జయహో భారత్‌..ఇస్రోకి జేజేలు

నిరీక్షణ ఫలించింది. కోట్లాదిమంది భారతీయుల పూజలు ఫలించాయి. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్‌.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 3 జాబిల్లి మీద అడుగు మోపింది. ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. కలలు సాకారం అయ్యాయి. గతంలో ఎదురైన చేదు సంఘటనలు అధిగమించి.. మరీ జాబిల్లిని అందుకుంది.
యావత్‌ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటివరకు జరిగిన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసు కున్న చంద్రయాన్‌ 3..చివరి అంకానికి చేరుకుంది. తాజాగా ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌..చంద్రుడి ఫోటోలు తీసింది.వాటిని పంపించడంతో ఇస్రో ట్విటర్‌లో పంచు కుంది. ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సుమారు 70డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద విక్రమ్‌ ల్యాండర్‌ దిగనుంది.
చంద్రయాన్‌ 3 దిగిన ప్రదేశం పేరు శివశక్తి పాయింట్‌
చంద్రయాన్‌ 3ని విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్‌ చేయగలిగిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని స్వయంగా కలిసి అభినందించారు. ఆగష్టు 26 ఉదయం బెంగళూరులోని ఇస్రో నెట్‌వర్క్‌ కమాండ్‌ సెంటర్‌ చేరుకున్న ప్రధాని అక్కడ శాస్త్రవేత్తలను కలిశారు.ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్‌ అయిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి దిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తన పని ప్రారంభించడంతో ప్రధాని శాస్త్రవేత్తల నుంచి దాని సమాచారం తెలుసుకున్నారు. చంద్రయాన్‌ 3 ల్యాండిరగ్‌ ఎలా జరుగుతుందో ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు ఎలా వస్తుందో వీడియోల ద్వారా ఇస్రో సైంటిస్టులు ఆయనకు వివరించారు. తర్వాత ఇస్రోచైర్మన్‌ సోమనాథ్‌ ప్రధానికి చంద్ర యాన్‌3 మోడల్‌ను బహూకరించారు. రోవర్‌ తీసిన చంద్రుడి ఫొటోలను ప్రధానికి అందించారు.

‘‘ఆగస్ట్‌ 23న భారత్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. ఇక ఇప్పటి నుంచి, ఈ రోజుని భారత్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వ హించుకుందాం’’అని ప్రధానమంత్రి ప్రకటిం చారు. శాస్త్రవేత్తలు మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని చంద్రుడిపైకి తీసుకెళ్లారని అభినందించారు.తన ప్రసంగం మధ్యమధ్యలో ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని తలుచుకుని భావోద్వేగానికి గుర య్యారు. భారత్‌ చంద్రయాన్‌ 3మిషన్‌ భూమి ఎదుర్కుంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కూడా సాయం చేస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ ఇస్రో కమాండ్‌ సెంటర్‌లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దంలో ప్రపం చంలోని పెద్ద పెద్ద సమస్యలను భారత్‌ పరిష్కరి స్తుందని, మన సాంకేతిక, శాస్త్రీయ ఆలోచలను ప్రపంచమంతా అంగీకరిస్తుందని మోదీ అన్నారు. చంద్రయాన్‌ మహాభియాన్‌ అనేది కేవలం భారత్‌ విజయవంతం మాత్రమే కాదని, మొత్తం మానవాళి సాధించిన విజయంగా అభివర్ణించారు. మన మిషన్‌ చేపట్టే అన్వేషణ చంద్రుడిపైకి వెళ్లేందుకు అన్ని దేశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తుం దన్నారు. కేవలం చంద్రుడి రహస్యాలు తెలుసు కోవడమే కాకుండా,భూమిపై ఉన్న సమస్యల పరి ష్కారానికి ఇది సాయం చేస్తుందని మోదీ తెలిపారు. ‘‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ అనేవి అంతరిక్ష రంగంలో ఉన్నతమైన బలం. నేడు దేశ పాలనకి ముడిపడి ఉన్న ప్రతి అంశానికి స్పేస్‌ అప్లికేషన్‌ను అనుసంధానించే కార్యక్రమం పూర్త యింది. నేను ప్రధానమంత్రి అయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో, అంతరిక్ష శాస్త్ర వేత్తలతో నేను వర్క్‌షాపు నిర్వహించాను. పరి పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు స్పేస్‌ రంగాన్ని గరిష్టంగా వాడుకోవాలన్నది ఈ వర్క్‌ షాపు ఉద్దేశ్యం’’ అని మోదీ తెలిపారు.
చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఫొటోలు తీసిన చంద్ర యాన్‌-2 ఆర్బిటర్‌
చంద్రయాన్‌-3ల్యాండర్‌ను చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసిం ది.‘‘నేను నీకు గూఢచారిని!’’ అంటూ చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ చంద్రయాన్‌-3ల్యాండర్‌ను ఫొటో షూట్‌ చేసిందంటూ ఇస్రో ట్వీట్‌ చేసిం ది.చంద్ర యాన్‌-2లో ఆర్బిటర్‌ హై రెజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ఉంది.చంద్రుడి చుట్టూ ఏది ఉన్నా ఈ కెమెరా ఫొటోలు తీసి పంపుతుంది. చంద్ర యాన్‌-3 అక్కడ ల్యాండ్‌ అయిన తర్వాత, దీన్ని కూడా అది గుర్తించి, ఫొటోలు తీసింది. ‘‘ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్ర యాన్‌-3సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ సమయంలో దక్షిణా ఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్‌ -3 విజయంపైనే ఉంది. విజయంపట్ల శాస్త్రవేత్త లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అసాధా రణ విజయం. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఇప్పుడు భారత్‌ చంద్రుడిపై ఉంది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది చంద్రయాన్‌ -3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందాం. ’’ అని ప్రధాని మోదీ అన్నారు.
కక్ష్యలో సొంతంగా పరిభ్రమించి
జాబిల్లి(చందమామ)పై పరిశోధన కోసం రోదసిలోకి దూసుకెళ్లిన భారతవ్యోమనౌక చంద్ర యాస్‌3 లక్ష్యం దిశగా విజయ వంతంగా పయనించింది.చంద్రుడి కక్ష్యలో సొంతంగా పరిభ్రమించి ల్యాండర్‌ విక్రమ్‌..జాబిల్లి ఉపరితలం పొటోలను తన కెమెరాలో బంధించింది.ఈ పోటో లను ఇస్రో ఎక్స్‌(ట్విటర్‌)వేదికగా షేర్‌ చేసింది. చంద్రయాన్‌3 వ్యోమనౌకలో ప్రోపల్షన్‌ నుంచి ల్యాండర్‌ ఆగష్టు 23న విడిపోయిన తర్వాత కొద్ది సేపటికే ఈపోటోలను తీసినట్లు ఇస్రో వెల్ల డిరచింది. ఇందులో జాబిల్లి ఉపరితలంపై బిలా లు స్పష్టంగా కన్పిస్తున్నాయి.ఆబిలాల పేర్లనుకూడా ఇస్రో వెల్లడిరచింది. ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో,హర్కేబి జే తదితర వాటి పొటోలను ల్యాం డర్‌ తీసింది.ఇందులో గియార్డనో బ్రునో జాబిల్లిపై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఒకటి. ఇక హర్కేబి జే బిలం వ్యాసం దాదాపు 43 కి.మీలు ఉన్నట్టు తెలుస్తోంది.చంద్రడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లికి మరింత చేరువైంది. ఆగష్టు 23న చేపట్టిన డిబూస్టింగ్‌(వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడిరచింది. ల్యాండర్‌ (విక్రమ్‌),రోవర్‌(ప్రజ్ఞాన్‌)తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆరోగ్యంగానే ఉందని తెలిపింది.
గురు తప్పని ప్రయోగం..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ హరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్ర యాన్‌-3ప్రయోగం విజయవంతం అయ్యిం ది. జూలై 14,2023 చంద్రయాన్‌-3 మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగించారు శాస్త్రవేత్తలు.. చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌కు విక్రమ్‌ అని పేరు పెట్టారు. దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితా మహుడు విక్రమ్‌ సారాభాయ్‌ పేరు పెట్టారు. రోవర్‌కు ‘ప్రజ్ఞాన్‌’అని పేరు పెట్టారు. దీనిని సంస్కృ తంలో జ్ఞానం అంటారు. చంద్రయాన్‌-2 సమ యంలో ల్యాండ్‌ రోవర్‌కు అదే పేరు ఉండేది. రోవర్‌ అనేది వాహనం లేదా రోబోట్‌, ఇది వివిధ ప్రదేశాల నుంచి డేటాను సేకరించి ఆర్బిటర్‌కి పంపడానికి గ్రహం ఉపరితలం చుట్టూ తిరుగు తుంది.ల్యాండర్‌ అనేది లోపల రోవర్‌ ఉన్న ఒక రకమైన క్యారియర్‌. దాని సహా యంతో రోవర్‌ ఉపరితలంపై ల్యాండ్‌ చేయబడు తుంది. రోవర్‌ను ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్‌ చేయ డానికి ల్యాండర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రోవర్‌ ల్యాండ్‌ అయిన గ్రహం చుట్టూ ఒక ఆర్బిటర్‌ తిరుగుతుంది. రోవర్‌ గ్రహం ఉపరితలం నుంచి గ్రహం చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు డేటాను పంపుతుంది. అలాగే భూమిపై ఉన్న ఇస్రో-నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఆ సమాచారాన్ని ప్రసారం చేయడానికి ఆర్బిటర్‌ పనిచేస్తుంది…
భారత్‌ గుప్పిట చిక్కిన జాబిల్లి..
ఇండియా ఈజ్‌ ఆన్‌ ది మూన్‌.. ఇదీ ఇస్రో వారి సగర్వ ప్రకటన. జాబిలి మీద కాలు మోపిన తమ చంద్రయాన్‌3 ప్రాజెక్ట్‌ సూపర్‌ సక్సెస్‌ కొట్టిందన్న వార్తను ప్రపంచానికి చాటిచెప్పుకుంది ఇస్రో. అగ్రరాజ్యాల్ని సైతం నోరెళ్లబెట్టేలా చేసిన ఈ ఘన విజయాన్ని దేశం మొత్తం ఆస్వాదిస్తోం దన్నారు ప్రధాని మోదీ. మూన్‌ మిషన్లను చాలా దేశాలు విజయవంతం చేసుకున్నాయి. కానీ.. ఇన్నాళ్లు అందని జాబిలి..
ఇప్పుడు గుప్పిట చిక్కింది. చంద్రుడి మీద ప్రయోగంలో సంపూర్ణ విజయం సాధించి మళ్లీ మీసం మెలేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రోవర్‌ని దింపిన తొలి దేశంగా అవతరించింది భారత్‌. ఇస్రో అంచ నాలు ఏమా త్రం తప్పలేదు. అంగుళమైనా పక్కకు జరగలేదు. గీసిన గీత మీద సరిగ్గా వాలింది చంద్ర యాన్‌`3. విక్రమ్‌ ల్యాండర్‌ నెలరేడుని ముద్దా డిరదన్న శుభవార్త యావత్‌ దేశాన్నీ పులకింప జేసింది.ఈ అపూర్వమైన.. సాటిలేనివిజయంతో, భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్త లను దేశప్రజలు అభినందిస్తూ వారి కృషిని అభినం దిస్తున్నారు.సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
దేశాల నుంచి ప్రపంచ సంస్థల దాకా ఇదే మాట
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి భారత్‌ అడుగుపెట్టగానే ప్రపంచవ్యాప్తంగా మొదలైన జయ జయధ్వానాలు ఇంకా కొనసాగుతున్నాయి. శిఖ రాగ్ర సమావేశాల కోసం కలుసుకున్న ప్రపంచ దేశాల అధినేతల సంభాషణల్లోనూ, అంతర్జాతీయ వార్తా పత్రికలు, ప్రముఖ న్యూస్‌ చానళ్ల కథనాల్లో నూ ఇదేఅంశం ప్రధానంగా కనిపించింది. చంద్రు నిపై విక్రమ్‌ ల్యాండ్‌ కాగానే క్షణాల్లో తీవ్ర ఉద్వే గానికి గురయ్యానని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ మొదలు బ్రిటన్‌ ‘బీబీసీ’ వరకు భారత్‌కు జయహోలు పలికాయి. దాయాది దేశం పాకిస్థా న్‌కు చెందిన పత్రికలు సైతం అంతరిక్ష రంగంలో భారత్‌ తిరుగులేని విజయాన్ని ప్రస్తుతించాయి. జయహో భారత్‌.. సాహో ఇస్రో..అంటూ దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ప్రతి భారతీ యుడు సగర్వంగా తన జయహో అంటూ సంబ రాలు మొదలు పెట్టింది.భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్‌-3 ‘చంద్ర యాన్‌-3’చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయ వంతంగా ‘సాఫ్ట్‌ ల్యాండ్‌’ అయింది.
ఈఅపూర్వమైన..సాటిలేని విజయం తో,భారతదేశం చరిత్ర సృష్టించింది.భూమిసహజ ఉపగ్రహం (చంద్రుడు)ఈ భాగంలో దిగిన ప్రపం చంలో భారత దేశం మొదటి దేశంగా అవతరిం చింది. ఎందు కంటే ఇప్పటివరకు చంద్రునిపైకి వెళ్ళిన అన్ని మిషన్లు చంద్ర భూమధ్యరేఖకు ఉత్తరం లేదా దక్షిణంగా కొన్ని డిగ్రీల అక్షాంశంలో దిగాయి. భారత దేశ పతాకాన్ని ఎగురవేయడం వల్ల శాస్త్రవేత్తలలోనే కాదు, దేశంలోని సాధారణ ప్రజలలో కూడా అపారమైన ఉత్సాహం కనిపి స్తోంది.‘సాఫ్ట్‌ ల్యాండిరగ్‌’ గురించి తెలిసిన ప్రతి భారతీయుడి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.-గునపర్తి సైమన్‌