కృత్రిమ మేథ ప్రపంచ భవిష్యత్తు

కృత్రిమ మేథ..ఇప్పుడిదే సర్వాంతర్యామి. ఇందుగలదందు సందేహం వలదన్న మాట కృత్రిమమేథకి సరిగ్గా సరిపోతుంది.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..అనగానే అదేదో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్ల భాష,మనకు సంబంధం లేదనుకుంటాం.కానీ..తెల్లారి లేచిందగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉ ంటోంది.ఒక వస్తువైనా,సేవ అయినా కృత్రిమమేథని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతోంది.అందుకే..విద్య నుంచి వైద్యం వరకూ,వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. విద్య,ఉద్యోగం,పాలనా రంగం..అసలు కృత్రిమమేథ ప్రవేశించని రంగమంటూ ఏదీ కనిపించడం లేదు.ఉద్యోగుల హజరు నమోదు చేసే బయోమెట్రిక్‌ సిస్టమ్‌తో మొదలుపెట్టి శాంతిభద్రతను పరిరక్షణకు,ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకూ పరిపాలనలో కృత్రిమమేథ ఎప్పడో ప్రవేశిచింది.
పిల్లలు బడికెళ్లి చదువుకోవటానికి ఏఐతో ఏమిటీ సంబంధం అనుకుంటే పొరపాటే.మన విద్యారంగంలో ఏఐ మార్కెట్‌ విలువ గతేడాది 75వేల కోట్లు.అది ఏటా 40శాతం చొప్పున పెరుగుతుందట.ఆన్‌లైన్‌ చదువులు వచ్చాక,తరగతి గదిలో టీచరు చెప్పాల్సిన పాఠాలను రకరకాల ఆప్స్‌ ద్వారా ఫోన్‌ తెరమీద చెప్పడానికీ,ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకీ ఏఐ సాయం కీలకమవుతోంది.విద్యార్ది సామర్ధ్యాలనూ నైపుణ్యాలనూ బేరీజువేసి ఒక్కోక్కరి బలాబలాలను గుర్తించడం ద్వారా టీచర్లు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ద తీసుకోవడానికి వీలు కలుగుతోంది.
తప్పులేకుండా ఉద్యోగానికి దరఖాస్తు రాయడమెలా అన్న సందేహం అక్కర్లేదిప్పుడు.గ్రామర్లీ లాంటి ఏఐ ఎనేబుల్డ్‌ సాప్ట్‌వేర్‌ తోడుంటే అది సాద్యమే.ఒక్కో వాక్యం రాసేటప్పుడే తప్పల్లేకుండా దరఖాస్తుని దిద్దిపెడుతుంది ఆ సాప్ట్‌వేర్‌.
కృత్రిమమేథ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు.రాయగలవు.మాట్లాడగలవు.మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి.కాబట్టి వాటికి ఆ పనులు అప్పజేప్పి మనుషులు అంతకన్నా పైస్థాయిలో సృజనాత్మకత,ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన.అంటే,ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభజంగా మారనుందన్న మాట.!
1950ల నుండి కృత్రిమమేధస్సు(ఎఐAI)విషయంలో అనేక పరిశోధనలు జరిగి,అది సిద్ధించి… ప్రస్తుతం మానవజాతిచేతిలో ఒక కొత్తసాధనం సమకూరింది.నవంబర్‌ 2022లో విడుదలైన చాట్‌ జిపిటి దీనికి ఒక తాజా ఉదాహరణ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ భవితవ్యం ఏమి కానుంది అనే చర్చ కూడా మొదలయింది.ఇది కార్పొరేట్‌ ప్రపంచానికి అందివచ్చిన ఫాసిస్టు ఆయుధం అని కొందరు వ్యాఖ్యానించారు.కృత్రిమ మేధస్సు అంటే యంత్రాలు,ముఖ్యంగా కంప్యూటర్‌ వ్యవస్థల ద్వారా మానవ మేధస్సులో జరిగే ప్రక్రియలను అనుకరించడం.డేటాసేకరణ,డేటాఎంట్రీ,కస్టమర్‌ ఫోకస్డ్‌ బిజినెస్‌, ఇ-మెయిల్‌ ప్రతిస్పందనలు,సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌,ఇన్వాయిస్‌ జనరేషన్‌ వంటి యాంత్రికంగా పునరా వృతం చేసే సాధారణ(రొటీన్‌)పనులను ఆటోమేషన్‌చేసి పనిలో విసుగుదలను తగ్గించి మనిషి మరింత సృజనా త్మకంగా చేసుకోవాల్సిన పనులకు సమయం కల్పిస్తుంది.
పరిశ్రమల ఉత్పత్తులను పెంచడం,పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చేయడం, రవాణా సౌకర్యాలను సముచితంగా నిర్వహించటం,విద్యబోధన,ఆరోగ్య సంరక్షణ,వాతావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల కోసం అవసరమైనమార్పులు సూచిస్తుంది.పేదరికం,ఆకలికి వ్యతిరేకంగా పోరాడటం లో కూడా సహాయపడుతుంది.ఆరోగ్యసంరక్షణలో ఎఐ,వ్యాధి నిర్ధారణను మెరుగుపరచడానికీ,కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికీ సహాయపడుతుంది. ప్రాణాంతక వ్యాధుల నివారణలతో సహా ఔషధాలలో పురోగతికి ఇది తోడ్పడుతుంది.విద్యరంగానికి ఇదిమరింత ఆకర్షణీయమైన,అద్భుతమైన అభ్యాస అనుభ వాలను అందించగలదు.వర్చువల్‌,ఆగ్మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీలవల్ల పరస్పర సంభాషణా రీతిలోను (ఇంటరాక్టివ్‌’,బోధనలో పూర్తిగా లీనమయ్యే పద్ధతిలోనూ (ఇమ్మర్సివ్‌) నేర్చుకోవడం జరుగుతుంది. చదువుకోవటం ఒక ఆకట్టుకునే ప్రక్రియగా మారుతుంది.
కృత్రిమ మేధ సమాజంలోను,దైనందిన జీవితంలోను అనేక మార్పులు తెస్తోంది.సిరి,గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా వంటి కృత్రిమ మేధ ఆధారిత వ్యక్తిగత సహాయక యాప్‌లు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు,ఇతర పరికరాలతో అనుసంధానించబడి అనేక రకాల పనులనుచేస్తుంది. మన జీవితాలను సులభతరం,సౌకర్యవంతం,సౌఖ్యవంతం చేస్తుంది.కాకుంటే మానవులు యంత్రాలపై ఆధారపడటం మరింత పెరుగుతుంది.అది సోమరితనానికి దారి తీస్తుంది.పనిలో సృజనాత్మకత,భావోద్వేగం లేకపోవడం వంటి లోపాలు వుంటాయి.అంతేకాక సమాజపరంగా కొన్నినష్టాలు కూడా సంభవిస్తాయి.చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు.ఎక్కువగా సమాచార కార్మికుల ఉద్యోగాలకు,వైట్‌-కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు వస్తుంది.కృత్రిమమేధ సాంకేతికపరిజ్ఞానం – (బప్పా సిన్హా,/ఆంజనేయ రాజు)