క్షమించరాని..నిర్లక్ష్యం
‘శ్రీకాకుళం జిల్లాకు ఇతర ప్రాంతాల నుండి వలసలు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. కిడ్నీల వ్యాధిని నిర్మూలించడానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించే బాధ్యత నాది’ అని ఇటీవల శ్రీకాకుళం ఎన్నికల బహిరంగ సభలో పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ‘ఇలాంటి అమలు కాని వాగ్ధానాలు చేస్తే మాదేశంలో ఉరి వేస్తార’ని హైదరాబాదులో జరిగిన సెమినార్‌లో ఓ విదేశీ ప్రతినిధి అన్నారు. ఇది జరిగినప్పుడు చంద్రబాబు వేదిక పైనే ఉన్నారు. రెండూ వేర్వేరు సందర్భాలలో అన్నమాటలే అయినప్పటికీ నేతలు అలా నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తూనే వున్నారు. సోంపేట, కాకరాపల్లిలో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన ప్రతిపాదనలు వైఎస్సార్ హయాం లోనే వచ్చాయి. మొత్తంమీద ఇటు చంద్రబాబు…అటు వైఎస్సార్… వీరిద్దరి పాలనలోనూ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది. జగన్ సైతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎన్నో శుష్క వాగ్దానాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖల నుంచి వలసలు వెళ్తున్నవారు హిమాలయ పర్వతాల నుంచి అండమాను దీవుల వరకు విస్తరించి వున్నారు. ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక చిన్నపరిశ్రమ పెడితే అక్కడికీ శ్రీకాకుళం వాళ్లు కార్మికులుగా వెళ్తున్నారు. దీన్నిబట్టే ఉత్తర కోస్తా నుంచి వెళ్లే వలసలు ఎంత ప్రమాదకరంగా వున్నాయో అర్థమౌతోంది. వాస్తవానికి ఉత్తర కోస్తా జిల్లాలలో దేశంలోనే అత్యధిక వర్షపాతం 1150 మి.మీ నమోదవుతోంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆజిల్లాల నుంచి ప్రజలు వలసలు పోయే పరిస్థితే రాదు. కానిఆదిశగా ప్రభుత్వాలు పని చేయవు. పైగా పరిశ్రమల కోసం పేదల నుంచి భూములు లాక్కున్నాయి. పోలీసుల నిర్బంధం ప్రయోగించి, అక్రమ కేసులు బనాయించి, జైళ్లలో పెట్టి, లాఠీ ఛార్జీలు చేసి, బలవంతంగా భూముల నుండి పేదలను వెళ్లగొట్టారు. చివరికి అణువిద్యుత్ కేంద్రానికి కూడా శ్రీకాకు ళంనే ఎంచుకున్నారు.మూడు జిల్లాల్లో దాదాపుగా 30లక్షల ఎకరాల సాగుభూమి లో 3లక్షల ఎకరాలకు మాత్ర మే నీటి వనరులు న్నాయి. చెరువులు వున్నప్పటికీ మరమ్మతులు లేక పెద్దగా వినియోగంలో లేవు. తాగునీటి కోసం విజయనగరం నుంచి తాడిపూడి ప్రాజెక్టును విశాఖపట్నం కార్పొరేషన్ నిర్మాణం చేసి నీటిని వినియోగిం చుకున్నది. నిర్ణీత 25 సంవత్సరాల గడువు పూర్తి అయిన తర్వాత స్థానిక జిల్లాకు ఆ ప్రాజెక్టును అప్పగించారు. కానీ,నేటికీ విశాఖపట్నానికే నీరు వెళుతోంది. దీంతో ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీరు లేని పరిస్థితి. 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని రూ.7214 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీకాకుళంలో 0.85 లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, విశాఖపట్నంలో 3.21 లక్షల ఎకరాలు మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పారు. కానీ, 2016-17లో రూ.రెండు కోట్లు, 2017-18లో రూ.రెండు కోట్లు కేటాయించారు. 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో మొత్తం ఇరిగేషన్‌కు రూ.14,229 కోట్లు కేటాయించారు. అందులో రూ.420 కోట్లు మాత్రమే మూడు జిల్లాల ప్రాజెక్టుకు కేటాయించినా వ్యయం చేయలేదు. వంశధార-2 ప్రారంభించి దశాబ్దం గడుస్తున్నా పూర్తి కాలేదు. ఇలా ఉత్తరాంధ్ర లోని ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్షానికి గురౌతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావలసినన్ని వాగులు, వంకలు, నదులు ఉన్నా, ఈ నీరంతా సముద్రం పాలవు తూనే వుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 2003 వరకు 9సంవత్స రాల పాటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా,2014-19ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ15 సంవత్సరాలలోను గుర్తించని అంశాన్ని కొత్తగా గుర్తించినట్లు ప్రకటించడం హాస్యాస్పదం. వలసలను నిరోధించాలంటే ఆ జిల్లాల జీవనాదాయం పెరగాలి. ప్రతిసారీ ‘అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను’ అంటూ చేస్తున్న ప్రచారం చెవిలో మోగుతూనే ఉంది. పాలకుల దృష్టి అంతా ఉత్తరాంధ్రలో వున్న ఖనిజ సంప దను, బహుళ జాతి సంస్థల ద్వారా అమ్మించాలన్న ప్రయత్నమే తప్ప ఆ ప్రాంతాన్ని బాగు చేయాలన్న దృష్టి కాదు. బంగాళఖాతంలో వచ్చిన ప్రతి తుపాను ఉత్తర కోస్తాను నష్టపరుస్తూనే ఉంది. హుదూద్, పైతాన్ లాంటి తుపానుల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇంత వరకు పరిహారం ఇవ్వ లేదు. పైగా నష్టం ఇస్తున్నట్లు విపరీతమైన ప్రచారం చేసింది. ఈ పరిహా రాన్ని కూడా ఉద్యోగుల సహకారంతో పాలక వర్గాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఈ జిల్లా లు విద్యకు బహు దూరంలో వున్నాయి. ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్ పార్టీ ఈ అంశాలపై గట్టిగా ఒత్తిడి చేయనూ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అక్షరాస్యత గురించి పట్టించుకోలేదు. వైద్య సౌకర్యం ఆమడ దూరంలో వుంది. అక్కడ లేని జబ్బులు లేవు. పైగా, ఫార్మా సంస్థలు గిరిజనులపై తమ మందులను ప్రయో గించి పరీక్షలు చేస్తాయి.దీంతో వారి బతుకులు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. ఫార్మా కంపెనీలకు దాసోహంగా ఉండే ప్రభుత్వాలు పేద, దళిత గిరిజనుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పిహెచ్‌సీ సెంటర్లు వున్నా వైద్యులు, మందులు ఉండవు. కిడ్నీలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభిస్తామన్న ఏలికలకు ఈ ప్రాంతంలో మలేరియాతో ఏటా 3వేల మంది చనిపోతున్న విషయం తెలుసా? మొబైల్ వ్యాను ద్వారా మెడికల్ సహాయం చేయడానికి ఆటంకాలేంటి? మరణిస్తున్న గర్భిణీలు, నవజాత శిశువుల గణాంకాలు ఈ పాలకులు ఎప్పుడైనా గమనించారా? రవాణా సౌకర్యాలు పరిశీలిస్తే ఎన్‌హెచ్-5 (చెన్నై-కోల్ కతా), రైల్వే లైన్ మినహా గిరిజన పల్లెలకు కల్పించిన రహదారి సౌకర్యం నామ మాత్రమే. ఒక వైపున ఈ మూడు జిల్లాలలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండగా అక్కడ ఎంపికైన శాసన సభ్యులు, మంత్రులు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రజలకు ఆదామా షాలో ఆదాయం పెరిగిందా? ఈమూడు జిల్లాల్లో 2014 నుండి 2019 వరకు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదలకు ఎంత కేటాయించి వ్యయం చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలి. కిడ్నీ బాధితు లకు పాలక వర్గాల నాయకులు సానుభూతులు మాత్రమే ప్రకటించి వచ్చారు తప్ప, నివారణకు ఏ చర్యలూ తీసుకోలేదు. ఫ్లోరైడ్ నీటి వినియోగం వల్ల కిడ్నీ వ్యాధులు దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులన్నీ వైద్యులు లేక, మందుల కొరత వల్ల కునారిల్లుతున్నాయి. ఈ సంగతి పాలకు లకు తెలియదా? సాగునీటి వనరులను ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి, వారికి పౌష్టికాహారం అందించడం, జీవనాదాయం పెంచడం, విద్యా వైద్య సౌకర్యం కల్పించడంతో పాటు కాలుష్య నివారణా చర్యలు చేపట్టినప్పుడు ఉత్తర కోస్తాను ‘కోస్తా’గా గుర్తించవచ్చు. అంతేగానీ, కోస్తా పేరు చెప్పి ఇంతకాలం చేస్తున్న నిర్లక్ష్యం క్షంతవ్యం కాదు. శ్రీకాకుళం జిల్లాకు బయటి నుండి వలసలు రావటం కాదు, ఇక్కడి నుంచి వెళ్లే వలసలను నివారించగలిగితేనే పాలక పార్టీ లక్ష్యం నెరవేరుతుంది- వ్యాసకర్త : వ్యవసాయ రంగ నిపుణులు -సారంపల్లి మల్లారెడ్డి