జీవితాన్ని అంకితమిచ్చిన సామాజిక ఉద్యమ నేతలు

తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ప్రతిక్షణం గిరిజన,దళిత ప్రజల ఆకాంక్షలు, కలలనే ఊపిరిగా చేసుకుని బతికిన సామాజిక స్పూర్తిదాతలు,పర్యావరణవేత్త శ్రీధర్‌ రామ్మూర్తి, సామాజికవేత్త విలియమ్‌ స్టాన్లీ,అలుపెరగని పోరాట యోధుడు,సామాజిక సేవకు అద్దంపట్టే మరోఆత్మ కె.రాజేంద్ర కుమార్‌లు ఒకే నెల జనవరిలో మనమధ్య నుంచి దూరమవ్వడం మర్చిపోలేని సంఘటన.ఈ ముగ్గురు సామాజిక యోధులతో నాకున్న అంకుఠిత పరిచయం చిరస్మరణీయమైనది.నాతోటి సహచారులు మనలో లేరంటే నా హృదయం పరితపిస్తోంది.
వివిధ రంగాల్లో నిర్మాణాత్మకమైన సామాజిక ఉద్యమాలను నడిపించారు.సమాజ శ్రేయస్సుకు..సమూహ ప్రయోజనాలు అందించారు. వర్తమాన సామాజిక ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని సంతకాలగా వారి సామాజిక సేవలు నిలిచిపోయాయి.సామాజిక అసమానతలపై సమరం సాగిస్తూ,సమాజాన్ని సంస్కరించడం కోసం,అలుపెరగని కృషి చేసిన పోరాట యోధులు.
శ్రీధర్‌ అనంతమైన ఆలోచనలు,విశ్లేషణలతో కూడిన పరిశోధకుడు.శాస్త్రవేత్త.దేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఆదివాసీ ప్రజలకు ఆలోచనలు అందించారు. ఒకశాస్త్రవేత్త,ఒకకార్యకర్త, ఒకసాహసికుడు,ఒక స్వాప్నికుడుగా తన జీవితమంతా అట్టడుగున ఉన్నవారి కోసం, పర్యావరణంకోసం, సహజవనరులపై సమాజాల నియంత్రణకోసం అలుపెరగని పోరాటాలు చేశారు.
ఇక విలియమ్‌ స్టాన్లీ ఒడిస్సా,చత్తీష్‌ఘర్‌ ఆదిమతెగల జీవితాల్లో వెలుగు నింపాడు.అనాగరిక గిరిజన ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించారు.వందలాది గిరిజన గ్రామాలకు త్రాగునీరు, విద్యుత్‌,ఇతరమౌళిక సదుపాయాలు కల్పించారు.గిరిజన యువతకు మార్గదర్శిగా ఉంటూ సామా జిక,ఆర్ధిక,రాజకీయరంగాల్లో ఎందరో యువకులకు భవిష్యత్తునిచ్చారు.
ఇక అలుపెరగని సామాజిక యోధుడు రాజేంద్ర నాతోటే పయనించారు.అత్యంత అట్టడుగున దళిత కుటుంబంలో జన్మించిన రాజేంద్ర తన దళిత,గిరిజనుల జీవితాల కోసం రక్తాన్ని ధారపోసిన హృదయం.ఒకఆత్మ స్థిరమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మార్గాల కోసం అనంతంగా అన్వేషించిన నిస్వార్ధపరుడు.రాజేంద్ర చేసినసుదీర్ఘ పోరాటాలు ఎన్నో నేటికి చెరగని ముద్రవేసుకున్నాయి.కాలుష్యకోరల్లో కొట్టిమిట్టులాడుతున్న క్వారీ ప్రజలకు అండగా నిలిచారు.ఏలేరు నిర్వాసితులకు పునరావాసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు.అత్యాచారానికి గురైన దళిత బిడ్డకు అండగా నిలిచి న్యాయంపోరాటం చేసి గెలిచారు.కాకినాడ జిల్లా తీరప్రాంతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్ధిక మండలి(స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌`(ఎస్‌ఈజెడ్‌) పేరుతో రైతులు,మత్స్యకారుల భూములు ప్రభుత్వం స్వాదీనపర్చు కోవడంపై తరుపున సుదీర్ఘ పోరాటంచేసి కొద్దిరోజులు జైలుజీవితాన్నికూడా అనుభవించారు. వంతాడ ఆదివాసీ వనరుల పరిరక్షణపై(లేటరైట్‌)పోరాటంచేసి విజయం సాధించారు.
సామాజిక సేవలో కుటుంబాన్ని,ఆరోగ్యాన్నిసైతం విస్మరించారు.వారి జీవితాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అలుపెరగని సేవలందించారు.వాస్తవానికి సామాజిక సేవ చేసే ప్రతి కార్యకర్త ప్రజలతోనే మమేకంగా ఉంటారే తప్పా వారి ఆరోగ్యం,కుటుంబం సంక్షేమకోసం పట్టించుకోవడం తక్కువ.ఈనేపథ్యంలోనే ఈ ముగ్గురు సహచరులు హాఠత్తుమరణానికి గురికావాల్సి వచ్చింది. మనిషికి మరణమనేది ఏరకంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహించకూడదు. అనారోగ్యం రాకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రస్తుత మానవ జీవనవిధానం కలుషితమయంగా మారింది.కలుషితమైన ఆహారపదార్ధాలనే తీసుకుంటున్నాం.ముఖ్యంగా సమాజంలో సామాజిక మార్పులు తీసుకొచ్చే శ్రేణులు ఆరోగ్యపరిరక్షణ పట్ల మరింత శ్రద్ద తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.జీవిత విలువ తెలుసుకొనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు.!- రవి రెబ్బాప్రగడ ,ఎడిటర్