జమిలి ముచ్చట తీరేదెన్నడు..
జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమం టున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.లోక్‌సభ నుంచి పంచాయతీల వరకూ ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుందంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ జమలి ఎన్నికలపై దశాబ్దాలు గా జరుగుతున్న చర్చ మరోసారి ఉపందుకుంటోంది. కేంద్రం కోరుకుంటున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాకారమయ్యేనా?అందుకు విపక్షాలు సహకార మందిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జమలి ఎన్నికలపై ప్రత్యేక కథనం..
లోక్‌సభ ఎన్నికలే అయినా..రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికలు జరిగినా..పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా..ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయనేది కేంద్ర ప్రభుత్వ వెర్షన్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులోని ఈమాట ఇప్పటిది కాదు. ఆయన అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. 2019 బీజేపీ మానిఫెస్టోలో కూడా పెట్టారు. నీతీ ఆయోగ్ కూడా నివేదిక సిద్ధం చేసింది.లా కమి షన్ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
ఎన్నికలు తరచూ జరగడం మూలంగా సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు.. వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడు తోందని ప్రభుత్వం అంటోంది. అన్ని ఎన్నికలు ఏక కాలంలో జరిగితే..ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెం టరీ స్థాయి సంఘం తన 79వ నివేదికలో పేర్కొంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్ పేర్కొంది. సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలు న్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి.కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్ నేషన్..వన్ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని మోదీ భావిస్తే..అమలు పెద్దకష్టం కాదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది.
సై అంటున్న తెలుగు రాష్ట్రాలు.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..ప్రధాన పార్టీలు జమిలి ఎన్నికలకు సై అంటున్నాయి.జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తమపార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చా రు. ఇక ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేం దుకు రెడీగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు.2019లో జరిగి న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే..అఖిలపక్షం భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడిని ఆహ్వానించారు. అప్పుడే జమిలీ ఎన్నికల అవశ్యకత గురించి ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్నిపార్టీలు అంగీ కారం తెలిపాయి.వామపక్షాలు మాత్రం జమిలీ ఎన్నిక లను వ్యతిరేకిస్తున్నాయి. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా గతంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది.పార్లమెంట్‌లో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించే స్తామని చెప్పింది. ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే..కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గించాలని.. మరికొన్నింటినీ పొడిగించాల్సి ఉంటుంది. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.ప్రస్తుతం.. కేంద్రం తల్చుకుంటే రాజ్యాంగ సవరణ అంత కష్టమేమీ కాదు.
జమిలి కొత్తేంకాదు..కాగా, దేశానికి జమిలీ ఎన్నికలు కొత్తేంకాదు. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లోనే మూడు సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి.జమిలీ ఎన్నికలు జరగాలి అంటే..ప్రధాని మోదీ,హోం మం త్రి అమిత్ షా అనుకోవాలి.ప్రధానమంత్రి కూడా పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి.. ఒకే దేశం-ఒకే ఎన్నిక అనేది అత్యంత అవశ్యమని ఆయన చెబుతున్నారు. అందుకే జమలీ ఎన్నికలు జరుగుతా యని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. జమిలి ఎన్ని కలు అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి పార్ల మెంట్ ఎన్నికలు జరగాలి. అదే సమయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఒక్కో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి,ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు జరగడం గందరగోళం అవుతుంది. సంవ త్సరం మొత్తం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎన్నిక జరగడం వల్ల వ్యయం ఎక్కువ అవుతోంది, శ్రమ ఎక్కువైపో తుంది అన్న వాదన ఉంది.
5ఎన్నికలతో తేలిపోయింది.. అయితే 2023లో జమిలీ ఎన్నికలు నిర్వ హించాలి అనుకున్నప్పుడు యూపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపేందుకు ఈసీ చర్యలు తీసుకునేది కాదు.ఒకవేళ 2023 జమిలి ఎన్నికలు అంటే ఎన్నికైన ఆఅయిదు రాష్ట్రాల ప్రభుత్వా లను ఏడాదిలో రద్దు చేస్తారా..?అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి.ఒక వేళ జమిలి ఎన్నికలు పెట్టాలని భావిస్తే యూపీ,పంజాబ్,గోవా,మేగాలయ,ఉత్తరాఖండ్ ఎన్ని కల బదులు ఏడాది పాటు రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేది.లేదా ఏడాదో రెండేళ్లో అసెంబ్లీని పొడిగిం చాల్సి ఉండెది.
వెయిట్ చేయక తప్పదా? 2025లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పుడు 2024లో ఏపిలో ఎన్నికలు నిర్వహిం చకూడదు.ఇదే ప్రభుత్వాన్ని ఏడాది పాటు కొనసాగిం చాలి.ఒక వేళ 2029లో జమిలీ ఎన్నికలకు పోవా లంటే ఇప్పుడు జరుగనున్న అయి రాష్ట్రాల పదవీ కాలం అయిదేళ్లు 2027కు పూర్తి అవుతున్నందున ఈ రాష్ట్రాల పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిం చాల్సి ఉంటుంది. ఇలా జమిలీ ఎన్నికలు నిర్వహిం చాలి అంటే పలు రాష్ట్రాల పదవీ కాలాన్ని కుదించాలి. మరి కొన్ని రాష్ట్రాల పదవీ కాలాన్ని పెంచాల్సి ఉం టుంది.దీనికి ఆయా రాష్ట్రాల తీర్మానాలు తప్ప నిసరి. దేశ వ్యాప్తంగా29రాష్ట్రాలు ఉంటే కనీసం20 రాష్ట్రాల నుండి మేము జమిలికి సిద్దమేనంటూ తీర్మానాలు వెళ్లాలి.ఆతరువాత పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలి, లా కమిషన్ కు పంపించాలి. అభ్యంతరాలు లేవని చెప్పాలి. అప్పుడు రాజ్యసభ ఆమోదించాలి. అవసర మైన రాజ్యాంగ సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపాలి.రాష్ట్రాలకు సంబంధం లేకపోతే కేం ద్రం తలుచుకుంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా పెట్టే యవచ్చు..కానీ దీనికి రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి. ఇవన్నీ పరిశీలిస్తే జమిలి ఎన్నికలు జరగాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదనే అభిప్రా యం వినిపిస్తుంది.
‘జమిలి’ నిరంకుశం!
అన్నివైపుల నుండి వ్యతిరేకత వస్తున్నా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి (రాజ్యాంగ సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపంపైన, సమాఖ్యవాదంపైన దాడిగా దీనిని అభివర్ణించడం సరైనదే! రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలాన్ని కేంద్ర పదవీ కాలంలోకి మార్చడం రాజ్యాంగానికి ద్రోహం చేయడ మేనని విమర్శించాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే లోక్‌సభ ఎన్నికలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.ఈ విష యమై ఓటింగ్ కోరగా269 మంది సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లును సమర్పించడానికి మద్దతు ఇవ్వగా 198మంది సభ్యులు వ్యతిరేకిం చారు.బిల్లు అంతిమంగా నెగ్గడానికి మూడిరట రెండొంతుల మెజారిటీ అవసరం.కానీ ఆపరిస్థితి లేకపోయినా మోడీ ప్రభుత్వం బిల్లును బుల్డోజ్ చేయ డం నిరంకుశ పోకడలకు నిదర్శనం. ఏమైనప్పటికీ ప్రజెంటేషన్ దశలోనే తీవ్రవ్యతిరేకత రావడంతో బిల్లులను సం యుక్త పార్లమెంటరీ కమిటీకి పంపక తప్పలేదు.
సమగ్ర అధ్యయనం, విస్తృత చర్చల తర్వాతే బిల్లు తీసుకొచ్చామని,మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పా టు చేసిందని మంత్రి మేఫ్న్‌వాల్ లోక్‌సభకు సుతి మెత్తగా వివరించారు. కానీ,‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే భావన రాజ్యాంగంలోని ఫెడరలిజంతో సహా దాని మౌలిక స్వరూపానికి విరుద్ధం.‘బిల్లులోని నిబం ధనలు శాసన వ్యవస్థ అధికార పరిధిని ఉల్లంఘిం చేవిగా ఉన్నాయి.లోక్‌సభ పదవీకాలం ప్రకారం శాసనసభల పదవీకాలం నిర్ణయించబడదు. చట్టసభ లు విడివిడిగా ఉంటాయి. ఈ బిల్లుతో అధిక కేంద్రీక రణ అమలులోకి వస్తుంది.సభల కాలవ్యవధి, ఎన్నిక లు ఎప్పుడు నిర్వహించాలనే అధికారాలను ఎన్నికల కమిషన్‌కే వదిలేస్తున్నారు. అలా అయితే ఒక వ్యక్తి కోరిక నెరవేర్చడం కోసమేఈ బిల్లులను పెట్టినట్లు ఉంటుంది’ అన్న ప్రతిపక్ష ఎంపీలి విమర్శ అక్షర సత్యం. ఈ బిల్లుతో దేశ గణతంత్ర రాజ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్,మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబం ధించినవని, కానీ ఈ బిల్లుతో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పెత్తనం కిందికి వెళ్లిపోతాయన్న సిపిఎం ఎంపి అమ్రా రామ్ ఆందోళన ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియు లందరిదీను. దేశంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైన భాష,తమదైన అధికార వికేంద్రీకరణ కలిగి ఉన్నాయి. వాటిపై రాష్ట్రాలకు గలహక్కును కేంద్రం ఎలా లాక్కొం టుంది? కానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రాంతీయ పార్టీలు మూడూ ఈబిల్లును సమర్థించడం ఆత్మహత్యా సదృ శం. జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల వ్యయం తగ్గుతుం దన్న మాట సర్వాబద్ధం.మోడీ సర్కారుకు ఊపిరి పోస్తూ ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న జెడియు నుంచి ఎవరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడకపోవడం గమ నార్హం. ప్రస్తుతానికి పక్కన పెట్టినా పంచాయతీలు, స్థానిక సంస్థల ప్రాథమిక సూత్రమైన వికేంద్రీకరణ స్ఫూర్తికే పూర్తి విరుద్ధమైనది. కీలకమైన ‘స్థానికత’ మాయమవుతుంది కదా! గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అవగాహనకే ఇది విఘాతం. గత 75 ఏళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో, పార్లమెంట్, శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో మనం చూశాం. స్థానిక సంస్థలకు, వాటికి నిధులు, విధులు, అధికా రాల కల్పనకూ సాగిన ఉద్యమాలు, చేసిన పాలనా సంస్కరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. వాటన్నిటికీ పాతర వేసే ఈజమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశం లో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొం టుంది. అది ఏక పార్టీ పాలనకూ ఆ తరువాత ఏక వ్యక్తి నియంతృత్వానికి దారి తీసే ప్రమాదం వస్తుంది. నిరంకుశమైన జమిలి ఎన్నికల ప్రతిపాదనను అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, యావత్ దేశ పౌరులు ఐక్యంగా వ్యతిరేకించాలి. భారత రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోవాలి.
జమిలి పాట..రాజ్యాంగానికి పోటు..
పార్లమెంటు ఉభయ సభలూ ప్రస్తుతం అతి కీలకమైన రెండు అంశాలపై చర్చ తలపెట్టాయి. ఇందులో ఒకటి నడుస్తుండగా మరొకటి నిర్ణయం కావలసి వుంది.నిజానికి ఈ మూడూ పరస్పర సంబంధం లేనివేమీ కాదు. బిల్లు తీసుకు వస్తామం టున్న మార్పులు చేర్పులు గానీ రాజ్యాంగ మూల స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనవి.వాటిని జనంతో మింగిం చేందుకే ఏవో వేడుకలు, ఉత్సవాలు, చర్చలు అంటూ మాయ నాటకం నడిపిస్తున్నారు. అదానీకి సంబం ధించిన ఆరోపణలతో సహా పలు కీలకాంశాలు దాట వేసేందుకు కూడా ఈప్రహసనం తీసుకొచ్చారని చెప్పాలి.ప్రభుత్వం తరపున లోక్‌సభలో చర్చలో పాల్గొ న్న సీనియర్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యాం గంలో నిబంధనలను గురించిగాక ఏకగ్రీంగా ప్రక టించిన రాజ్యాంగ ప్రతిని ప్రశ్నించడంతో మొద లు పెట్టారు. రాముడు సీత విగ్రహాలతో ఏవో మత చిహ్నాలు వుంటే వాటిని లేకుండా చేశారని ఆరెస్సెస్ చిరకాల ఆరోప ణలు సభలో వల్లెవేశారు. రాజ్యాంగ నిర్మాతలు కోవిదు లైన వారిని గౌరవించకపోగా దాంట్లో భారతీయత ఏ మాత్రం లేదని తిట్టిపోసిన ఆరెస్సెస్ భావ ప్రవక్తలైన వినాయక దామోదర సావర్కర్, జనసంఫ్న్ వ్యవస్థా పకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి వారి పేర్లు జపించారు.మత రాజకీయాలను ఆ నాడే తిరస్క రించిన భగత్‌సింగ్‌ను తమ ఖాతాలో వేసుకుని మాట్లా డారు. ఇందిరా గాంధీ కుటుంబాన్ని విమర్శిం చే పేరిట నాటి కాంగ్రెస్ నాయకత్వాన్ని స్వాతంత్ర పోరాట విలువలను తిరస్కరించే బిజెపి, ఆరెస్సెస్ బాణీయే ఈ చర్చలో అడుగడుగునా గోచరిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్,ఎస్‌పి, సిపిఎం తదితర పార్టీలు ప్రజా స్వామ్యం, లౌకిక విలువలు, రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలకు హాని కలుగు తున్న తీరును ప్రస్తావిస్తే వారికి మహా కంటగింపుగా వుంటున్నది. అడుగడుగునా అడ్డు తగులుతూ చర్చను రచ్చగా మారుస్తున్నారు. కాంగ్రెస్ తరఫున వయనాడ్ నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం కూడా ఈ అంశంపైనే కావడం విశేషం.
జమిలి జుమ్లా
ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెల్పింది గనక సోమవారం నాడు న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ దాన్ని సభలో ప్రవేశ పెడతారని ప్రకటించారు. ఈ లోగా వీలైన ప్రతి చోటా బిజెపి, ఎన్‌డిఎ నాయకులు దానికి మద్దతు ప్రకటిస్తూ కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొ స్తున్నారు. తెలుగు రాష్ట్రాల వరకూ చూస్తే ఎపి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జమిలిని బలపరుస్తున్నదని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు బిల్లు ఆమోదించినా 2029లోనే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఆయన కొత్త సవరణ ప్రకటించారు. మరోవంక దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోని వైసిపి మాత్రం రాజ్యాంగ కోణం కన్నా తమకు తొందరగా మళ్లీ ఎన్నికలు వస్తాయన్న ఆనందంతో పొంగిపో తున్నది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ జమిలికి సిద్ధంగా వుండాలంటుంటే వారి మీడియా, ఆ పార్టీ ప్రతినిధులు కూడా జమిలి జపమే చేస్తున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ కూడా సూటిగా స్పందిం చకుండా మరింత స్పష్టత రావాలని చెబుతున్నది. కానీ వాస్తవానికి రేవంత్ సర్కారు గడువుకు ముందే తొలగిపోతుందనే ఆనందం వారిలో తొంగి చూస్తు న్నది. ప్రాంతీయ పార్టీలుగా ఈమూడూ సమాఖ్య విధానానికి రాజ్యాంగస్ఫూర్తికీ పూర్తి విరుద్ధమైన ఈ మార్పును గట్టిగా వ్యతిరేకించాల్సింది పోయి తాత్కాలిక దృష్టితో మాట్లాడటం దురదృష్టకరం. చంద్ర బాబు నాయుడు బిల్లు ఆమోదించినా ఎన్నికలు రాబో వని నమ్మకంగాచెబుతున్నారంటే మోడీ తీరు, ఆరెస్సెస్,బిజెపి రాజకీయాలు ఆయనకు తెలియ వనా? ఎన్‌డిఎలో చేరే నాటికే వారి విధానాలు ఇలానే వుంటాయని చంద్రబాబు వంటి వారికి బాగా తెలుసు. ఏమైనా అధికారం కోసం మోడీతో రాజీపడి ఆయన హుకుంలను ఆమోదించక తప్పదని తల వంచు తున్నారు.బిజెడి,అకాలీదళ్,ఎఐడిఎంకె,లోక్ జనశక్తి వంటివి బలపర్చాయని నివేదిక చెబుతున్నది. బిఆర్ ఎస్,ముస్లింలీగ్,నేషనల్ కాన్ఫరెన్స్,వైసిపి,టిడిపి వం టివి అధికారికంగా సమాధానమివ్వలేదట.డీఎంకె, ఆప్,ఎస్‌పి,వంటి ప్రాంతీయపార్టీలతో పాటు కాంగ్రెస్, సిపిఎం,సిపిఐ,బిఎస్‌పి,ఎస్‌పి వంటివి గట్టిగా వ్యతిరేకి స్తున్నాయి.చిన్నా పెద్ద కలిపి 32 పార్టీలు బల పరు స్తుంటే 15వ్యతిరేకిస్తున్నాయని లెక్క చెబు తున్నారు. గతంలో కొంత బలపర్చిన పార్టీలు కూడా ఇప్పుడు వ్యతిరేక వైఖరి తీసుకున్నాయని దీనిపై నివేదికనిచ్చిన కమిటీ అధ్యక్షుడు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెల్లడిరచారు.ఈ నివేదికను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్ ఆదిశలో ముందుకు పోవాలని నిర్ణయిం చింది.ఇందుకు సభలో ఎన్‌డిఎ సంఖ్యా బలం సరిపో తుందా అనేది ఒకటైతే రాజ్యాంగపరంగా ఇది చెల్లుతుందా అనేది మరొకటి.
మాజీ రాష్ట్రపతి సేవలు
దేశానికి రాష్ట్రపతి అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించినట్టు లెక్క. అలాంటివారికి తదుపరి కాలంలో మరో బాధ్యత అప్పగించడం గతంలో ఎరగనిది. కానీ మోడీ సర్కారు మాజీ సిజెఐలతోపాటు రాష్ట్రపతులను కూడా రంగం లోకి దింపడం చూస్తున్నాం.2023లో విడుదల చేసిన ఉన్నత స్థాయి కమిటీ నియామకం ఉత్తర్వు 11019/3/23లో కోవింద్‌కు జమిలి ఎన్నికల నిర్ణయం అమలును చర్చించమన్నారే గాని సిఫార్సు కోసం ఆ కమిటీని వేయలేదు.పైన చెప్పుకున్న రాజ్యాంగ నిబంధనలకు ఇది పూర్తి వ్యతిరేకమైన నిర్ణయం. రాజ్యాంగం 75(3)అధికరణం లోక్‌సభ పదవీ కాలాన్ని,164(1)శాసనసభల పదవీ కాలాన్ని విడివి డిగా పేర్కొంటున్నది. సభ రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరు నెలలకు మించి వుండరాదంటున్నది. 83(2) లోక్‌సభ విషయంలోనూ,172(1) శాసన సభల విషయంలోనూ ఇతరేతరంగా రద్దు కాకపోతే మాత్రమే అయిదేళ్ల పదవీ కాలం అంటున్నాయి తప్ప కాల పరిమితి లేదు.వీటిలో దేనికి దానికి స్వంత అస్తిత్వం ఏర్పాటు ముగింపు రద్దు అవకాశాలున్నాయి. 83వ అధికరణం లోక్‌సభ కాలపరిమితినీ, 85 రద్దు అవకాశాన్ని చెబితే 172వ అధికరణం శాసనసభ గడువునూ 174 రద్దునూ చెబుతున్నాయి. రాష్ట్రాలకు అదనంగా 356 కింద రాష్ట్రపతి రద్దు చేసే మరో అధికరణం వుంది. ఆ తర్వాత ఆరు మాసాల లోపు మరో సభసమావేశం కావాలని వుంది. దీని అర్థమే టంటే రాజ్యాంగ నిర్మాతలు కృత్రిమంగా సభలను పొడిగించాలని గానీ, ప్రజల ఆమోదం (ఎన్నికలు) లేకుండా పాలన నడిపించాలని గానీ ఎంతమాత్రం కోరుకోలేదు.పైగా 1967 వరకూ లోక్‌సభ శాసన సభల ఎన్నికలు ఒకేసారి జరిగాయంటే దానికి కార ణం కాంగ్రెస్ గుత్తాధిపత్యం వుండటమే. తర్వాత కాలంలోనూ ప్రతిపక్ష ప్రభుత్వాలను కేంద్రం నిరం కుశంగా రద్దు చేయడం వల్లనే రెంటికీ మధ్య అంత రం వచ్చింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు కూట ములు అయిదేళ్లు తప్పక కొనసాగుతాయనే గ్యారంటీ వుందా? కానీ ఆ పేరిట కృత్రిమంగా పొడిగించడం అంటే ప్రజల ఆమోదం లేని పాలన రుద్దడమే.
అంతా ఒకే పెత్తనమా?
ఒకే దఫా ఎన్నికల ఖర్చు ఎన్నికల్లో గెలవని పాలన సాగి ప్రజాధనం గల్లంతవుతుంది. దీనివల్ల రూ.5,000కోట్లు ఆదా అవుతాయని జిడిపి పెరుగు తుందని తాడూ బొంగరం లేని కథలు చెబుతు న్నారేగానీ బాధ్యత లేని పాలన వల్ల ఎన్ని వేల కోట్లు దారి తప్పుతాయో వేరే చెప్పాలా? ఒక చిన్న ఇంట్లో అందరి పెళ్లిళ్లు అందరి చదువులు ఒకేసారి జరగవు గానీ ఇంత పెద్ద దేశంలో అన్ని ఎన్నికలు ఒకే సారి జరగాలనడం ఏంతర్కం? ఏం ఇంగితం? కేంద్రం లో ప్రభుత్వాలు నాలుగు సార్లు కూలిపోయాయి. మరో రెండు సార్లు ముందే ప్రధాని ఎన్నికలకు వెళ్లారు. మరి ఇలాంటి సమయాల్లో అన్ని రాష్ట్రాలలో అనవస రంగా సభల రద్దు ఖర్చు తగ్గిస్తుందా పెంచుతుందా? ఈదేశాన్ని రాష్ట్రాల కలయిక అని రాజ్యాంగం చెబుతుందే గానీ కేంద్రీకృత ఏకరూప అని చెప్పడం లేదే? ప్రపంచ బ్యాంకు లేదా అంతర్జాతీయ పెట్టుబడి చెప్పే ప్రపంచీకరణ విధానాలు ఒకే విధంగా అమలు చేసే ఏకీకృత మార్కెట్‌గా రుద్దడం కోసమే దీనిపై ఇంత హడావుడి. అదే విధంగా ఏకరూప మెజార్టీ మతతత్వ నిరంకుశత్వంతో రాష్ట్రాలను మండలాల స్థానిక సంస్థల స్థాయికి దించే సంఘపరివార్ కుట్ర కూడా.అందుకే మలి దశలో స్థానిక సంస్థల ఎన్నిక లను కూడా ఈ పరంపరలో కలపడమంటే అర్థం అదే.ఒకే పన్ను,ఒకే రేషన్,ఒకే చట్టం,ఒకే విద్య, ఒకే మతం,ఒకే బిజెపి,ఒకే మోడీ అన్నదాని పరాకాష్ట. వీరు ఇది అధ్యక్ష తరహా పాలనను రుద్దే ప్రయాణం లాంటిదే. అలా రాజ్యాంగం రెండుసార్లు మార్చుకున్న శ్రీలంక వంటి ఇరుగు పొరుగు దేశాలు కూడా మళ్లీ వెనక్కు రావలసి వచ్చింది.ప్రపంచంలో భారత దేశం లా ఇన్ని భాషలు, విభిన్నతలు గల దేశాలు వేళ్ల మీద లెక్క పెట్టదగినన్ని కూడా లేవు. అటు మార్కెట్ ఇటు మతతత్వం అవసరాల కోసం ఆరాటపడటమే గానీ చిన్నవీ పెద్దవీ కలిపితే 28 రాష్ట్రాలు గల ఈ దేశంలో ఇది ఆచరణ సాధ్యం కూడా కాదు. స్థిరత్వం జపం వాస్తవంలో మరింత అస్థిరతకూ మరింత ఆర్థిక భారానికి దారితీస్తుంది.15 రాజ్యాంగ సవరణలు చేయాలి. రాష్ట్రాలలోనూ ఆమోదించాలి. ఇందుకు లోక్‌సభలో 362కావలసి వుంటే 299 ఎంపీల మద్ద తు మాత్రమే వుంది.ఎటూ చేరని వారు 19.ఇక రాజ్యసభలో 164 మంది మద్దతు కావాలంటే 125 బలం మాత్రమే వుంది.24 మందిది అటూ ఇటు కాని మధ్యే మార్గం,ఈ పొందికలో తుది ఫలితం ఏంటనేది ఒకటైతే రాష్ట్రాలలో చాలా చోట్ల ఎన్‌డిఎ అధికారంలో లేదు. కనుక పార్లమెంటులో బిల్లు ఆమో దం పొందడం కూడా గగనమే గనక పార్టీలను తిప్పు కునే పథకాలు కుట్రలూ కూడా జరుగుతాయి. ఏమైనా రాష్ట్రాల హక్కులనూ ప్రజల ఎన్నుకునే హక్కును కూడా కాపాడుకోవడం ఇక్కడ కీలక సవాలు. తమ తాత్కాలిక అవసరాల కోసం వైసిపి, బిఆర్‌ఎస్ వంటివి ఆహ్వానించడం,టిడిపి భాగస్వామిగా మారడం అవాంఛనీయం.
జగడపు ధన్‌ఖర్
ఇక రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఈపరిణామాల కొనసాగింపే. ఎందు కంటే రాజ్యసభ మౌలికంగా రాష్ట్రాల సభ (రాజ్యం అంటే రాష్ట్రం).కానీ జగదీప్ ధన్‌ఖర్ వచ్చాక రాజును మించిన రాజభక్తుడిలా మోడీని మించి ఆరెస్సెస్‌ను కీర్తించడం,ప్రతిపక్షాల పీకనొక్కడం నిత్యకృత్య మైంది. దీన్ని నిరసించిన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో సహా ప్రతి ఒక్కరితో ఆయన వాదనలు పెట్టుకుని అవమానిస్తున్నారు. కనుకనే అనివార్యంగా ఆయనపై అవిశ్వాసం నోటీసునిచ్చాయి.దానిపైన కూడా తగాదా పెట్టుకోవడం ధన్‌ఖర్‌కే చెల్లింది. అయితే ఆతీర్మా నాన్ని అనుమతిస్తారా లేక ఏవో సాకులతో నిరాకరి స్తారా అనే సందేహాలున్నాయి.లౌకిక ప్రతిపక్షాలు మోడీ సర్కారు కుట్రలకూ ఒత్తిళ్లకు తల వంచకుండా ఐక్యంగా నిలబడితే ఈకుట్రలను ఛేదించడం సాధ్య మవుతుంది.ఏమైనా పార్లమెంటు ఎన్నికల తర్వాత రాజకీయంగా తీవ్రమవుతున్న ఘర్షణనే పార్లమెంటు ప్రతిబింబిస్తున్నదని చెప్పాలి.
(వ్యాసకర్త : ఇండిపెండిరట్ జర్నలిస్టు`న్యూఢల్లీి)-(ప్రకాశ్ యాదవ్‌జీ)