కొమరం భీమ్‌

అయనో అగ్గిబరాట … ఆదివాసీల అగ్గిరవ్వ..గెరిల్లా పోరాటంలో మడమతిప్పని యోధుడు..జంగ్‌ సైరన్‌తో నిజాం సర్కారు గుండెల్లో ధడ పుట్టించిన గోండు బిడ్డడు జల్‌,జంగల్‌,జమీన్‌ నినాదంతో గిరిజన హక్కుల కోసం తన చివరి శ్వాస వరకూ పోరాడిన మహనీయుడుకొమరం భీం నిజాం పాలకుల నిరంకుశత్వానికి..అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన వీరుడతను.జల్‌,జంగిల్‌,జమీన్‌ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించిన యోధుడతను.గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమరుడతను. ఇప్పటికీ అడవిబిడ్డల గుండెల్లో కొలువైన ఆవ్యక్తే కొమరంభీమ్‌.ఆమహా నీయునిపై ఎస్‌.ఎం.ప్రాణ్‌రావు రచించినకొమరంభీమ్‌నవల.ఇది పక్క పరిశోధక నవల కావడంతో ప్రముఖ సాహిత్యవేత్త, గిరిజన కథావిశ్లేషకులు..డాక్టర్‌ అమ్మిన శ్రీనివాస రాజు గారు రాసిన అత్యాంత విలువైన సమీక్షా వ్యాసం ఇది.వారివిలువైన సమయాన్నికేటాయించి..శ్రమించి మన థింసా పాఠకులకోసం ఈసమీక్ష వ్యాసాన్ని అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు- ఎడిటర్‌
దక్షిణ భారతదేశ గిరిజన పోరాటయోధుడు, దమ్మున్న ఆదివాసి అమరుడు, కొమురం భీం.. సుమారు 1901లో జన్మించి 1940లో వీర మరణం చెందిన ఈఅడవి బిడ్డ జీవించిన కాలం నాలుగు పదులే అయిన తరతరాలకు స్ఫూర్తిని పోరాట విలువలను అందించడమే కాక తమ గోండు జాతి వికాసానికి కారకుడ య్యాడు.తాను చేసిన భూపోరాటం తన కాలం లో కాకపోయినా తదనంతర కాలంలో విజ యం సాధించి లక్ష్యాన్ని చేరుకుంది. తను ఏనైజాం రాజ్యపాలకుల అరాచక పాలనపై తిరుగుబాటు చేశాడో ఆ నైజాం ప్రభువులు కొమరం భీం చేసిన సంఘటిత పోరాటానికి తన జాతి కష్టార్జిత సంపద అడవులు, భూముల,రక్షణ కోసం చేసిన ప్రాణత్యాగానికి పశ్చాత్తాపం చెంది ఆప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రముఖ మానవ శాస్త్రవేత్త ‘‘హైమన్‌ డార్ప్‌’’ నేతృత్వంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశారు. అది అంతటితో ఆగకుండా తదనంతర పాలకులు కూడా ఆగిరిజన అభివృద్ధి పథకాలు కొనసాగిస్తూ గిరిజన హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలు చేసి, విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో వారి అభివృద్ధికి పాటు పడుతున్నారు. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్‌లో గల అధిక సంఖ్యాకులైన ఆదివాసీ తెగ ‘‘రాజ్‌ గోండు’’ స్వాతంత్రానికి పూర్వం నైజాం పాలనలో గోండుజాతి గిరిజనులు అనుభ వించిన శ్రమదోపిడి,జీవన అస్తిత్వం,మొదలైన పీడనలు,పాలకులు ప్రజల మధ్య వారదులైన అధికారులు,గుత్తేదారులు,నిత్యం అక్కడ గిరిజ నులపై చేసే దౌర్జన్యాలు,విద్రోహాలు,కారణంగా రాజుకుందే ఆ‘‘గోండు పోరాట జ్వాల’’.దానికి ముందుండి నడుం బిగించి తనజాతి అభివృద్ధి కోసం ఆహుతైన అగ్నికణమే ‘‘కొమరం భీమ్‌’’. అక్కడ జరిగింది భారీపోరాటం..కానీ నాటి పాలకుల దృష్టిలో అదిఒకస్థానిక పోరాటం గానే మిగిలిపోయింది.
స్వాతంత్య్రానంతరం జరిగిన గిరిజన వికాసంలో భాగంగా, అభివృద్ధి చెందిన సాహిత్యం సాక్షిగా,అల్లం రాజయ్య,సాహు , వంటి సామాజిక స్పృహగల రచయితల సాయంగా ..‘‘కొమురం భీం’’ చేసిన పోరాట పటిమ సభ్యసమాజానికి చేరడమేకాక,స్థానిక పోరాట యోధుడి,చరిత్ర రాష్ట్రవ్యాప్తంగా జాతీయ చరిత్రలో భాగమైంది.
ఆంధ్రదేశ గిరిజన పోరాటాల్లో అగ్రభాగంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు పోరాటం, దానిలో సీతారామరాజు బ్రిటిష్‌ పాలకుల చేతుల్లో అమరుడైన ఆయన నింపిన పోరాట స్ఫూర్తి గిరిజనుల్లో చక్కని చైతన్యంకలిగించింది. కొమరంభీమ్‌,అల్లూరి సీతారామరాజుల,జీవిత కాలాలు,ప్రాంతాలు,ఒకటి కాకపోయినా,వారి లక్ష్యాలు మాత్రం ఒకటే! వారు జీవించింది కొద్ది కాలమే అయినా అనంతకాల స్ఫూర్తిని ఖ్యాతిని సొంతం చేసుకున్న త్యాగమూర్తులు వారు. కొమరంభీం త్యాగ చరిత్ర వెలుగు చూడటానికి ఆలస్యమైనా అతనిదే అసలైన పోరాటం,రన్‌ గేమ్స్‌ కం తన అమరత్వానికి ప్రతిఫలంగా తన జాతి హక్కులు,స్వేచ్ఛ,పొంది ఆర్థికవిద్య అభి వృద్ధి సాధించి తద్వారా సామాజిక గౌరవం పొందుతుంది. గిరిజనజాతి సంస్కృతిపై జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగడానికి కారణం అయింది. ప్రారంభంలో కేవలం మౌఖిక సాహిత్యంగా మాత్రమే ఉండి ఆదిలాబాద్‌ గోండల గుండె గదుల్లో గుడి కట్టు కుని ఉన్న ‘‘భీమ్‌ పోరాట గాథ’’ పత్రికల పరంగా సభ్య సమాజంలో పాదం మోపిన, తెలియాల్సినంతగా తెలియలేదు.
1990లో విస్తృత ప్రచార సాధనమైన సినిమాగా కొమరం భీమ్‌ కథ సినిమాగ చిత్రీకరించబడ్డ అది విడుదల కావడానికి మరో 20 సంవత్సరాలు పట్టి విడుదలైన చిన్న చిత్రాల జాబితాలో చేరి, ఆచిత్ర లక్ష్యం అందరికీ చేరకుండానే తెరమరుగైంది. అయినా ఆ సినిమాకు కథ మాటలు రాసిన ప్రముఖ చారిత్రక నవలా రచయిత, నల్లగొండ వాసి ఎస్‌.ఎం.ప్రాణ్‌ రావుటసర బాద ముఖ్య ప్రాణ్‌ రావుఊ కలం నుండి పరిశోధనాత్మక నవల ‘‘కొమరంభీమ్‌’’ వెలువడిరది. తెలుగు సాహిత్యానికి ఒక ప్రామాణిక నవల దక్కింది. సినిమా చిత్రీకరణలో భాగంగా భీం నివాస ప్రాంతం, నైజాం పోలీసులతో పోరాటం జరిగిన వీర భూమి,జోడేఘాట్‌, కొమరం భీమ్‌ భార్య సోంబాయి నివాస ప్రాంతం ‘‘దో బె’’ తదితర గిరిజన గ్రామాలు స్వయంగా సందర్శించి భీమ్‌ సమకాలికులతో ముఖ్యంగా భీమ్‌ భార్యతో ముచ్చటించి ఆనాటి పరిస్థితులు, భీమ్‌ వ్యక్తిత్వం,తదితర అంశాలు ప్రత్యక్షంగా చెప్పగా విని రచయిత ఈనవల రాశారు. ‘‘అవ్వల్‌’’ తాలూక్దారు… అబ్దుల్‌ సత్తార్‌… జోడేఘాట్‌లో భీం నాయకత్వంలో జరిగిన గోండు పోరాటానికి సంబంధించిన కాల్పుల గురించి పై అధికారులకు రాసిన నివేదిక పత్రాల ఆధారాలు,‘‘ముషిర్‌- ఎ- డక్కన్‌’’ పత్రికలో 05 అక్టోబరు 1940 తేదీన ప్రచురించబడ్డ వార్తాకథనాలు ఈ నవలకు అధికార ధ్రువపత్రాలు గా చెప్పవచ్చు. ఇక నవల శైలి చారిత్రక కథనంకు అద్దం పడుతుంది. సుమారు 80 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్‌ అడవుల్లో నియంత నిజాం సర్కారు,అతని గుత్తేదారులు,ప్రభుత్వ ఉద్యో గులు,అమాయకత్వానికి చిరునామాలైన అక్కడి గిరిజనులపై చేసిన మోసాలకు ప్రతిరూపంగా ఈ నవల ఆద్యంతం కొనసాగుతుంది. ఒకవైపు నవల కథనం కొనసాగుతూనే,మరోవైపు అంతర్భాగంగా సందర్భోచితంగా గోండు జాతి గిరిజనుల సాంప్రదాయ పండుగలు,జాతరలు, వారాంతపు సంతలు, మొదలైన వారి వారి సాంఘిక జీవన చిత్రాలు సంక్షిప్త రూపంగ అందించడంలో రచయిత సామాజిక దృష్టి స్పష్టమవుతుంది. ఈ నవలలో మరో ప్రాముఖ్యత….కొమురం భీం గురించిన గత విశ్వాసాలు నిరాధార విషయాలను తేటతెల్లం చేయడం. ఇందులో భీమ్‌ వ్యక్తిత్వం, పోరాటపటిమ,వాక్‌ చతురత,అతను మాతృభాష గోండుతో పాటు తెలుగు భాష నేర్చుకోవడం, ముఖ్యంగా తమ జాతి జనావళిలో తన పోరాటంపట్ల, తనపట్ల,నమ్మకం కలిగించ డంలో చేసిన నాయకత్వకృషి,మొదలైన విషయాల నూతన కోణాలు దీనిలో ఆవిష్కృతం అవుతాయి,నూతన నాయకత్వందారులకు ఈ నవల ఆదర్శంగా నిలుస్తుంది.ఈ నవలలో ప్రధాన పాత్ర కొమరంభీం. అతని చిన్నతనంలో తమ వంశస్థులు రాజులుగా ఉండి పాలన చేసిన వారు, ప్రస్తుతం పాలితులుగా ఉండి బాధలు అనుభవిస్తున్న తీరు..బ్రిటిష్‌ పాలకుల ఆదేశాల ప్రకారం నిర్మల్‌ తాలూకా దార్‌, రాంజీగోండును 1860లో నిర్మల్‌లో ఉరి తీసిన ధీనగాథలు,తన కులగురువులైన’’ప్రధాన్‌’’ల గేయాల ద్వారా విన్న యువ భీమ్‌..లో..తమ జాతి స్వేచ్ఛకై పోరాట బీజాలు నాటు కుంటాయి. భీమ్‌ ప్రధాన నాయకత్వానికి సహాయకులుగా,కురంగ రాము, కురిసెంగ సాము, కుమార లింగు, ఆత్రంరఘు, మడవి సోము, రాజు పటేల్‌, తదితరులు ఉండగా ఈ నవలలో ప్రధాన స్త్రీ పాత్రలు రెండు రెండు ఉన్నాయి. ఒకటి భార్య సొంబాయి, ముఖ్య అను చరుడు రాము భార్య జంగుబాయి,నిజాం పాలకుల పక్ష అధికారులైన అబ్బాస్‌ అలీబేగ్‌, సిద్దఖి, హజర్‌ హాసన్‌, పట్వారీ దేశ్‌ పాండే, లు.. గోండు ప్రజలను చిత్రహింసలకు గురి చేసిన క్రూర పాత్రలుకాగా, పైకాజి, మహ్మద్‌ ఆలీ, లు భీమ్‌ పోరాటంలోని న్యాయ, ధర్మం గురించి ఆలోచించిన సౌమ్య పాత్రలు. తిర్మాజి అనే పత్రికా సంపాదకుడు భీమ్‌ పోరాటానికి చేయుత నిచ్చిన అక్షర సేనాని. ఇక గోండు జాతికి చెందిన ‘‘కుర్దూ’’ దురాశతో స్వార్థంతో పటేల్‌ పదవికి ఆశపడి భీమ్‌ పోరాట వ్యూహాలు, నైజాం పోలీసులకు చేరవేసే వెన్నుపోటు దారుడుగ చిత్రించబడ్డాడు. ఈ నవలలో అత్యంత ప్రధాన ఘట్టం ‘‘జోడేఘాట్‌’’ కేంద్రంగా గోండులకు నైజం సైన్యానికి జరిగిన యుద్ధం, కొమరం భీం సంఘటిత నేతృత్వానికి భయపడిన నిజాం అధికారులు కుట్రలో భాగంగా భీమ్‌ కు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడానికి ఆశ చూపిన, నిస్వార్ధంగా దాన్ని తృణప్రాయంగా తిరస్కరించి తన యావత్‌ జాతి సముద్దరణ ప్రధాన ధ్యేయంగా.. పోరాటానికి సిద్ధం అవుతాడు. ప్రతి ఘట్టంలో భీమ్‌ పాత్రను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చిత్రించడంలో రచయిత నేర్పు అక్షర అక్షరాన అగుపిస్తుంది, తన అనుచర వర్గంలో ఆత్మస్థైర్యం నింపడంలో భీమ్‌ కృషి, మాటల తీరు, రచయిత దృశ్యిక రించిన వైనం అద్భుతంగా సాగుతుంది. ఆధునిక ఆయుధాలు కలిగిన నైజాం సైనికులతో ఆత్మస్థైర్యంమే ప్రధాన ఆయుధంగా సాధారణ ఆయుధాలతో అసాధారణమైన పోరాటం చేసిన భీమ్‌ యుద్ధ నైపుణ్యంను కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించిన తీరు కూడా ఆచరణీయం, కథ చారిత్రాత్మకమైన వాస్తవ చిత్రాలతో పాఠకులను ఆనాటి కాలానికి నడిపించుకుంటూ వెళుతుంది ప్రత్యక్షంగా ఎదిరించలేక నిజాం సైన్యం కుట్రదారుడు అయినా కుర్దూ సహకారంతో భీమ్‌ స్థావరాలపై అర్ధరాత్రి దాడి చేసినిప్పు పెట్టి, భీంను అతని అనుచర గణాన్ని అంతం చేసిన నైజాం పోలీసు మూక విజయగర్వంతో వెనుతిరుగగా, ఏడాది కొడుకును ఎత్తుకొని వచ్చి ఆరని మంటల వెలుగుతున్న భర్త మృతదేహం పక్కన మోకాళ్ళ మీద కూర్చుని, భర్త మొహాన్ని కడసారి చూసుకుని, వెలుగుతున్న దివిటీని ఒక చేత, ఏడాది కొడుకుని చంకలో ఎత్తుకుని భీమ్‌ భార్య ‘‘సొమ్‌ బాయ్‌’’ అడవిలోకి వెళ్ళి పోవడంతో నవల ముగుస్తుంది. ఒక వీరుడి మరణం తో పోరాటం ఆగదనే అక్షర సత్యాన్ని భీమ్‌ జీవన చిత్రం ద్వారా అనితర సాధ్యంగా చెప్పడంలో రచయిత కృషి విశేషంగా ఉంది, మనకున్న అనేక చారిత్రక నవలల్లో ఒక భిన్నమైన, నిజమైన, చారిత్రక నవల ఈ ‘‘భీం నవల’’ అక్షరీకరించిన రచయిత కృషి ఎన్నటికీ వన్నె తగ్గదు. డాక్టర్‌ అమ్మిన శ్రీనివాస రాజు