ఏపీలో ఎన్నికల కోడ్‌`2024

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది సీఈసీ. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర సరిహద్దుతో పాటుగా జిల్లాల సరిహద్దుల్లో కూడా అవసరమైన చోట చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.డబ్బులు, బంగారం, వెండి,మద్యం,విలువైన వస్తువులు భారీగా పట్టుబడుతోంది.దీంతో ఎంత వరకు డబ్బు,బంగార,వెండిని వెంట తీసుకె ళ్లొచ్చు..ఒకవేళ తీసుకెళితే ఎలాంటి ఆధారాలు ఉండాలి అనే నిబంధనలపై చర్చ జరుగుతోంది.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం..పరిమితికి మించి తీసుకెళ్తే తప్పనిసరిగా లెక్క చూపించాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రూ.50వేలు వరకు మాత్రమే డబ్బులు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తే..ఆ నగదుకు సంబంధించిన వివరాలు, సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎక్కడికి తీసుకెళుతున్నారు వంటి అంశాలను చెప్పాల్సిందే. ఒకవేళ డబ్బులు తీసుకెళ్లేవారు ఇచ్చే డాక్యుమెంట్లు, చెప్పే విషయాల్లో నిజాలు లేకపోతే ఆ డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటారు. సరైన పత్రాలు చూపించిన తర్వాతే తిరిగి ఆ నగదును అప్పగిస్తారు. అప్పటి వరకు ఆ డబ్బులు కోర్టు కస్టడీలో ఉంటాయి. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. డబ్బులు మాత్రమే కాదు.. బంగారం, వెండి తదితర ఆభరణాలు, విలువైన వస్తువుల్ని కూడా పరిమితికి మించి తీసుకెళ్లకూడదు..
నియమావళి అంటే ఏమిటి, పాటించకపోతే ఏమవుతుంది?
లోక్‌ సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. దీంతో 2024 జనరల్‌ ఎలక్షన్స్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రక్రియ మొదలు పెట్టినట్లయింది.ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో కోట్లమంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఎన్నికల నియ మావళి(ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) కూడా అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ‘‘ఎన్నికల నియమావళి’’గా పిలుస్తారు.ఎన్నికల నియమావళిని అమలుచేసిన తర్వాత ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సిబ్బందిగా పని చేస్తారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరు ఈసీ కోసమే పనిచేస్తారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత,ఒక పార్టీకి ప్రయో జనాలు చేకూర్చేలా ప్రజాధనాన్ని ఉపయోగించ కూడదు. ఒకసారి కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత,కొత్త ప్రభుత్వ పథకాలు,భూమి పూజలు,శంకుస్థాపనలు,ప్రకటనలు చేయ కూడదు.ప్రభుత్వ వాహనాలు,విమానాలు, ప్రభుత్వ భవనాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోకూడదు.ఎన్నికల ర్యాలీలు, పాదయాత్రలు,బహిరంగ సభలు లాంటి ప్రజా కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు,అభ్యర్థులు, వారి మద్దతుదారులు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మతం,కులంపేరుతో ఏరాజకీయ పార్టీ ఓట్లు వేయాలని అభ్యర్థించకూడదు.మత ఘర్షణలు రెచ్చగొట్టేలా లేదా కులాల మధ్య చిచ్చు పెట్టేలా లేదా భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రకటనలు లేదా వ్యాఖ్యలు చేయకూడదు. పార్టీలు లేదా అభ్యర్థుల విమర్శలు..విధాన నిర్ణయాలు,పథకాలు,కార్యక్రమాలు,గతంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి.అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు, ప్రజా జీవితంతో సంబంధంలేని అంశాల జోలికి పోకూడదు. నిరూపించలేని ఆరోప ణలను చేయకూడదు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మసీదులు, చర్చ్‌లు, దేవాలయాలు ఇతర ప్రార్థనా స్థలాలను ఉపయోగించుకో కూడదు.ఎన్నికల చట్టంలో నేరాలుగా పరిగణించే ‘‘అవినీతి‘’ విధానాల జోలికి అభ్యర్థులు, పార్టీలు వెళ్లకూడదు.ఓటర్లకు డబ్బులు లేదా బహుమతులు ఇచ్చి ప్రలోభ పెట్టడం,భయపెట్టడం,దొంగ ఓట్లు వేయడం లాంటివి చేయకూడదు.పార్టీలు ఓటర్లకు లంచం ఇవ్వడం/బెదిరించడం/అవమానించడం లాంటవి చేయకూడదు.ఓటర్లను పోలింగ్‌ స్టేషన్‌లకు, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించకూడదు. పోలింగ్‌ రోజున మద్యం సేవించడం/పంపిణీ చేయడం నిషేధం.పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటుచేయకూడదు. పోలింగ్‌కు ముందు 48 గంటల సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలూ నిర్వహించకూడదు.ఎన్నికల కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.
ప్రవర్తనా నియమావళి ఎప్పుడు ప్రారంభమైంది?
భారత్‌లో 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ప్రవర్తనా నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల అంగీకారంతో వారితో సంప్రదింపులు జరిపి ప్రవర్తనా నియమావళిని రూపొందించారు. పార్టీలు, అభ్యర్థులు ఏ నియమాలను అనుసరించాలో నిర్ణయించుకున్నారు.1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ప్రవర్తనా నియమావళి అమలు చేశారు. దానికి కొన్ని కొత్త విషయాలు, నియ మాలు పొందుపరిచారు.కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఏ చట్టంలోనూ భాగం కాదు.కానీ దానిలోని కొన్ని నిబంధనలు ఐపీసీలోని సెక్షన్ల ఆధారంగా అమలవుతాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 1979లో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవర్తనా నియమావళిని సవరిం చింది.1979 అక్టోబరులో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి దీన్ని అమలుచేశారు.ప్రవర్తనా నియమావళి విషయంలో 1991జనరల్‌ ఎల క్షన్స్‌ అత్యంత ముఖ్యమైనవి.ఈ సమయంలో ప్రవర్తనా నియమావళిని విస్తరించారు.దీనిని అమలుపరచడంలో ఎన్నికల సంఘం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిచింది. తేదీలు (షెడ్యూల్‌) ప్రకటించిన రోజు నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి తెచ్చేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ భావించగా,నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.ఈ వ్యవహారం చివరకు కోర్టుల వరకు వెళ్లింది.కానీ,అక్కడి నుంచి స్పష్టత రాకపోవడంతో చివరకు 2001 ఏప్రిల్‌ 16రాజకీయ పార్టీలు,ఎన్నికల సంఘం మధ్య జరిగిన చర్చల తర్వాత,షెడ్యూల్‌ విడుద లైన రోజు నుంచి ప్రవర్తనా నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌)ను అమలు చేయడానికి ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి.అయితే, ఎన్నికల తేదీకీ, నోటిఫికేషన్‌కు మధ్య కనీసం మూడు వారాల (21రోజుల) గడువు ఉండా లన్న షరతు పెట్టారు.

ఏపీ ఎన్నికల `2024 షెడ్యూల్‌ ఇదీ..
ఏప్రిల్‌ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌
ఏప్రిల్‌ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
తెలంగాణలోనూ మే 13న ఎన్నికలు
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక
జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ..ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్‌ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు

` సైమన్‌