త్వరలో విశాఖ నుంచి పాలన

రాష్ట్రంలో విజయదశమి కీలక మార్పులు తేనుంది. దసరా పండుగ తర్వాత పాలనా రాజధానికి సీఎంవో తరలనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి అడుగు ముందుకు పడలేదు. ఎప్పటికప్పుడు తరలింపు తప్పదంటూ నాయకుల ప్రకటనలు మినహా ఆ దిశగా జరిగిందేమీ లేదు. అయితే గతంలోనే సీఎం ముఖ్య కార్యదర్శి, పలువురు అధికారులు విశాఖలో సీఎంవో,హెచ్‌వోడీల కార్యాలయాల కోసం పర్యటనలు చేశారు. నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో భవనాలనూ ఖరారు చేసుకున్నారు.
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తరలి తీరాలనే పట్టుదలతో ఉంది. అసెంబ్లీలో పాసైన చట్టంపై న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు కావడంతో తరలింపుపై వేచి చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని తరలింపు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌ఆర్సీ వంటి వాటిని న్యాయ రాజధాని అయిన కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణ యించింది. హైకోర్టు తరలింపుపైనా న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది.పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ నుంచి పరిపాలనను సాగించబోతున్నట్లు ఉత్తరాంధ్ర కీలక నేతలు కూడా చెబుతున్నారు. గతంలో రెండు మూడు సార్లు ప్రయత్నాలు, ప్రచారం జరిగినా వివిధ కారణాల వల్ల అడుగు ముందుకు పడలేదు. ముఖ్య మంత్రి ఎక్కడ నుంచి పరిపాలన సాగిస్తే అదే రాజధాని అని చట్టం చెబుతోందని న్యాయస్థానంలోనూ ప్రభుతవ్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలాగే శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యాయపరమైన ఇబ్బందులతో బిల్లును ఉపసంహరించుకున్నా తరలింపునకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి బొత్స పలు వేదికలపై చెప్పారు. అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా విశాఖే పాలనా రాజధాని అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే మరో బిల్లుతో వస్తామని పేర్కన్నారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బిల్లు తుది దశలో ఉండటంతోనే సెప్టెంబర్‌ ఒకటిన జరగాల్సిన కేబినెట్‌ను ఏడో తేదీకి వాయిదా వేసినట్లు చర్చించుకుంటున్నారు. కేబినెట్‌ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించుకోనున్నట్లు చర్చ జరుగు తోంది. సీఎం జగన్‌ ఇటీవల పర్యట నలను వేగవంతం చేశారు. రెండుమూడు సార్లు ఉత్త రాంధ్రలోనూ పర్యటించారు. ఈ క్రమంలో విశాఖతో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాల యం నుంచి కూడా పరిపాలనను నిర్వహించ నున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఆవిధంగా చేస్తే న్యాయపరమైన ఆటంకాలు కూడా ఉం డవని భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో పరి పాలనకు అవసరమైన అన్ని భవనాలను ఎంపిక ప్రక్రియ జోరందుకుంది. విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలన ప్రారంభిస్తే ప్రస్తుతానికి హెచ్‌వోడీలు తరలి వెళ్తే సరి పోతుందని చెబుతున్నారు.
అక్టోబర్‌ 23వ తేదీన మూహోర్తం..
విజయదశమికి ఇంకా నెలరోజులు గడవు ఉంది.ఈలోగా అమరావతి ప్రాంతంనుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకదాని తరు వాత మరొకటి విశాఖపట్నం తరలి వస్తాయని అధికార వర్గాల సమాచారం.విజయదశమి రోజు(అక్టోబర్‌ 23న) రాజధాని నిర్మాణాలకు సీఎం చేతులు మీదుగా శంకుస్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. చట్ట బద్ధం గానే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్‌ గత ఏడాది సెప్టెంబరులో జీఎన్‌ రావు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి,పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా డిసెంబరు నెలాఖరున నివేదిక సమర్పించింది.దీనిపై ప్రతిపక్షాలు, అమరావతికి 33వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చిన రైతుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.ఆపై బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక అంటూ మరోకటి తెరపైకి తీసుకువచ్చింది.దీంతో విశాఖకు పరిపాలన రాజధానిని తరలిం చాలని ప్రభుత్వం నిర్ణయింది. విశాఖలో ఇందుకు అవసరమైన కార్యాలయాలను ఎంపిక చేసుకోవాలని అన్ని శాఖల అధిపతులకు సూచించింది. రెవెన్యూ,ఐటీ, జలవనరులు,ఆర్‌అండ్‌బీ, పురపాలన, పట్టణాభివృద్ధి,రిజిస్ట్రేషన్లు…ఇలా అన్ని శాఖల అధిపతులు ఏదో ఒక సమయంలో విశాఖ పట్నం వచ్చి, తమ శాఖకు అనుకూలమైన భవనాలను పరిశీలించుకున్నారు. కుటుం బాలతో సహావస్తే… ఉండేందుకు రుషి కొండలో ఏపీ టూరిజం నిర్మిస్తున్న ఐదు భవన నిర్మాణాల్లో రెండు భవనాలు సిద్దమవుతున్నాయి.భహుశా ఆభవనాల్లోనే ముఖ్యమంత్రి పరిపాలన కార్యనిర్వహణా కొనసాగించవచ్చని పరిశీలికలు భావిస్తున్నారు.
సీఎం కార్యాలయాలన్నీ భీమిలి నియోజకవర్గ పరిధిలోనే?
విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అనగానే..భీమిలి నియోజకవర్గంలోనే రాజధాని కార్యాలయాలు రానున్నాయి.ఈ మేరకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా ఈప్రాంతంలో పర్యటించినప్పుడల్లా ‘ఇదంతా రాజధానిప్రాంతమని అనేవారు.గత సీఎం సలహాదారు అజయ్‌ కల్లం, అప్పటి సీఎం పేషీముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి… తదితరులు విశాఖలో ప్రభుత్వ అవసరాలకు అనువైన భూములు,భవనాల కోసం అన్వేషిం చారు.మొదట రుషికొండఐటీ పార్కులోని మిలీనియం టవర్‌లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. అప్పటికే అందులో కాండ్యుయెంట్‌ కంపెనీ ఉండడం, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు పోతా యని ఐటీవర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి ఐటీ సెక్రటరీ కోనశశిధర్‌, స్వర్గీయ ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి విశాఖపట్నం వచ్చి…అటువంటిదేమీ లేదని, అందులో సీఎం కార్యాలయం రాదని ప్రకటించారు. అయితే ఆ పక్కనే మిలీనియం టవర్‌-2నిర్మాణాన్ని వేగవంతం చేశారు. దానిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించు కోనున్నారు.
పరిపాలన కార్యాలయాలు గతంలో కొన్ని గుర్తింపు..
సీఎం నివాసం,కార్యాలయం,సచివాలయం ఇలా అన్నీ శాఖల కార్యాలయాలు ఏర్పాటుపై గతంలో అప్పటి సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు ఒక కమిటీ ఏర్పడి విశాఖలో పర్యటించి కొన్ని భవనాలను గుర్తించారు.ఎక్కడ ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి?అనే అంశాలపై క్షుణ్ణంగా పలు ప్రదేశాలను సందర్శించారు.అప్పట్లో రుషికొండ ఐటీపార్కులో స్టార్టప్‌ విలేజ్‌ భవనాన్ని సీఎం కార్యాలయం కోసం ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అందులో స్టార్టప్‌ కంపెనీలన్నింటినీ ఏడాది క్రితమే ఖాళీ చేయించారు. ఐటీ పార్కులో ఓరాజకీయ నాయకుడికి చెందిన భవనాన్ని డీజీపీ కార్యాలయం కోసం మాట్లాడారు. మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న ఆభవనంలో మరో అంతస్థు నిర్మించే అవకాశం కోసం పరిశీలిం చారు. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌ కార్యాల యం ఉంది.అక్కడ భద్రత ఎక్కువ. అందు లోనూ కొన్ని నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.బోయపాలెంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అల్లుడికి చెందిన పైడా విద్యా సంస్థల భవనాలను కూడా అజయ్‌ కల్లం,తదితరులు ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడతాయని అప్పట్లో పరిశీలిం చారు.అదే విధంగా నగరంలోని ఏలేరు గెస్ట్‌హౌస్‌ను జల వనరులశాఖ రాష్ట్ర కార్యాలయంగా,మర్రిపాలెంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ స్‌ను ఆ శాఖ ప్రధాన కార్యాలయం కోసం వినియోగించుకుంటారని కూడా అప్పట్లో సీఎంఓ ఉన్నతాధికారులు పరిశీలించడం జరిగింది.రుషికొండ ఐటీ పార్కులో పరిశ్రమలు,ఐటీ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.రాష్ట్ర టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయం కోసం మద్దిలపాలెం ఆటోమోటివ్‌ సమీపాన వీఎంఆర్‌డీఏ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను అప్పట్లో రిజర్వ్‌ చేసి సీఎంకి నివేదించారు.
అధికారులకు అద్దె ఇల్లులు సిద్దం..
రుషికొండ కేంద్రంగా పరిపాలన సాగితే అందుకు తగ్గట్టుగా అధికారులు నివాసం ఉండటానికి ఇప్పటికే గృహలను గుర్తించారు. ఇరవై రోజులుగా బీచ్‌ రోడ్డు నుంచి రుషికొండ వరకు ఉన్న అపార్టుమెంట్లలో 128ప్లాట్లను అద్దెకు తీసుకోవడానికి ముందుగా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రవైద్యకళాశాల వైద్యుల క్వార్టర్స్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది డూప్లెక్స్‌ ఇళ్లను సైతం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే కొందరు మంత్రులు విశాఖలో ఇళ్లు కొనుగోలు చేయగా,మరికొందరు అద్దెకు తీసుకోవడానికి సిద్దమయ్యారు.
మంత్రిత్వశాఖలకు అతిథి గృహాలు..ఖాళీ భవనాలు
మంత్రుల కార్యాలయాలకు ఆయా శాఖల్లోని ఖాళీ భవనాలు,అతిథగృహాలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కాంప్లెక్సులో ఖాళీగా ఉన్న ప్లోరుతోపాటు,అతిథిగృహాన్ని రహణాశాక మంత్రి కార్యాలయానికి, ఆధునీకరిస్తున్నట్టు జిల్లాపరిషత్‌ అతిథిగృహాన్ని పంచాయితీశాఖ మంత్రిత్వశాఖకు,బీచ్‌ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న అతిథి గృహాన్ని పురపాలకశాఖ కార్యాలయానికి, ఈఎన్‌సీ కార్యాలయంలో జలవనరులశాఖ మంత్రికి,దేవాదాయశాఖ మంత్రికి సింహాచలంలో కార్యాలయాలు కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బృహత్తర ప్రణాళికతో విశాఖ అభివృద్ధి
విశాఖనగర అభివృద్ధికి భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకొని బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కే.ఎస్‌.జవహర్‌రెడ్డి జిల్లా అధికారులకు దిశనిర్ధేశం చేశారు. విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎం ఆర్‌డీఏ)పరిధిలో మూడు జిల్లాలో రూ.కోట్లతో చేపట్టే ప్రాజెక్టులు,ఇతర అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. విశాకలో చేపట్టే ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మారతాయని,అభివృద్ధి పనుల్లో పచ్చదనం,పారిశుద్ద్యాఆనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. బీచ్‌ కారిడార్‌లో భాగంగా కాపులుప్పాడలో సిగ్నేచర్‌ టవర్‌,ఆధునిక వసతులతో కూడిన కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని జవహర్‌రెడ్డి సూచించారు. మంగమూరిపేట వద్ద జల క్రీడలు,కైలాసగిరిపైన సైన్స్‌ సిటీపాటు నగరంలోని అన్ని ఉద్యానవనాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
పరిపాలన రాజధాని విశాఖ కొత్త హంగులు
ఇప్పటికే అధికారులు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అందాల నగరంగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖకు మరిన్ని కొత్త హంగులు దిద్దేందుకు జిల్లా కలెక్టర్‌,జీవీఎంసీ కమిషనర్‌,కలసి కసరత్తు చేస్తున్నారు.సీఎం నివాసముండే రుషికొండ భవనాల చుట్టూ వంద అడుగుల రహదారులు నిర్మాణమవు తున్నాయి.ఇక్కడ నుంచి నగరంలోకి సీఎం కాన్వాయ్‌ వెళ్లేందకు గీతం వర్శిటీ నుంచి జోడుగుళ్లపాలెం వరకు బీచ్‌ రోడ్డును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు .విశాఖవ్యాలీ మలుపు నుంచి సీతకొండ వ్యూ ఫాయింట్‌ వరకు విస్తరణకు నోచుకోని బీచ్‌ రోడ్డును అటవీశాఖ అనుమతులు తీసుకొని ఐదువందల మీటర్లు పొడవును విస్తరించే పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి.రుషికొండ నుంచి ఆర్కేబీచ్‌ వరకు బీచ్‌ రోడ్డు ఇరువైపుల పుట్‌పాత్‌లు,విద్యుత్‌లైట్లతో ప్రత్యేక ఆకర్షణగా తయారు చేస్తున్నారు.నగర పరిధిలో ఉన్న ఇరుకైన రహదారులను విస్తరిస్తున్నారు. ఇప్పటికే పూర్ణామార్కెట్‌, ఓల్డ్‌టౌన్‌,కనకమహాలక్ష్మీ టెంపుల్‌,కొత్త రోడ్డు వంటి ఇరుకైన మెయిన్‌ రోడ్డులను విస్తరి స్తున్నారు. అక్కయ్యపాలెం, దొండపర్తి, రైల్వేన్యూకాలనీ తదితర ప్రాంతాల్లో కూడా మెయిన్‌రోడ్డులను విస్తరించి అకర్షణీయంగా నిర్మించేందకు జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికేంద్రికరించారు.
వీఎంఆర్‌డీఏ పరిధిలో రహదారులు విస్తరణ,అభివృద్ధి..
ఇప్పుడు విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) పరిధిలో కూడా పరిపాలనా రాజధానికి కొత్త హంగులు సమకూరబోతున్నాయి.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి భొగాపురం వరకు మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు.భీమిలీ బీచ్‌ నుంచి భోగాపురం వరకు రోడ్డును సుందరంగా తీర్చి దిద్దాలని ప్రణాళికలు సిద్దం చేశారు. అదే రకంగా13 మండలాల వీలీనంతో ీ(వీఎం ఆర్‌డీఏ) పరిధి పెరిగింది.ఇప్పటికే అభివృద్ధిని పరుగులు పెట్టించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల విస్తరణ,అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.
అడ్డంకులు అధికమించి..
జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్నీ ఇచ్చిన నివేదికలపై హైపవర్‌ కమిటీ చర్చించి కేబి నెట్‌కు నివేదికను సమర్పించింది. చట్టసభ ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా… ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ చేసింది. తరువాత జనవరి 20న అసెంబ్లీ ఆమోదించింది.22న శాసన మండలి ముందుకు బిల్లును తీసుకువచ్చారు. అక్కడ కూడా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మండలిలో తెలుగుదేశానికి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో శాసన మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. తెలుగు సంవత్సరాది ఉగాదినాటికి విశాఖ తరలి రావాలని ప్రభుత్వం మరోయత్నం చేసింది. అది కూడా బెడిసి కొట్టింది. ఆతరు వాత స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎన్నికల కమిషనర్‌ మార్పు,కరోనా వైరస్‌ వ్యాప్తి ఇలా…ఒక దాని తరువాత మరొకటి రావడంతో వేసవి సెలవుల తరువాత కార్యాలయాలు తరలించాలని యోచించారు. ఇదే సమయంలో రాజ్యాంగపరంగా అవసర మైన అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చారు. రెండోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తరువాత ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌కు పంపిం చారు. దీంతో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారినట్టయ్యింది.- గునపర్తి సైమన్‌