గిరిజనులారా బహుపరాక్..!
ఇరువైతోమ్మిదేళ్లక్రితం పీసాచట్టం కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది మేథావులు,గిరిజనులు పోరాడి సాధించారు.ఈచట్టంపై రాజ్యాంగం కల్పించిన హక్కులు, వనరుల పరిరక్షణ కోసం షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆయా గ్రామాల్లో జనవరి3నుంచి7వ తేదీ వరకు పెసాచట్టం కమిటీలకు ఉపాధ్యక్షుడు,కార్యదర్శి పదవు లకు ఎన్నికలు జరిగాయి.వాస్తవానికి పార్టీలకు అతీతంగా చేతులు ఎత్తే విధానంలో ఈఎన్నికలు జరిగాయి కానీ అన్నీ రాజకీయపార్టీల ముసుకులోనే జరిగిన ఈఎన్నికల్లో ఆయా ప్రతినిధులు పదవులు దక్కించుకున్నారు. ఎన్నికైన వారంతా ఐదేళ్లు పదవుల్లో ఉంటారు.
అయితే,ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గిరిజన తెగలకు చెందినవారే కాబట్టి ప్రతి ఒక్కరూ పెసాచట్టంపై అవగాహన పెంచుకోవాల్సిన అవశ్యకతఎంతైనా ఉంది.వనరులు,హక్కులు దోపిడికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.ఎందుకంటే..ఈచట్టం ప్రకారం ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్ర బిందువు చేశారు.గ్రామసభకు విశేషాధికారాలను కల్పించారు.ఒకప్రాంతంలో నివసించే ఓటుహక్కు కలిగి ఉన్న నివాసితులంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు.వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వన రులు,అటవీ సంపదపై యాజమాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆవనరులను స్వీయ అవసరాల కోసం వినియో గించు కుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు.ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు,వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ,నష్టపరిహారం పంపిణీ,గనులతవ్వకాలకు సంబంధించిన లీజులు,సామాజిక,ఆర్ధిక అభివృద్ధి కార్యక్ర మాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన,ఉపప్రణాళిక నిధులఖర్చుకుసైతం గ్రామసభల అనుమతి తీసు కోవాలి.అంతేకాదు ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లబ్దిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ,నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించబడ్డాయి. జల,అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షిం చుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి.విద్యా,వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యతఉంటుంది.
దేశంలో అత్యంత వెనకబడిన జిల్లాలన్నీ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలే.అందుబాటులోని వనరులపై హక్కులు కల్పించి,వారికి గ్రామసభల స్థాయిలో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వ్యయం, సంక్షేమ ఫలాల పంపిణీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పరిపాలన,కట్టుబాట్లు, భౌగోళిక,సామాజిక పరిస్థితులు క్లిష్టంగాను, భిన్నంగాను ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి దశాబ్దాలుగా గందరగోళంగా తయారైంది. గ్రామసభలను విస్మరించడంఆదివాసుల్లో అసంతృప్తికి, అశాంతికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉన్నతస్థాయి కమిటీలు కేంద్రానికి నివేదించాయి.గిరిజన ప్రాంతాల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్’ అధ్యయనంబీ రెండో పాలన సంస్కరణల కమిషన్, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ,చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీ భూ పరాయీకరణ, నిర్వాసితుల సమస్య, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవ చంద్ర కమిటీలు-‘పీసా’ను పటిష్ఠంగా అమలు చేస్తేనే, ఆదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి.
పీసా,అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమలుకు రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగమే సిద్ధం కాలేదు.దీంతో రాజ్యాంగరక్షణ కవచాలు కాస్తా చేవ తగ్గి నిర్వీర్యం అవుతున్నాయి.పీసాతో సహా ఇతర గిరిజనరక్షణ చట్టాలు,సంబంధిత నిబంధ నలపై శిక్షణ,అవగాహన పెంచే బాధ్యత,అమలు తీరునుపర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన, శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది,తగిన నిధులు లేక సతమతమవుతున్నాయి.పీసాచట్టం అమలులోకి వచ్చి 29ఏళ్లుయిన తర్వాత పెసాచట్టంపై ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. కొత్తగా కొలువుతీరిన తెలుగు రాష్ట్రాల పెసాచట్టం పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామీణ సభల కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలి.మరోవంక రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చిపెసా అమలుకు వాటిని సిద్ధం చేయాల్సిన బాధ్యతకొత్తగా కొలువుదీరిన పెసా కమిటీపై ఎంతైనా ఉంది! – రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్