కరువు కోరల్లో బీడ్‌ కదలని ప్రభుత్వం

ఈఏడాది జనవరి నాటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభు త్వాలు 300జిల్లాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాయి. వీటిలో మహారాష్ట్రలోని బీడ్‌జిల్లా ఒకటి. గతేడాది అక్టోబర్‌లోనే ఈ జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించారు. సీపీఐ(ఎం), కిసాన్‌ సభ జిల్లా నాయకులతో కలిసి నేను వివిధ తాలూకాల్లోని 25గ్రామాలలో వందలాది మంది బాధితులను కలిశాను. ఇప్పటికీ అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కనుచూపు మేరలో కనిపించటం లేదు. పంట నష్టాన్ని అంచనా వేయటానికి ఒక్క ప్రభుత్వ బ ృందం కూడా గ్రామాల్ని సందర్శించలేదు.
ఎండిన పంటలను పొలాల నుంచి తొలగించాల్సి ఉన్నా అవి తీసేస్తే తమకు బీమా సొమ్ము అందదేమోనన్న భయంతో రైతులు వాటిని అలాగే ఉంచేశారు. మేం కలిసిన ప్రతి రైతూ అప్పుల్లో కూరుకు పోయి ఉన్నారు. అయినా ప్రభుత్వ సహకారం అందుతుందన్న ఆశ వారికి ఏమాత్రం లేదు. వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా మహిళా కార్మికుల దుర్భర పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించి మా మనసుల్ని కలచివేసింది. చాలా గ్రామాలలో కుటుంబంలోని పురుషులు ఇతర పనులు వెతుక్కుంటూ వలస వెళ్లిపోయారు.ఈప్రాంతం కరువు ప్రభావిత జిల్లాగా గుర్తించినప్పటికీ గ్రామీణ ఉపాధి పథకం కింద అవసరానికన్నా చాలా తక్కువ పని దొరకటం దీనికి ప్రధాన కారణం. బీడ్‌జిల్లాలో 2018-19సంవత్సరానికి కేవలం 43రోజులు మాత్రమే ప్రభుత్వం పని కల్పించింది.
జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి సమావేశాలు వేసి వాటిలో వచ్చిన అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితిపై ప్రతినిధి బృందం కలెక్టర్‌కు నివేదిక అందజేసింది. మోడీ ప్రభుత్వం తయారు చేసిన ‘కరువు సహాయక మార్గదర్శకాలు 2016’లో కూడా ఈజిల్లా రైతులకు అన్యాయం చేశాయనేది వారి అనుభవం ద్వారా తెలుస్తోంది.
నష్ట తీవ్రత-పరిహారం, సహాయం
బీడ్‌లోని మొత్తం 11తాలూకాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు. అయితే నష్టాన్ని అంచనా వేయలేదు. నష్ట పరిహారం, బీమా చెల్లింపునకు ఇదే కీలకం. గతంలో జరిగినట్టే నష్టశాతాన్ని తక్కువ చేసి చూపించి సరైన పరిహారం ఇవ్వకుండా ఎగవేస్తారని రైతులు భయపడుతున్నారు. ఈ ఐదేండ్లలో కేవలం 2017లో మాత్రమే వర్షాలు పడటంవల్ల మిగిలిన నాలుగేండ్లూ ప్రజలు కరువుతో సతమత మయ్యారు. ఈ ప్రాంతంలో చెరకు, పత్తి, సోయా, కందులు, సజ్జలు, జొన్న సాగు చేస్తారు. కరువుకు తోడు 2016నుంచి బీటీ పత్తికి ‘బొండాలి’ పురుగు సోకుతోంది. దీని నివారణకు ఎరువులు, పురుగు మందులూ అధికంగా వాడటం వల్ల ఎకరాకి అయ్యే ఖర్చు పెరిగింది. రైతులు చెప్పినదాన్ని బట్టి వర్షాభావం వల్ల 80శాతం ఖరీఫ్‌ పంట, దానికి కొంచెం అటూ ఇటూగా రబీ పాడైంది. అప్పుల్లో మునిగిపోయి, గత 8నెలలుగా ఆదాయం లేక తల్లడిల్లుతున్న రైతులకు ప్రభుత్వ సహాయంగాని, బీమా పరిహారంగానీ ఇచ్చేందుకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎలాంటి శ్రద్ధా చూపలేదు.
అరకొర రుణాలు-అప్పుల గాయాలు
ఒకవైపు ప్రభుత్వం పంట రుణ పథకాల గురించి ఊదర కొడుతున్నప్పటికీ మేం కలిసిన రైతుల్లో చాలామంది బ్యాంకుల నుంచి రుణాలను పొందలేదు. అనేక ఆందోళనలు చేసినా బ్యాంకుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. పర్లి తాలూకా మందఖేల్‌ గ్రామంలో రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన చెరుకు రైతులను ‘షుగర్‌ మిల్లు యజమానుల నుంచి గ్యారంటీ లెటర్‌ తెస్తేనే లోన్లు ఇస్తామ’ని అధికారులు తిప్పి పంపేశారు. ఇప్పటికే రాజకీయ ప్రాబల్యం కలిగిన యజమానులకు ఈచర్య మరింత బలాన్ని ఇవ్వటమే కాక చెరుకు రైతులపై వారి పట్టు మరింత బిగుస్తుంది. ఆప్రాంతంలోని అన్ని బ్యాంకులలో ఇదే పరిస్థితి ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వ రుణ మాఫీ పథకం వల్ల లాభపడిన ఒక్క రైతు కూడా మాకు కనిపించలేదు. బ్యాంకులు తమకు రుణాలు ఇవ్వకుండా వివక్ష చూపి తమను శిక్షిస్తున్నాయని వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులుచేసి ఇబ్బందులపాలవుతున్న రైతులు వాపోయారు. ధానూ ర్లో జరిగిన సమావేశంలో రైతు బాబా సాహెబ్‌ పవార్‌ మాట్లాడుతూ ‘బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్లే రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు కరువు సాయం అందించననటం న్యాయమా?’ అని కన్నీటితో ప్రశ్నించాడు. అయితే తమ అప్పుల వివరాలను బహిరంగంగా చెప్పటానికి రైతులు నిరాకరించారు. ‘మాకు ఎంత అప్పు ఉన్నదీ పబ్లిగ్గా చెబితే మా పరువు పోవటమే కాదు. రేపు ఇంకా ఎక్కడా అప్పు పుట్టదు. అందుకే మేము ఆ వివరాలు చెప్పలేం’ అని ఒకవృద్ధ రైతు సమావేశం అనంతరం మాతో తమ వ్యధ చెప్పుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి? ఒక వైపు అప్పుల భారాన్ని తమ భుజాలపై మోస్తున్నా దాని బరువును బయట పెట్టటానికి రైతులు ఒప్పుకోరు. కానీ ఆ భారంవల్ల కలిగే బాధను దాచుకోవటం సాధ్యమా?
యంత్రాలు మాట్లాడవు!
బీమా కంపెనీలతో రైతులకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈఏడాది బీడ్‌ జిల్లాలో చెరుకు రైతులకు బీమా సౌకర్యం లేదు. ఎందుకని అడిగితే ప్రీమియం చాలా ఎక్కువ వున్నదని, రైతులు దానిని కట్టలేరని అధికారుల సమాధానం. అయితే వారు అసలు తమని ఎప్పుడూ సంప్రదించలేదని రైతులు చెప్పారు. ఈ విషయంలో మరింత లోతైన విచారణ జరగాల్సి ఉంది.
మజల్‌గావ్‌ ప్రాంతంలోని ధర్మేవాడి గ్రామంలో రైతులబ ృందం తమ అనుభవాలను తెలిపారు. పత్తి రైతు సందీపన్‌ భుంభ్లే మాట్లాడుతూ.. ‘2017లో నేను ఎకరా పత్తి పంటకు రూ.1200 బీమా చెల్లించా. వర్షం బాగానే ఉన్నా బొందాలి పురుగు ఆశించడంతో 10క్వింటాళ్లకి బదులు 6క్వింటాళ్లే పండిరది. బీమా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం చాలా కష్టమైంది. మా ఊళ్లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ చాలా బలహీనంగా ఉంటుంది. దీనివల్ల ఆన్‌లైన్‌లో పూర్తిచేయాటానికి చాలా సమయం వృధా అయింది. నేను చెల్లించిన ప్రీమియం రసీదు నా దగ్గరే ఉంది కానీ ఏం ఉపయోగం? గతంలో బీమా ఏజంటుని మేం నేరుగా కలుసుకుని మా అనుమానాలన్నీ అడిగే వాళ్ళం. ఇప్పుడు మిషను మాత్రమే ఉంటుంది. యంత్రాన్ని ఏమని అడగగలం? నా పంట నష్టాన్ని అంచనా వేసి, బీమా సొమ్ము ఇవ్వటానికి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసేవాణ్ణి. ఎవ్వరూ రాలేదు. పరిహారం కింద ఒక్క పైసా కూడా అందలేదు. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసుకి వెళ్ళటంవల్ల సమయం వ ృధాయేనని వదిలేశా’.
పశువులు – పశుగ్రాసం
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 5లక్షల ఆవులు, 2.6లక్షల ఎడ్లు, 2.4లక్షల గేదెలూఉన్నాయి. పశువులపోషణ, డైరీ ఫారం నిర్వహణ ఇక్కడి ముఖ్య ఆదాయ వనరు. అయితే పశుగ్రాసం, నీళ్లు కొరత వల్ల పశువులను పోషించటం చాలా కష్టంగా ఉంది. అందువల్ల అన్ని గ్రామాలలోను పశువుల మందను అమ్మ టానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలేడ్‌ పంచాయితీ సమావేశంలో రైతులు చెప్పిన ప్రకారం ఒక జత ఎద్దులకు నెలకు సుమారు 8క్వింటాళ్ల గ్రాసం కావాలి. క్వింటాల్‌ రూ.2000 చొప్పున ఏడాదికి రూ.72,000 కేవలం గడ్డి కొనటానికే అవుతుంది. నీళ్ళ కొరత ఇంకొక పెద్ద సమస్య. పశువుల సంగతి తరువాత. మనుషుల అవసరాలకు సరిపడా ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవు. ఇక గోరక్షణ పేరుతో బీజేపీ చేపడుతున్న విధానాల వల్ల మొత్తం పశువుల వ్యాపారమే బాగా దెబ్బతిన్నదని రైతులు వాపోయారు. దానికి తోడు కరువు వల్ల ధరలు కూడా బాగా పడిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పశువుల్ని అయినకాడికి అమ్మటంవల్ల బాగా నష్టాలొ చ్చాయి. హామీ ఇచ్చిన ప్రభుత్వం గ్రామాలలో ఇంకా పశువుల కొట్టాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వమే గ్రామంలో పశుగ్రాసం సరఫరా చేయాలని రైతులు అడిగినా వాటిని మేత కోసం పశువుల కొట్టానికి తీసికెళ్లాలంటే ఒక మనిషి ఒక రోజు పనీ, ఆదాయాన్నీ వదులుకోవాలి.
కానరాని అదనపు సేవలు-సహకారం
ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు సేవలు దాదాపు కను మరుగయ్యాయనే చెప్పవచ్చు. ఏరకమైన పంట వేయాలనే విషయంపై రైతులకు తాము అవగాహన కల్పిస్తామని, దానికనుగుణంగా రైతులు తమ పంటలను మార్చుకునేందుకు అవసరమైన సహకారం అంది స్తామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు అటువంటిదేమీ అమల్లోలేదు. పైగా బీటీ కాటన్‌ విత్తనాలు, ఎరువుల అమ్మకానికి ప్రయివేటు ఏజన్సీలను అధికారులు ప్రోత్సహిస్తున్నారనీ, చక్కెర మిల్లు యజమానులకు పూర్తి మద్దతు ఇస్తున్నారనీ చెప్పారు. చక్కెర మిల్లులకు ప్రభుత్వమే విద్యుత్‌ ఇవ్వటం దీనికిసాక్ష్యం. ఇటు వంటి పరిస్థితుల్లో కరువు సమయాల్లో ఆచరించాల్సిన పద్ధతుల గురిం చి, ప్రణాళికల అమలు గురించి ఎక్కడా ఊసేలేదు. అదనపు సేవలు, మేలైన విత్తనాల ఉత్పాదనకు ప్రయోగాలు, నిరంతర వ్యవ సాయాన్ని పెంపొందించే చర్యలు మొదలైన వాటి లేమివల్ల వ్యవ సాయ ఉత్పాదకత, రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. వీటి అమలులో ప్రభుత్వం తన కనీస బాధ్యత నుంచి కూడా తప్పుకుంటోంది.
అధికారుల పాత్ర
అన్ని గ్రామాల్లోను రుణాలు, ఇన్సూరెన్స్‌ విషయాలలో రైతులు సమస్యలెదుర్కొంటున్నారని చెప్పినప్పుడు ‘సమస్య కొన్ని బ్లాకులలోనే ఉన్నదనేది’ కలెక్టర్‌ స్పందన. నిజానికి ఆన్‌లైన్‌లో ఇన్సూ రెన్స్‌ రిజిస్ట్రేషన్‌ విధానం రైతులకు చాలాకష్టం. అలాగే బీమా ప్రీమి యం కట్టించుకోవటంలో కంపెనీల బాధ్యత శూన్యం. ప్రభుత్వమే దానిని నిర్ణయిస్తుంది. బీమా ప్రీమియం ఖరారు, నష్టం అంచనాలో జాప్యానికి అధికారుల అలసత్వమే కారణమని కలెక్టర్‌ అంగీకరించారు. కరువు అంచనాకు సంబంధించిన కొత్త నిబంధనల ప్రకారం ఇకముందు గ్రామస్థాయి ప్రత్యక్ష తనిఖీ అవసరం లేదు. బ్లాకు లేదా జిల్లాస్థాయిలో సగటు దిగుబడి ఆధారంగా అంచనా కడతారు. దీనివల్ల భూస్వాములు,ధనిక,మధ్య తరగతి, చిన్నరైతుల మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. నీటి పారుదలకు సంబంధించి సేకరించిన లెక్కలు కూడా అందుబాటులో లేవు. కొన్నిప్రాంతాలలో సంపన్నులైన రైతులు పంపులు, బోర్ల ద్వారా పొలాలకు నీరు పెట్టుకోగలుగుతారు కాబట్టి సహజంగానే వారి పంట దిగుబడి అధికంగానే ఉంటుంది. వారిని కూడా పేద రైతులతో సమానంగా లెక్కగడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు కరువు నష్టం అంచనా విషయంలో కూడా ఏవో కొత్త పద్ధతుల ద్వారా వాస్తవ పరిస్థితిని మరుగున పడేసి తనకు అనుకూలంగా నివేదికలను తెప్పించుకునే అవకాశం లేకపోలేదు.
ఇటీవలే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘కరువు విధాన పత్రం – 2016’ను పరిశీలిస్తే దానిలో పొందుపరచిన అంశాలు కరువు తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఒక జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించేందుకు తీసుకున్న ‘మధ్యస్థం’, ‘తీవ్రం’, ‘అతి తీవ్రం’ అనే కొలబద్దల స్వభావం మానవీ య విలువలతో కాక పూర్తిగా సాంకేతికంగా, కఠినంగా ఉన్నది. కరువు అంచనా వేయటంలో శాస్త్రీయ విధానమైన ప్రత్యక్ష తనిఖీని పూర్తిగా ఎత్తేశారు. పైన తెల్పిన మూడు కేటగిరీలు నిధుల కేటాయిం పులో కీలక పాత్ర వహిస్తాయి. కానీ నిధుల విషయానికి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని భరించాలని తేల్చేశారు. సహాయ నిధుల్లో 2రకాలు ఉంటాయి. ఒకటి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌-దీనిలో 75శాతం కేంద్ర ప్రభుత్వం, 25శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. రెండవది,ఎన్‌డీఆర్‌ఎఫ్‌-ఇది మొత్తం కేంద్ర నిధుల నుంచే చెల్లించాలి. ఈ విధానపత్రం ప్రకారం మహారాష్ట్రలో కేవలం 3జిల్లాలు మాత్రమే కరువు ప్రభావిత ప్రాంతాల కిందికి వస్తాయి. రైతుల నుంచి తీవ్ర నిరసనా రాజకీయ తిరుగుబాటూ ఎదుర్కొంటున్న రాష్ట్ర సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయక తప్పలేదు. అయితే ఈ అంశంలో నిధుల కేటాయింపు కీలకం అయినందున కరువు తీవ్రత ప్రభావం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే బీడ్‌ జిల్లాలో కరువు సహాయానికి నిధుల కేటాయింపులో జరిగిన తీవ్ర జాప్యం వల్ల అక్కడి రైతుల దుస్థితి మరింత పెరిగింది. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే దీనికంతటికీ కారణం!- బృందాకరత్‌