తెరపైకి మ‌ళ్లీ ఉత్త‌రాంధ్ర అణువిద్యుత్ కుంప‌టి

ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుకు గుర య్యాయి. ప్రగతి అన్నది ఎరగనివి. వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఉత్తరాంధ్ర నెత్తిన అణు కుంపటి పెట్టి…ప్రజలకు కంటి నిండా కునుకు కూడా లేకుండా చేయనున్నాయి. కొవ్వాడపై ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 1208మెగావాట్ల సామర్ధ్యంతో 6 రియా క్టర్లతో కూడిన అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయం గా ఆమోదించిందని…పిఎంఓ కార్యాల యం సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.
అణు ప్రమాదాల నష్టాన్ని పూడ్చుకునే సామ ర్థ్యం అభివృద్ధి చెందిన దేశమైన జపాన్‌ కే లేకుండా పోయింది. అలాంటిది మన దేశం ఇటువంటి విపత్తులను తట్టుకోగలదా? అసలు ఒక దివాళా తీసిన కంపెనీతో ఒప్పందం చేసుకోవడమేమిటి? ప్రపంచమంతా నిషేధిస్తున్న అణు విద్యుత్‌ మనకు అవసరమా? ఇవన్నీ తెలిసి కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు ఉవ్విళ్లూరుతోంది? ఇతరరాష్ట్రాలు నిరా కరించిన అణు విద్యుత్‌ ప్లాంట్‌ పట్ల జగన్‌ ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి. కేంద్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్‌ లోని మితివిర్ధిలో అణు విద్యుత్‌ కేంద్రం పెట్టాలని 2007లో నిర్ణయించింది. 2013 నాటికి పర్యావరణ,అటవీ అనుమతులు పొందింది. అయినా ఆగమేఘాల మీద2016 జూన్‌4వ తేదీన మితివిర్ధిలో నిర్మించాలనుకున్న అణు విద్యుత్‌ కేం ద్రాన్ని కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంజిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం ? ప్రపంచంలోనే అణువిద్యుత్‌ పరిశ్రమలు ఎక్కడా పెట్టడంలేదు. అణువిద్యుత్‌ కేంద్రాల్లో భద్రత లేదని ప్రపంచంలోని అణు నిపుణులు వక్కాణిస్తున్నారు. పార్లమెంట్‌లో మనరాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అడిగినప్రశ్నకు వెస్టింగ్‌హౌస్‌ అనే అమెరికా కంపెనీతో ఒప్పందంఖరారు చివరి దశలోఉందని ప్రభుత్వం తనసమాధానంలో తెలిపింది. ఈ కంపెనీ అమెరికాలో దివాళాతీసి ఐ.పి పెట్టింది. అలాంటి కంపెనీతో నేడుమోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఎలాఅర్థం చేసు కోవాలి? ఈఒప్పందంలో మరో ప్రమాదక రమైన అంశమేమిటంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే,ఆకంపెనీకేమీ సంబంధం ఉండదట! బహుళజాతి సంస్థల బండారం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇటీవలి విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌ ఉదంతం మన ముందే ఉంది. 1984లో భోపాల్‌లో జరిగిన ఘోర గ్యాస్‌ లీకు ప్రమాదానికి సంబంధించి ఇదే అమెరికాకు చెందిన యూనియన్‌ కార్బైడ్‌ బహుళజాతి సంస్థ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా నేటికీ పూర్తిగా పరిహారం చెల్లించలేదు. వారు చెల్లించక,మన ప్రభుత్వాలూ పట్టించుకోక పోవ డంతో నేటికీ వేలాది మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ బాధపడుతూనే ఉన్నారు. అదే విధంగా అమెరికాలోని ఐస్లాండ్‌,రష్యాలోని చెర్నో బిల్‌, 2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో జరిగిన ప్రమాదంతో ఆరాష్ట్రమంతా తీవ్రంగా నష్ట పోయింది. పూర్తిగా వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆ రాష్ట్రంలో రేడియేషన్‌వల్ల గాలి,భూమి, నీరు విషతుల్యం అయ్యాయి. ఈవిస్ఫోటనం తర్వాత ఏ దేశంలోను అణు విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు. ఇప్పటికేవున్న అణు విద్యుత్‌ కేంద్రా లను అనేక దేశాలు మూసివేస్తున్నాయి. మనకు రియాక్టర్లను ఎగుమతి చేస్తున్న అమెరికా తమ దేశంలో 4విద్యుత్‌ కేంద్రాలు మూసివేసింది. జపా న్‌లో 2 అణు విద్యుత్‌ కేంద్రాలు తప్ప మిగిలినవన్నీ మూసివేయడం జరిగింది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగితే 170కిలోమీటర్లు విస్తరించి దక్షిణాన కాకినాడ,ఉత్తరాన ఒడిషా లోని చత్రపూర్‌ వరకు జీవకోటి నశిస్తుంది. ఈ ప్రాం తాన్ని సర్వనాశం చేస్తుంది. ఒకేచోట 6 రియాక్టర్లు పెట్టడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. వెస్టింగ్‌ హౌస్‌ ఉత్పత్తి చేసే ఎ.పి1000అనే రియాక్టర్లు ఇంత వరకు ప్రపం చంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలా లేదు. ఎక్కడా పరీక్షించని రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన అమెరికా రుద్దుతున్నది. అమెరికా కోసం భారత ప్రయోజనాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయి. పైగా1208 మెగావాట్ల సామ ర్ధ్యంతో 6 రియాక్టర్లతో కూడిన ఈఅణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుతో 8వేల మందికి ఉపాధి దొరుకు తుందని సాకుగా చూపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తూ ప్రత్యక్షంగా 30 వేల మందికి,పరోక్షంగా లక్షమందికిపైగా ఉపాధి కల్పిస్తున్న విశాఖస్టీల్‌ ప్లాంటును ఎలాగైనా అమ్మి తీరుతామని చెబుతూనే మరోవైపు అత్యంత ప్రమా దకరమైన అణువిద్యుత్‌ కేంద్రంతో 8వేల మందికి ఉపాధి కల్పిస్తామనడంపూర్తిగా అసంబద్ధం కాదా? అణువిద్యుత్‌ కేంద్రాలకు పెట్టుబడి బాగాఅధికం. ఒక మెగావాట్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తికి రూ.48 కోట్లు ఖర్చు అయితే ఒకమెగావాట్‌ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.5కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్‌ టెక్నాలజీ నేడు బాగా అభివృద్ధి అవుతున్నది. పర్యా వరణ సమస్య వుండదు. విండ్‌ టెక్నాలజీ కూడా నేడు అభివృద్ధి చెందుతున్నది. పర్యావరణ సమస్య లేని విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.
ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర ప్రభుత్వం అణు విద్యుత్‌ కేంద్రాన్ని అంగీకరించకూడదు. కేంద్ర ప్రభుత్వనిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తేవాలి. రాష్ట్రానికి తీవ్ర ప్రమాదకారి అయిన అణు విద్యుత్‌ కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు,మేధావులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించాలి.ప్రజలకు చౌకగా విద్యుత్‌ను అందించగలిగే పర్యావరణ హితమైన పవర్‌ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
‘‘రేపు అణు విద్యుత్‌ కేంద్రం వస్తే మీ ఊరే ఎగిరి పోతుంది…ఇంకా రోడ్లెందుకు, స్కూళ్లెందుకు?’’
మీగ్రామం భవిష్యత్తులో మాయమై పో తుంది. అలాంటి గ్రామానికిరోడ్లు,కాలువలు వేయ డం ఎందుకు దండగ.ఇదేమాట గత ఐదేళ్లుగా అధికారుల నోటవింటున్నాం.కానీ,మా గ్రామం మాయమైపోలేదు. ఊరు అభివృధ్ది జరగలేదు’’- ఇది కొవ్వాడ మత్స్యలేశం గ్రామస్థుల ఆవేదన కొవ్వాడ మత్స్యలేశం (కొవ్వాడ)ఒకమత్స్యకార గ్రామం. ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండ లంలో ఉంది. దేశంలోనే అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతోంది.‘‘మాఊరిలో కరెంట్‌ కంపెనీ వస్తుందని చెప్పారు. అందరు భూములు,ఇల్లు ప్రభుత్వానికి అప్పగించేస్తే… అం దుకు డబ్బులు ఇచ్చి, మరొక చోట ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. కొందరం ఒప్పుకున్నాం, మరికొం దరం ఒప్పుకోలేదు. అలా కాలం గడుస్తున్న కొద్దీ మెల్లగా అందర్ని ఒప్పించారు. మీ అందర్ని ఇక్కడ నుంచి తీసుకునివెళ్లి మరోచోట పెడతామని చెప్పా రు. చెప్పి ఆరేడేళ్లు అవుతోంది.కానీ ఇప్పటి దాక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోవడమే కానీ… అసలేం జరుగుతోందో మాకు తెలియడం లేదు. వాళ్లు అన్నట్లుగానే మాగ్రామం ఎప్పుడు మాయమ వుతుందా అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.మాపరిస్థితి ఏంటోఅర్థం కావడం లేదు’’ అని 52ఏళ్ల కొవ్వాడ వాసి రాము ఎదుట వాపోయారు.
ఆరు రియాక్టర్లతో అణు విద్యుత్‌ కేంద్రం
కొవ్వాడలో దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.ఈఒప్పందంలో భాగం గా అణు విద్యుత్‌ ప్రాజెక్టును కొవ్వాడ, దాని పరిసర గ్రామాల్లో నిర్మించేందుకు భూ సేకరణ చేయాలని నిర్ణయించారు. ఇక్కడే ఆరురియాక్టర్లతో అణు విద్యు త్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా తీర ప్రాంతంలో 2400ఎకరాల్లో విస్తరించి ఉన్న కొవ్వా డ,కోటపాలెం,రామచంద్రపురం,గూడెం,టెక్కలి, గ్రామాలను ఖాళీ చేయించేందుకు నిర్ణయించారు. ఇక్కడే అణు విద్యుత్‌ కేంద్రం రియాక్టర్లు, ఉద్యోగుల కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. ఇదంతా 2012 నుంచి జరిగి,2017 నాటికి ఈ గ్రామా లను ఖాళీచేయించి,పునరావాస కాలనీలకు తరలిం చాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆ తేదీ దాటి ఐదేళ్లయినా…
అణు విద్యుత్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూ సేకరణ జరిగి, నిర్వాసితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఇచ్చి…వారిని పునరావాస కాలనీలకు తరలించేందుకు కటాఫ్‌ తేదీ2017 ఏప్రిల్‌ 30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీ దాటిపోయి ఐదేళ్లు కావస్తోంది. అయినా ఎక్కడ గ్రామాలు అక్కడే ఉన్నాయి. ‘‘మమ్మల్ని పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు.అసలు ప్రాజెక్టు పనులే ప్రారంభం కాలేదు. పైగా మాకు ఇస్తామన్న ప్యాకేజీ లు సైతం ఇంకా అందరికి అందలేదు. మొత్తం రూ.18 లక్షలు ఇస్తామన్నారు. అలాగే కటాఫ్‌ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు సైతం ప్యాకేజీ వర్తింపజేస్తామన్నారు. ఆతేదీకి 18ఏళ్లు దాటిన వాళ్లకి ప్యాకేజీ ఇవ్వలేదు. పైగా అనుకున్న తేదీకి తరలించకపోవడంతో…గ్రామంలో చాలా మందికి 18ఏళ్లు వచ్చాయి. వీరికి ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వా లని డిమాండ్‌ చేస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించడమో,లేదా మాగ్రామాల్ని అభివృద్ధి చేయ డమో చేయాలి’’అని పెదకొవ్వాడ నివాసి మంగ రాజు చెప్పారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ సాకుతో అభివృద్ధి చేయడం లేదు’’
అణు విద్యుత్‌ ప్లాంట్‌ పరిధిలో సుమారు 8వేల మంది గ్రామస్థులు ఉన్నారు. వీరందరూ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇల్లు సరిపోక పోయినా,కట్టుకునేందుకు డబ్బులున్నా, మరొక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు.‘‘ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది.గోడలు బీటలు వారాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కన్నాలుపడి, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. గ్రామంలోనిరోడ్ల పరిస్థితి అయితే దారుణం. ఇక విద్యుత్‌, కాలువలు లాంటి మౌలిక సదుపాయాలు వైపు ఏఅధికారి చూడటం లేదు. కారణమడిగితే రేపో మాపోమాయమైపోయే గ్రామం,దీనికి సౌకర్యా లేందుకు,డబ్బులువృథా అని అంటున్నారు. అలాగని తరలించడమూ లేదు’’ అని మత్స్యకార నాయకుడు బి.రాంబాబు చెప్పారు.‘‘అభివృద్ధి పనులైతే లేవు. కటాఫ్‌ డేట్‌ నుంచి అధికారులకు మా గ్రామాలంటే చిన్నచూపు అయిపోయింది. ఆతేదీ నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. పునరా వాస ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన డబ్బులు ఖర్చవు తున్నాయి. కాలనీలు ఇంకా ఇవ్వలేదు. పోనీ ఇల్లు సరిపోవడంలేదు,మరోగదో,చిన్న ఇల్లో కట్టుకుందా మంటే…అది వృథాఅయిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ప్రభుత్వం పునరావాస కాలనీలు, ప్యాకేజీల అం శాన్ని క్లియర్‌ చేసి తరలించక పోతే… ఆందోళ న చేస్తాం’’ అని రాంబాబు అన్నారు.
భూసార పరీక్షలు అడ్డుకున్నందుకు అరెస్టులు
నిర్వాసితుల్లో కొందరికి ఇంకా ప్యాకేజీ డబ్బులు అందలేదు. వాటిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరు.పైగా ఊర్లో రెండేళ్లుగా పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తు న్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అరెస్ట్‌ చేశారని అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాసితుల్లో ఒకరైన అప్పన్న చెప్పారు.‘‘ప్లాంట్‌ కు సంబంధించిన పనుల్లో భాగంగా నిర్వాసితగ్రామాల్లో ఎక్కడోఒకచోట రోజూ భూసార పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని సార్లు వాటిని అడ్డుకుంటే మాపై కేసులు పెట్టారు. మాకు ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా మా మీదే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ…మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించ నైనా,తరలించాలి. లేదంటే మా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటాం’’ అని అప్పన్న తెలిపారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ వద్దే వద్దు’’
కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్లాంట్‌ వద్దం టూ వామపక్షాలు,ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్రను నాశనం చేసే కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.‘‘అమెరికా ఆర్థిక సహాయంతో కొవ్వాడలో కేంద్రం తలపెట్టిన అణువిద్యుత్‌ ప్లాంట్‌ ఉత్తరాంధ్రలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ అణువిద్యుత్‌ను వదలి…ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తుంటే, భారత దేశంలో మాత్రం అణు విద్యుత్‌ ప్లాంట్లను ఎందుకు ప్రొత్సహిస్తున్నారు? ప్రమాదకరమైన వీటిని వెంటనే రద్దు చేయాలి. లేనిపక్షంలో అన్ని పార్టీలు, సంఘాలతో ఉద్యమిస్తాం’’ అని సీపీఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు చెప్పారు. బొగ్గు, గ్యాస్‌, జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి వాడే ఐదోపెద్ద వనరు అణు విద్యుత్‌. ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం.దానిసామర్థ్యం రెండు వేల మెగావాట్లు.కొవ్వాడలో రూ.61వేల కోట్ల అంచనా వ్యయంతో ఆరుఅణువిద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ ప్రాజెక్టు ఇదే. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా,అమెరికా రియాక్టర్‌ల నిర్మాణ సంస్థ వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీల మధ్య కొవ్వాడలో ఆరు అణు విద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.బొగ్గు,గ్యాస్‌,జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ఉత్పత్తికి వాడే ఐదో పెద్ద వనరు అణు విద్యుత్‌.ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం. దాని సామర్థ్యం రెండు వేల మెగావాట్లు. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం సామర్థ్యం(ఒక్కొక్కటి1208 వీఔ చొప్పున్న 6రియాక్టర్లు)7,248 మెగావాట్లు. ఇది పూర్తయితే దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రమవుతుంది. ఇది దేశంలోని 22 ఆపరేషనల్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్లలో 6.780 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ. (ఈ సమాచారం పార్లమెంట్‌ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హరావు అడిగిన ప్రశ్నకు సహాయమంత్రి జితేం ద్రసింగ్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా 31.03. 22 తేదీన తెలిపినది)
శరవేగంగా పనులు జరగాలి: ప్రత్యేక అధికారి
కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణా నికి అవసరమైన భూసేకరణ చాలా వరకు పూర్తయి నట్లు శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అణు విద్యుత్‌ కేంద్రం ప్రత్యేక అధికారి ఎం.విజయ సునీత తెలిపారు. కోర్టుకేసులు,పునరావాస ప్యాకే జీల క్లియరెన్స్‌ ఆలస్యం కారణాంగా కొంత భూ సేకరణ మిగిలి ఉందని, న్యూక్లియర్‌ ప్లాంట్‌ కు అవసరమైన 2060 ఎకరాల భూమిలో 1480 ఎకరాలు ఇప్పటికే సేకరించామని తెలిపారు. ‘‘కొవ్వాడలో మౌలిక సదుసాయాలపై కూడా దృష్టి పెట్టాం. ప్లాంట్‌ పనుల ప్రారంభంలో ఆలస్యం జరగడంతో అది గ్రామంలోని మౌలిక సదుపాయల కల్పన పై ప్రభావం చూపింది. ప్లాంట్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అంతలోపు… తాత్కలిక మౌలిక సదుపాయలను కల్పిస్తాం. త్వరి తగతిన ఈ ప్రాజెక్టుపూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.నిర్వాసితులను ఎచ్చర్ల వద్ద ధర్మా వరంలో నిర్మించే నిర్వాసిత కాలనీలకు తరలిస్తాం’’ అని విజయ సునీత చెప్పారు.-(అల్లు రాజు)