క్షీణిస్తున్న ఉద్యోగులు..తగ్గుతున్న వేతనాలు

ప్రపంచంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం కూడా ఉందని ఇప్పుడు చాలామంది నమ్ముతు న్నారు. అయితే అభివృద్ధి అంటే జీడీపీ వృద్ధి అని మాత్రమే కాదు. జీడీపీ వృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ఉపాధీ ఉద్యోగ అవకాశాలూ పెరగాలి 2014 ఎన్నికలప్పుడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్‌డీఏ హామీ ఇచ్చింది. జనవరి 2018లో ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో 70లక్షల మంది కొత్తగా పీఎఫ్‌ అకౌంట్లను తెరిచారని ఇది కొత్త ఉద్యోగాల సృష్టి గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తోందని అని ప్రధాని మోడీ చెప్పారు. అయితే ప్రధానమంత్రి రోజ్‌గార్‌ ప్రోత్సహన్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం యజమానులు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పీఎఫ్‌ మొత్తాన్ని మూడేండ్లవరకూ చెల్లిస్తున్నది. ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఇదివరకే తమ వద్ద పీఎఫ్‌ చెల్లించకుండా పనిచేస్తున్న కార్మికులను కొత్తగా చేర్చుకున్నట్టు చూపి వారికి ప్రభుత్వపథకం ద్వారా పీఎఫ్‌ చెల్లిస్తున్నారు. ఇదివరకు ఉన్న ఉద్యోగాలని కొత్త ఉద్యోగాలుగా చూపిస్తూ కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ 2018, 2019 లో నిరుద్యోగపు రేటు భారతదేశంలో 3.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేయగా సీఎంఐఈ ఇది ఇంతకన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. ఆర్థిక అభివ ృద్ధి గురించి కాంగ్రెస్‌, బీజేపీలు నిరంతరం వాదులాడుకుంటూ ఉంటాయి. ఈ వాదనలలో మానవాభి వృద్ధి రేటు గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. మోడీ ప్రభుత్వం ఈమధ్య జీడీపీని లెక్కించే పద్ధతి మార్చి వేసింది. తమ హయాంలో యూపీఏ కన్నా ఎక్కువ వ ృద్ధి జరిగిందని చెప్పుకోడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఈ కొత్త పద్ధతి ప్రకారం వేసిన అంచనాలు వివాదాస్పదమయ్యాయి. నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ అనధికారికంగా చేసిన అంచనాల ప్రకారం ఎన్‌డీఏ కన్నా యూపీఏ హయాంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉండగా సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ అధికారికంగా విడుదల చేసిన అంచనాలలో ఎన్‌డీఏ హయాంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నది. ఈ విరుద్ధమైన అంచనాలు రెండు సంస్థలు చేసిన అంచనాల విశ్వసనీయతను ప్రశ్నించేట్టుగా ఉన్నాయి. జీడీపీలో వృద్ధి జరిగినా అది ప్రజల జీవితాలలో గుణాత్మ కమైన మార్పు తీసుకురానప్పుడు ఆ వృద్ధివల్ల ప్రయోజనం ఏమిటి. జీడీపీలో వృద్ధి జరిగినా సమాజంలోని ఒక పెద్ద సమూహానికి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవు. భారతదేశంలో వృద్ధిరేటు వేగంగా పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో అసమానతలు కూడా పెరుగుతున్నాయి. జతీవసఱ్‌ ూబఱంంవ రిపోర్ట్‌ ప్రకారం ఒక శాతంగా ఉన్న సంపన్నుల సంపద 2010లో మొత్తం సంపదలో 40శాతంగా ఉండగా 2016లో అది 50 శాతానికి పెరిగింది.10శాతంగా ఉన్న సంపన్నులు మిగతా 90శాతం ప్రజల కన్న నాలుగు రెట్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ భారతదేశంలో ఉపాధి అవకాశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇన్‌ ఇండియా’ అన్న పేరు మీద ఈ నివేదిక విడుదల చేశారు. భారతదేశ లేబర్‌ మార్కెట్‌ను విశ్లేషిస్తూ వ్యవసాయరంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు కార్మికుల వలసపోతున్నారని నివేదిక తెలియజేసింది. ఉపాధి రహిత అభివృద్ధీ, వేతనాలు పెరగని అభివృద్ధీ సహజంగానే సమ్మిళితమైన అభివృద్ధికి దారితీయదని అది అసమానతలూ అంతరాలూ పెంచుతుందని నివేదిక స్పష్టంగా తెలియజేసింది.నూతన ఆర్థిక విధానాలు అమలైన గత 25 ఏండ్లలో జీడీపీకి,ఉపాధి కల్పనకూ ఉన్న సంబంధం రోజు రోజుకి బలహీనపడిపోతున్నది. 1970, 1980లలో జీడీపీ వృద్ధి 3 నుంచి 4శాతం ఉంటే ఉపాధిలో వృద్ధి సుమారు 2శాతంగా ఉండేది.1990 తర్వాత మరీ ముఖ్యంగా2000ల తర్వాత జీడీపీలో 7శాతం వృద్ధి ఉన్నా ఉపాధిలో వృద్ధి మాత్రం ఒకశాతం కన్నా తక్కువ ఉన్నది. జీడీపీలో వృద్ధీ, ఉపాదివృద్ధికీ మధ్య నున్న నిష్పత్తి 0.1 శాతం కన్నా తక్కువగా ఉన్నది. అంటే జీడీపీలో 10శాతం వృద్ధి ఉంటే ఉపాధిలో ఒక శాతం పెరుగుదల మాత్రమే ఉంటుందన్నమాట. 2013-15 మధ్య దాదాపుగా 70లక్షల ఉద్యోగాలు మాయమైపోయాయని నివేదిక తెలియజేస్తున్నది. నిరుద్యోగం 5శాతం కన్నా ఎక్కువైందని ఉత్తరాది రాష్ట్రాలలో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని నివేదిక వెల్లడిరచింది. ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులలో నిరుద్యోగం 16శాతంగా ఉందని నివేదిక తెలపడం చాలా ఆందోళన కలిగించేదిగా ఉంది. అండర్‌ ఎంప్లాయిమెంట్‌, తక్కువ వేతనాలు మాత్రమే సమస్యలుగా ఉన్నాయని అనుకుంటే ఇప్పుడు ఈ నివేదిక పెరుగుతున్న నిరుద్యోగం మరి ఉపాధి కల్పన భారత దేశానికి పెద్ద సవాళ్లని తెలియజేస్తున్నది. దాదాపు అన్ని రంగాలలో వేతనాలు పెరుగుతున్నాయని చెప్తున్నా ఇది జీడీపీ వృద్ధితో పోలిస్తే చాలా తక్కువ. గ్రామీణ వేతనాలలో ఎలాంటి పెరుగుదల లేదు. సగటున వేతనాలలో వృద్ధి 3శాతంగా ఉన్నది. అయితే కార్మికుల ఉత్పాదకత 30ఏండ్ల కింది నాటికన్నా ఆరు రెట్లు పెరిగింది. సూపర్వైజరీ, మేనేజరియల్‌ ఉద్యోగాల్లో వేతనాలు మూడు రెట్లు పెరగగా కార్మికుల వేతనాలలో వృద్ధి మాత్రం ఒకటిన్నర రెట్లుగా ఉన్నది. ఇప్పటికీ మగవారిలో 82శాతం, స్త్రీలలో 92శాతం నెలకు 10 వేల రూపాయలు కన్నా తక్కువగా సంపాదిస్తున్నారు. సెవెంత్‌ సెంట్రల్‌ పే కమిషన్‌ నెలకు 18వేల రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని సిఫారసు చేసింది. దీన్నిబట్టి చాలా పెద్ద సంఖ్యలోనే భారతీయులు జీవించడానికి కావలసిన వేతనాలకు (లివింగ్‌ వేజ్‌) చాలా దూరంలో ఉన్నారని అర్థమైపోతుంది. ప్రయివేట్‌ రంగంలో చాలా పరిశ్రమలు సెంట్రల్‌ పే కమిషన్‌ సిఫారసు చేసిన కనీస వేతనం కన్నా చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. అందుకనే ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటున్నది. అట్లాగే కార్మిక, పెట్టుబడి (లేబర్‌-క్యాపిటల్‌) నిష్పత్తి కూడా దారుణంగా పడిపోతున్నది. 1980లో కోటి రూపాయలు (2015 ధరలలో) పెట్టుబడి పెడితే 90ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 90బదులు 10 ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. అట్లాగే ఉన్న ఉద్యోగాలలో కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మొత్తం ఉద్యోగాలలో 60శాతానికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటున్నారు. శాశ్వత ఉద్యోగుల పనులను ఇప్పుడు రకరకాల పేర్లు గల తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్నారు. పర్మనెంట్‌ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల కన్నా చాలా తక్కువ వేతనాలను వీరికి ఇస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యపరుస్తు ప్రయివేట్‌ యాజమాన్యాలు శ్రమదోపిడీ చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన లింగ వివక్ష నెలకొని ఉన్నదని నివేదిక తెలిపింది. మేనేజర్లు, సీనియర్‌ అధికారులు, శాసనసభ్యులలో 2011లో 13శాతంగా ఉన్న మహిళల వాటా 2015 కల్లా 7శాతానికి తగ్గిపోయిందని నివేదిక వెల్లడిరచింది. తయారీ రంగంలోని కార్మికులలో 22శాతం మహిళలు ఉండగా సర్వీస్‌ రంగంలో మహిళలు 16శాతంగా ఉన్నారు. టెక్స్టైల్‌ గార్మెంట్‌, టుబాకో, విద్య. వైద్య రంగాలలో మహిళా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగాల సంఖ్యలోనే కాక వేతనాలలో కూడా మహిళలు వివక్షకూ లోనవుతున్నారు. తాము చేస్తున్న పని, తమ విద్యార్హతలను బట్టి మహిళలు పురుషుల వేతనాలలో 35 నుంచి 85 శాతం వరకు పొందుతు న్నారు. అయితే ఈఅసమానతలు కొంత తగ్గుతున్న సూచనలు కూడా కనిపిస్తు న్నాయి. తయారీరంగంలో మహిళల వేతనాలు పురుషుల వేతనాలలో 35 నుంచి 45శాతానికి పెరిగింది. రెగ్యులర్‌ వర్కర్స్‌, ఉన్నత విద్యావంతులైన మహిళలలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉన్నది. శ్రామిక మహిళలు, ఉద్యోగాల కోసం చూస్తున్న మహిళల శాతం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువగా ఉన్నది. ఇది ఇంకా తగ్గుతూ వస్తున్నది. ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల కన్నా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నది. సాంఘిక పరమైన కట్టుబాట్ల కన్నాఅవకాశాలు లేకనే మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నది. గ్రామీణ ఉపాధి పథకం, ఆషా, అంగన్‌ వాడీ వంటి స్కీముల వల్ల మహిళల వాటా ఉద్యోగాల్లో కొంతమేరకు పెరిగింది.
ఉపాధిలో కులపరమైన వివక్ష, అసమాన తలు కొనసాగుతున్నాయి. తక్కువ వేతనాలు ఉన్న వృత్తులలో ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు చాలా ఎక్కువగా ఉండగా అధిక వేతనాలు కల ఉద్యోగాలు/ వృత్తులలో వారి సంఖ్య నామమాత్రంగా ఉన్నది. కుల వివక్షతను అలాగే నిమ్న కులాలకు గౌరవప్రదమై ఉద్యోగాలలో అవకాశాలు లేకపోవడాన్ని ఇది స్పష్టంగా చూపిస్తున్నది. రిజర్వేషన్లు సరిగా అమలైన చోట ప్రభుత్వ పాలనా వ్యవస్థలో కొంత మెరుగైన ప్రాతినిధ్యం ఈవర్గాలకు లభ్యమయిందని నివేదిక తెలియజేస్తున్నది. గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంపాదనలో/ వేత నాలలో మహిళల పట్ల ఉన్న తేడాల కన్నా కులపరమైన వివక్ష తేడాలే ఎక్కువ. ఉన్నత కులాలకు చెందిన వారి సంపాదనలో ఎస్సీ కులాల వారు 56 శాతం సంపాదిస్తూ ఉండగా, ఎస్టీ కులాలవారు 55శాతం అలాగే ఓబీసీకి చెందినవారు 72శాతం సంపాదిస్తున్నారని నివేదిక అంచనా.
వ్యవస్థాగతమైన మార్పులు చాలా మెల్లగా జరుగుతున్నాయని ఇవి వేగవంతం కావాల్సిన అవసరం ఉన్నదని నివేదిక అభిప్రాయపడిరది. అలాగే ఉపాధి కల్పనకు ఒక సమగ్ర విధానం రూపొందించాల్సిన అవసరం ఉన్నదని నివేదిక భావించింది. అధిక వృద్ధిరేటు ఉద్యోగాల కల్పనను పెంచలేక పోయినందున అలాగే కార్మికుల పెరిగిన ఉత్పాదకత వారి వేతనాలను పెంచలేక పోయినందున ప్రభుత్వం ఒక జాతీయ ఉపాధి విధానాన్ని రూపొందించాలని నివేదిక సిఫారసు చేసింది. దీనికిగాను గ్రామీణ ఉపాధి హామీ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నివేదిక సూచించింది. కొన్ని రాష్ట్రాలలో విజయవంతంగా అమలు చేస్తున్న ఉపాధి పథకాలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలించాలని అట్లాగే పారిశ్రామిక విధానాలను ఉపాధి అవకాశాలను కల్పించేటట్టుగా, కార్మికులకు వేతన ప్రోత్సాహకాలను అందించేట్లుగా రూపొందించాలని నివేదిక ప్రభుత్వాలకు సూచించింది. గ్రామీణ ఆదాయాలను పెంచడానికి వ్యవసాయ రంగంలో పబ్లిక్‌ పెట్టుబడులను పెంచాలని, విద్య, వైద్యం, హౌసింగ్‌ పబ్లిక్‌ రవాణాలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని, పర్యావరణ రక్షణ, కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగాలు సృష్టించాలని నివేదిక సిఫారసు చేసింది. సాంఘిక అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వ పథకాలు కీలకమని నివేదిక అభిప్రాయపడిరది. త్వరలోనే పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. కార్మిక సంఘాలు, అసమానతలను అంతరాలను తొలగించడానికి కృషి చేస్తున్న సంస్థలు, పర్యావరణ పరిరక్షణకు పని చేస్తున్న సంస్థలు నివేదిక తెలియజేసిన అంశాలపై ప్రజాభిప్రాయం కూడగట్టి ఉపాధి అవకాశాలు పెంచే అభివృద్ధిని, అంతరాలను తగ్గించే సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక సాంఘిక విధానాలను అవలంబించేట్టుగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది -వేణుగోపాల్‌