గిరిజన కథల పొది..ఇప్ప పూలు
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘ ఐ.ఏ.ఎస్ అధికారి అయిన అపరమేధావి ‘‘ గూడూరు రాజేందర్రావు గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘విప ్పపూలు’ -డా. అమ్మిన శ్రీనివాసరాజు
తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలది ఒక ప్రత్యేక స్థానం,గిరిజనుల సంస్కృతి సాంప్రదా యాలు ఎలాంటి విశిష్టత,ప్రత్యేకతలు,కలిగి ఉం టాయో ఆ కథలు కూడా అంతే వైవిధ్యం నింపుకొని సాగుతాయి. 1910లో తెలుగు సాహిత్యంలో కథల తలుపులు తెరుచుకుంటే 1932లో గూడూరు రాజేంద్రరావు ‘‘చెంచి’’ కథతో గిరిజన కథల ప్రవేశం మొదలైంది. ప్రారంభంలో గిరిజన జన జాతికి చేరువలో జీవనం సాగించిన, అడవిబిడ్డలపై అభిమానం గల రచయితల నుంచి అరకొరగా గిరిజన ప్రత్యేక కథలు వెలువడ్డాయి.
అనంతర కాలంలో ఆదివాసుల్లో కూడా అక్షరాస్యత దినదిన ప్రవర్తమానమై వారిలో కూడా రచయితలు ఆవిర్భవించారు. అంతకు ముందుగల వారియొక్క ‘‘నోటి సాహిత్యం’’ను అక్షరబద్దం చేసే పని ప్రస్తుతం విస్తృతంగా జరుగుతుంది. గతంలో గిరిజనుల పోరాటాలు, అన్యాయా లకు గురవుతున్న తీరు,వారికష్టాలు మాత్రమే కథా వస్తువులుగా కథలు వెలువడి అవి అన్ని ‘‘సానుభూతి కథల’’ జాబితాలో చేరిపోయాయి. అనంతరం వచ్చిన గిరిజనులే వ్రాసిన గిరిజన కథల్లో విస్తృత మార్పులు చేరి వారి సంస్కృతి సాంప్రదాయాలే కథా వస్తువులుగా గిరిజన కథలు వెలబడుతూ..‘‘స్వానుభవ కథల’’ జాబితాగా తయారయ్యాయి, కథలు అవే అయినా వస్తువుల్లో భిన్నత్వం సంతరించుకొని అటు పాఠకులకు ఇటు పరిశోధకులకు పూర్తి సంతృప్తిని అందిస్తూ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
గిరిజన జీవితాలకు సంబంధించి విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తృత పరిశోధనలు జరిగిన గిరిజన కథల గురించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మంకు చెందిన ప్రముఖ సీనియర్ రచయిత, జీవన్ అవిశ్రాంత సాహితీ కృషిలో భాగంగా ఆయన సంపాదకత్వంలో2009 సంవత్సరంలో 29 కథలతో ‘‘ఇప్ప పూలు’’ గిరిజన సంచార తెగల కథా సంకలనం వెలువడిరది, దానికి లభించిన అత్యధిక ఆదరణతో మరో పదకొండు అచ్చమైన గిరిజన కథలు జోడిరచి మొత్తం 40కథలతో ‘‘ఇప్పపూలు’’ మలికథా సంకలనం ఇటీవల వెలువడిరది. దీనిలో 30% సంచార జాతుల వారి జీవన దర్పణాలైనా కథలు మినహాయిస్తే అన్ని అచ్చమైన అడవి జాతి బిడ్డల కథలే…!! జయధీర్ తిరుమలరావు, వంశీకృష్ణ, వంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల గీటురాళ్ల వంటి ఆప్త వాక్యాలు అదనపు ఆకర్షణగల ఈ కథా సంకలనం నిజంగా తెలుగు కథ సాహిత్యంలో వెలువడ్డ తొలి గిరిజన కథా సంకలనంగా చెప్పవచ్చును. బోయ జంగయ్య వ్రాసిన ‘‘ఇప్ప పూలు’’ కథ నే శీర్షికగా ఎంచుకున్న ఈ కథా సంకలనంలోని ప్రతి కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. లంబాడా గిరిజన కుటుం బాలలో పేదరికం వల్ల, పుట్టిన ఆడపిల్లల సంతానాన్ని డబ్బులకు అమ్ముకుంటున్న దీన పరిస్థితులకు అక్షర రూపం అయిన ‘‘ఇప్ప పూలు’’ కథలో ఇప్ప సారా తయారు చేయడం కుటీర పరిశ్రమగా చెబుతూ పోలీసులు ఆ నెపంతో లంబాడా సామాజిక వర్గం వారిని శారీరకంగా ఆర్థికంగా ఎలా దోచు కుంటున్నారో కూడా ఈ కథలో మరో కోణం ద్వారా చూపించారు. ముందు తరం గిరిజన కథకుడు గూడూరు రాజేంద్ర రావు మొదలు నేటితరం యువ గిరిజన కథకుడు రమేష్ కార్తీక్ నాయక్ వరకు 40మంది కథకుల నవ్య కథా రీతులు ఇందులో మనం చదవవచ్చు. బహు విశేషాల వేదిక అయిన ఈ కథల పందిరిలో ప్రజావాగ్గేయ కారుడు పాటల పోరు బిడ్డ వంగపండు ప్రసాదరావు వ్రాసిన కథ కూడా ఉండటం మరో విశేషం!! ‘‘వంగపండు’’ అంటే పాట గాడు గానే అందరికీ తెలుసు, కానీ అతనిలోని అద్భుతమైన కథకుడిని ఆవిష్క రించింది ఆయన వ్రాసిన ‘‘కొండ పందికొక్కు’’ కథ, అమాయకపు అడవి బిడ్డలు వ్యాపారస్తుల మోసాలకు ఎలా బలి అవుతున్నారో తెలుపుతూ తద్వారా ఉద్య మాలవైపు, సంఘాల వైపు, గిరిజనులు మొగ్గు చూపుతున్న తీరు గురించి తనదైన ఉద్యమ శైలిలో ఈ కథను వంగపండు వ్రాశారు. ఇక గిరిజన రచయితలైన మల్లి పురం జగదీష్,భూక్యా తిరుపతి,పద్దం అనసూయ,రమేష్ కార్తీక్ నాయక్,తిమ్మక రాంప్రసాద్, వంటి వారి కథలు ఈ సంపుటికి మరింత ప్రత్యేకతను అందించాయి ఈ ఐదు కథలు గిరిజన సంస్కృతిసాంప్రదాయాలు ప్రధాన భూమికగా చెప్పబడ్డాయి. భూక్య తిరుపతి ‘‘కాక్లా’’ కథలో లంబాడా సామాజిక వర్గంలో గల కాకుల కలయికతో ముడిబడ్డ ఒక అపనమ్మకాన్ని వారు సంప్రదాయంగా ఎలా కొనసాగిస్తున్నారో చెబుతారు.మల్లిపురం తన ‘‘దారి’’ కథలో అడవి బిడ్డల రోజువారి దినచర్యలను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తూనే ఆదివాసులు ఐక మత్యంతో తమను మోసగిం చిన తమ ప్రాంతపు అధికారిపై ఎలా ఎదురు తిరిగారో ఆవిష్కరిం చారు.ఇక చావు నేపథ్యం లో కథలు వ్రాసి తనదైన ప్రత్యేకతను చాటు కున్న ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన ‘‘మూగ బోయిన శబ్దం’’ కథలో గిరిజన జన జాతి అన్యమత ఊబిలో ఎలా కూరుకుపోతున్నదో చక్కగా వివరించారు, సంస్కృతి సాంప్రదా యాలపై అన్యమత దాడి గురించి ఈ కథలో ఆలోచనత్మకంగా చెప్పారు.
‘‘ప్రాచీన పురుడు’’ తీరు గురించి సందేశాత్మకంగా ఆవిష్కరించిన మరో గిరిజన కథారచయిత రమేష్ కార్తీక్ నాయక్ రాసిన కథ ‘‘పురుడు’’,పాత్రోచితమైన సంభాషణ తీరు దీనిలో మనకు ఆవిష్కరించబడిరది ఇదే తీరుకు తార్కాణకంగా నిలిచే మరో కథ ‘‘పిన్లకర్ర’’ గిరిజన యువత పట్టణాలపై మోజుతో అక్కడకు చేరి తమ చక్కని సంస్కృతితో పాటు విలువైన ఆరోగ్యాలను ఎలా కోల్పోతున్నారో.. ఈ కథ కళ్ళకు కట్టింది.మొత్తానికి ఈ కథా సంకలనంలో 40కథలు వ్రాయబడ్డ కాలాల రీత్యా 50సంవత్సరాల నిడివి ఉంది ఈ ఐదు దశాబ్దాల నడుమ అనేక ఆధునిక మార్పులు వచ్చి చేరాయి కానీ గిరిజన జీవన విధానంలో వారి అణిచివేతలు, దోపిడి, ఆధిపత్యం, తదితర మోసాల్లో మాత్రం తేడా రాలేదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు లోబడే వారి మీద అన్యాయాలు అక్రమాలు రూపాం తరం చెందాయి.ప్రాంతాలవారీగా విభజించ బడ్డ,ఈగిరిజన కథలసమాహారం లోని కథల తీరు గమనిస్తే,..ఆస్తులు అంతస్తులు కాదు పీడన,దోపిడి కూడా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ అదో గొలుసు వలయమై నిరంతరం కొనసాగుతుంది, కానీ దానిని ఎక్కడో ఒక చోట ఛేదించి నియం త్రించాలి, లేకపోతే భవిష్యత్తులో ఈ ఆదిమ తెగల మనుగడకు భారీ ప్రమాదం ఏర్పడి మహా ఉత్పాతం కలగవచ్చు, దాని నుంచి రక్షించే దిశగా సాగుతున్నదే ఈఅక్షర చైతన్య కథాయాత్ర. తరాలు మారిన తలరాతలు మారని గిరిజన స్త్రీల స్థితిగతులు, ఆందోళన కలిగిస్తున్న తీరును ఈ గిరిజన సంచార జాతుల కథాసంకలనం ఆవిష్కరించింది. గిరిజన హక్కులు మానవ హక్కులే అని ఎలుగెత్తి చాటిన ‘‘పోరాటశీలి’’బాలగోపాల్,స్మృతిగా ఈ ‘‘ఇప్ప పూలు’’ కథా సంకలనం ప్రచురించిన సంపా దకులు ప్రచురణకర్త జీవన్ గారికి అభినందనీయులు.అడవి బిడ్డలతో పాటు అణగారిన వర్గపు సంచార తెగల బతుకుల వెతలు కూడా ఇందులో మనం చదవవచ్చు, పెద్దింటి అశోక్ కుమార్,బిఎస్ రాములు, ఏ.విద్యాసాగర్, బోయ జంగయ్య, జాతశ్రీ, అల్లంరాజయ్య, అట్టాడ,గంటేడ వంటి లబ్దప్రతిష్టలైన వారి కథల్లోని భావ సొగసులతో పాటు వర్ధమాన కథా శీలురైన డా:జడా సుబ్బా రావు,బాల సుధాకర్ మౌళి,ఆప్త చైతన్య,ల ఆధునిక కథన రీతులు ఈ కథా సంకలనంలో మనం గమనించవచ్చు.బహురుచుల విందు భోజనంలా బహుముఖీయమైన కథల సమా హారం ఇది,కథ ప్రియులకే కాక పరిశోధక విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శి వంటి అపురూప కథా పేటిక, ఇదో చారిత్రక దీపిక.