆశ్చర్యపరి చేవారు. పీడిత ప్రజల నేత పుచ్చలపల్లి సుందరయ్య ఫోటోని పెట్టి ప్రభను కట్టిన చరిత్ర ఉంది. అత్యంత వైభవంగా సాగే ఈ సంస్క ృతి కూడా దాదాపు అటకెక్కేసింది.
తెలంగాణాలో బతుకమ్మ
%దసరానే కాదు. దసరా నవరాత్రుల్లో జరుపుకునే పండగల్లోనూ ఓ విశిష్టత ఉంది. ప్రకృతితో మమేకమయ్యే సజీవ సంబంధమేదో దాగుంది. మహిళలను గౌరవించుకునే పద్ధతి ఇమిడి ఉంది. తెలంగాణలో దేవీ నవరాత్రుల్లో భాగంగా జరుపుకునే బతుకమ్మ పండగ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బతుకమ్మ ‘పూల పండగ’, చెరువుల పండగ, మహిళల పండగ, పర్యావరణ పండగ. మరి కాస్త అర్థం చేసుకుని చెప్పాలంటే ప్రకృతి పండగ. మన అమ్మలకు, అక్కలకు, ప్రతి ఆడబిడ్డకూ కృతజ్ఞతలు తెలుపుకునే పండగ. ఇంకా లోతుగా వెళ్లి చూస్తే ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. జీవితాన్ని ఇచ్చిన ఆడబిడ్డలకు, అమ్మలకు మనం చెప్పే ధన్యవాదాల పండగ.
బతుకమ్మ పండగ సాధారణంగా భారతీయ కాలమానం ప్రకారం ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈ వేడుకను తొమ్మిది రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ‘బతుకు’ ‘అమ్మ’ అనే పదాలే బతుకమ్మగా మారాయి. ఇందులో భాగంగానే మహిళలనూ, ప్రకృతినీ పూజించు కుంటారు. సాధారణంగా భారతీయ పూజా విధానాల్లో విగ్రహారాధన ఉంది. అందులో భాగంగా పూజ కోసం పూలను ఉపయోగి స్తారు. కానీ బతుకమ్మ విషయంలో మాత్రం పూలనే దైవత్వానికి ప్రతినిధిగా గుర్తించి పండగ చేసుకుంటారు.
ఈ తొమ్మిది రోజుల వేడుకల్లో గొప్ప జీవన విలువల్ని నేర్పే పాఠాలూ ఉన్నాయి. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ,మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ,ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరోరోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ,తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పండగ పూర్తవుతుంది. రోజుకో బతుకమ్మ చొప్పున చివరిరోజుకు చేరేసరికి ఒక రకమైన పరిపూర్ణత చేకూరుతుంది. చివరి రోజున సద్దుల బతుకమ్మతో దగ్గర్లోని చెరువుకి చేరతారు. అక్కడ ఆటపాటల మధ్యన బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను పేర్చే క్రమంలోనూ మన మహిళల కళాత్మక నైపుణ్యం ఉట్టిపడుతూ ఉంటుంది.
బతుకమ్మ పాటల్లోనూ ఒకరకమైన స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి పట్ల ప్రేమ,గౌరవం,ఆరాధనా కనిపిస్తూ ఉంటాయి. అవి సామాన్యుల జీవితాలకు దగ్గరగానూ, అందరూ కలిసి పాడుకునేందుకు వీలుగానూ ఉంటాయి.
అవన్నీ పల్లెల నుంచి పుట్టిన పాటలు..
శ్రామిక మహిళల నుంచి పుట్టిన పాటలు. ఎంపలీ చెట్టు కింద ఉయ్యాలో ఎంపలీ చెట్టు కింద ఉయ్యాలో ఎల రేని కింద ఉయ్యాలో ఎప్పుడూ నీ నోము ఉయ్యాలో శ్రీ గౌరి దేవి ఉయ్యాలో చిన తల్లి నోమింది ఉయ్యాలో సిన తోటా వనము ఉయ్యాలో పెద తల్లి నోమింది ఉయ్యాలో పెద్ద తోటా వనము ఉయ్యాలో నా తల్లి నోమింది ఉయ్యాలో నందన్న వనము ఉయ్యాలో నందన్న వనమైతె ఉయ్యాలో నాకేమి కలుగు ఉయ్యాలో పెట్టెతో బియ్యమే ఉయ్యాలో పేటంచు చీర ఉయ్యాలో గోనెతో బియ్యమే ఉయ్యాలో గోరంచు చీర ఉయ్యాలో మొంటెతో బియ్యమే ఉయ్యాలో మొగ్గాలంగీలు ఉయ్యాలో ఏమేమి పువ్వొప్పుదూ గౌరమ్మ ఏమేమి పువ్వొప్పుదూ గౌరమ్మ ఏమేమి కాయొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి కాయొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి చెట్టు మీది యాట సిలుకాలాల పాట సిలుకాలాల కలికి సిలుకాలాల కందుమ్మ గుడ్డలు మమ్మ సిరి మేడలు రాను మూడడుగులు పోను మూడడుగులు సందప్పు జల్లులు సకినప్పు నీడలు నీడల్ల కనుగొంటినీ గౌరమ్మ
నీ నోము నే నోమితీ గౌరమ్మ
ఈ పండుగలో జమ్మిచెట్టుకి కూడా ప్రాధాన్యత ఉంది. జమ్మి కొండవాలుల్లో పెరిగే ఒక ముల్ల చెట్టు. దీంతో అనుసంధానమవడం కంటే ప్రకృతితో మమేకం అవ్వడం ఇంకేముంటుంది. జమ్మి చెట్టును పూజించుకోవడం కూడా ఈ పండుగలో ప్రధాన ఘట్టం.జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఈ విషయంలో కరీంనగర్ లాంటి ఉత్తర తెలంగాణా ప్రాంతాల్లో మరి కొంత విభిన్నమైన సంస్క ృతిని చూడొచ్చు.వయసు తేడాలను పరిగణనలోకి తీసుకోకుండా,ఇంట్లోని ప్రతి మహిళకూ జమ్మి ఆకును ఇచ్చి నమస్కరిస్తారు. అదీ కాక ఆడపిల్లలు తమ పుట్టింటికి కచ్ఛితంగా చేరే పండగ ఇది. బతుకమ్మకు పేర్చే పూలను చూసుకున్నంత అపురూపంగా, గౌరవంగా, మర్యాదగా వాళ్లని చూడమనే బతుకమ్మ చెప్పేది.
పిల్లల సందడి
అది ఏ పండగైనా కానివ్వండి.ముందుగా వెలిగిపోయేది పిల్లల మొహాలే.సెలవులకు వారం రోజులు ముందుగానే, పిల్లల్లో ఆ ఆనం దం కనిపిస్తూ ఉంటుంది. అమ్మమ్మల ఇళ్లకు, నానమ్మలకు ఇళ్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఎదురుచూపులు ఉండేవి. స్కూల్ ఒత్తిళ్లకు కాస్త విరామమిచ్చి పల్లె వాతావరణపు మట్టిగాలినీ, ముందుతరాల ప్రేమలనీ గుండెల నిండా నింపుకునే అవకాశం ఉండేది.పండగ అంటే ఊరంతా కలిసి జరుపుకునేది.వీధుల్లో జరుపుకునేది.నవ్వుకుంటూ,తుళ్లుకుంటూ ఆలింగనాల మధ్య జరుపుకునేది.కానీ ఇప్పుడు తీరు మారిపోయింది. పిల్లలంతా అపార్ట్ మెంట్‌లో చిక్కుకుపోయారు. మన బతుకుల్లానే పండగ కూడా ఇరుకైపోయింది. ముందు తరం వరకూ అయినా కాస్తోకూస్తో అసలైన పండగ శోభను చూసి ఉన్నారు. బొమ్మల కొలువులు పెట్టుకుని, స్నేహితులతో ఆడిపాడి ఉన్నారు. ఇప్పుడంతా పబ్జీలు, ఫ్రీఫైర్‌ల కాలమొచ్చేసింది. బొమ్మల కొలువు కమ్యూనికేషన్‌ని పెంచితే, స్మార్ట్‌ఫోన్ ఆటలు కళ్లను డ్యామేజ్ చేస్తున్నాయి.
పిండి వంటలు
పండగ అంటే సంస్క ృతీ,సాంప్రదాయం,కళలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. వాటన్నింటితో పాటు పిండి వంటలకూ ప్రత్యేక స్థానం ఉంది. ఒక తమిళ సినిమాలో హీరో విజరు ’’కప్పు ముఖ్యం బిగిలు’’ అన్నట్టు పండుగకు ’’పిండి వంటలు’’ ముఖ్యం.పిల్లలకు సెలవులు ఇవ్వగానే, టౌన్‌లూ,సిటీలూ టిక్కెట్టేసుకుని సొంత ఊళ్లకు చేరిపోయేవాళ్లు. అందరూ కలిసి ఒకదగ్గర చేరి ఒక్కో ఇంటి పిండివంటలనూ చేసుకునేవాళ్లు. ఏడాది పాటు జీవితాల్లో జరిగిన కష్టాలకూ, నష్టాలకూ, సుఖాలకూ, దు:ఖాలకూ షేరింగ్ పాయింట్ అదే. ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్ పెడితే చూసే కాలం.మనుషులంతా సంతోషాలను తెర మీదా,బాధలను గుండె లోపలా దాచుకుంటున్న కాలం. పిండి వంటల సంగతి స్విగ్గీ,జొమోటో,స్వగృహా ఫుడ్స్ చూసుకుంటున్నాయి.ఆర్డర్ చేసాక, డెలివరీ బారు తెచ్చిచ్చే, కేజీ అరిసెలంత తీపిదనం కూడా లేని పండగను సెలబ్రేట్ చేసుకునే హడావుడిలోకి చేరిపోయాం.
దసరా మామూళ్లు
నిజానికి దసరా మామూళ్లు ఒక ఎమోషన్. ఒకరి సాయం లేకుండా ఎవరూ తమ బతుకుబండిని లాగలేరనేది వాస్తవం.అది ఇల్లు కావొచ్చు,ఆఫీస్ కావొచ్చు, పొలం కావొచ్చు మరేదైనా కావొచ్చు. హెల్పర్లు లేకపోతే ముందుకు నడవాల్సిన పని వెనక్కే నడుస్తుంది. వాళ్లని గౌరవించుకోకపోతే,ఒక మనిషి తనని తాను గౌరవించుకోనట్టే అవుతుంది. ఇలా పండగల సందర్భంలో తమ హెల్పర్లకు మూమూళ్లు ఇవ్వడం ఒక మనిషి తనకు తాను ఇచ్చుకునే మర్యాదే అవుతుంది. ఒకప్పుడు దసరా వస్తుందంటేనే పనివాళ్ల మొహాలన్నీ కళకళలాడుతుండేవి. ఇప్పటికీ ఈట్రెండ్ కొనసాగుతున్నా కొద్దిపాటి మార్పులొచ్చాయి. డిజిటల్ ఇండియా అట్టడుగు స్థాయి వర్కింగ్ క్లాస్ వరకూ ఇంకా పూర్తిగా చేరనేలేదు. మరో పక్క పైస్థాయి వర్కింగ్ క్లాస్ ఉద్యోగులు చెల్లిం పులన్నీ డిజిటల్ మయమైపోయాయి. ఇదే అవకాశం అనుకుని, మూమూళ్లకు ఎగనామం పెడుతున్న మహానుభావులూ పెరిగిపోయారు. తప్పదన్నట్టూ, వదిలించుకోవాలన్నట్టూ ఎంతో కొంత సమర్పించుకునేవాళ్లూ ఎక్కువైపోయారు. హృదయంతో మామూళ్లిచ్చే కాలం వెళ్లిపోయి చాలా కాలమే అయింది.
పలచనవుతోన్న కళ..
ఇప్పుడు ఏ పండగలోనైనా సాంప్రదాయకళల సందడి తగ్గింది. హడావిడి పెరిగింది.. ఆదరణ సన్నగిల్లింది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న ఒంగోలు ‘కళారం’ ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నా ఆ శోభ తగ్గిపో యింది. తూతూ మంత్రంగా లాగించడమే తప్ప గౌరవమూ, ఆసక్తి సన్నగిల్లిపోతున్నాయి. మచిలీపట్నం కాళికానృత్యం పరిస్థితీ ఇంతే. అత్యంత కళాత్మకమైన ఆ నృత్యానికి అప్పటి ఆదరణలో పదోవంతు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఆకాశాన్ని తాకే వీరవాసం ఏనుగు సంబరాలు ఇప్పుడు పూర్తిగా నేల మీదే ఉన్నాయి. ఇక దసరా వేషాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు వీటికి ప్రత్యేక ఆకర్షణ ఉండేది. వేషం కట్టి ఇంటింటికీ తిరిగి తమ కళారూపాన్ని ప్రదర్శించే కళాకారుల కోసం మీ దగ్గర ఒక భూతద్దం ఉంటే తీసి వెతకండి. ఒకరో ఇద్దరో కనిపించొచ్చు. పోనీ మీ యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడండి. అతి తక్కువ వ్యూవ్స్‌తో ఏదో ఒక మూలన కనిపించొచ్చు.ఇది మనం సమూలంగా దసరాను గుర్తుచేసుకోవాల్సిన సమయం.అసలైన దసరా అంటే ప్రకృతిని గౌరవించడం.అసలైన దసరా అంటే మహిళలను గౌరవించడం.అసలైన దసరా అంటే కళలను గౌరవించడం. అసలైన దసరా అంటే అదంతా అందరూ కలిసే ఒక సరదా.(ప్రజాశక్తి సౌజన్యంతో..) – (రావి నేహ)