గోండుల పరిణామక్రమం కోమురం భీమ్‌…

ఉద్యోగరీత్యా మూడు దశాబ్దాల పాటు గిరిజన సంస్థల్లో ఉద్యోగించి అడవి బిడ్డలతో అవినాభావ సంబంధం గల అనుభవం ఒకటైతే, కొమరం భీమ్‌ పోరాటం ఇంద్రవెల్లి పోరాటం మధ్య జరిగిన సంఘటనలు నేపథ్యంలో పరిశోధన చేయడమే కాక ఉద్యోగ సమయంలో ప్రసిద్ధ మానవ శాస్త్ర పరిశోధకుడు గోండు గిరిజనుల పాలిట ఆరాధ్యుడు అయిన హేమండార్ప్‌ తో కలిసి 1971-90 సం:మధ్యకాలంలో ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించిన అనుభవం గల డా: వి. యన్‌.వి.కె.శాస్త్రిగారు వ్రాసిన పరిశోధనాత్మక పుస్తకం‘‘కొమురం భీమ్‌ ముందు, తర్వాత, ఇప్పుడు,’’ఈ పుస్తకంద్వారా ఆదిలాబాద్‌ జిల్లా గిరిజనుల పోరాట చరిత్రతో పాటు అక్కడి గిరిజనులకు మార్గదర్శకంగా నిలిచిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్‌ పోరాటానికి గల నేపథ్యంతో పాటు దాని ఫలితాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు.
పక్కా పరిశోధనాత్మకంగా గణాంకాలతో ప్రామాణికంగా వ్రాయబడ్డ ఈలఘు పరిశోధన పుస్తకం 12 అధ్యాయాలుగా విభజించబడిరది.
ప్రారంభంలో కొమురం భీమ్‌కు అతని పోరా టానికి గల ఉపోద్ఘాతం అనంతరం గిరిజన పోరాటాల చరిత్రతో పాటు గోండుల పూర్వ వైభవం వారి రాజ్య స్వయం ప్రతిపత్తులకు సంబంధించిన విషయాలు విశేషాలు కూలంకషంగా చెప్పబడ్డాయి. సంఖ్యాపరంగా గోండు గిరిజనులు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతిగా అభివర్ణించి అందులోని సామాజిక రాజకీయ వ్యవస్థల గురించి కూలంకషంగా వివరించారు,ఆయా గోండు గ్రామాల్లో నెలకొని ఉన్న సంస్కృతులు సాంప్రదాయాలు నేటికీ కొనసాగడంలో గల అంతరార్థం అవసరాలు గురించి కూడా మనం ఇందులో స్పష్టంగా చదవవచ్చు.చరిత్రకారులు చెప్పినట్టు 14వ శతాబ్దం వరకు గోండుల వైభవం కొనసాగగా అనంతర కాలంలో గోండు రాజ్యాలపై మారాఠాలు, మొగలు, అనంతరం నిజాములు దండయాత్రలు చేసి లోబరుచుకున్న చారిత్రిక అంశాలు గణాంకాలతో సహా వివరించారు పుస్తక రచయిత శాస్త్రి గారు.
ముఖ్యంగా నిజం పరిపాలనలో గల రెవిన్యూ విధానం నాటి ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఇందులో మనం గమనించవచ్చు బ్రిటీష్‌ పాలకులకు నైజాం పాలకులకు మధ్య గల వ్యత్యాసం ఇందులో ప్రత్యేకంగా చెప్పబడిరది.1855లో సాలార్‌ జంగ్‌ తొలిసారిగా తాలూకా దారులను ప్రభుత్వ ఉద్యో గులుగా నియమించారు వారే నేటి తాసిల్దార్లుగా పేరు మార్చబడిరది దీనిలో భాగంగా ప్రభుత్వ పాలన అధికారులుగా చలామణి అయిన దేశ్‌ ముఖ్‌, లు దేశ్‌ పాండేలు, చేసిన అక్రమాల వల్ల అంతకు ముందు వరకు రాజ్యాలు ఏలిన గోండు గిరిజనులు అధికారాలు క్రమంగా కోల్పోయి వారి భూములన్నీ భూస్వాములైన దేశముఖ్‌ లు, పాండేల హస్తగతమై వారి సొంత భూముల్లోనే రైతు కూలీలుగా పని చేయాల్సిన ధీన పరిస్థితి ఏర్పడిరది.
అంతేగాక 1920లో అమలు అయిన అటవీ చట్టం వల్ల గిరిజనుల నివసించే అడవులు ప్రభుత్వం వారి రిజర్వ్‌ అడవులుగా మారి పోవడంతో అడవి బిడ్డలు వ్యవసాయ భూములతో పాటు నివాస గ్రామాలు కోల్పోయి దిక్కులేని పరిస్థితికి చేరి తీవ్రంగా అణిచివేతలకు గురి కావడంతో కలిగిన అవమానాల నుంచి కొమరం భీమ్‌ పోరాటం ఆరంభమైంది, అంటూ రచయిత స్పష్టం చేశారు.
ఐదవ విభాగంలో భీమ్‌ పోరాటం గురించిన విషయ వివరణలో రచయిత అనేక సందేహాలు వెలిబుచ్చారు.
కొమురం భీమ్‌ అనే ఆదివాసి యోధుడి చరితను సమాజానికి పరిచయం చేసిన సాహు,అల్లం రాజయ్య,ల రచనతోపాటు నాటి ఆంధ్రప్రభ, గోల్కొండ, సారంగ, పత్రికల్లోని సమాచారంతో పాటు భీమ్‌ కుటుంబ సభ్యులు,నాటి సమకాలీనులు చెప్పిన మౌఖిక సమాచారాలే కొమరం భీమ్‌ పోరాటంలోని అంశాలకు ఆధారాలు, అయితే వీటన్నిటిలో కూడా కొన్ని కొన్ని లోపాలు సహేతుకంగా వివరించిన ఈ పుస్తక రచయిత డాక్టర్‌ శాస్త్రి, స్వయంగా తను ఆ ప్రాంతాన్ని సందర్శించి సేకరించిన విషయాలతో అప్పటి గోండుల భూములు అన్యాక్రాంతం అయిన తీరును వివరించారు, అలాగే భీమ్‌ చేసిన పోరాటం అతను అమరత్వం చెందిన తీరుకు సంబంధించిన రెండు సంఘట నలు తాను సేకరించిన ఆధారాలతో తెలిపారు.
కొమరం భీమ్‌ అమరత్వంతో గోండు ప్రజల్లో చైతన్యం రావడమే కాక,నాటి నిజాం ప్రభుత్వంలో కూడా చలనం మొదలై,హేమన్‌ డార్ప్‌ నేతృత్వంలో అక్కడి గోండు గిరిజనులకు కావలసిన తక్షణ అవసరాలు గురించిన సంస్కరణలు ఏర్పాటు చేయడం,అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో విద్యాలయాలు నెలకొల్పడం, గిరిజనులనే ఉపాధ్యాయులుగా నియమించడంతోపాటు గిరిజనుల సమీకృత అభివృద్ధి కోసం ఆయా గిరిజనులు నివసించే ప్రాంతాలలోనే ఐ.టీ.డీ.ఏ,లు అనే సొసైటీలు ఏర్పాటు చేసి మానవ అధ్యయన శాస్త్రం అభ్యాసం చేసిన కలెక్టర్‌ స్థాయి వారిని వాటి నిర్వహణ అధికారులుగ నియమించడం వంటి సంస్కరణలు జరిగాయి.
స్వాతంత్ర అనంతరం ఏర్పాటు అయిన రాజ్యాంగంలో గిరిజనుల అభివృద్ధి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయడం వంటి, అంశాలు పేర్కొనబడ్డాయి అదే విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రోడ్డు మార్గాల అభివృద్ధి కూడా ఒక కారణంగా రచయిత వివరించారు, ఏడవ అధ్యాయంగా పేర్కొన్న ‘‘ఇంద్రవెల్లి పోరాటానికి ముందు’’ అనే అంశంలో గిరిజన సమాజంలో శాంతిభద్రతలు క్షీణించడం దరిమిల ఏర్పడ్డ పరిణామాలు నక్సలైట్ల పాత్ర, గిరిజనులు సేకరించుకుని జీవనం సాగించే అటవీ ఉత్పత్తు లపై గిరిజన సహకార సంస్థలు అధికారం చెలాయించటం, దానికి తోడు గ్రామస్థాయి అధికారులు, వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్‌ షావుకారులు, చేసిన ఆకృత్యాల నేపథ్యంలోనే ఇంద్రవెల్లి పోరాటం, తదితరాలు జరగగా… గిరిజనులు అభివృద్ధికోసం కేటాయించిన మంత్రిత్వ శాఖలు గాని ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు గాని, ఆశించిన మేర చురుగ్గా పనిచేయక పోవడంతో …..గిరిజన వికాసంలో మళ్లీ క్షీణదశ మొదలైంది.అన్న అంశం వివరిస్తూ… హైమన్‌ డార్ప్‌ ఆశించిన సంపూర్ణ గిరిజన వికాసం జరగాలి అంటే…రాజ్యాంగం లోని ఐదవ షెడ్యూలు చైతన్యం కావలసిన తీరుతో పాటు గిరిజన నాయకత్వం బలపడాల్సిన తీరు, విద్య హక్కు చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలు తక్షణమే ఆశించిన రీతిలో అమలు కావలసిన ఆవశ్యకతల గురించి ఇందులో పేర్కొన్నారు. అనేక చారిత్రిక ప్రామాణిక అంశాల మేళ వింపుగాగల ఈ పరిశోధనా స్థాయి పుస్తకం గిరిజన చారిత్రక, సామాజిక, పరిశోధకుల పాలిట వరం అనడంలో సందే హం లేదు.కొమురం భీమ్‌ ముందు తర్వాత ఇప్పుడు (వ్యాస సంపుటి)రచన : డా:వి.యన్‌.వి.కె.శాస్త్రి,పేజీలు : 80, వెల : 75/-రూ, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ హైదరాబాద్‌`20,ఫోను : 040-27673787.– డా. అమ్మిన శ్రీనివాసరాజు