కరోనా కట్టడిలో ఆచార సంప్రదాయాలూ మేలే
భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి.
మన దేశం సంస్కృతి,సంప్రదాయాలు, ఆచా రాలకు పుట్టినిల్లు. పూర్వం నుంచి మన వాళ్లు పాటించిన ఆచార సంప్రదాయాల వెనుక మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యా లున్నాయి. పూర్వీకులు ఆచరించిన సాంప్ర దాయక, ఆధ్యాత్మిక ఆచారాల చాటున వెనుకటి మర్యాద మన్ననలే కాదు అవి ఆరోగ్యంతో కూడుకున్నవి. భారతీయ సంప్రదాయాచారాలను కొందరు మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తారు. దాని మాటున శాస్త్రీయ విజ్ఞానం ఉందని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. తీరిక లేని యువతతో పాటు పెద్దలు కూడా నాటి ఆహారపు అలవాట్లు అతిథి మర్యాదలు వంటి పురాతనాచారాలను అవలంబించడంపై శ్రద్ధపెట్టకపోవడంతో అవి కనుమరు గవుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారులు సృష్టిస్తున్న కల్లోల సందర్భాల నేపథ్యంలో పూర్వాచారాల అమలుపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఆచారాలలో దాగున్న శాస్త్రీయత ఆధారంగా పునరాలోచించి తిరిగి ఆచరిస్తే ఫలితముంటుందని ఆయుర్వేద వైద్యులు, ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు,వేడుకలు, పండుగలు, వాస్తు సంబంధ విషయాలలో తరచుగా కొన్ని పూర్వాచారాలు గోచరిస్తుంటాయి.
సంప్రదాయక ఆరోగ్య సూత్రాలు
వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు మాత్రమే నేడు అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి వస్తోంది కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీ రియా సోకకుండా యాంటీ సెప్టిక్, యాంటీ బయాటిక్ గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్ల లోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే…ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని చెబుతారు. అమ్మవారు (వైరల్ ఇన్ఫెక్షన్) సోకితే పిల్లలకు క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం. మన ఇంటికి అతిథులైనా, బంధువులైనా వచ్చారంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇచ్చి స్వాగతించడం ఆనవాయితీ. బయటి నుంచి వస్తారు గనుక కాళ్లు కడుక్కుని లోపలికి రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిములు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే వండిన భోజనం వెంటనే తినమని పెద్దలు సూచించేవారు. చల్లారిన పదార్ధంలో క్రిములు చేరతాయని. అప్పట్లో ఆహార పదార్థాల తయారీకి మట్టి,ఇత్తడి,రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. వాటివల్ల పోషకాల నిల్వ పుష్కలంగా సమకూరుతుంది. కాలుష్యం బారిన పడే అవకాశమే లేదు. పర్వదినాల్లో ఇంటి గుమ్మాలకు తప్పనిసరిగా తోరణాలు కట్టేవారు. గతంలో ఇళ్లలో సూక్ష్మ క్రిముల తాకిడికి నివారణగా సాంబ్రాణి పొగ వేసేవారు. హిందూ సంప్రదాయ పండుగల్లో దర్శనమిచ్చే రకరకాల పిండి వంటకాల ప్రత్యేకతల వెనక కొన్ని ఆరోగ్య రహస్యాలు న్నాయి. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున పచ్చడిలో, శ్రీరామనవమి నాటి బెల్లం పానకం లోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దసరా, సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాల్లో వాడే బెల్లం, నువ్వులు, వాము వంటివి దీని ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బతికుంటే బలుసాకు తినొచ్చు నన్న సామెత ఊరకే పుట్టలేదు. పొలాల గట్లమీద, చిత్తడినేలల్లో బలుసాకు అరుదుగా లభిస్తుంది. దీన్ని పల్లెల్లో కొందరు వినాయక చవితి సమయంలో పులుసుగా, పప్పుతోనో వండుకుని తినడం అలవాటు. దీన్ని పచ్చడిగా తింటే అతిసారం తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి తోడ్పడుతుంది. ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు శరీరంలో వేడిని తొలగించి ఒత్తిడిని జయిస్తుంది. పూర్వం ఆదివాసులలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. ఏ పద్ధతి పాటిం చిన మానవతా దృక్పథంతో కూడి ఉండేవి. ఆ కాలంలో జనసమూహంలో ఎవరైనా తుమ్మినా అపచారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామాజిక దూరాలు పాటించేవారు. అలాగే అశుభాలకు సంబంధించిన ఆచారాల్లోనూ అదే జాగ్రత్త కనిపించేది. క్షౌరశాలకు, అంత్య క్రియలకు వెళ్లి వస్తే దేన్నీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం. వ్యాధులు సంక్రమించకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించేవారు. పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి. మైల, అంటు వంటివి పాటించడంతో ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. వాటిని మూఢాచారాలుగా మార్చేసిన కొందరి వల్ల అటువంటి పద్ధతులపై విరక్తి, అనాసక్తి ఏర్పడ్డాయి. అందులోని శాస్త్రీయతను ఆరోగ్య సూత్రాలను కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చలేని విధంగా ఆనాటి సంప్రదాయాలను పాటించడం, అనుసరించడం నేడు చాలా అవసరం.
ఇవీ ఆరోగ్యకారకాలే
వేకువ జామునే ‘సూర్యనమస్కారాలు’ చేయడం వల్ల శారీరక దృఢత్వం చేకూరటమే గాక శరీరానికి కాంతి కిరణాలు సోకి విటమిన్ ‘డి’ సమకూరుతుంది. వ్యక్తులు తారసపడితే చేతులు జోడిరచి నమస్కరించడం ఎంతో ఆరోగ్యకరం. నమస్కరించడంలో రెండు చేతుల వేళ్లు కలిసిపోయి ఆక్యుప్రెషర్ జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరూ మెరుగవుతుంది. నుదుటన కుంకుమ బొట్టు ధరించడం హైందవ ఆధ్యాత్మికతకు ప్రతీకనే గాక నుదురులోని నాడులు ఉత్తేజితమై ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రతతో కూడిన మానసికోల్లాసం ఉట్టిపడుతుంది. పీయూష గ్రంథి ప్రేరేపించబడుతుంది. దీంతో రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన వంటివి క్రమంగా తగ్గుతాయి. గుడిలో దైవాన్ని ప్రసన్నం చేసుకునే ముందు గంటలు కొట్టడం ఆధ్యాత్మి కాచారం. గంట మోగించడంతో ఆ ప్రాంతం లో ఓంకార ధ్వని విస్తరించి గాలిలో ఉండే (సూక్ష్మ) క్రిములు నశిస్తాయి. సద్దుల బతుకమ్మ సంస్కృతిలో ఆడపడుచులు సత్తుపిండి పంచిపెట్టడం వెనుక పోషకాల లేమి ఉండ కూడదనే ఆచారం వాడుకలో ఉంది. వీటిని మనం మరిచిపోయాం.ఇంటిలోకి విస్తారంగా గాలి, ధారాళంగా వెలుతురు ప్రవేశించేందుకు వాస్తు పండితులు తగు ప్రణాళికను సూచిస్తుంటారు. కిటికీల ద్వారా చల్లని గాలి (ఆమ్లజని) ప్రవేశిస్తూ, వెంటిలేటర్ల ద్వారా వేడి గాలి (బొగ్గు పులుసు వాయువు) బయటికి వెళ్ళడం వల్ల చల్లటి ఆహ్లాద వాతావరణం. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య కిరణాలు గదులలోకి ప్రసరిస్తే క్రిమి కీటకాలు నశిస్తాయి. పెద్దలు సూచించిన ‘చద్దన్నం’ శరీరానికి చలువ కలిగించడమే గాక కడుపులో అల్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. నేలపై చాప పరిచి కూర్చోని భోంచేయడం’ మన సదాచారం. ఇలా చేయడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి, అజీర్తి సమస్యలు సమసిపోతాయి. భోంచేసేటప్పుడు కూర్చోవడానికి బాసుపీటలు ఉపయోగిస్తే కాళ్ల నొప్పులు రావు. అరిటాకు భోజనం చాలా శ్రేష్టమైనది. అరిటాకు ద్వారా ఆహారంలోని పోషకాలు యధాతధంగా శరీరానికి చేరతాయి. ఇది కాలుష్యరహితమైనదిగా గుర్తించాలి. పూర్వం రోజుల్లో భోజనం చేయడానికి మోదుగాకులు లేదా పారెటాకులతో చేసిన విస్తరాకులను వాడేవారు. అప్పట్లో మట్టి, రాగి, కంచు పాత్రల్లో భోజనం చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా కంచు పళ్ళెంలో ఆహారం భుజిస్తే జీర్ణశక్తి, మేధోశక్తి పెరుగుతుంది. ఉదరంలో ఆమ్లత్వం గాఢత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆ తరం అలవాట్లను కొంతమేరకైనా ఒంటపట్టించుకోవాల్సిందే. విలువలతో, శాస్త్రీయతతో కూడిన మరిన్ని ఆచారాలపై భవిష్యత్తరాలకు తెలిసేలా ‘పాఠ్యాంశం’ గా ప్రవేశ పెడితే సమాజ ఆరోగ్యం, నైతిక విలువలు పెంపొందుతాయి.- గుమ్మడి లక్ష్మినారాయణ