కులాల విభజన ఉపాధి హామికే ప్రమాదం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామిలో కులాలవారి సమాచారంపై కేంద్ర గ్రామీణా భివృద్ధిసంస్థ మార్చి 2, 2021న అడ్వయి జరీ ఫైల్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఉపాధి హామిలో దళితు లు,గిరిజనుల వివరాలు, వారి పనిదినాలను ప్రత్యేకంగా పేర్కొనాలని, ఆ ప్రాతిపదికపై 2021-22వేతనాల చెల్లింపు ఉంటుందని ఆ అడ్వయిజరీ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 2006లో ఉపాధి హామిని ప్రారం భించిన నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సర్క్యులర్‌లు ఏవీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు రాలేదు. మొదటి సారిగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధిలో ఈ కులాల విభజన చేయడాన్ని పైపైన పరిశీలిస్తే హిందుత్వ శక్తుల అసలు ఎజెండా అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలగజేయడానికే ఈ వివరాల సేకరణ అనే ముసుగేసి అంతిమంగా ఉపాధి హామి చట్టం యొక్క మౌలిక లక్ష్యాలనే దెబ్బతి సేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధమైంది.

  దేశంలో అన్ని గ్రామాలకు విస్తరించిన అతి ముఖ్యమైనది ఉపాధి హామి చట్టం. 2004లో ప్రజా సంఘాల ఒత్తిడితో ‘’ఉపాధిహామి’’ పథకంగా కాకుండా చట్టంగా రూపుదిద్దుకున్నది. ఉపాధి హామిలో ఎలాంటి మౌలికమైన మార్పులు చేయా లన్నా పార్లమెంట్‌కే అధికారం ఉన్నది. అలాంటి ఈచట్టాన్ని మోడీ ప్రభుత్వం నీరుగార్చడానికి సర్క్యులర్స్‌,అడ్వయిజరీల పేరుతో దొడ్డిదారిన అనేక మార్పులు చేస్తున్నది. హిందూత్వ శక్తులు ఉపాధి హామిలో తెస్తున్న మార్పులు ఎంత ప్రమాదకరమో అర్థం కావాలంటే చట్టంలో ఉన్న మౌలిక అంశా లను గుర్తుచేసుకోవడం అవసరం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వయోజనుడికి కులాలు, మతాలు,ప్రాంతాలు అనేదానితో నిమిత్తం లేకుండా సంవత్సరంలో 100రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలి. వారం,పది రోజుల్లో పని చూపిం చకపోతే నిరుద్యోగభృతి ఇవ్వాలి. యంత్రాలు, కాంట్రాక్టర్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమ తించవద్దు. పనిప్రదేశాల్లో అన్ని సౌకర్యాలను కల్పిం చాలి. చివరకు పిల్లలకు చైల్డ్‌కేర్‌ సెంటర్స్‌ను కూడా పెట్టాలి. వారంవారం వేతనాలు చెల్లించాలి. సరళీ కృత ఆర్థిక విధానాలవల్ల వ్యవసాయంలో యాంత్రీ కరణ జరగడం, వృత్తులు దివాళాతీసి వ్యవసాయ కార్మికులుగా మారడం, చిన్న-సన్నకారు రైతులు వ్యవసాయ నష్టాలతో కూలీలుగా మారడంతో వ్యవ సాయ రంగంలో సంవత్సరంలో 70-80రోజు లకు మించి పనిదొరకని నేపథ్యంలో ఉపాధి హామి చట్టం వచ్చింది.
 కానీ,29కోట్ల 42లక్షల మంది ఉపాధి కూలీల్లో ప్రస్తుతం 14కోట్ల31లక్షల మందికే ప్రభు త్వాలు పని కల్పిస్తున్నాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాలు పనులు కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో గత రెండు, మూడు సంవత్సరాలుగా లక్షల మంది పనికోసం దరఖాస్తులు పెట్టుకుంటే పనులు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కోర్టులు జోక్యం చేసకున్నా ఫలితం ఉండడం లేదు. ఇన్ని పరిమితుల్లో కూడా2020-21ఆర్థిక సంవ త్సరం లో 389.32 కోట్ల పనిదినాలు ఉపాధిలో దేశ వ్యాపితంగా లభించాయి. కరోనా విపత్తులో కూడా ఉపాధి కూలీలు ప్రాణాలు ఫణంగా పెట్టి పనులు చేసారు. వ్యవసాయంలోనూ కరోనాలో పనులు నిర్వహించడంవల్లనే అన్నిరంగాలు మైనస్‌లో   ఉన్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే 4శాతం అభివృద్దిని సాధించింది. ఇలాంటి ఉపాధి హామికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి. కానీ బీజేపీ తీసుకొచ్చిన ఈఅడ్వయిజరీ ఫైల్‌, మొత్తం ఉపాధి హామి లక్ష్యాలనే తలక్రిందులుగా చేస్తోంది.
 ఉపాధిలో ఎస్సీ,ఎస్టీల వివరాలను సేకరిం చేది సబ్‌ప్లాన్‌ ద్వారా నిధులిచ్చి మరింతగా ఈ తరగతులకు లబ్దిచేయడానికేనని బీజేపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. గత సంవత్సరం కల్పిం చిన పని దినాల్లో ఎస్సీలు 19.86 శాతం, ఎస్టీలు 17.9శాతం పని దినాలు పొందారు.ఎస్సీ, ఎస్టీ లకు కలిపి 37.76శాతం...అంటే 140కోట్లకు పైగా పనిదినాలు లభించాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా 24.4 శాతం ఉంటే, జనాభా కంటే 13శాతానికి పైగా అదనంగా ఉపాధి హామి పను లు చేస్తున్నారు. దళిత, గిరిజన ప్రజలకు గ్రామాల్లో ఉపాధి హామి ఒక జీవనాధారం. కానీ ఇప్పుడు సబ్‌ప్లాన్‌ నిధుల్లో జనాభా ప్రాతిపదికపై బడ్జెట్‌లో కేటాయింపులు చూపిస్తున్నారు. ఉపాధి హామికి సబ్‌ప్లాన్‌ నిధులు మరలించాలంటే జనాభా ప్రాతిపదికన 24.4శాతమే ఇస్తారు. మరి అదన మైన 13శాతం పని దినాలకు వేతనాలు ఎక్కడి నుండి వస్తాయి? దేశంలో ఈ స్థితి ఉంటే చాలా రాష్ట్రాల్లో ఉపాధి హామి పనులు 40 నుంచి 60 శాతం వరకు దళితులు, గిరిజనులే చేస్తున్నారు. పంజాబ్‌లో ఉపాధి పనులు 60శాతానికి పైగా ఒక్క దళితులే చేస్తున్నారు. అక్కడి జనాభా రేషియో లో నిధులు ఇస్తే పంజాబ్‌లో ఎస్సీ జనాభా 30 శాతం మాత్రమే. మిగిలిన 30శాతం ఎస్సీ వేత నాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి పని దినాల్లో 33.38శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.5శాతం, తెలంగాణలో 40శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. కనుక ఎస్సీ,ఎస్టీ ప్రయోజనాలకే ఈ వివ రాల సేకరణ అనేది పచ్చి బూటకం. ఈ పేరు చెప్పి ఉపాధి హామీలో బీజేపీ ప్రభుత్వ హెడన్‌ ఎజెండాను అమలుచేసే కుట్రలకు బీజేపీ తెగిం చింది. సబ్‌ప్లాన్‌ నిధులంటే రెగ్యులర్‌ పథకాల్లో దళిత, గిరిజనులు పొందే సౌకర్యాలకు అదనంగా వాటిని ఉపయోగించాలి. కానీ,ఏకకాలంలో   ఉపాధిని, సబ్‌ప్లాన్‌ను పాతర పెట్టడానికి నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు.
 నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉపాధిహామిని బలహీన పర్చడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగి స్తున్నారు. వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపీఏ ప్రభుత్వం యూనియన్‌ బడ్జెట్‌లో ఈపథకానికి 4శాతానికి తగ్గకుండా నిధులు కేటాయిస్తే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్‌లో 2శాతానికి తగ్గించారు. ఒక్కదెబ్బతో ఉపాధి నిధు లకు అడ్డంగా కోతపెట్టారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వాలు కేటాయించినట్టు కనీసం 4శాతం కేటాయిస్తే 1,44,000 వేల కోట్లకు తక్కువ కాకుండా ఉపాధి హామికి బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. కానీ ఈ సంవత్సరం బీజేపీ ప్రభుత్వం 71వేల కోట్లే ఇచ్చింది. మోడీప్రధాని అయిన దగ్గర నుంచి ఈ తరహాలోనే కేటాయింపులు సగానికి తగ్గాయి. బడ్జెట్‌ తగ్గిపోవడంతోటే ఉపాధి పనుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మందికే పనులు కల్పిస్తున్నాయి. ఉపాధిహామి నిధుల్లో 10 శాతానికి మించి మెటీరియల్‌కు ఖర్చు పెట్టకుండా గతంలో అమలైతే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40శాతానికి మెటీరియల్‌ను వినియోగిం చుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో యంత్రా లు,కాంట్రాక్టర్లను,మనుష్యులు చేయలేని పనుల పేరుతో ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు దళిత, గిరిజనుల స్వంత భూముల అభివృద్ధికి ఉపాధిహామి నిధులను ల్యాండ్‌ డెవలప్‌ మెంట్‌ పేరుతో వేలకోట్లు వినియోగించాయి. స్వంత భూమిలోపని చేసుకోవడం వలన భూములు సాగులోకి తెచ్చుకున్నారు. కానీ,నరేంద్రమోడీ ప్రభు త్వం ఉపాధి ద్వారా ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ను అటకెక్కించింది. ప్రజలకు ఉపయోగపడే వాటిని పక్కన పెట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మంత్రుల పర్యటనలకు, పార్కులకు, హెలిప్యాడ్‌ల వినియో గానికి కూడా ఉపాధి హామి నిధులను ఉపయోగిం చే స్థితికి ప్రభుత్వాలు దిగజారాయి. చట్టం యొక్క స్పూర్తికే బీజేపీ తిలోదకాలిచ్చింది.
 కేరళతో పాటు, త్రిపురలో వామపక్ష ప్రభు త్వం ఉన్నప్పుడు ఉపాధిహామి పని దినాలు కల్పిం చడంలో దేశంలో అగ్రభాగాన ఉన్నాయి. త్రిపుర అయితే ప్రతి జాబ్‌కార్డుకు సగటున 89పని దినాలు కల్పించి కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నది. దక్షిణాది రాష్ట్రాలు కూడా ఉపాధి హామిని ఐదారు సంవత్సరాలు బాగా ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు వామపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలు తప్ప, కేంద్రంతో పాటు ప్రాంతీయ పార్టీలన్న తేడా లేకుం డా అని పార్టీల ప్రభుత్వాలూ ఉపాధి హామిని నిర్వీర్యం చేస్తున్నాయి. బీజేపీ పాలక రాష్ట్రాల్లో ప్రారంభం నుండి ఉపాధిహామిపై శ్రధ్ద లేదు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ప్రాణాళికాబద్దంగా ఉపాధి హామీనే లేకుండా చేస్తున్నారు.20కోట్ల జనాభా   ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 2.21కోట్ల జాబ్‌కార్డులు, 3. 12కోట్ల ఉపాధి కూలీలను మాత్రమే నమోదు చేసారు. ఉపాధి హామిని బలహీనపరచి దళిత, గిరిజనుల ఆర్థిక మూలాలను దెబ్బతియడానికే బీజేపీ ఈ కుతంత్రాలు చేస్తున్నది. ఉపాధి హామి వల్ల వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, ప్రత్యేకించి దళిత,గిరిజనులు,ఓబీసీలకు కొన్ని పని దినాలు దొరికాయి. రెండు,మూడు నెలలు ఆహా రానికి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడిరది. కొంత కొనుగోలు శక్తి పెరిగింది. ప్రత్యేకించి గ్రామ పెత్తందారులపై పదిఇరవై రూపాయలకు ఆధా రపడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది.పేదల భూము లు కొంతమేరకైనా సాగులోకి తెచ్చుకున్నారు. గుడ్డిలో మెల్లగా అమలవుతున్న ఉపాధిచట్టం వల్ల కలిగే ఈ మాత్రం ప్రయోజనాలు కూడా గ్రామీణ ధనిక వర్గానికి కంటగింపుగా ఉన్నాయి. ఈ చట్టాన్ని అమలు జరపడం ఏ కోశానా ఇష్టంలేని పెత్తందా రులు, హిందుత్వవాదులు కలిసి ఉపాధి హామి పీక నులమడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వయిజరీ ఫైల్‌లో ఉన్న అంశాలు అమలైతే అందరికంటే నష్టపోయేది దళితులు, గిరిజనులే. సబ్‌ప్లాన్‌ పేరు చెప్పి, జనాభా ప్రాతిపదికమీద నిధులిచ్చి దళిత-గిరిజనులు ఇప్పుడు పొందుతున్న పనులు సగానికి తగ్గిస్తారు. తద్వారా దళితులను పూర్వ స్థితికి, అంటే పెత్తందా రులకు ఊడిగం చేసే స్థితికి నెట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీల పేరు చెప్పి ఓబీసీ, బీసీలకు కూడా ఉపాధి హామి పనులు లేకుండా చేస్తారు. దేశ వ్యాపితంగా 35నుంచి40శాతం పనులు ఓబీసీ, బీసీలు చేస్తున్నా రు. భవిష్యత్‌లో వారికీ అవకాశం లేకుండా ఈ చట్టాన్ని తలకిందులుగా మారుస్తారు. పని ప్రదే శాల్లో కుల వైశమ్యాలను పెంచుతారు. సమిష్టిగా చేసే ఉపాధి పనులు కుల ఘర్షణలుగా మారు తాయి. దీనిని పెత్తందారులు అవకాశంగా వినియో గించుకుంటారు. కులాల పేరుతో ఏర్పడే గ్రూపులకు గ్రామ పంచాయతీలు ఇష్టానుసారం పనులు ఇస్తాయి. దళిత, గిరిజనులకు కఠినమైన పనులు, తక్కువ వేతనాలు పడేటట్లుగా ఈ ఆధిపత్య వర్గాలు ప్రయత్నిస్తాయి. బీజేపీ తెచ్చిన ఈ అడ్వయిజరీ అమలైతే కులాల వారీగా వేతనాల్లో వ్యత్యాసా లొస్తాయి. పూర్వ కాలంలో, ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులకు, ఇతర కులాల కంటే తక్కువ వేతనాలు ఇచ్చిన నేపథ్యం మన దేశంలో ఉన్నది. ఆస్థితి ఉపాధిలో పునరావృతం అవు తుంది. ఇప్పటి వరకు 50శాతం ఉపాధి పనులను మహిళలు చేస్తున్నారు. కులాల విభజన వచ్చిన తర్వాత మహిళలు చేయలేని పనులను ప్రవేశపెట్టి వీరికి పనులు సగానికి సగం తగ్గిస్తారు. అంతిమం గా ఈ అడ్వయిజరీ వల్ల అందరికంటే దళిత, గిరిజనులు, అన్ని కులాల్లో ఉన్న మహిళలకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతు చట్టాలు, విద్యుత్‌ బిల్లు, కార్మిక చట్టాల కోడ్‌ల కోవలోనే ఉపాధి హామిలో కుల విభజనను చూడాలి. దేశ వ్యాపితంగా రైతాం గం,కార్మికులు,వ్యవసాయకార్మికులు చేస్తున్న చట్టాల వ్యతిరేక పోరాటంలో ఉపాధి హామిలో బీజేపీ తెచ్చిన కులవిభజనను జోడిరచాలి. పోరాడి సాధిం చుకున్న ఉపాధి హామిని కాపాడుకోవడానికి మరో పోరాటమే మార్గం. కులాల విభజన రద్దు, 200 రోజుల పని, రోజు వేతనం రూ.600 కోసం దేశ వ్యాపిత సమరశీల సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి. రైతాంగ పోరాటాల స్ఫూర్తితో ఉపాధి హామి పోరాటం ప్రారంభం కావాలి.-బి.వెంకట్‌