చట్టాల అమలు సక్కగా లేక..
ప్రభుత్వాలు ప్రజలకు చట్ట బద్ధ పాలన అందించడమంటే ఏంటి? రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్య భావనకు ప్రాతిపదికలు. వీటి ఆధారంగా చట్ట సభల్లో ఆమోదించే చట్టాలు, ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు విడుదల చేసే జీవోలు, వాటి అమ లుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, ప్రభుత్వాలు అందుకు అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించడం, ఆయా శాఖల మెరుగైన పని తీరుకు మానవ వనరులను, మౌలిక సదుపాయాలను సమకూర్చడం- ఇవన్నీ సుపరిపాలన కిందకు వస్తాయి. పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా, సమా జంలో ప్రజలందరినీ సమానంగా చూసే వైఖరిని పాలకులు కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యనిర్వాహక సిబ్బంది పథకాల అమలులో అవినీతికి, లంచగొండితనానికి పాల్పడకుండా పారదర్శకత కలిగి ఉండటం వల్ల ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ సాధారణ సూత్రాలను ఇప్పుడు తెలంగాణాలో ఆశించడం ఎంతో కష్టమైపోయింది.
పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో పరిపాలన అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై పోయింది. రాష్ట్ర సచివాలయం, వివిధ స్థాయిల్లో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రమై పోయి కేవలం ‘ప్రగతి భవన్’ మాత్రమే పరిపాలనా కేంద్రంగా మిగిలింది. ఈ లక్షణం మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కూడా కనిపి స్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ పరిపాలనా ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. రాజ్యాంగం 7వ షెడ్యూల్ లో నిర్దేశించిన కేంద్ర, రాష్ట్రాల మధ్య బాధ్యతల, హక్కుల విభజనకు కూడా వ్యతిరేకం. స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలను కట్టబెట్టిన 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం. షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన షెడ్యూల్ 5కు వ్యతిరేకం. ఆదివాసీల గ్రామ సభలకు అత్యున్నత అధికారాలను ఇచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
ఆహార భద్రతా చట్టం
పార్లమెంట్లో,రాష్ట్ర అసెంబ్లీ లోనూ ఆమోదించిన చట్టాలకు విలువ లేకుండా పోయింది. చట్టాలు ఆమోదించాక కూడా వాటి అమలుకు మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం, నిర్ధిష్ట కాలపరిమితి విధించకపోవడం చూస్తున్నాం. ఫలితంగా వీటి అమలు వల్ల లబ్ధిదారులుగా ఉండాల్సిన ప్రజలు హక్కులు అందక,ఆర్థికంగా కూడా నష్ట పోతున్నారు. దేశ పార్లమెంటు ఆమోదిం చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం,విద్యా హక్కు చట్టం,ఆహార భద్రతా చట్టం ఇందుకు పెద్ద ఉదా హరణలు. ఆహార భద్రతా చట్టం ప్రకారం,ఆహార ధాన్యాల పంపిణీని కేవలం బియ్యం, గోధుమలకే పరి మితం చేసి, ఫుడ్ బాస్కెట్ విస్తరించడం లేదు. చిరు ధాన్యాలను కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ లో చేర్చాలని చట్టం నిర్దేశిస్తున్నా, తెలంగాణ రాష్ట్రం దాన్ని అమలు చేస్తలేదు. ఫలితంగా ప్రజలకు పౌష్టిక ఆహారం అందడం లేదు. దీంతో జొన్న,కొర్ర,రాగి సహా చిరుధాన్యాలు పండిరచే రైతులకు కనీస మద్ధతు ధరలు దొరకట్లేదు. ఆహార భద్రతా చట్టం రాష్ట్ర నియమాల ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయక పోవడంతో, అర్హులం దరికీ 35 కిలోల బియ్యం అందడం లేదు.
అటవీ హక్కుల చట్టం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం జాబ్ కార్డ్ పొందిన ప్రతి కుటుంబానికి100 రోజుల పని హక్కుగా కల్పించాలి. కానీ ఇప్పటికీ ఒక్కో కుటుంబ సగటు పని దినాలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 50కి మించడం లేదు. అంటే మిగిలిన 50 రోజుల వేతనాన్ని( రోజుకు రూ.175 సగటు వేతనం అనుకున్నా, ఏడాదికి రూ.8,750 ) ఒక్కో కుటుంబం నష్ట పోతున్నది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన గత 17 ఏండ్లలో ప్రతి సంవత్సరం గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఇలాంటి ఆర్థిక నష్టమే జరుగుతున్నది. 2005 అటవీ హక్కుల చట్టం అమలు తీరు కూడా ఇలాగే ఉంది. 2005 డిసెంబర్13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు, 75 ఏండ్లకు పైగా అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీయేతరులకు ఈ చట్టం ప్రకారం వ్యక్తిగత, సాముదాయక పట్టాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ చట్టం చేసి 17 ఏండ్లు గడుస్తున్నా లక్షలాది ఆదివాసీ కుటుంబాలకు ఇంకా అటవీ హక్కుల పట్టాలు జారీ చేయలేదు. ఉదాహరణకు తెలంగాణలో ఒక ఆదివాసీ కుటుంబం 4 ఎకరాలు సాగు చేసుకుంటుంటే, రైతు బంధు పథకం కింద ఆ కుటుంబానికి సీజన్ కు రూ. 20,000 పెట్టుబడి సాయం అందాలి. అంటే 2018 ఖరీఫ్ నుంచి 2022-2023 రబీ నాటికి10 సీజన్లకు ఆ కుటుంబానికి రూ.2,00,000 రైతు బంధు సాయం అందకుండా పోయిందన్నమాట. ఒక ఆదివాసీ కుటుంబానికి ఇది చాలా పెద్ద మొత్తం. వడ్డీ లేని పంట రుణాలు, సబ్సిడీ విత్తన పథకాలు, పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీలు, ప్రభుత్వాలు సేకరించే పంటలకు కనీస మద్దతు ధరలు ఈ కుటుంబానికి అందకపోవడం వల్ల జరిగే నష్టాన్ని కలిపి లెక్కవేస్తే, పోడు వ్యవసాయం చేసే ఆదివాసీ కుటుంబాలు పట్టాలు అందక ఎంత నష్ట పోతున్నాయో అర్థం అవుతుంది.
రుణ విముక్తి చట్టం అమలు చేయక
తెలంగాణా రాష్ట్రంలో 1973 భూ సంస్కరణల చట్టం అమలై ఉంటే, గ్రామీణ పేద కుటుంబాలకు సాగు భూమి హక్కుగా దక్కేది. ఆ కుటుంబాల ఆర్థిక స్థితి కూడా మెరుగయ్యేది. కౌలు రైతులకు కౌలు ధరల భారం తగ్గేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అందించే అన్నిసహాయ పథకాలు అంది ఉండేవి. ఈ చట్టం అమలు కాకపోవడం వల్ల, ఆ కుటుంబాలకు జరిగిన ఆర్థిక నష్టం లెక్క వేస్తే, తప్పకుండా అది లక్షల్లోనే ఉం టుంది. రాష్ట్రంలో 93 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోయాయని ఎన్ఎస్ఎస్ఓ తాజా నివేదిక స్పష్టం చేసింది. 2016 లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన వ్యవసాయ కుటుంబాల రుణ విముక్తి చట్టాన్ని, చట్టం స్ఫూర్తితో రుణ విముక్తి కమిషన్ కు రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్ గా, పూర్తి స్థాయిలో అయిదుగురు సభ్యులను నియమించి స్వతంత్రంగా పని చేయనిస్తే, వ్యవసాయ కుటుంబాలకు ఎంతో కొంత రుణాల భారం నుంచి విముక్తి లభించేది. కానీ మన ముఖ్యమంత్రి చట్ట సవరణ చేసి తన పార్టీ నాయకులతో కమిషన్ ను నియమించడం వల్ల, కమిషన్ స్వతంత్రంగా పని చేయలేక పోతున్నది. ఫలితంగా రుణాల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది. ఇవన్నీ స్పష్టం చేస్తున్న అంశం ఒక్కటే. ప్రభుత్వాల పని తీరు ప్రజాస్వామికంగా ఉండాలి. చట్టాలు, జీవో లు సరిగా అమలవ్వాలి. అప్పుడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగం.
విద్యాహక్కు చట్టం ఎక్కడ?
2010 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం అమలు తీరు కూడా రాష్ట్రంలో నాసి రకంగా ఉన్నది. తల్లిదం డ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆకాంక్షతో ప్రైవేట్ స్కూళ్లకు లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్న ఒక కుటుంబం ఏడాదికి సగటున రూ. 60 వేల చొప్పున పిల్లల చదువుపై ఖర్చు పెడుతుందనుకున్నా, ఈ పదేండ్లలో కనీసం ఆ కుటుంబం చదువుపై రూ.6 లక్షలు ఖర్చుపెట్టిందన్న మాట. నిజంగా విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు పడి ఉంటే, రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుం బాలన్నీ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకే పంపే వారు. సర్కారు బడుల్లో టీచర్ల రిక్రూట్?మెంట్?చేపట్టి, వాటిల్లో సౌలత్?లు కల్పించి, మధ్యాహ్న భోజనం సరిగా అమలు చేసి, తమిళనాడు తరహాలో ఉదయం పూట పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లాంటి పథకం అమలు చేసి ఉంటే, పేద, మధ్యతరగతి కుటుం బాలపై ఆర్థిక భారం బాగా తగ్గి ఉండేది. — వ్యాసకర్త : రైతు స్వరాజ్య వేదిక