చేయవలసినదింకెంతో..
ఒక వ్యక్తిని మరో వ్యక్తి కాదు, యావత్ సమాజమే అతను ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా గౌరవించి గుర్తుంచుకొని తన మనసుల్లో నింపు కుంది అంటే అది సామాన్య విషయం కాదు. ఆ వ్యక్తి కూడా అసమాన్యుడే అయి ఉంటాడు. ఆ అసమాన్య వ్యక్తి మరి ఎవరో కాదు మానవ శాస్త్రవేత్తగా ఆంగ్లేయ ప్రభుత్వం ద్వారా పంపబడిన నైజాం సర్కార్ ఉద్యోగి ‘హైమన్ డార్ప్’.కేవలం ఉద్యోగి గా గిరిజన ప్రాంతాలు సందర్శించి మొక్కుబడి కృషిచేసి తాత్కాలిక రిపోర్టులు అందించి ఉంటే అతను అనేకమంది సర్కారు ఉద్యోగుల్లో ఒకడిగా మిగిలిపోయి ఉండేవాడు. కానీ ఈ ‘మానవ శాస్త్ర ప్రొఫెసర్’ ఆదిలా బాద్ గోండు గిరిజనుల సమీకృత అభ్యున్నతి కోసం బలమైన పునాదులు వేయడమే కాక వారి సమగ్ర అభివృద్ధి కోసం అనేక భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసిన క్రాంతదర్శి వారికోసం ఆయన జీవితమే త్యాగం చేసి వారితో కలిసి వారిలో ఒకడిగా జీవించి, ఆదిలాబాద్ అడవి బిడ్డల ఆత్మ బంధువుగా నిలిచిపోయాడు. ఒకసామాన్య ఉద్యోగి ఆదివాసులకు అంత ఆప్తుడుగా ఎలా మారి పోయాడు? అతడు చేసిన కృషి వెనుక గల అంతరార్థం ఏమిటి? తెలుసుకోవాలి అంటే ఆయన చేసిన క్షేత్రస్థాయి అధ్యయనం, రూపొందించిన పథకాలు, తదితర విషయాల గురించి కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఆదిలాబాద్ ఆదివాసుల జీవితాలను గొప్ప మలుపు తిప్పిన మొత్తం కథనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే రెండు చారిత్రక నివేదికల చిరు పుస్తకమే ‘చేయ్యవలసిన దింకెంతో…’ వ్యాస సంపుటి, సంపూర్ణ ఆంగ్ల భాషలో వ్రాయబడ్డ, తెలుగు ఆంగ్ల భాషల్లో సమర్ధులైన ‘‘సుమనస్పతి రెడ్డి’’ సంపాదకత్వంలో అనువాదకురాలు ల.లి.త సరళమైన తెలుగులోఅను వదించారు. 1944,1946 సంవత్సరాల్లో ‘హైమన్ డార్ప్‘ ఆదిలాబాద్ గోండుల జీవన సరళి గురించి నాటి నైజాం సర్కారుకు, రాసి ఇచ్చిన రెండు చారిత్రిక నివేదికల సంక్షిప్త రూపం మనం ఇందులో చదవవచ్చు. ‘మర్లవాయి’ గోండు గ్రామం కేంద్రంగా ‘డార్ప్’చేసిన ఈ క్షేత్రస్థాయి కృషి గురించి, అతని శాస్త్రీయమైన ప్రణాళికల గురించి నేటితరం అధికారులు తెలుసుకొని ఆచరణాత్మకంగా కృషి చేసిననాడు యావత్ వెనుక బాటు సమాజ శాఖలన్ని అభివృద్ధి పథంలో మును ముందుకు దూసుకుపోగలవు అనే లక్ష్యంతో సంపాదకులు,అనువాద రచయిత్రి,ఈఅక్షర యజ్ఞానికి పూనుకున్నారు అనిపిస్తుంది. యావత్ సమాజానికి అభివృద్ధి కారకం ‘విద్య’ ఒక్కటే అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి,విద్య ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఆ సమాజం కూడా అంతే ఘనంగా అభివృద్ధి సాధించి తీరుతుంది, అంటే అభివృద్ధి అనే బండికి విద్య అనే చక్రాలు అవసరం ఏమిటో అవి ఎంత పటిష్టంగా ఉండా లో వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిరు పుస్తకంలో 1944సం: నివేదికలో హైదరాబాద్ సంస్థానంలో ఆదివాసుల విద్య గురించి, 1946 సం: నివేదికలో ఆదిలాబాద్ జిల్లా మూలవాసుల పున రావాసం సాధించిన ప్రగతి సమస్యలు, గురించి వివరణ చదవ వచ్చును.1941లో గోండు సామాజిక వర్గంలో 6,78,149 మందిలో కేవలం 4,486మంది మాత్రమే అక్షరాస్యులు,అంటే 1000కి ఆరుగురే అక్షరాస్యులు, లంబా డాల్లో తప్ప కోయ జాతి వారిలో ఈ అక్షరాస్యత మరీ తక్కువ అని ‘‘డార్ప్’’ నివేదికలో వెల్లడి చేశారు.అలాంటి అల్పస్థాయి నుంచి వారి సంస్కృతి సాయంగానే గోండుల అక్షరాస్యత పెంచవచ్చని,అలాగే వారి అక్షరాస్యత తొలి అడుగులు గోండి భాషలో పడాలని, అక్షరాలు నేర్పే వారు సైతం గోండులై ఉండాలని ఆయన పేర్కొన్నారు.కానీ ఈ రెండు పరిస్థితులు సాధించటం నాడు కష్టతరంగా ఉంది హైదరాబాద్ సంస్థానంలో మాట్లాడే గోండు భాషకు లిపి లేదు రాయడం వీలు కాదు, అలాగే చదువుకున్న కొద్దిమందిలో నేర్పే శక్తి గల వారు ఎవరూ లేరు. కేవలం మౌఖిక సాహిత్య రూపంలో గల అమూల్యమైన గోండు సాహిత్యం అంతా తన క్షేత్ర పర్యటన ద్వారా సేకరించి భద్రపరిచి దానిని ఉపయోగించినట్టు ‘డార్ప్’ పేర్కొన్నారు.చివరికి లిపిలేని గోండు భాషకు ఏలిపిని అందించాలి అని తర్జనభర్జనల పిదప గోండుభాష ద్రావిడ భాష కనుక దీనికి చెందిన తెలుగు లిపిని అన్వయం చేయాలని కొందరుఅన్నా, నాటి అధికారభాషలుగా గల ఉర్దూ, మరాఠా భాషలు ప్రజల నోళ్ళల్లో అధికంగా ఉన్నా యి కనుక ప్రజలకు త్వరగా అర్థం అయ్యే ఉర్దూ, మరాఠా, భాష లిపుల్లో వ్రాయాలని తద్వారా విద్య త్వరగా అందుతుందని డార్ప్ అభిప్రాయపడ్డారు.ఈ మొదటి నివేదికలో కేవలం గోండుల సామాజిక పరిస్థితులు, అక్షరాస్యత, వెనుకబడటానికి కారణాలు చెప్పి ఊరుకోకుండా అభివృద్ధికి కావలసిన సలహాలు, సూచనలు, కూడా ఇవ్వడం వల్ల ఈ నివేదిక విలువ మరింతగా పెరిగింది.డార్ప్ స్థానిక గోల్డ్ యువకుల సాయంతో ఎలాంటి శిక్షణలు ఇచ్చారు, ఎటువంటి పుస్తకాలు ప్రచురించారు. ఈ తొలి నివేదికలో కూలంకషంగా వివరించారు.1945సం:లో రెండు నెలల పాటు ఆదిలాబాద్ ప్రాంతంలో పర్యటించిన హైమన్ డార్ప్ ఆదిలాబాద్ ఆదివాసులు సాధించిన ప్రగతి, సమస్యలు, గురించి ఏకరువు పెట్టారు.దాని రెండవ నివేదికగా అందించారు. గోండులు చదువుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరగడంతోపాటు, సామాజిక అంశాలు, రాజ్యాంగం, హక్కులు,గురించిన అవగాహన కలుగుతుంది.కేవలం చదువుతూనే గిరిజన జాతి అభివృద్ధి సాధించగలదని డార్ప్ తన రెండవ నివేదిక ద్వారా వివరించారు.అటవీ విధానం, అటవీ ఉత్పత్తులు, గ్రామ పున: నిర్మాణం, కవులు దారు చట్టం, గిరిజన ప్రాంతాల పరిపాలన సమస్యలు, గురించి కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.ఇలా ముందుచూపుతో తయారు చేయించిన నివేదికలు ప్రణాళికల ద్వారా అనంతర కాలంలో గిరిజనులు అభివృద్ధి సాధించారు అనడంలో ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.ఈ సరళమైన నివేదికలలో కేవలం గణాంకాలు మాత్రమే కాదు, అపురూపమైన అలనాటి పాత చిత్రాలు కూడా ఇందులో పొందు పరచడం అదనపు ఆకర్షణ. గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసే వారు మాత్రమే కాక, మూలవాసుల్లోని అభివృద్ధి కారకం తదితర విషయాల గురించి అవగాహన పెంచుకోవలసిన వారు సైతం విధిగా ఈ ‘‘నివేదికల పుస్తకం’’ చదవాల్సిన అవసరం ఎంతో కనిపిస్తుంది.
పుస్తకం పేరు :- ‘చెయ్య వలసిన దింకెంతో..’ సంపాదకులు :- అర్. సుమనస్పతి రెడ్డి. పుటలు:64, వెల:70/-, ప్రతులకు:- 9676180802- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్ : 7729883223)