గిరిజన ప్రగతికి చిహ్నం ఈ గిరిజన సాహిత్యం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ ఆచార్య ఎం.గోనా నాయక్‌ ’’ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజన సాహిత్యం ’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
పూర్వపు గిరిజన సాహిత్యం అంతా గిరిజనేతరులు రాసిన ‘‘అనుభూతి సాహిత్యం’’ నేటి ఆధునిక కాలంలో విద్యావంతులైన గిరిజన జన జాతి రచయితల రాస్తున్న ‘అనుభవ పూర్వక సాహిత్యం’ దీనిలో మరి కాస్త ప్రామాణికత ఉంటుంది అనేది విశ్లేషకులు మాట.
అచ్చంగా ఆ కోవకు చెందింది ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే ప్రామాణిక పుస్తకం. రచయిత ఆచార్య యం.గోనా నాయక్‌ గిరిజన సామాజిక వర్గంకు చెందిన అత్యు న్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విశ్వ విద్యాలయ ఆచార్యునిగా వృత్తి జీవితం గడుపుతున్నారు.
ఆచార్య నాయక్‌ లక్ష్యం తమ గిరిజన సంస్కృతి భాషా సాంప్రదాయాలను ప్రామాణికంగా విశ్వవ్యాప్తం చేయాలని, అందులో భాగంగానే విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యయనం చేస్తూ, రాస్తూ, విద్యార్థుల పరిశోధనలకు చేయూతనిస్తున్నారు.
ఆయన రాసిన అనేక గిరిజన భాషా పరమైన రచనల్లో ఒకటి ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే పుస్తకం.దీనిలో గిరిజన మూలాలు,గిరిజన తెగలు,గిరిజనులు సాంఘిక ఆచారాలు,గిరిజనసాహిత్యం, పొడుపు కథలు, అనే విభాగాలు ఉన్నాయి.
మానవ శాస్త్రవేత్తల్లో ప్రముఖుడైన మోర్గాన్‌ చెప్పిన సిద్ధాంతాన్ని అనుసరించి ఆది మానవుని కన్నా ముందుతరం నుంచి నాటి ఆటవిక యుగంలోనే ఆదిమ గిరిజనులు ఈ భూమి మీద నివసించారని ఆధుని కాలం నుంచి తమదైన సంస్కృతిని పరిరక్షించుకుంటూ నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో మైదాన ప్రాంతాల్లో తమదైన ప్రత్యేక జీవన శైలిలో నేటికీ వీరు జీవిస్తున్నారు.
మానవ శాస్త్రవేత్తల నిర్వచనాలను అనుసరించి గిరిజనుల నామౌచిత్యాల వివరణ చేసి వివిధ శాస్త్రవేత్తల నిర్వచనాలను క్రోడీకరించి అందులోని సారూప్యతల ఆధారంగా గిరిజనుల లక్షణాలు భాషా తదితరాలను అభివ్యక్తీకరించారు.
రెండవ విభాగంలో గిరిజన తెగల గురించిన వివరణ దేశంలోని రాష్ట్రాలు ప్రాంతాల వారీగా ఆయా తెగల వివరణలు అందించి మొత్తం 35 తెగలుగా నిర్ధారించారు. ప్రతి తెగకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను కూడా ఇందులో సంక్షిప్తంగా తెలపడం ఉపేత్తంగా ఉంది ప్రాచుర్యమైన గిరిజన తెగతో పాటు రోనా,మూకదొర,కూలియ, మాలీలు,వంటి మరికొన్ని గిరిజన తెగల వివరాలు కూడా ఇందులో పొందు పరిచారు.దీనిలో ఆయా గిరిజనులకు సంబంధించిన వర్గీకరణ శాస్త్రీయంగా అందించారు.గిరిజనుల సాంఘిక ఆచారాల విషయానికి వస్తే గృహ నిర్మాణం మొదలుకుని వారి వేట,వేట సాధనాలు,పండుగలు,నృత్యాలు, రీతులు వివరించారు దీనిలో ఆయా గిరిజనులు చేసే నృత్యాల రకాలు సవివరంగా వ్రాశారు వీటిలో జాతావులు చేసేగజ్జల నృత్యం,గొలుసు నృత్యం,కోంధ్‌లు చేసే మయూరి నృత్యం, భగత, వాల్మీకి,తెగల వారు చేసే గుమ్మలాట నృత్య విశేషాలు గురించి ఆసక్తికరంగా వివరించారు.
నమ్మకానికి చిరునామాదారులైన ఆదివాసీల్లోని విభిన్న రకాల నమ్మకాలను క్షుణ్ణంగా సహేతుకంగా రచయిత గోనా నాయక్‌ వివరించారు
ఆదివాసీల నమ్మకాలు ఎక్కువగా ప్రాకృతిక శక్తుల నుంచి తమను తాము రక్షించు కోవ డానికి, సులభంగా వేటాడుకోవడానికి,వారి జీవనం సక్రమంగా సాగిపోవడం కోసం, ప్రకృతిలో కనబడని శక్తుల్ని పూజించటం, బలు లు ఇవ్వడం చేస్తారు.వీరిజీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక నమ్మకాన్ని సూచిస్తుంది.
కలలకు సంబంధించి, ఆరోగ్య సంబంధం, గృహ సంబంధిత, వ్యవసాయ సంబంధిత,దైవ సంబంధిత, వార వస్తు, వేటకు సంబంధించిన వీరి నమ్మకాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటా యి. వీటిపూర్వకాల పద్ధతులు సంఘటనలు ముడిపడి ఉన్న సామాజిక శాస్త్రీయతలు కల గల్సి ఉంటాయి. గిరిజనుల్లో కనిపించే వైద్య విధానంలో నాటు పద్ధతులు కనిపించిన అంతర్గతంగా శాస్త్రీయత ఆగుపిస్తుంది వీరి వైద్యంలో ప్రధానంగా అనేకుల అనుభవాల సమ్మేళనం కనిపిస్తుంది వీరు ఎక్కువగా అడవుల్లో లభ్యమయ్యే వనమూలికలు,చెట్ల ఆకులు,బెరడు,అడవి జంతు వులను మందులుగా ఉపయోగిస్తారు.
పాల చెక్క పచ్చిపసుపుల మిశ్రమం నీళ్ళ విరోచనాలు తగ్గడానికి, బర్నిక చెట్టు పాలను దగ్గు తగ్గడానికి, మూర్ఛ వ్యాధి నయం కావడానికి పులి కొవ్వు, నడుం నొప్పికి ఉడు మాంసం ఒళ్ళు నొప్పులకు ఎలుగుబంటి కొవ్వు తాగించడం వంటి అనేక గిరిజన వైద్య విధానాలు ఇందులో తెలుసుకోవచ్చును.
ఇక ‘గిరిజనుల సాహిత్యం’ గురించి నాలుగో విభాగంలో వివరించారు, వీరి సాహిత్యమంతా మౌఖికంగా నృత్య గీతాలలో నిక్షిప్తం అయినట్టు ఇందులో చెప్పబడిరది.సాధారణంగా గిరిజనుల జీవన విధానం అంతా సంఫీుభావంతో ముడిపడి ఉంటుంది, వివిధ సామాజిక శాస్త్రవేత్తల నిజ నిర్ధారణ ద్వారా వీరి సంగీత నృత్య రీతులను నిర్ధారించి వివరించారు.
జానపద సంగీతం, శాస్త్రీయ సంగీతం,సృష్టి రూపాన్ని సంతరించుకోవడానికి ఎన్నో సంవత్స రాలకు ముందే ఈ గిరిజన సాహిత్యం పుట్టిం దని సంగీతానికి తొలి రూపం గిరిజనుల ఆటపాటలే అని నిర్ధారించారు.
నృత్య గీతాలు రకాలు నృత్య గీతాల అర్థ వివరణ వర్గీకరణ తదితరాలు ఇందులో క్రోడీకరించారు, దీనిలో వివిధ తెగల పాటలు అర్ధ వివరణలతో అందించడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉంది.
అదేవిధంగా లంబాడాలు అని పిలవబడుతున్న బంజారాల మూలస్థానం గురించిన పూర్తి వివరణ సహేతుకంగా ఇచ్చారు.
వీరిలో కనిపించే సాంప్రదాయాల ఆధునీకరణ పద్ధతులు వారిలోని సంస్కృతి సాహిత్యాల అభివృద్ధి కారణాలు గురించి కూడా మనం ఇందులో కూలంకషంగా చదవవచ్చు.
సాహిత్యంలో భాగమైన పొడుపు కథలను చివరిదైనా ఐదవ భాగంలో ప్రస్తావించారు, గిరిజన తెగల్లో కూడా ఈ పొడుపు కథలు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇందులో వ్యవ సాయ,వివాహ,సామాజిక, పరిస్థితులకు సంబంధించిన వాటిని వర్గీకరించి వివరించారు.బంజారా భాషలోని పొడుపు కథలను తెలుగీక రించి ఇందులో రచయిత వివరించడం ఉపయుక్తదాయకం.
ఈ పుస్తకం నిడివిలో చిన్నదైన విషయ వివరణలో చాలా పెద్దది అనాలి,దీనిలో ప్రతి విషయాన్ని పరిశోధక రచయిత గోనా నాయక్‌ అత్యంత శ్రద్ధగా బాధ్యతాయుతంగా ప్రామా ణికంగా రాయడం అభినందనీయం.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణలో భాగంగా 2012లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణగా వెలువడ్డ ఈ పరిశోధనాత్మక పుస్తకం పరిశోధకుల పాలిట కల్పవృక్షంగా చెప్పవచ్చును. పరిశోధకులతో పాటు గిరిజన సాహిత్య అధ్యయన విద్యార్థులు, ఆసక్తిగల ప్రతి ఒక్కరూ విధిగా చదవదగ్గ విలువైన పుస్తకం ఇది.
పుస్తకం పేరు : గిరిజన సాహిత్యం, రచన : ఆచార్య యం.గోనా నాయక్‌, పేజీలు :124, వెల:30/- రూ,
ప్రతులకు : తెలుగు అకాడమీ, హిమాయత్‌ నగర్‌,హైదరాబాద్‌.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.