కాఫ్‌`29 భేటీ లాభమేంటీ!?

ప్రపంచ వాతావరణ సదస్సు కాఫ్‌`29 అజర్‌ బైజాన్‌లోని బాకులో ముగిసింది.నవంబర్‌ 22తో పూర్తికావాల్సిన సదస్సును అంతర్గత,వాగ్వివాదాల వల్ల రెండు రోజులపాటు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిఎదుర్కోవాలన్నలక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసించాయి.ఐక్యరాజ్యసమితివాతావరణ మార్పుల నియంత్రణ ఒప్పందం (యూఎన్‌ఎఫ్‌సీసీ)లో భాగస్వాములైన దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాఫ్‌)గా వ్యవహరిస్తారు.శిలాజ ఇంధనాల వినియోగం వంటి మానవ కార్యకలాపాలతో భూగోళం వేడెక్కిపోతోంది.భూఉష్ణోగ్రత పెరగుదలను 1.5సెల్సియస్‌ డిగ్రీల దగ్గర నిలువరించాలని పారిస్‌ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు తీర్మానించాయి.ఈలక్ష్య సాధనలో పేద దేశాలకు ఆర్ధికంగా చేయూతనివ్వాలని నిశ్చయించాయి.దీన్ని వాతావరణ ఫైనాన్స్‌ అంటున్నారు.బాకు కాఫ్‌`29 సదస్సులో పేద దేశాలకు నిధుల కేటాయింపునకు సంబంధించి కొత్తగా నిర్ణయం తీసుకోవాలని అజెండా పేర్కోంది.
భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని కొన్ని ధనిక,అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్‌29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన వాతావరణ నిధిపై ముసాయిదా సత్వర కార్యాచరణకు ఏమాత్రమూ అనువుగా లేదని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేలా కొత్తఆర్థిక లక్ష్యాలతో ముసాయిదా వుండాలని వర్ధమాన,నిరుపేద దేశాలు భావిస్తున్నాయి.
క్లయిమేట్‌ ఫైనాన్స్‌ కింద ఏటా 100బిలియన్ల డాలర్లు (10 వేల కోట్ల డాలర్లు) ఇస్తామని 2009లో సంపన్న దేశాలు ఒప్పుకున్నాయి. కానీ, గడచిన పదమూడేళ్లలో దానిని పాటించింది ఒక్కసారే! సంపన్న దేశాలు 2020నుంచి వాతావరణ ఫైనాన్స్‌ కిద ఏటా 100బిలియన్ల డాలర్లు (10వేలకోట్లు డాలర్లు) ఇస్తామని వాగ్దానంచేశాయి.2022లో సదరులక్ష్యాన్నిఅందుకున్న ఆ దేశాలు 2025వరకు దీన్నికొనసాగిస్తామన్నాయి.ఇప్పుడు తమ సాయాన్ని 30వేల కోట్ల డాలర్లకు పెంచుతున్నామనీ,అదీ ఉదారంగా ఇస్తున్నదేనని వాదిస్తున్నాయి.వాస్తవానికి 2035కల్లా 50వేల కోట్ల డాలర్ల సాయం అందిస్తామని అవి మొదట్లో ప్రతిపాదించాయి.అది చివరికి 30వేల కోట్ల డాలర్లకు తగ్గింది.వచ్చే ఏడాది జరిగే కాఫ్‌30సభలో వార్షిక వాతావరణ ఫైనాన్స్‌ను 1.3లక్షల కోట్ల డాలర్లకు పెంచే విషయం పరిశీలిస్తామని మాటతో సరిపెట్టేశారు. ఇలాంటి మాట తప్పుడు తంతుతో పర్యావరణానికి ఏమాత్రమూ మేలు జరగదని పేద దేశాలు వాపోతున్నాయి.ప్రపంచంలో పునుత్తాదక ఇంధన వనరుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2030కల్లా మూడు రెట్లు పెంచాలని కాఫ్‌29లక్షిస్తోంది.కానీ,శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యేక తీర్మాణం చేయకపోవడం గమనార్హం.దీనివల్ల సంపన్న దేశాలు బొగ్గు,చమురును యధేచ్ఛగా వినియోగిస్తాయనే ఆందోళన వ్యక్తమైంది.వాతావరణంలో మార్పుల నిరోధానికి సంపన్న,వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నడవడం తప్పనిసరి.ఈవిషయంలో ఏకాభిప్రాయం లోపించడం కాప్‌29లో స్పష్టంగా కనిపించింది.పాశ్చాత్య దేశాలు కూడా మాటలకే పరిమితమయ్యాయి.ఆఖరికి కాఫ్‌29 సదస్సును నిర్వీర్యం చేస్తూ అర్ధవంతంగా ముగించేశారు.!- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్