జనావాసాల్లో జంతువులు

అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు కొంత కాలంగా జనావాసాల బాట పడుతున్నాయి. దీంతో జనపథాలుగొల్లుమంటున్నాయి.తెగించి ఎదురునిలిచినా, తెలియక ఎదురుపడినా బతుకుపై భరోసా లేనట్టే. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిన స్థితి. చిత్తూరు జిల్లాల్లో ఏనుగు దాడిలో ముగ్గురు మరణిం చినా,తిరుమల కొండల్లో అభం శుభం తెలియని పసిపాప చిరుతకు బలైనా, వందలాది ఎకరాల్లో పంటపొలాలు ధ్వంసమైనా.. ఆ మూల నుండి ఈ మూల వరకు ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒకప్రాంతంలో వన్యమృగాలు సంచరిస్తు న్నట్లు వార్తలు వస్తున్నా కారణం ఒక్కటే.. అది మృగాలకి, మనుషులకి మధ్య పెరుగుతున్న ఘర్షణ. అనివార్యంగా మారుతున్న మనుగడ పోరాటం. ఎక్కడో కాకులు దూరని కారడవుల్లో ప్రశాంతంగా తమ మానాన తాము బతికే పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు నుండి వివిధ రకాల వన్యమృగాలు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? మనకు సమస్యగా ఎందుకు మారుతు న్నాయి? ఈ సంఘర్షణకు పరిష్కారం లేదా? అసలీ దుస్థితికి కారణం ఏమిటి? దీనిపై ప్రత్యేక కథనం..
వన్య మృగాలు జనావాసాల్లోకి రావడమనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్యేమీకాదు. అటవీ ప్రాంతాలకి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలకు వన్యమృగాలు తారసపడటం అనేది సహజమే. అయి తే, అది మృగాలకు మనుషులకు మధ్య ఘర్షణగా మారే సందర్భాలు మాత్రం అరుదు. పొరపాటున గ్రామాల్లోకి వన్యమృగాలు వచ్చినా, మనిషి తారస పడగానే అవి వెనక్కి తగ్గేవి. అనివార్యంగా జనావా సాలను దాటాల్సి వచ్చినా.. సాధ్యమైనంత మేరకు మనిషి కంటపడకుండా వెళ్లిపోతాయి. అడవులకు సమీపంలో నివసించే చెంచులను, గిరిజనులను అడిగితే ఇటువంటి సంఘటనలను కోకొల్లలు చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. కిలోమీటర్ల దూరం జనావాసాల్లోకి వన్యమృగాలు వచ్చేస్తున్నాయి. ఆ మేరకు మనుషులకు మృగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలూ పెరుగు తున్నాయి. జంతువుల దాడుల్లో మనుషులు, మను షుల దాడుల్లో జంతువులు మరణిస్తున్న సంఘటనలూ పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 నుండి 2025 సంవత్సరాల మధ్య కాలంలో వన్యమృగాల బారిన పడి రాష్ట్రంలో 139మంది మరణించారు. మృతులలో పురుషులే ఎక్కువ. ఏ జంతువుల బారిన పడి ఈ మరణాలు చోటుచేసు కున్నాయి అన్నది ఎన్‌సిఆర్‌బి అధికారికంగా ప్రకటిం చలేదు. అయితే, అటవీ, పోలీస్‌ అధికారులు చెబు తున్న సమాచారం ప్రకారం ఏనుగులు, ఎలుగుబంట్ల దాడుల కారణంగానే ఈమరణాలు చోటుచేసు కున్నాయి. ఇటీవల కాలంలో చర్చనీయాంశమైన చిరు తలు,పులుల దాడుల్లో మనుషులు మృతి చెందిన సంఘటనలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఇటీవల తిరుమలలో జరిగిన దురదృష్టకర సంఘటన దీనికి మినహాయింపు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలు ఏనుగుల గుంపుల బారిన తరచూ పడుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి నివేదికలను పరిశీలిస్తే అర్థమవుతోంది. సంవత్సరానికి సుమారుగా 30 మంది వన్యమృగాల బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్నారు. 2018 సంవత్సరంలో 31 మంది, 2019లో 25 మంది, 2020లో 32మంది మరణించారు. అనధికారికం గా మరికొన్ని సంఘటనలూ చోటుచేసుకుని ఉండ వచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్ల దాడులు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. నాలుగు ఏనుగుల మంద ఈప్రాంతంలో తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. మన్యం పార్వతీపురం జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఆరు ఏనుగులు కనిపించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో గడిచిన ఐదు సంవ త్సరాల కాలంలో ఏనుగుల దాడిలో ఆరుగురు రైతులు మరణించారు.వీటిని బంధించడానికి వచ్చిన ఒక ట్రాకర్‌ కూడా మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా లో ఐదు సంవత్సరాల కాలంలో పదిమంది రైతులు మరణించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో గత ఏడాది పెద్ద పులుల సంచారం కలకలం రేపగా, ఈఏడాది శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్దపులి కనిపించినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి.కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ శాంచురీ నుండి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి ఏనుగుల రాకపోకలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్నాటక నుండి కూడా ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓఒంటరి ఏనుగు బారిన పడి,చిత్తూరు జిల్లా లో కొద్దిరోజుల క్రితం ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.-(తిరుపతి రెడ్డి మద్దిగెడ్డ)