తుఫాన్లు..కష్టాలు

తీర ప్రాంత ప్రజానీకానికి తుపాన్లు, వాటి వల్ల వచ్చే కష్టాలు కొత్త కాదు. కానీ, ఆ కష్టాలను పూర్తి స్థాయిలో నివారించలేక పోవడమే బాధాకరం. తాజాగా విరుచు కుపడిన మాండూస్‌ తుపాన్‌ కూడా తీర ప్రాంత ప్రజానీకానికి తరగని కష్టాలను మిగిల్చింది. తుపాన్‌ ప్రాంతానికి పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా నష్టతీవ్రతను ఇంకా ప్రకటించలేదు. ఎన్యూ మరేషన్‌ ఇంకా ప్రారంభమే కాకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తయి, బాధితులకు నష్ట పరిహారం అందడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోగా అరకొర సాయంతోనే బాధితులు నెట్టుకురావాల్సి ఉంటుంది. తుపాన్లు వంటి ప్రకృతి వైప రీత్యాలు చోటు చేసుకున్నప్పుడు గతంలో మరణాల సంఖ్య భారీగా ఉండేది. పెరి గిన సాంకేతికతతో పాటు అధికార యం త్రాంగం అప్రమత్తత కారణంగా ఇటీవల కాలంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.-సైమన్‌ గునపర్తి
మాండూస్‌ తుపాన్‌ సమయంలోనూ ఈ విష యాన్ని గమనించవచ్చు. మూడు,నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసినప్పటికీ,దక్షిణ కోస్తా జిల్లాలో నదులు,వాగులు పొంగి ప్రవహించినప్పటికీ మన రాష్ట్రంలో ఒక్కరే మరణించారు. అది కూడా వర్షాలకు నానిన గోడ కూలడం కారణంగా సంభవించింది. సకాలంలో సహాయ చర్యలు చేపట్టినందున మరణాల సంఖ్యను నలుగురికి పరిమితం చేయగలిగామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోనూ సంభవించిన ఆస్తి, పంట నష్టం మాత్రం అపారం. రాష్ట్రాలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే! తక్షణ సాయం ప్రకటించడంతో పాటు, పూర్తిస్థాయి నష్టం అంచనా వేయడానికి బృందాన్ని పంపడం, ఆ బృందం ఇచ్చే నివేదికను, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మరిన్ని నిధులను మంజూరు చేయడం వంటి పనులు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా చేస్తుంది. ఈ తరహా స్పందన ఎంత త్వరగా వ్యక్తమైతే బాధిత ప్రజానీకానికి అంత త్వరగా ఊరడిరపు లభిస్తుంది. అయితే,తాజా తుపాన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇటువంటి స్పందన నామమాత్రంగా కూడా వ్యక్తం కాలేదు. సాయం సంగతి అలా ఉంచి,కనీసం బాధిత ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలనుండి ఊరడిరపు మాటలు కూడా వ్యక్తం కాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.తమ సొంత ప్రభుత్వాలు ఉన్నచోటో,ఎన్నికలు వచ్చినప్పుడో దీనికి భిన్నంగా ఉరుకులు, పరుగుల మీద సాయం అందడం ప్రజానీకం గమనిస్తున్న విషయమే. ఈ తరహా వివక్షా పూరిత వైఖరిని కేంద్ర ప్రభుత్వం తక్షణం మానుకోవాలి. మాం డూస్‌ తుపాన్‌ కారణంగా చిత్తూరు, తిరుపతి,కర్నూలు నెల్లూరు,ప్రకాశం, బాపట్ల,గుంటూరు,కృష్ణ,ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట దెబ్బ తింది. రేపో,మాపోమార్కెట్‌కు చేరాల్సిన ధాన్యపు కళ్ళాల్లోకి వర్షపు నీరు చేరింది. పండ్ల తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరద నీరు చేరడంతో కొన్ని చోట్ల ఇళ్లకు దెబ్బతిన్నాయి. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ! అది జరగాలంటే ముందుగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో నష్టం అంచనాల ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వారం రోజుల్లోపు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఉదారంగా నిర్వహించాలి. రంగుమారినా, తడిసినా ముందుగా ప్రకటించిన రేటుకే కొనుగోలు చేయాలి. ముఖ్యమంత్రి కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి.దీంతో పాటు అన్ని విధాల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే రైతులకు కొంతమేరకైనా ఊరట లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని అధికార పక్షంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం కూడా సాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. అవసరమైతే ఇతర ప్రతిపక్షాలను, శక్తులను కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.
ఆంధ్రప్రదేశ్‌కు పదే పదే ఎందుకీ వరద కష్టాలు….
భౌగోళికంగా గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన నదులకు చివరలో ఉండే ఆంధ్ర ప్రదేశ్‌కు అనేక ముప్పులు పొంచివున్నాయి. నీటి కొరత ఏర్పడినా, నదికి వరదలు వచ్చినా తొలి ప్రభావం ఏపీ మీదనే ఉంటుంది. గడిచిన రెండు మూడు సీజన్లలో ఏటా వరదలతో అపార నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ చవిచూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి పెద్ద వరదలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి వరదల తాకిడి తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా పోలేదు. సహజంగా ఆగష్టులో ఎక్కువగా వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో.. గోదావరి తీరం ఇంకా ప్రమాదం ముంగిట్లో ఉన్నట్టుగానే భావించాలి.సెప్టెంబర్‌ మాసంలో ఎక్కువగా వరదల ప్రమాదం ఎదుర్కొనే కృష్ణా నదీ తీరం కూడా రాబోయే రెండు నెలల పాటు దినదినగండంగా గడపాల్సిందే. అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో పెన్నా తీరంలో ప్రమాదం పొంచి ఉంటుంది. గత నవంబర్‌లో ఎగువన కురిసిన భారీ వర్షాలకు పెన్నా నదీ తీరం పొడవునా అవస్థలు ఎదురయ్యాయి. ఏటా వరుసగా నాలుగైదు నెలల పాటు ఏదో నదికి వరదల ప్రమాదం అంచున ఆంధ్రప్రదేశ్‌ ఉంటుంది. అయితే, దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ..తగిన పరిష్కారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరకట్టల పరిస్థితిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఇది చాటుతోంది.ఈ నేపథ్యంలో గోదావరి ఏటిగట్లు, కృష్ణా కరకట్ట, పెన్నా సహా పలు నదీ తీరాల్లో పరిస్థితిపై బీబీసీ పరిశీలన చేసింది.
గోదావరి ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా
1986 తర్వాత 2006లో గోదావరికి ప్రమా దకర స్థాయిని మించి వరదలు వచ్చాయి. అపార నష్టానికి కారణమయ్యాయి. అధికా రికంగా 1986లో 300 మందికి పైగా ప్రాణా లు కోల్పోయారు. 2006లో 70మంది మర ణించారు. ఆతర్వాత 2022 జులై16న అత్యధి కంగా నీటిమట్టం నమోదయ్యింది. ఈసారి మాత్రం స్వల్ప సంఖ్యలోనే ప్రాణనష్టంతో గోదా వరి తీరం ఊపిరిపీల్చుకునే అవకాశం దక్కింది. ఇంత పెద్ద వరదల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న ఏకైక తేడా ఏటిగట్లు బలోపేతం కావడం. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీకి ఎగువన అఖండ గోదావరిగా పిలుస్తారు.ఆ ప్రాంతం లో ఏటి గట్ల పొడవు 81.80కి.మీ.ఉం టుం ది.నదికి ఎడమ వైపు కొంత భాగాన్ని అంగు ళూరు ఫ్లడ్‌ బ్యాంకు అంటారు. దాని పరిధి 1.93 కి.మీ..ఇక బ్యారేజీ దిగువన గౌతమి ఏటి గట్లు 204.70కి.మీ.పరిధిలో ఉన్నాయి. వశిష్ఠ గోదావరి గట్లు 246.30 కి.మీ.పొడవు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైనతేయ సహా ఇతర నదీపాయల గట్లు కూడా కలిపితే దాదాపుగా 700 కిలోమీటర్లు ఉంటా యి. భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరిన నీటి మట్టం కారణంగా,ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద సుమారుగా 27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలాల్సి రావడంతో గోదావరి నదీ ప్రవాహం నిండుకుండను తలపించింది. అయినప్పటికీ పెద్ద ముప్పు రాకుండా నివారిం చేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.రాత్రి, పగలూ వివిధ శాఖల సిబ్బంది పలు చోట్ల పహారా కాయాల్సి వచ్చింది. స్థానికుల సహకారంతో గట్లు పరిరక్షించాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలే గోదావరి వాసులను ముప్పుల నుంచి తప్పించాయని చెప్పాలి. 2006 వరదల సమయంలో అయినవిల్లి మండలం శానపల్లి లంక,పి గన్నవరం మండలం మొండెపులంక వద్ద గట్లు తెగిపోయాయి. వరద ప్రవాహంతో ఊళ్లన్నీ జలమయమయ్యాయి. ఊరూ, ఏరూ ఏకం కావడంతో అపారనష్టం సంభవించింది. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పాటుగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా పర్యటించారు. ఆ సమయంలో గోదావరి గట్లు ఆధునికీకరిస్తామని శానపల్లిలంకలోనే సీఎం వైఎస్సార్‌ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా 1983 వరదల తీవ్రతను ప్రామాణికంగా తీసుకున్నారు. అప్పట్లో దాదాపు 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించిన నేపథ్యంలో అలాంటి వరదలు మళ్లీ వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యంతో గట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2006 వరదల నుంచి నేర్చుకున్న పాఠంతో సుమారుగా రూ.600 కోట్ల వ్యయంతో 535 కిలోమీటర్లు మేర ఆధునికీకరణ పనులు జరిగా యి.గట్లు ఎత్తు అందుకు తగ్గట్టుగా పెం చారు. ఆనాటి నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునికీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక ఆధారంగా ఈ పనులు చేశారు. ఇటీవల వరదల నుంచి కూడా కోన సీమ, పశ్చిమ గోదావరిలతో పాటు ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ప్రజలకు ఉపశమనం దక్కేం దుకు ఆనాటి పనులు తోడ్పడ్డాయి. కానీ రాను రాను గట్ల పరిస్థితికి నానాటికీ తీసికట్టు చందంగా మారుతోంది. అప్పట్లో పనులు పూర్తికాని చోట ఈసారి ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. వశిష్ఠ కుడి గట్టు నరసాపురం, వశిష్ఠ ఎడమ గట్టు పరిధిలో 48వ కిలోమీ టరు నుంచి 90వ కిలో మీటరు వరకు మూడు ప్యాకేజీలు ఆనాటి నుంచి అసంపూర్ణంగా వదిలేశారు.
ఇసుక తవ్వకాలతోనే తలనొప్పులు..
గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచినప్పటికీ వాటి లక్ష్యం దెబ్బతింటోందని ఇటీవలి వరదలు చాటుతున్నాయి. ముఖ్యంగా ఇసుక తవ్వకాలతో నదీ ప్రవాహం, ఒడి పెరగడమే కాకుండా ఏటిగట్లు బలహీన మవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇసుక తవ్వకాల విషయంలో నిబంధనలు అనుసరించకపోతే అనేక అనర్థాలు చవి చూడాల్సి వస్తుందని ఇరిగేషన్‌ నిఫునులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గోదావరి ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. యంత్రాలు వినియోగించ కూడ దనే నిబంధన కేవలం పేపర్లకే పరిమితం. పైగా గట్లుని ఆనుకుని తవ్వేస్తుండడంతో గ్రోయిన్లు దెబ్బతింటున్నాయి. ఏటిగట్లు బలంగా ఉండేందుకు వాటిని నిర్మిస్తే ఇసుక తవ్వకందా రులు వాటిని కొల్లగొట్టేస్తు న్నారు. గట్లకి రక్షణ లేకుండా పోతోంది. ఏటిగట్లు మీద భారీ వాహనాల రాకపోకల కోసం బాటల పేరుతో గట్లు దెబ్బతీస్తున్నారు. ఫలితంగా వరదలు వచ్చిన ప్పుడు ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా భయాందోళనలు ఎదుర్కోవాల్సి వస్తోందని’’ భావిస్తున్నారు.
కృష్ణా తీరంలోనూ అదే కథ..
గోదావరి వరదల తాకిడికి కోనసీమ వాసులు ఎక్కువగా కలత చెందుతుంటే కృష్ణా వరదల వల్ల అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతాలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. విజయవాడ నగరంలోని పలు ప్రాంంతాలు కూడా వరద తాకిడికి తల్లడిల్లిపోవాల్సిన దుస్థితి నేటికీ ఉంది.కృష్ణా నదికి 2009లో భారీవరదలు వచ్చాయి. ఆ వరదల మూలంగా కృష్ణా తీర మంతా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. 2020లో కూడా వరద తాకిడి ఎక్కువగా నమోదయ్యింది. కానీ అంత పెద్ద ముప్పు లేకుండానే ప్రజలు బయటపడ్డారు. 2009 తర్వాత కృష్ణా నది కరకట్ల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టారు. కానీ ఇసుక తవ్వకం దారుల తీరుతో నదీగర్భం కొల్లగొట్టడం, కరకట్ట దెబ్బతినడం వంటివి ఎదురవుతున్నాయి. ‘‘రాష్ట్రంలో గోదావరి, కృష్ణా వంటి నదులకు వరదలు తప్పవు. ఒక ఏడాది తప్పినా,ఎప్పటికయినా ముప్పు ఉంటుంది.దానికి మనం సన్నద్ధంగా ఉండాలి. కానీ అనేక అనుభవాల తర్వాత కూడా పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ఏటా వరదలు వస్తున్నాయనగానే వందల గ్రామాలు వణికిపోవాల్సి వస్తోంది. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూడాలి. అసాధా రణంగా ఎప్పుడయినా వరద వస్తే తప్ప, సాధారణ వరదలకు పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేయాలి. అందుకు కరకట్టలు బలోపేతం చేయడం,వాటిని పరిరక్షించడమే మార్గం.కోట్లు వెచ్చించి పనులు చేసిన తర్వాత ఇసుక కాంట్రాక్టర్ల వ్యాపారం కోసం భారీ వాహనాలతో వాటిని బలహీనపరిస్తే ఏమి ఉపయోగం ఉంటుంది. కాబట్టి యంత్రాంగం అటువైపు దృష్టి సారించాలి’’అన్నారు ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఎస్‌ ఈ పీవీ రామారావు. దేశంలో వరద తాకిడి నుంచి గట్టెక్కడానికి వివిధ రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలను మనం పాఠంగా తీసుకొవచ్చని ఆయన బీబీసీతో అన్నారు. తమి ళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వరద నియం త్రణ చర్యలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రమాదం అంచున పెన్నా తీరం…
గోదావరి, కృష్ణా నదులతో పాటుగా వంశధార, నాగవళి సహా వివిధ నదుల మూలంగానూ వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.వాటిలో పెన్నా ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో 2021 నవంబర్‌లో వచ్చిన వరదలు చాటిచెప్పాయి. ఏకంగా అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయే దశ నుంచి, సోమశిల ప్రాజెక్టు పరిస్థితి గురించి ప్రశ్నలు ఎదురయ్యే వరకూ వచ్చింది. భవిష్యత్తులో మరింత ముప్పు తప్ప దనే అంచనాలు ఉన్నాయి. దాంతో దానికి అనుగుణంగా చర్యలు అవసరమనే వాదన ఉంది. ‘‘అన్ని నదులకు కొన్ని సహజ లక్షణా లుంటాయి.20,30ఏళ్లలో ఓసారి అసాధా రణంగా ప్రవాహం వస్తుంది. వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి అనుగుణంగా మనం అప్రమత్తం కావాలి. వరద వచ్చినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత దానిని వదిలేయడంవల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. నిరుడు పెన్నా వరదలు, ఈ ఏడాది గోదావరి వరదలు వంటివి మనకు మేలుకొలుపు కావాలి. భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా అన్ని నదీ తీరాలను ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాలి. వాటిని ఎప్పటి కప్పుడు పరిరక్షణ జరగాలి’’ అంటూ పర్యా వరణ వేత్త సీహెచ్‌ శ్రీనివాసరావు అన్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఓవైపు వరద నీరు వెల్లువలా వచ్చి పడుతుంటే అప్పటికప్పుడు 2 మీటర్లు ఎత్తు పెంచినట్టు చెప్పడం విస్మయకరంగా కనిపించిందని,వరద నివారణ విషయంలో ప్రభుత్వ సన్నద్ధతను ఈ పరిణామం చాటుతుంది.ఆధునికీకరణలో భాగంగా వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాం తాలలో పర్యటనలో భాగంగా రాజమహేం ద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు. శాశ్వత చర్యలపై దృష్టిపెడతాం. నవంబర్‌ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలు పెడదాం’’ అంటూ ఆయన అధికారులను ఉద్దే శించి వ్యాఖ్యానించారు.సీఎం ఆదేశా లకు అనుగు ణంగా శాశ్వత వరద నివారణ చర్యలకు సర్కారు సిద్ధమయితే గోదావరి తీర వాసుల భయాందోళనలు తగ్గుతాయి. అదే సమయంలో ఇతర ప్రధాన నదుల వెంబడి కరకట్టల తీరు మీద కూడా దృష్టి పెట్టాలనే అభిప్రాయం వినిపిస్తోంది.