చంద్రన్నో..జగనన్నో..కాదు..ప్రజల పాలన కావాలి

‘‘ చంద్రన్నో, జగనన్నో కాదు.. ప్రజల పాలన కావాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని పట్టించు కోకుండా నిర్లక్ష్యం చేయడంలో ఇటు తెలుగుదేశం, అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌-రెండూ ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. విభజన హామీల అమలును గాలికొది లేసిన బిజెపిని నాలుగేళ్లు టిడిపి అంటకాగితే ప్రస్తుతం వైఎస్సార్‌ సిపి అదే బాటలో నడుస్తోంది.’’- ఎ అజ శర్మ
రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయినా ఇంకా విభజన చట్టంలోని అనేక అంశాలు సక్రమ అమలుకు నోచుకోవడం లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఈప్రాజెక్టును నిర్మించాలి. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరించాలి. వివిధ శాఖల అనుమతులు కూడా కేంద్రమే తీసుకోవాలి. దీనినిర్మాణం, నిర్మాణానికి పూర్తి నిధులూ భరించాలి. కానీ ఆచరణలో ఇవేవీ అమలు కావడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక నినాదం కిందే మిగిలిపోయింది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నామమాత్రంగా మారడమేకాక అబివృద్ధి ఆవగింజంత కూడా లేదనడం అతిశ యోక్తి ఎంతమాత్రం కాదు. విద్యా సంస్థల ఏర్పాటు, నిర్మాణం నత్తనడకన నడుస్తు న్నాయి. ఎయిమ్స్‌కు నిధుల కేటాయింపు అంతంత మాత్రమే. కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు సముద్రంలో కలిసి పోయాయి. ప్రత్యేక రైల్వే జోన్‌ ఎన్నికల జిమ్మి క్కుగా ఇచ్చి శతాబ్దం పైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేశారు. మొత్తంగా చూస్తే విభజన చట్టాన్ని, ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం ఒక ప్రహసనంలా మార్చి వేసింది. ఉత్తరాంధ్ర మరింత అన్యాయానికి గురయ్యింది. విభజన చట్టం అమలులోకి వచ్చి ఐదు సంవత్సరాల తర్వాత కూడా చట్టంలోని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రకటనలే తప్ప, అవసరమైన కనీస చట్టపర చర్యలు కూడా మోడీ ప్రభుత్వం చేపట్టలేదు. ఫలితంగా ఇంకా తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభం కాలేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ప్రజల చిరకాల కోరిక. దీనికై పెద్ద ఉద్యమమే జరిగింది. విశాఖనగరంలో మెట్రోరైలు నిర్మించాలని చట్టంలోఉన్నా దాని గురించి కేంద్రం ప్రస్తావనే లేదు. తమని గెలిపిస్తే రైల్వే జోన్‌తో సహా, ఉత్తరాంధ్ర అభివృద్ధి, విద్యా సంస్థలకు నిధుల కేటాయిం పుతో సహా అన్నివిధాలా అండగా ఉంటామని స్వయంగా మోడి గారే విశాఖ ఎన్నికలసభలో వాగ్ధానం చేశారు. వీటిని నమ్మి విశాఖ నుండి ఒక బిజెపి ఎంపిని, ఒక ఎమ్మెల్యేను ప్రజలు ఎన్నుకున్నారు. తీరా గెలిచిన తరువాత ఎలా తూట్లు పొడవాలనే చూశారు తప్ప వాటిలో ఒక్క దానిని కూడా చిత్తశుద్ధితో అమలు చేయలేదు సరికదా ప్రజలను ఇంకా మోసం చేయా లనే చూస్తున్నారు. ఉత్తరాంధ్రకు అభివృద్ధి ప్యాకేజీ కింద ముష్టి వేసినట్లు సంవత్స రానికి జిల్లాకు 50కోట్ల రూపాయల చొప్పున మూడు సంవ త్సరాలు ఇచ్చి తరువాత ఆపివేశారు. నాలగవ సంవత్సరం ఇచ్చిన నిధులు కూడా వెనక్కు తీసేసుకున్నారు. రైల్వే జోన్‌పై ఆఖరి ఘడియల వరకు తాత్సారం చేసి, చివరికి ప్రజలు ఛీ కొడతారనే భయంతో మాత్రమే, అక్కడ కూడా మోసకారితనంతోనే ఎవరికీ ఆమోదయోగ్యం కాని జోన్‌ ప్రకటించారు. ఇలామోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసింది. ఈ దుర్మార్గాన్ని ఎండగట్టి, ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని కేంద్రపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పనిచేయక పోగా నాలుగేళ్ళు మోడీ ప్రభుత్వంతో అంటకాగింది. వారితో కలిసి కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. ఉత్తరాంధ్ర నుండి తెలుగు దేశం పార్టీ విజయనగరం ఎంపి కేంద్ర మంత్రిగా కొనసాగారు. అయినా ఎప్పుడూ ఉత్తరాంధ్ర సమస్యలను లేవనెత్తిందీ లేదు. పరిష్కరించిందీ లేదు. రాష్ట్ర అభివ ృద్ధి అంటే రాజధాని అభివృద్ధేననట్టు, పోలవరం ప్రాజెక్టేనన్నట్టు వ్యవహరించి చంద్రబాబు ఉత్తరాంధ్ర సమస్యలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్నా వాస్తవమేమిటంటే ఈ ఐదేళ్ళ కాలంలోనూ ఉత్తరాంధ్రకు ఒక్క చుక్క కూడా అదనంగా సాగు నీరు రాలేదు. ఫలితంగా ఉపాధి కోసం వలసలు ఈకాలంలో కూడా పెరుగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యపై చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలే తప్ప చేసింది శూన్యం. విచిత్రమే మిటంటే ఈ జిల్లా నుండే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర మంత్రిగా ఉన్నా కిడ్నీ వ్యాధులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఉపాధి అవకాశాలు పెంచకుండా, ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించకుండా, ఖాళీ పోస్టులను నింపకుండా అనేక మంది గిరిజన యువకులను గంజాయి దొంగలుగా మార్చి వేస్తోంది. పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో వేలాది ఎకరాల భూమిని కార్పొరేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. విశాఖ నగరంలోని అత్యంత విలువైన భూములను అదానీలకు, షాపింగ్‌ మాల్సుకు కట్టబెడుతూ బ్రోకరులా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉత్తరాంధ్రలో నేడు లక్షలాది ఎకరాల భూమి పరాయిపరమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ మా కొద్దు బాబోరు అని నిరాకరించిన అణు విద్యుత్‌ ప్లాంటును శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటుకు ప్రభుత్వం అక్కడి ప్రజల అభిష్టానికి భిన్నంగా నిర్ణయించింది. ఉత్తరాంధ్రకు ప్రకృతి వరమైన సముద్ర తీరాన్ని కలుషితం చేసే కాలుష్య కారక పరిశ్రమలకు విచ్చలవిడిగా అనుమతిస్తోంది. తీరప్రాంత రక్షణకున్న సిఆర్‌జెడ్‌ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం మార్చివేస్తుంటే, వ్యతిరేకించవలసింది పోయిఉన్న కొద్ది పాటి రక్షణను కూడా రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది.రాష్ట్ర ప్రభుత్వ ఈదగాను ఎదుర్కొని, ప్రజలకు అండగా నిలవవలసిన ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆబాధ్యతను నిర్వర్తిం చడంలో ఘోరంగా విఫలమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఈపార్టీ ప్రజా ప్రతినిధులను గెలిపించి అసెంబ్లీకి పంపినా, ఉత్తరాంధ్ర ఒక్క సమస్యపై కూడా ఆందోళన చేయడం కాని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కాని చేసిన ఉదంతం ఒక్కటి కూడా లేకపోవడం పచ్చి మోసకారితనమే. అందుకే ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఉత్తరాంధ్ర విషయంలో తెలుగుదేశమూ, వైసిపి దొందూ దొందేనన్నట్టు వ్యవహరించాయనడానికి కొన్ని దృష్ట్యాంతాలు పరిశీలిద్దాం.
బాక్సైట్‌ మైనింగ్‌ : 1997లో చంద్రబాబు మైనింగ్‌ చేపడతానని ప్రకటించారు. ప్రజల ఉద్యమం ఫలితంగా వెనక్కి తగ్గారు. 2004లో రాజశేఖరరెడ్డి బాక్సైట్‌ మైనింగ్‌ మీద వేగంగా పావులు కదిపారు. ప్రజా ఉద్యమాలను దౌర్జన్యంగా అణచివేశారు. అప్పుడు బాక్సైట్‌ మైనింగ్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే తిరిగి మైనింగ్‌ చేపట్టడానికి జివో 97తెచ్చారు. ఇప్పటికీ రద్దు చేయలేదు. చంద్రబాబును ప్రతిఘటించవలసిన వైసిపి ఎమ్మెల్యేలిద్దరూ టిడిపి గూట్లో చేరారు. ఇప్పుడు జగన్‌ మళ్లీ రాజన్న రాజ్యం అంటున్నారు. బాక్సైట్‌ విషయంలో ఇద్దరికీ ఏంటి తేడా?
పంచ గ్రామాల భూసమస్య : చంద్రబాబు తెచ్చిన జివోను రద్దు చేసి ప్రజలకు న్యాయం చేస్తానని రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. 2009 వరకూ ఏమీ చేయలేదు. 2014ఎన్నికలలో చంద్రబాబు పంచ గ్రామా ల భూసమస్యను 100 రోజుల్లో పరిష్కరిస్తానన్నారు. ఎన్నికల ముందు 2019లో ఒక దుర్మార్గమైన జివో తెచ్చి తన మోసకారితనాన్ని బయట పెట్టుకున్నారు. ఇక జగన్‌ ఏనాడూ పంచగ్రామాల సమస్యను పట్టించు కోలేదు. దేవస్థానానికి అక్రమంగా భూమిని దఖలు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసే దమ్ము, నిజాయితీ ఇద్దరికీ లేదు.
గంగవరం : నిర్వాసిత మత్స్యకారులపై రాజశేఖరరెడ్డి కాల్పులు జరిపించారు. చంద్రబాబు పోర్టు యాజమాన్యానికి అంటకాగి నిర్వాసి తులకు ఉద్యోగాలివ్వకుండా నాటకమాడారు. మొత్తం మీద ‘చంద్రన్న పాలన’ అయినా, ‘రాజన్న రాజ్యం’ అయినా ఉత్తరాంధ్రకు జరిగిందీ, జరిగేదీ అన్యాయమూ,వంచనా,దగాయే తప్ప న్యాయం మాత్రం జరగదు. వీరిద్దరి వంచనకూ సరైన గుణపాఠం చెప్పేలా ఉత్తరాంధ్ర ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఈప్రాంతంలో నికరంగా, నిజాయితీగా ప్రజల సమస్యలపైన,గిరిజనుల,మత్స్యకారుల సమస్యలపైన, అక్రమ మైనింగ్‌ పైన, కాలుష్యకారక పరిశ్రమల పైన పోరాడిరదీ, ప్రజలను జాగృతం చేసిందీ కమ్యూనిస్టులు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించుకునే ఉద్యమంలో ముందున్నదీ కమ్యూనిస్టులే. ఈకమ్యూనిస్టులు జనసే నతో, బిఎస్పీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఈకూటమిని బలపరచడం ద్వారా ఉత్తరాంధ్రకు కొంతైనా న్యాయం జరిగేలా చేద్దాం.