డేటా వార్‌లో ఓటర్లే బలిపశువులా?
ఇందులో టిడిపి ఇరకాటం, టిఆర్ఎస్ చెలగాటం, వైసీపీ బులపాటం దాచేస్తే దాగేవి కావు. ఎవరెవరి వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా వున్నా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా లక్షల ఓట్లు గల్లంతు చేస్తే సగటు ఓటరు సంరక్షణెలా అన్నది కీలక ప్రశ్న. విధానాలతో విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవాలి గాని మూకు మ్మడి తొలగింపులు ఆందోళనకరం. అనుమా నాస్పదంగా మారిన ఈ డేటా వార్ కపట నాటకంలో పాత్రధా రులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల న్యాయమైన హక్కుల పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం కుంభకర్ణ నిద్ర మానాలి. అంతిమంగా ప్రజలు తీర్పు చెప్పే సమయం కూడా ఎంతో దూరం లేదు. ఈలోగా కుట్రలు కుత్సితాలతో, కుళ్లు కుతంత్రాలతో ఏదో సాధించేద్దామని ఎవరనుకున్నా భంగపాటు తప్పదు. ఎందుకంటే ప్రజలు కేవలం కంప్యూటర్ డేటా కాదు.
ఎక్కడో మునిగి ఎక్కడో తేలినట్టు ఎ.పి రాజకీయాల్లో టిడిపి-వైసిపి-టిఆర్ఎస్ వైరం చౌర్యం అంచుల వరకూ వెళ్లింది. నవ రత్నాలని ఒకరు, నవీక ృత పథకాలతో మరొకరు గెలిచేశామని ఇరు పార్టీలూ చేసిన హడావుడి వెనక్కు పోయి పరస్పరం దొంగతనం నిందారోపణలు మార్మోగుతున్నాయి. ఇరు పక్షాల పోల్ మేనేజిమెంట్ పొలిటికల్ మార్కెటింగ్ క్రీడల్లో ప్రజలు లేదా ఓటర్లు కేవలం డేటాగా మారిపోయిన దుస్థితి దాపురించింది. ఈ రెండు పార్టీలకూ లేదా వారి వారి మిత్రులకూ సంబంధించిన వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు తగాదాగా చూపించే ప్రయత్నాలు కూడా ఉధ ృతంగానే సాగుతున్నాయి. లక్షల ఓట్ల తొలగింపు, ఓటర్ల ప్రభుత్వ డేటా దొంగిలింపు వంటి తీవ్రమైన ఫిర్యాదులు భారీగా వినిపిస్తున్నా ఎ.పి, తెలంగాణ పోలీసులు, రాజకీయ వేత్తలు బాహాటంగా తిట్టిపోసు కుంటున్నా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది. అంతర్రాష్ట్ర వివాదంలాగా మారిన ఈ ప్రతిష్టంభన లో కేంద్రం చోద్యం చూస్తున్నది. తాజాగా ఏపి సిఎం ఇచ్చిన అధికారిక వివరణలోనూ రాజకీయ ఆరోపణలు, ఆక్రోశాలు తప్ప సమగ్ర సమాధానాలు, సంత ృప్తికరమైన సమాచారాలు లేవు.
ఐటి గ్రిడ్ వ్యవహారం : ఎ.పి ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ సంస్థ బ్లూ ఫ్రాగ్ (విశాఖ) టిడిపి ఐటి ప్రొవైడర్ ‘ఐటి గ్రిడ్స్’ (హైదరాబాద్) కేంద్రంగా ఈ వివాదం మొదలైంది. మార్చి మూడవ తేదీ అర్థరాత్రి హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ కాలనీలో ఐటి గ్రిడ్స్ కంపెనీలో పోలీసులు ప్రవేశించారు. ఓటర్లను తొలగించే ప్రక్రియ కోసం ఎ.పి ప్రభుత్వ డేటా అక్కడ దుర్వినియోగం అవుతున్నట్టు లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వచ్చినట్టు చెప్పారు. నలుగురు సిబ్భందిని తీసుకువెళ్లారు. ఇంతలో ఎ.పి పోలీసులు లోకేశ్వరరెడ్డి ఇంటికి చేరుకున్నారు. తమ సిబ్బంది ఆచూకీ తెలియలేదని ‘ఐటి గ్రిడ్స్’ యజమాని అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామనడంతో ఉభయ పోలీసుల మధ్య వివాదం నడిచింది. తెలంగాణ హైకోర్టులోనూ అశోక్ హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆ నలుగురిని హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు ఖాళీ కాగితాలపై విఆర్వోల సంతకాలు తీసుకోవడం ఏమిటని అక్షింతలు వేసింది. ఆ నలుగురు సిబ్బందిని సాక్షులుగా తీసుకున్నామే గాని అరెస్టు చేయలేదని వివరణ ఇచ్చిన పోలీసులు మరుసటి రోజు తీసుకురావడంతో కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈలోగా ఎ.పి మంత్రి లోకేశ్, మరికొందరు తమ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ‘సేవామిత్ర’ అనే యాప్ తయారు చేస్తున్న ‘ఐటి గ్రిడ్స్’పై దాడి చేసి తెలంగాణ పోలీసులు డిస్క్‌లు, డేటా అపహరించుకుపోయారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నివసించే టిడిపి వారిని వ్యాపారవేత్తలను భయభ్రాంతులను చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం మోడీ దర్శకత్వంలో వైసీపీతో కుమ్మక్కయిందని వారు ఆరోపించారు. ఇక ప్రభుత్వ డేటాను ఉపయోగించి ప్రతిపక్ష ఓటర్లను తొలగించేందుకు ప్రభావితం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఫిర్యాదు వస్తే పోలీసులు వెళ్లారు గాని ఏపి డేటాతో మాకేం అవసరమని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు తరహాలో చంద్రబాబును, లోకేశ్‌ను అవహేళన చేస్తూ మాట్లాడారు. వైసీపీ నేతలు టిడిపి డేటా చౌర్యం దొరికి పోయిందని ధ్వజమెత్తారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ డేటా చౌర్యంపై దర్యాప్తు చేస్తున్నామని అవసరమైతే ఎ.పి ప్రభుత్వానికి కూడా నోటీసు ఇస్తామని ప్రకటించారు. అయితే ‘సాధికార మిత్ర’తో సహా సర్కారు పథకాలకు సంబంధించిన సమాచారం సురక్షితంగా వుందని ఎ.పి అధికారి ఒకరు ప్రకటించారు. తమ పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్‌లో డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చేందుకు టిఆర్ఎస్ కుట్ర పన్నిందని టిడిపి ఎదురుదాడి చేసింది. అశోక్ తమ సంరక్షణలో వున్నారని కూడా ఆ పార్టీ నేత ఒకరు వెల్లడిరచారు. మన పార్టీపై ఇంత దాడి జరుగుతుంటే మీరు మంత్రులుగా గాక టిడిపి నేతలుగా మాట్లాడ్డం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించినట్టు మీడియా రాసింది.
ఎప్పటి నుంచో ఆరోపణలు, అరెస్టులు : అరెస్టులు, ఆరోపణలు ఇప్పుడు భగ్గుమన్నాయి గాని ఈ ప్రహసనం చాలా కాలం కిందటే మొదలైంది. ఏపిలో 59 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్పించినట్టు ఆరు మాసాల కిందటే వైసీపీ ఆరోపించింది. ఫిబ్రవరి 4న జగన్ ఢల్లీిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వచ్చారు. అధికార పార్టీ దీనిపై మాట్లాడలేదు (పైగా టిడిపి ఓట్లకు డబ్బు ఇస్తే తీసుకోమని అన్నందుకు జగన్ ఓటు హక్కు రద్దు చేయాలని టిడిపి లీగల్ సెల్ వినతి పత్రం సమర్పించింది). రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడున్నర కోట్లు అయితే అందులో దాదాపు 60 లక్షలు బూటకం అనడం అతిశయోక్తిగా వుందనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. అలాగే గ్రామాలలో సర్వేలంటూ జరిపి ప్రతిపక్ష ఓటర్ల సమాచారం తెలుసుకుని తొలగిస్తున్నారని వైసీపీ స్థానిక నేతలు అడ్డుపడటం వివాదానికి దారి తీసి అరెస్టులు కేసుల వరకూ వెళ్లింది. చిత్తూరు జిల్లా వంటి చోట్ల పోటా పోటీ ధర్నాలు జరిగాయి. అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు బెదిరించిన ఘటనలు కూడా వెల్లడైనాయి. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఏ మాత్రం స్పందించలేదు. జగన్ ఫిర్యాదుల పైనా అధికారికంగా వ్యాఖ్యానించలేదు. వివాదం బాగా ముదిరాకనే ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఓట్ల తొలగింపు సులభం కాదని మూడు దశలు దాటాలని చెప్పారు. ఓట్ల తొలగింపును కోరే ఫారం-7 దరఖాస్తులు తమకు లక్షల సంఖ్యలో వస్తే పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇంతలోనే హైదరా బాద్‌లో ఐటి గ్రిడ్‌పై దాడులు సంభవించాయి. డేటావార్ మొదలైంది.
ఇద్దరూ ఇద్దరే! : ఈ వార్ మొదలైన మరు రోజునే జగన్ నెల్లూరులో మాట్లాడుతూ తమ చిన్నాయన వివేకానందరెడ్డితో సహా లక్షల మంది ఓట్లను తొలగించినట్టు ఆరోపించారు. దొంగఓట్ల తొలగింపు కోసం తమ పార్టీ 8 లక్షల ఫారాలు సమర్పించిం దన్నారు. గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. ‘అసలు మీ ఫిర్యాదు ఓట్ల తొలగింపు అయితే…మళ్లీ తొలగింపు కోసమే అన్ని లక్షల దరఖాస్తులు సమర్పించడం వైరుధ్యభరితం కాదా!’ అని నేను టీవీ చర్చల్లో అడిగాను. రెండు ప్రధాన పార్టీల మధ్య నడుస్తున్న ఈ ప్రహసనంలో ఏదో లోగుట్టు వుందని మాత్రం స్పష్టమై పోయింది. ఆ నాటకం ఏమిటో తేలాలని ఓట్ల జాబితా సక్రమంగా వుండేలా చూడాలని జనసేన -వామపక్షాలు కోరాయి. కాని ఎన్నికల సంఘం ఖండిరచడం తప్ప కదిలింది లేదు. దాంతో ‘అర్హులందరికీ ఓటు హక్కు’ అనే రాజ్యాంగ మౌలిక సూత్రం పరిరక్షణ వెనక్కుపోయి టిడిపి, వైసిపి, టిఆర్ఎస్ రాజకీయాలే ప్రధానమై డేటా వార్‌ను ఈ స్థితికి తెచ్చాయి. వైసిపి ఎం.పి విజయ సాయిరెడ్డి ఫిర్యాదు పత్రాలు చూపిస్తూ ‘ఇది బాహుబలిని మించిన కుట్ర’ అని ఆగ్రహిస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఆయన చేసిన ఫిర్యాదులను ఎందుకు ముందే పట్టించుకోలేదు? అమెజాన్ క్లౌడ్‌లో ఈ డేటా పొందుపర్చడంపై సమాధానమేమిటి?
పొంతనలేని ప్రభుత్వాల తీరు : వార్ మొదలైన తర్వాత కూడా టిడిపి నాయకత్వం తడబాటుకు గురైంది. డేటా మాదైనప్పుడు తెలంగాణ పోలీసులు ఎందుకు వచ్చారంటూ మొదట్లో విమర్శ చేశారు. ఐటి గ్రిడ్స్ హైదరాబాదులో వుంది గనక ఈ ఆరోపణ నిలవలేదు. తామే వ్యతిరేక కూటమి వుందని ఆరోపించే చోట ఎందుకు వుంచారనే ప్రశ్న మరొకటి. రిజిస్టర్ కాని కంపెనీకి ఇంత ముఖ్యమైన డేటా అప్పగించడం కూడా విడ్డూరమే. ఒకే సంస్థకు ప్రభుత్వ యాప్ పార్టీ యాప్ కూడా కట్టబెట్టడం ఆరోపణలు పెంచుతుంది. పైగా ప్రభుత్వ డేటా పదిలంగా వుందని, టిడిపి యాప్‌లో సమాచారంలో రహస్యం లేదని చెబుతూ వచ్చారు. ప్రపంచమంతటా బిగ్ డేటా చౌర్యాలు పెరిగిపోతున్న కాలంలో అలాటి అలసత్వానికి తావే లేదు. జరిగింది డేటా సేకరణా బహుకరణా తస్కరణా అన్నది తేలవలసిందే. ఐటి గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎ.పి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ కిమ్మనకపోవడానికి కారణాలు అనూహ్యం. మార్చి 4 తర్వాత కూడా ఐటి గ్రిడ్ తరపున హేబియస్ కార్పస్ వేశారే గాని తమ డేటా గురించి టిడిపి కేసు వేయలేదు. వైసీపీ టిఆర్ఎస్ బిజెపిలు జట్టు కట్టాయంటే దాన్ని ఎదుర్కోవడం టిడిపి రాజకీయ సమస్య తప్ప ఎ.పి,తెలంగాణ ప్రజల వివాదం కాబోదు. ఇటీవల ఎ.పికి చెందిన చిగురుపాటి జయరాం హత్య కేసు సందర్భంలో ఒక దశ తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవడం చూశాం. మరి ఏ.పికి సంబంధించిన డేటా సమస్యలో తెలంగాణ పోలీసులు ఎపి ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయలేదన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే వారు తెలంగాణ డేటా కూడా పోయిందని ఆలస్యంగా చెప్పడం మొదలు పెట్టారు. కేసుపై మాట్లాడే పోలీసు అధికారులు కూడా ఇప్పటికి ముగ్గురు మారారు. మాట్లాడిన ముగ్గురిలోనూ కొన్ని వైరుధ్యాలున్నాయి. కనుక ఇదంతా ఇరువైపులా పోటాపోటీ రాజకీయ ప్రయోజనాల వేట మాత్రమేనన్నది స్పష్టం. ఇందులో టిడిపి ఇరకాటం, టిఆర్ఎస్ చెలగాటం, వైసీపీ బులపాటం దాచేస్తే దాగేవి కావు. ఎవరెవరి వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా వున్నా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా లక్షల ఓట్లు గల్లంతు చేస్తే సగటు ఓటరు సంరక్షణెలా అన్నది కీలక ప్రశ్న. విధానాలతో విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవాలి గాని మూకుమ్మడి తొలగింపులు ఆందోళనకరం. గత ఏడాది ఇలాగే భారీగా ఓట్ల తొలగింపు సమస్య తెలంగాణ ఎన్నికల్లోనూ వస్తే హైకోర్టు జోక్యం చేసుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఎ.పి లోనూ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలే గాని రాజకీయ రచ్చ నిరర్థకం. అనర్థకం. డేటా సురక్షితంగా వుందా లేదా అన్నది తెలంగాణ పోలీసుల తుది నివేదిక తర్వాతనే మాట్లాడాల్సిన విషయం. ఒకవైపు అధికార డేటా పోలేదంటూనే ఎ.పి ప్రభుత్వం అతిగా కంగారు పడటం ఆశర్యకరం. తమ పార్టీ డేటా పోయిందని టిడిపి నాయకులూ పరువు పోయిందని ఎ.పి మంత్రులూ రాష్ట్ర పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేయడం రాష్ట్రాల మధ్య మధ్య వివాదానికే తప్ప పరిష్కారానికి దోవ చూపదు. ఎన్నికల సంఘం ముందు, ఉన్నత న్యాయస్థానాల ఎదుటు తేలాల్సిన సమస్యలివి. అన్ని వైపులా అనుమానాస్పదంగా మారిన ఈ డేటా వార్ కపట నాటకంలో పాత్రధారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల న్యాయమైన హక్కుల పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం కుంభకర్ణ నిద్ర మానాలి. అంతిమంగా ప్రజలు తీర్పు చెప్పే సమయం కూడా ఎంతో దూరం లేదు. ఈలోగా కుట్రలు కుత్సితాలతో, కుళ్లు కుతంత్రాలతో ఏదో సాధించేద్దామని ఎవరనుకున్నా భంగపాటు తప్పదు. ఎందుకంటే ప్రజలు కేవలం కంప్యూటర్ డేటా కాదు. – తెలకపల్లి రవి