గిరిజన భూముల్లో రైల్వేజోన్ చిచ్చు
మహావిశాఖనగర మున్సిపల్ కార్పోరేషన్ సంస్థ(జీవీఎంసీ)పరిధి శివారు కొత్త సెంట్రల్ జైల్ పక్కన శ్రీకృష్ణాపురం అనే ఓగిరిజన కుగ్రామం ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి మన్నెదొరకు చెందిన 200 కుటుంబాలు ఇక్కడ నివాసముంటున్నాయి.వారికి 1977లో విశాఖ జిల్లా కలెక్టర్ 70మంది గిరిజన కుటుంబాలకు సర్వేనంబరు 26లో 77 ఎకరాలు భూమిని పంపిణీ చేసి వారికి అప్పటి ప్రభుత్వం డి`పట్టాలు మంజూరు చేసింది.నాటి నుంచి నేటివరకు సుమారు ఐదు దశాబ్దాలు(47 సంవత్సరాలు) నుంచి మామిడి,దుంప,సరుగుడు,జీడిమామిడి,ఉద్యానవన తోటలు వేసుకొని పంటలు పండిరచుకుంటున్నారు. దీంట్లో లభించిన ఫలసాయంతో వారంతా కుటుంబాలను పోషించుకుంటూ జీవనోపాధి పొందు తున్నారు. ఈనేపథ్యంలో విశాఖనగర పురపాలక సంస్థ 2007లో కార్పొరేషన్ సంస్థగా విస్తరించారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హాయంలో హనుమంతువాక నుంచి అడవివరం వరకు బీఆర్‌టీఎస్ ఆరులైన్ల రహదారి నిర్మించారు.దీంట్లో శ్రీకృష్ణాపురం గిరిజనలు సాగుచేసుకుంటున్న డి పట్టా భూముల్లో ఏడుగురు గిరిజన రైతులకు చెందిన ఏడు ఎకరాలు రోడ్డులో కలసిపోయి నిర్వాసితులయ్యారు.దీనిపై భూమిని కోల్పోయిన రైతులకు అప్పట్లో జీవీఎంసీ కమిషనర్ శ్రీకాంత్ ఆరిలోవ ప్రాంతంలో మూడు సెంట్లు చొప్పున ఏడుగురు రైతులకు నష్టపరిహారంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు కూడా మంజూరు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో గిరిజనులు సాగు చేసుకుంటున్న రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైల్వేజోన్ బూసితో ప్రశాంతంగా సాగు చేసుకుంటున్న 56ఎకరాల భూమిపై ప్రభుత్వం కుట్రపన్నింది.ఈ భూమిని రైల్వే జోన్‌కి అప్పగించామని కొన్ని సార్లు,ఇది జీవీఎంసీ పరిధి ముడసర్లలోవ రిజర్వాయర్ పరివాహాక ప్రాంతంలో ఉంది.తక్షణమే ఈ భూములను ఖాళీ చేయాలని చినగదలి విశాఖ రూరల్ రెవెన్యూ అధికార్లు రైతులను బెదిరిస్తూ మానసికమైన ఆవేదనలకు గురిచేస్తు న్నారు.నగరంలో చాలా చోట్ల వందలాది ఎకరాల భూములు ఖాళీగా ఉండగా మరి కొన్ని బడాబాబుల చేతుల్లో ఆక్రమణలకు గురయినప్పటికీ వాటిపై ప్రభుత్వ అధికారుల జోలికి వెళ్లలేదు.అమాయకులైన గిరిజనులు దశాబ్దాల క్రితం నుంచి సాగు చేసి జీవనోపాధి పొందుతున్న భూములను రైల్వే జోన్ కోసం కేటాయించడం అన్యాయమంటూ ఇక్కడ గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గిరిజన భూములతో ప్రభుత్వం ఆటలు..
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కపట నాటకాలతో పబ్బం గడుపుకుంటోంది. లేని భూ వివాదాన్ని పదేపదే తెరపైకి తెస్తూ ఎడతెగని జాప్యం చేస్తోంది. లోక్‌సభలో గురువారం 2024-25 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే స్థలం చూపకుండా మోకాలడ్డు తోంది. వివాదం లేని భూమి ఇస్తే జోన్ పనులు ప్రారంభిస్తాం’ అంటూ చెప్పడం చర్చనీయాంశంగామారింది. రైల్వే అధికారులు కూడా మంత్రి ప్రకటన పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఒకటి, రెండు స్థలాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఒకదానికి డిపిఆర్‌లో కూడా ఆమోదం లభించింది. దీంతో పాటు మడసర్లోవలో కూడా మరో స్థలం ఉంది. వీటిని మంత్రి విస్మరించారు. మరోవైపు పనులు కూడా ప్రారంభిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. నామమాత్రపు సిబ్బందినీ కేటాయించలేదు. సాధారణంగా ఏ కార్యాల యాన్ని ఏర్పాటు చేయాలన్నా తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని ఏర్పాట్లు , కొంత పనులు చేసుకునే విషయం తెలిసిందే! ఈ దిశలో ఒక్క అడుగుకూడా వేయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అసత్యాలు చెబుతున్నా రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపి కూడా పెదవి విప్పకపోవడం గమనార్హం. రైల్వే వైర్‌లెస్ కాలనీలో ప్రత్యామ్నాయ స్థలం 30 ఎకరా లకుపైనే ఉందని, దీనికి డిపిఆర్‌లో కూడా ఆమోదం లభించిందని రైల్వే అధికారులు చెబుతున్నారు . అదే సమయంలో విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రైల్వే జోన్ పనుల ప్రారంభానికి చిహ్నంగా శిలాఫలకం సిద్ధం చేసి, ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న బిజెపి నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో బిజెపి నేతలు కూడబలుక్కుని జోన్ పనులు నిలిపివేశారు. ముడసర్లోవ రైల్వే స్థలంపై వివాదం ఎంత ? విశాఖలో బిఆర్‌టిఎస్ కోసం రైల్వే నుంచి గతంలో 26 ఎకరాలను జివిఎంసి తీసుకుంది. అందుకు బదులుగా రైల్వేకు ముడసర్లోవ వద్ద సర్వే నెంబరు 57 నుంచి 59 పి, 61పి, 62 పి, 63, 64, 65లో 52 ఎకరాలు కేటాయించింది. 2018లో ఆ స్థలం వద్ద కంచె వేసేందుకు రైల్వే అధికారులు వెళ్లగా ఆ భూముల్లో ఉన్న రైతులు అభ్యం తరపెట్టారు. ఆ సమయంలో సర్వే కూడా రైల్వే చేయగా 27ఎకరాలు క్లియర్‌గా ఉందని తేలింది. మిగిలిన స్థలం ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. దీనికోసం రైల్వే అధికారులు, జివిఎంసి కలిసి జాయింట్ సర్వే చేసేందుకు 2022 నవంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నుంచి రైల్వే డిఆర్‌ఎం కార్యాల యానికి లేఖ రాశారు. రైల్వేకు అవసరమైన భూమిని తీసుకునేందుకు సర్వేలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దఫదఫాలుగా పిలిచినా రైల్వే అధికారులు హాజరు కాలేదు. మరలా జివిఎంసి కమిషనర్ నుంచి 2023 డిసెంబరు 23న కూడా రిమైండర్ పంపారు. కానీ, రైల్వే స్పందిం చలేదు. నిజానికి వైర్‌లెస్ కాలనీలో ఐదు ఎకరాల్లో జోన్ కార్యాలయ భవనాల నిర్మాణానికి సరిపోతుంది. అయినా, ఇటువైపు రైల్వే శాఖ చూడడం లేదు. జాయింట్ సర్వేకు రాకుండా కాలయాపన చేస్తోంది. ఇప్పుడు భూ వివాదం అంటూ నెపం వేయడానికి కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వాల దొంగాట
కేంద్రం పితలాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. రెండూ కలిసే దొంగాట ఆడుతున్నాయంటూ విశాఖ వాసులు పేర్కొంటున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తున్నట్లు ప్రకటించి ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేసింది. 200 కిలోమీటర్లలోపు విజయ వాడ డివిజన్ ఉండగా, వాల్తేరు రైల్వే ఎందుకు? అంటూ బిజెపి పెద్దలు వాదించి విజయవాడ డివిజన్లో వాల్తేరు డివిజన్లోని సగభాగాన్ని కలిపించేశారు. మరి విజయ వాడకు 40 కిలోమీటర్ల దూరాన్నే గుంటూరు డివిజన్ లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదన కేంద్రం వద్ద చేయడంలేదెందుకు? జోనల్ హెడ్‌క్వార్టర్స్ వచ్చినంత మాత్రాన డివిజన్ ప్రధాన కార్యాలయాన్ని మూసె య్యాలా?కొల్‌కతాలో రెండు జోనల్ హెడ్ క్వార్టర్లు లేవా? ఒక జోన్,ఒక డివిజన్ ప్రధాన కార్యాలయం ఒకేచోట ఉంటే తప్పే మిటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.రైల్వే జోన్ స్థలంపై ఎలాంటి వివాదమూ లేదు. విశాఖపట్నం రైల్వే జోన్ స్థలానికి సంబం ధించి ముడసర్లోవలో ఎలాంటి వివాదమూ లేదని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లి కార్జున తెలిపారు. రైల్వే మంత్రి ఫిబ్రవరి 2న చెప్పిన నేపథ్యంలో ఆమరుచటి రోజు సాయంత్రం తన ఛాంబర్‌లో మీడియాతో కలెక్టర్ మాట్లాడారు.‘ముడస ర్లోవ సర్వే నెంబర్ 26లో సుమారు 52 ఎకరాలను గతంలో రైల్వేతో జివిఎంసి చేసుకున్న ఒప్పందం ప్రకారం సిద్ధం చేశాం. రైల్వే వారిని రావాలని, భూమి తీసుకోవాలని పలుమార్లు కోరినా స్పందన లేదు. వారెప్పుడు వచ్చినా స్థలం ఇస్తాం. ఈ విషయంపై 2023 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ సమావేశం నిర్వహించి డైరెక్షన్ ఇచ్చారు. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాలని జివిఎంసి కమిషనర్‌కి స్వయంగా నేను చెప్పాను. ఆయన కూడా ఈ ఏడాది జనవరి 2న రైల్వేకు లేఖ రాశారు. ట్రెంచింగ్ కూడా ఆ భూమిలో క్లియర్ చేశాం. భూ వివాదం లేదు’ అని వివరించారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ముడసర్లోవ సమీపంలో 52 ఎకరాల స్వాధీనానికి సిద్ధమైన జీవీఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు యత్నిం చారు. ఆ భూమిని తమకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిందని వాదనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ముడసర్లోవ సర్వే నంబర్లు 53,55, 59, 60 61,62లో గల భూమి చుట్టూ కంచె నిర్మించేందుకు శుక్రవారం జీవీఎంసీ సిబ్బంది పోలీసుల సహాయంతో వెళ్లారు. ఈ విషయం తెలిసి స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఆ భూము లకు తాము హక్కుదారులమని, ఫలసాయాన్ని ఇచ్చే చెట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ కార్యాలయాలను కట్టడానికి ప్రభుత్వం సిద్ధమైతే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గిరిజనులకు, పోలీసులకు నడుమ వాగ్వాదం జరిగింది. అనంతరం గిరిజనులు తమ ఆందోళన ొనసాగిస్తుండగానే…మరోవైపు అధికారులు తమ పని తాము చేసుకోసాగారు. ఈ భూమి గతంలోనే జీవీఎంసీకి దఖలు పడినట్టు చినగదిలి తహసీల్దార్ రమణయ్య తెలిపారు. కాగా ఈ భూమిని రైల్వే జోన్ కోసం కేటాయించనట్టు అధికారులు చెబుతున్నారు.-జిఎన్‌వి సతీష్