ఏజెన్సీ స్వరాజ్య సింహం` చింతల చెరువు వెంకటాద్రి
‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.
గిరిజన ప్రజలకు నెలవైన గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం ఏజెన్సీలో ఒకసాధారణ గ్రామం చర్ల. మన దేశంలో ఒకేపేరుతో అనేక గ్రామాలు ఉన్నాయి కానీ ‘‘చర్ల’’ అనే రెండు అక్షరాల పేరుతో మరెక్కడ ఒక్కగ్రామం లేకపోవడం ఒక విశేషం!! అలా ఎన్నో విశేషాలకు సాక్షి భూతమైన చర్ల ప్రాంతంలో తొలిసారిగా స్వరాజ్య ఉద్యమస్ఫూర్తిని అందించడానికి గిరిజనగ్రామాలలో కాలి నడకన,సైకిళ్లు,ఎడ్లబండ్ల, సాయంతోతిరిగి స్వరాజ్య స్ఫూర్తిని ఉద్యమ చైతన్యం నింపిన నాటి ఏజన్సీ‘‘స్వరాజ్య సింహం చింతలచెరువు వెంకటాద్రి’’.
గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా మృత్యుంజయ పురంలో ‘‘చింతలచెరువు వెంకట్రామయ్య – లక్ష్మమ్మ’’ దంపతులకు 5వ సంతానంగా 1889 నవంబరు20న వెంకటాద్రి జన్మించారు. పన్నెండేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన ఆలనాపాలనా అన్న గార్ల మీదేపడిరది, బ్రతుకుతెరువు కోసం మిత్రుల సహాయ సలహాలతో వీరి పెదనాన్న వెంకటప్పయ్య గారు భద్రాచలం డివిజన్లోని వెంకటాపురంలో 1896సంవత్సరం పట్వారి ఉద్యోగంలో చేరారు, దానితో మిగతా కుటుంబ సభ్యులంతా వెంకటాపురం చేరుకొని ఆనాటి సాధారణ ఉద్యోగాలైన పట్వారి పనులు చేస్తూ కొందరు, మరికొందరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు. పట్వారి ఉద్యోగం చేసేవారు వ్యవసాయం చేయడం ఆ రోజుల్లో నిషేధం.
వెంకటాపురం సమీపంలోని ఆలుబాకలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న వెంకటాద్రిగారు, సోదరుని వద్ద సాధారణ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని స్వయంకృషితో తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ భాషలు నేర్చుకొని చక్కని సాహిత్య పరిజ్ఞానం కూడా పెంచుకున్నారు. అన్నగారి సాయంతో 1908 సంవత్సరం లో కొత్తగా ఏర్పడ్డ ‘‘పడిగాపురం’’(వాజేడు సమీపంలో ప్రస్తుతం అంత రించిన గ్రామం) సర్కిల్లో ‘‘పట్వారి’’ కొలువులో చేరారు.
గుంటూరుకు చెందిన మహాలక్ష్మమ్మని పెళ్లి చేసుకున్నారు వెంకటాద్రి,ఆమె అక్క గారు ఏలూరులోని ప్రముఖ ప్రచురణ సంస్థ వెంకట్రామా అండ్ కంపెనీ యజమాని ‘‘ఈదర వెంకట్రావు’’ గారి భార్య, దరిమిలా వెంకటాద్రిగారి తోడల్లుడు ద్వారా సాహితీవేత్తలతో పరిచయం. సాహిత్యంపై మక్కువ పెరిగాయి. దాని ద్వారా అందిన సామాజిక స్పృహ ఆయనను జాతీయోద్యమం వైపు నడిపించింది. 1908 సంవత్సరంలో భద్రాచలం డివిజన్ మద్రాసు రాజధాని పరిధిలో ఉండేది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా అక్షర పరిజ్ఞానం లేక పూర్తి స్తబ్ధతతో ఉన్న ఈగిరిజన ప్రాం తంలో వెంకటాద్రి వారిని చైతన్య పరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉదర పోషణ కోసం ఉద్యోగం చేస్తున్న ఆయన ఆలోచనంతా సమాజ శ్రేయస్సు కోసమే ఉండేది.
ఆ రోజుల్లో వెలువడుతున్న ఒకేఒక తెలుగు దిన పత్రిక ‘‘ఆంధ్రపత్రిక’’దానిని ఈ ప్రాంతంలో పోస్టు ద్వారా తెప్పించుకున్న ఏకైక వ్యక్తి వెంకటాద్రి, నాటి స్వరాజ్య ఉద్యమ వార్తలు నాయకుల ప్రసంగాలు, ప్రకటనలు, చదివి తాను స్ఫూర్తి పొందడం కాక గాంధీజీ పట్ల ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమంపట్ల మక్కువ పెంచుకున్నారు. గ్రామగ్రామాన తిరిగి గిరిజనులకు నాటి దేశ పరిస్థితులు,బ్రిటిష్ వారి అరాచకాలు వివరించేవారు. కాలక్రమేణా ఆయనకు ఉద్యోగం కన్నా సమాజ సేవే ముఖ్య మని దేశ స్వరాజ్యమే ప్రధానం అనే భావన కలిగింది, ఈయన చర్యలు ఎప్పటికప్పుడు గమని స్తుండే పైఅధికారులు అతని పై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. 1921 డిసెంబరులో అహ్మదాబాదులో భారత జాతీయ కాంగ్రెస్ ‘‘పన్నుల నిరాకరణ ఉద్యమా నికి’’ పిలుపునివ్వడంతో వెంకటాద్రి తన గ్రామ కర్నికానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో ప్రవేశించారు. నాటి ప్రముఖ స్వరాజ్య ఉద్యమ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ తన ‘‘ఉద్యమ స్నేహరాజ్యం’’ విస్తరించుకున్నారు. ఆయనలోని స్వరాజ్య కాంక్ష పట్టుదల మాట తీరు తదితర లక్షణాలు తెలిసిన దేశభక్త కొండా వెంకటప్ప య్య గారి పిలుపు మేరకు అష్టకష్టాలు పడి కాలినడకన ఇల్లందు చేరి అక్కడ నుంచి రైల్లో గుంటూరు వెళ్లి వెంకటప్పయ్య గారి నాయక త్వంలో ‘‘సహాయ నిరాకరణోద్యమంలో’’ పాల్గొన్నారు. అక్కడ టంగుటూరి ప్రకాశం, కళావెంకట్రావు,భోగరాజు పట్టాభి సీతారా మయ్య, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వంటి పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతర కాలంలో వారితో కలిసి వెంకటాద్రి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పది నెలల పాటు అక్కడే స్వరాజ్య ఉద్యమంలో గడిపి తిరిగి వెంకటాపురంచేరి తాను గుంటూరులో పొందిన ఉద్యమస్ఫూర్తితో గిరిజన గ్రామాలు తిరుగుతూ జాతీయోద్యమ అవసరాన్ని తనదైన వాక్చాతుర్యంతో ప్రచారం చేశారు.వెంకటాపురం నుంచి వి.ఆర్.పురం (వరరామచంద్రపురం) వరకు వెంకటాద్రి గారికి స్వరాజ్య ఉద్యమ అనుచరగణం ఉండేది. ఆ రోజుల్లో గోదావరి రేవు ప్రాంతం ‘‘దుమ్ముగూడెం’’ పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. స్వరాజ్య ఉద్యమకారులకు అదే కేంద్రంనిలయం. ఆప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత రంగూన్ రౌడీ నాటకకర్త ‘‘సోమరాజు రామానుజరావు’’ భద్రాచలంకు చెందిన కురిచేటి శ్రీరామ్మూర్తి,ఆర్.కొత్తగూడెం చెందిన భూపతిరాజు బుచ్చి వెంకటపతిరాజు, మొదలైన వారంతా ఆయన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించే వారు. ఈ క్రమంలో వెంకటాద్రి గారి కుటుంబాలకు అనివార్య కారణాలతో చర్లకు చెందిన భూస్వామి ‘‘ముత్యాల వెంకట స్వామి’’ స్నేహం లభించింది. ఆయన సలహా మేరకు చర్లకు చేరి వ్యవసాయ భూములు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం ద్వారా జీవనం సాగించేవారు, దీనితో వెంకటాద్రి గారి స్వరాజ్య పోరాట కేంద్రం చర్లకు మారింది. ఆయన కార్య దీక్షను తెలుసుకున్న విప్లవం వీరుడు’’అల్లూరి సీతారామరాజు’’తన అజ్ఞాత పర్యటనలో భాగంగా ఒకరాత్రి చర్లకు వచ్చి తన పోరాటానికి సహకరించమని వెంకటాద్రి గారిని కోరారు, కానీతాను మొదటి నుంచి గాంధేయవాదానికి అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పి రామరాజు అభ్యర్థులను సున్నితంగా తిరస్కరించారు.1926 సంవత్సరములో మన్యం ప్రాంతపు పోలవరం గ్రామంలో ‘‘పునులూరు కోదండరామయ్య’’ నేతృత్వంలో ‘‘స్వరాజ్య ఆశ్రమం’’నెలకొల్పారు 1929 మే 9న గాంధీజీ ఆ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు వెంకటాద్రి తన అనుచరగణంతో పోలవరం వెళ్లి మహాత్ముని తొలిసారి దర్శనభాగ్యం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
ఆ స్ఫూర్తితో ఆశ్రమం చేపట్టే ప్రతి ఉద్యమ కార్యక్రమాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. 1929 డిసెంబర్లో లాహోర్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్ళిన వెంకటాద్రి అక్కడి నాయకుల ప్రసంగాలతో తనలో అచంచలమైన ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.1930 సంవత్సరంలో గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంకు పిలుపునిచ్చి దండి యాత్ర ప్రారంభించారు. సముద్ర తీర ప్రాంతాల ఉద్యమకర్తలు తమ ప్రాంతాల్లో ఉద్యమానికి మద్దతుగా ‘‘ఉప్పుతయారీలు’’ మొదలుపెట్టారు సముద్రానికి దూరంగా మన్యం ప్రాంతంలో ఉన్న వెంకటాద్రి గారికి ఏం చేయాలో అర్థంకాక చివరికి చౌడు మట్టి నుంచి ఉప్పు తీయవచ్చని ఆలోచనతో పాత చర్లలోని చెరువు దగ్గర ఆయన ఉప్పు సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ ఉద్యమం పెను సవాలుగా నిలిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటాద్రి గారి దీక్షను భగ్నం చేసి లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేసి భద్రాచలం తీసుకువెళ్లి అక్కడి నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపించారు. అక్కడ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. అనంతరం 1932లో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొని ప్రముఖ పాత్ర పోషించారు.రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం 1938 సంవత్సరంలో ‘‘జమిందారి రిపోర్ట్’’ తయారు చేయడానికి చర్ల వచ్చినప్పుడు ఆయన లోని కర్తవ్య దీక్షను వెంకటాద్రి ప్రత్యక్షంగా గమనించి ప్రభావితం చెందారు.
1939 సంవత్సరంలో త్రిపురలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు వెంకటాద్రి హాజరయ్యారు. సుభాష్ చంద్రబోస్‌ను ప్రత్యక్షంగా అక్కడే దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి, తూర్పుగోదావరి జిల్లా కమిటీ, సభ్యులుగా ఎన్నికయ్యారు.
1942 వ సంవత్సరంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన మన్యం ప్రాంతానికి నాయకత్వం వహించి తన సహచరులతో కలిసి అనేక చోట్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వరాజ్యఉద్యమ శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
స్వాతంత్రానంతరం ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి తాను నమ్మిన పార్టీలోనే కొనసాగి తన కార్య క్షేత్రమైన చర్ల అభివృద్ధికి తన సొంత ఆస్తులు సైతం అందించిన త్యాగశీలి, 1951 ఫిబ్రవరి 14న చర్లలో ప్రాథమిక సహకార సంఘం, స్థాపించడం శాఖ గ్రంథాలయానికి సొంత స్థలం ఇల్లు వితరణ చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసిన త్యాగమూర్తి వెంకటాద్రి,
తన సహచరులు ‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది.
ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.- డా.అమ్మిన శ్రీనివాసరాజు