కామారం కలాల శోధన కోయతూర్ ఆఫ్ కామారం
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ‘‘బీర్సా ముండా యూత్ సభ్యులు’’ పర్యటనలు, పరిశోధనల సాయంగా వెలువరించిన పుస్తకం’’ ‘‘ఇండిజినెస్ నాలెడ్జ్ ఆఫ్ ది కోయతూర్ ఆఫ్ కామారం’’ – డా. అమ్మిన శ్రీనివాసరాజు
నేటి ఆధునిక కాలంలో అడవి బిడ్డల్లో పొడచూస్తున్న మార్పుల తీరు తెన్నులు గమనిస్తుంటే, అక్షరాల ఆనందదాయకంగా ఉంది. ఆదివాసీలు తమ చరిత్రను, తమ అస్తిత్వాన్ని, మూలాలను, తామే స్వయంగా నిర్మాణం చేసుకుంటున్న శుభతరుణం ఇది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పరిధిలోగల ‘‘సమ్మక్క సారక్క తాడ్వాయి’’ మండలంలోని గిరిజన గ్రామం కామారంకు చెందిన విద్యావంతులైన గిరిజన యువత ఏర్పాటు చేసుకున్న ‘‘బీర్సా ముండా యూత్ సభ్యులు’’ పర్యటనలు, పరిశోధనల సాయంగా వెలువరించిన పుస్తకం.
‘‘ఇండిజినెస్ నాలెడ్జ్ ఆఫ్ ది కోయతూర్ ఆఫ్ కామారం’’ ఇది విషయపరంగాను అలంకరణ పరంగాను ఎంతో ఆకర్షణీయంగా అందంగా విలువైనదిగా ఉంది ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని ‘‘గిరిజన ఎన్సైక్లోపీడియా’’ అని కూడా అభివర్ణించవచ్చు.
296 కమ్మలతో అచ్చంగా 64 అంశాలను సచిత్రంగా అనుభవసారంతో అందించిన ఈ వ్యాసావళిలోని ప్రతి వ్యాసం ఒక ఆణిము త్యం లాంటిదే..!! ఆదివాసి జనజాతి అన్న, వారి ఆచారసాంప్రదాయాలు అన్న,అవి అతి ప్రాచీనమైనవి అనే భావన ప్రతి ఒక్కరిలో నాటుపోయి ఉంది.కానీ అది సరైనది కాదు అనే భావన కలుగుతుంది ఈ పుస్తకం చదివితే. దీనిలో ఆదివాసీలకు సంబంధించిన సమస్త అంశాలు పరిశోధనాత్మకంగా వివరించబడ్డాయి.వస్త్రధారణ,అలంకరణ, పండుగలు,గట్టు- గోత్రాలు,పెళ్లి, చావు,వేట, భాష, ఆహార సేకరణ,ఆటలు- పాటలు, వ్యవసాయ విధానం,పశువుల జంతువుల పెంపకం,తదితర విషయాల గురించిన సంపూర్ణ సచిత్ర విషయాలు సహేతుకంగా ఇందులో మనం చదవచ్చు.సాధారణంగా పరిశోధన గ్రంథాలు అంటే ఏదో ఒక అంశం మాత్రమే తీసుకుని దానిని పరిశోధించి ఫలితాలు రాస్తారు కానీ ఈబీర్సా ముండా యూత్ వారు సుమారు 200 విషయాలు ఎంచుకొని వృక్ష- జంతు శాస్త్ర, గణిత -భౌతిక శాస్త్ర, చరిత్ర, పురావస్తు, ఆంత్రఫాలజీ, వంటి అంశాలను కలగలిపి అధ్యయనం చేసి పరిశోధన చేయటం సాహసంతో కూడిన గొప్ప విషయం.
దీనిలో ప్రధానంగా ‘‘ఇండిజినెస్’’ (స్థానిక ప్రజల ఆలోచనలు ఆచరణ) జ్ఞానంపై ఎక్కువ విశ్లేషణ చేసి గిరిజన ప్రాకృతిక వైవిధ్య ఫలితమైన జ్ఞానాన్ని విపులంగా చిత్రించారు, ఇందులోని శోధన అంతా గిరిజన జీవనం ప్రాకృతిక జ్ఞానం కేంద్రంగా కొనసాగింది. ఆదివాసుల నాగరికతకు సంబంధించిన పరికరాలను వివరించడమే కాక వాటి యొక్క శాస్త్రీయ విశ్లేషణ కూడా చేయడం ఇందులో ఒక విశిష్టత, ఎడ్ల బండి మొదలు నాగలి , ముల్లుకర్ర, గొర్రు, బొనగ, తూతకొమ్ము, ఒడిసెల, గినుగు, బరిశ, ఇసుర్రాయి, రోలు, తదితర వస్తువుల నిర్మాణం ఉపయోగంతో పాటు వాటిలో గల శాస్త్రీయ విశ్లేషణలు కూలంకషంగా చేశారు.
వీటిలో ‘‘తూత కొమ్ము’’ గురించిన విశ్లేషణ గమనిద్దాం… అడవి దున్నల కొమ్ములను గిరిజనులు అడవుల నుంచి సేకరించి క్రమ పద్ధతిలో మొన భాగాన్ని, తొలగించి లోపల భాగం శుభ్రం చేస్తారు, పై భాగంలో నులుపుగా ఉండటానికి నూనె పూస్తారు, బోలుగా ఉన్న కొమ్ము మొన భాగం నుండి గాలిని ఊదటంతో భీకరమైన శబ్దం వస్తుంది,
ఈ ‘‘త్షుత కొమ్ము’’ గిరిజనులకు హెచ్చరిక చేసే సైరన్ లాంటిది, పశువులను మేత కోసం వదలడానికి, అడవుల్లో అవి మేత మేసే సమయంలో క్రూర మృగాల బారి నుంచి కాపాడటానికి, మందల నుంచి తప్పిపోయిన పశువులు తిరిగి మందలోకి రావడం కోసం, ఈ ‘‘తూతకొమ్ము’’ను ఉపయోగిస్తారు. అలాగే గిరిజన గ్రామాల్లో ఈ తూతకొమ్ము ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది, ముఖ్యంగా గ్రామ దేవతల జాతరలు పండుగల వేళ ఆయా దేవర్ల ఆగమనానికి గుర్తుగా తూతకొమ్ము ఊది జనాలను జాగృతం చేస్తారు. ఈ దూత కొమ్ముకు సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణ చేస్తూ దీని జ్ఞానం నుంచే నేటి ఆధునిక సౌండ్ సిస్టమ్స్ వచ్చాయని భావించవచ్చు అంటూ…అడవిలో జంతువులు పక్షులు ఆరుపులను బట్టి గుంపులు గుంపులుగా జీవిస్తాయి,వాటి క్రమం నుంచే జ్ఞానం తెలుసుకుని తూతకొమ్ము శబ్దంతో ఆదివాసీలందరూ ఏకమవడం నిజంగా ప్రకృతి నేర్పిన జ్ఞానం అంటారు ఈ పరిశోధకరచయితలు,ఇదే క్రమంలో వడిసెల, గినుగు, విల్లు, తదితర ఉపకరణాల గురించిన విశ్లేషణలు ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా ఇందులో చదవచ్చు.
కోయవారు పూర్వకాలం నుంచి కాలాన్ని కొలవడానికి కార్తెలను ఎలా ఉపయోగించారో చెబుతూ కార్తెల పేర్లకు గల జానపద కథనాలు, వాటితో ముడిపడి ఉన్న సామెతలు, కూడా ఇందులో పేర్కొనడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అలాగే ఆయా కార్తెల సందర్భంగా గిరిజనులు చేసుకునే పండుగల వివరాలు సైతం చెప్పడం జరిగింది.అడవిలోనే మృగాలు దాంపత్య జీవనం కోసం కలుసుకునే సందర్భంలో భీకరంగా అరుస్తాయి.ఆసందర్భంలో వచ్చే కార్తె కనుక దీనిని ‘‘మృగశిర కార్తె’’ అంటారు, ఎండలు తగ్గి వానలు రాకకు అనుకూలత చెందెసమయంలో ఈ కార్తె వస్తుంది.వర్షం లేకపోయినా భూమి చల్లగా ఉంటుంది. ఈ కార్తెలోనే భూమిలో విత్తనాలు వేస్తే పాడైపోకుండా సక్రమంగా మొలుస్తాయి అని వారి నమ్మకం, ఇలా కార్తెలను లెక్కించడం, కాలాన్ని విభజించడం, భూములు కొలవడం, తదితర విషయాల గురించి పరిశీలిస్తే ఈ ఆదివాసులకు, అక్షరజ్ఞానం అంతగా లేకపో యినా ప్రకృతిని అంచనా వేయడంలో వారు చక్కని పరిజ్ఞానం కలిగి ఉంటారు అనే నిజం నమ్మి తీరాల్సిందే.!! ఈ పుస్తకంలో సాధార ణమైన గిరిజన పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఉమ్మడి జీవన విధానం, కుటుంబ వ్యవస్థ, బంధుత్వాలు, ఆటలు, పాటలు, వ్యవసాయం, జంతువుల పెంపకం, గురించిన సాధారణ విషయాల గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా సహేతుకంగా వివరించడమే కాక శివుని చారిత్రక నేపథ్యం, సింధు నాగరికత కోయ నాగరికత, కోయ సిద్ధాంతం ప్రత్యేకత, కోయ తూర్, గోండ్వానా ధర్మచక్రాల గురించిన విశ్లేషణలతో పాటు, గొంతెమ్మ మడుగు పురాతన చిహ్నాలు – ఒక అధ్యయనం, వంటి వినూత్న విషయాల గురించిన వివరాలు చెప్పడం దీనిలో ఒక ప్రత్యేకత.
ఆదివాసి జాతి సంరక్షణ కోసం తమ అస్తిత్వాన్ని తామే వ్రాసుకోవడం ఒక కోణం, అయితే గిరిజనులకు గల పరిశీలన దృష్టి, ప్రకృతిని అంచనా వేయడంలో వారికి గల ప్రత్యేకతలు, కూలంకషంగా ఈ క్షేత్ర పరిశీలన తాలూకు పరిశోధన అధ్యయన గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఎంతో అవసరమైన గిరిజన విజ్ఞానం తాలూకు సైద్ధాంతిక పరమైన విషయ సేకరణలో కామారం బిర్సా ముండా యువజన ఉద్యోగ సంఘాల వారు చేసిన ఈ అక్షర కృషి ఎంతో శ్లాఘనీయం, భావి పరిశోధనలకు ఇది ఒక ‘‘నీటి చెలెమె’’లా, దోహదపడగదు, ఈ అద్బు Ûత అక్షర కృషికి సారథ్యం వహించిన గిరిజన పరిశోధక విద్యార్థి ‘‘మైపతి అరుణ్ కుమార్’’ ఎంతో అభినందనీయుడు.గిరిజన సంస్కృతి సైద్దాంతిక గ్రంథాలకు తలమాని కంగా నిలిచే ఈ సచిత్ర పుస్తకం ప్రతి పరిశోధక విద్యార్థి అధ్యయనకర్త, విధిగా చదవాల్సినది.