ఎన్నాళ్ళీ…మండేకాలం…..?

కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే. అంతెకాకుండా మండుతున్న మండువేస‌వి సాక్షిగా ధ‌ర‌లు పెంచేసి ప్ర‌జ‌ల న‌డ్డి విరిస్తున్నారు.

ఇది ”మంటలకాలం”. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. ఈ మంటలకు ముందునుండే ధరలు మండుతున్నాయి. ఆకలితో ప్రజల కడుపులూ మండుతున్నాయి. ఇరుగున సీతమ్మ పుట్టిల్లని చెప్పుకునే నేపాల్‌లో, పొరుగున రావణరాజ్యం అని భావించే శ్రీలంకలోనూ లేని మంటలు… మోడీగారి రామరాజ్యంలో మాత్రం ప్రజలను మలమల మాడుస్తున్నాయి. అందుకని ఇది ఎండాకాలం మాత్రమే కాదు, మండేకాలం. అంతేకాదు, కడుపు మండి మిడతలు కూడా దండయాత్రలు చేస్తున్న కాలం. మరి బతుకులే మండుతుంటే మనుషులేం చేయాలో తేల్చుకోవాల్సిన కాలం…
తాజాగా మోడీ సర్కార్‌ వంటగ్యాస్‌ ధర పెంచి ఈ మంటలను మరింత ఎగదోస్తోంది.. ఫలితంగా గ్యాస్‌బండ కాస్తా గుదిబండగా మారింది. వేయికి చేరువలో మోయలేని భారమై కూర్చుంది. ఎట్లా బతుకాలో అర్థం కాక ప్రజలుంటే.. అధికారపార్టీ నేతలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరో మాట వల్లిస్తూ ప్రజలను మాయజేస్తున్నారు. నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పెరిగిన చమురు ధరలపై మోడీ ఏమన్నారు? ”ఇది ముమ్మాటికీ యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే” అన్నారు. అది నూటికి నూరుపాళ్లూ నిజం కూడా. మరిప్పుడు పెట్రోల్‌ వాత, గ్యాస్‌ మోత లేకుండా దినం గడవని స్థితికి చేరింది మోడీ పాలన..! దీనికి ప్రధానిగా, ప్రభుత్వాధినేతగా ఏం సమాధానమిస్తారు? విచిత్రమేమిటంటే ఇప్పుడు కూడా ఆయన, ఆయన భక్తబృందం ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని సెలవిస్తారు..! ప్రజలు ఎంత అమాయకులని భావిస్తే ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడగలరు..!? ఆయన మొదటిసారి ఢిల్లీ పీఠంపై కొలువుదీరే నాటికి (2014) 14.2కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 414. అదిప్పుడు అక్షరాలా ఎనిమిదివందల డెబ్బయ్యొక్క రూపాయల యాభై పైసలు. అంటే ఈ ఏడేండ్ల మోడీ పాలనలో అది ఏకంగా రూ.457.50 పెరిగింది. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంగతి చెప్పనవసరం లేదు, వాటిది విరామమెరుగని పరుగు… మరి ఇది ఎవరి వైఫల్యం..? ప్రజలు నిజం తెలుసుకోవాలి?
”స్వేచ్ఛా విపణి” కోసం మోడీ సర్కార్‌ వెంపర్లాటను 2017 జూన్‌ మధ్య నుంచి దినసరి ధరల యంత్రాంగం (డైలీ ప్రైస్‌ మెకానిజం)తో లింక్‌ చేసారు. అంతర్జాతీయ ధరల 15రోజుల సగటుపై ఇది నిర్ణయమవుతుంది. మన దేశంలో క్రూడ్‌ ఆయిల్‌ విస్తృతంగా లభిస్తుంది. సహజవాయువూ దొరుకుతుంది. వాటిని బయటికి తీసే ఖర్చు, శుద్ధి చేయడానికయ్యే ఖర్చు, ఆ కంపెనీ లాభం, రిటైల్‌ రవాణా ఖర్చుతో కలుపుకున్నా రూ.40 దాటదు. నేడు మనం చెల్లిస్తున్న ధరలో 60శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దేశంలోనూ పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి అన్నారు. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధర పీపా 25డాలర్లకు తగ్గినప్పుడు కూడా మన దేశంలో నయా పైసా తగ్గలేదు. ఈ పాపం మోడీ సర్కారుది కాదా..?!

చమురు ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాటి వినియోగదారుల మీద మాత్రమే ఉండదు. అది మొత్తం రవాణా వ్యవస్థనే ఖరీదైనదిగా మార్చడంతో పాటు, ఆ రవాణా మీద ఆధారపడిన సకల సరుకుల ధరలనూ మండిస్తుంది. ఫలితంగా ప్రజారవాణే కాదు, సమస్త వస్తువులూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. ప్రత్యేకించి నిత్యావసరాలు భగ్గుమంటాయి. ఇప్పటికే ఈ నిరంతర పెరుగుదల పరంపరలో నింగినంటిన నిత్యావసరాలు పేదల కడుపుల్లో అగ్గిరాజేస్తున్నాయి. ఒకవైపు ఆర్థికమాంద్యం, మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఉపాధికోల్పోయి, ఆదాయాలు క్షీణించి కనీస అవసరాలకు కూడా అల్లాడుతున్న జనంపై ఇది పెనుభారం. ప్రపంచ ఆకలి సూచిలో దేశం అట్టడుగు స్థానంలో ఉండటమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కనికరమన్నదే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా కేవలం ఏడు నెలల్లో (2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు) కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను ద్వారా చమురు ఖాతా నుంచి రూ.1,96,342కోట్లు పిండుకున్నారు. అంతకు ముందు సంవత్సరం అదే వ్యవధిలో దండుకున్న మొత్తం రూ.1,32,899కోట్లు కావడం గమనార్హం. అంటే కరోనా కాలంలో కూడా జనాన్ని మరింత పీల్చి పిప్పి చేసిన ఘరానా ప్రభుత్వమిది.
జీవితావసరాల నుంచి నిత్యం భావోద్వేగాల వైపు దృష్టి మళ్లిస్తూ ప్రజలను దొంగదెబ్బ తీయడంలో ”మహాగొప్ప నైపుణ్యం” ఈ ప్రభుత్వానిది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దించగల ”నేర్పు” ఈ ప్రభుత్వాధినేతలది. ఎంతటి భారాలూ ఘోరాలనైనా అతి సహజమైన విషయాలుగా చెప్పి ప్రజలను వంచించగల తెలివితేటలు వారివి..! లేదంటే మండుతున్న ధరలు తగ్గించమంటుంటే మందిర నిర్మాణానికి చందాలు అడుగడాన్ని ఏమనాలి..?! ఉద్యోగాలు కావాలని జనమడుగుతుంటే ఉపాధిరంగాన్నంతా ధనవంతులకు తెగనమ్మడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి..?! తాము ఏం చేసినా దేశం కోసమేనంటూ ‘దేశభక్తి’ ముసుగులో జనాన్ని నమ్మించి గొంతుకోయడం వారికి ఓ అలవాటుగా మారింది. అందుకే ”ఏ మాటల వెనుక ఏ వర్గప్రయోజనాలున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు” అంటారు లెనిన్‌.
అంగట్లో దేశం..
కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.
సామ్రాజ్యవాదులపై రెండు శతాబ్దాలుగా పోరాటంలో పాల్గొన్నవారికి ఆనాటి స్థితిగతుల్లో మార్పు కోసం ఎన్నో స్వప్నాలు, మరెన్నో ఆకాంక్షలు. అవే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగమై వెలిసాయి. ఇది సంపన్నదేశాల ప్రభుత్వరంగం వంటిది కాదు. 1947నాటికి ఒక అత్యంత వెనుకబడిన, వ్యవసాయక దేశంలో ఆవిర్భవించిన ప్రభుత్వరంగం. ఇది రెండు కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంది. మొదటిదీ కీలకమైనదీ, దెబ్బతిన్న పెద్దపులిలాంటి సామ్రాజ్యవాదం తిరిగి పంజా విసరకుండా దేశాన్నీ, దేశ సార్వభౌమత్వాన్నీ కాపాడటం. రెండవది భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం. అయితే సహజంగానే స్వాతంత్య్రానంతర భారత పాలకులకుండే ”వర్గ”నైజం రీత్యా భారత పెట్టుబడిదారులకవసరమైన మౌలిక సరుకులు, గనులు, భారీ యంత్రాలు, విద్యుత్‌, నౌకా నిర్మాణం, చమురు తవ్వకం, శుద్ధి చేయడం మొదలైనవన్నీ ప్రభుత్వరంగంలో చేస్తూ, వినిమయ సరుకుల ఉత్పత్తి మాత్రం పెట్టుబడిదారులకే వదిలేసారు. మొదట్లో పాలకులు దీన్ని మిశ్రమార్థిక వ్యవస్థంటూ ముద్దుగా పిలుచుకున్నా దేశంలో నిర్మితమైంది ఫక్తు పెట్టుబడిదారీ విధానమే! అయితే జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ప్రభుత్వరంగానికి లాభనష్టాలు ప్రాతిపదిక కానే కాదు. సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు మాత్రమే ప్రాతిపదిక. ప్రయివేటు సంస్థలకు సొంత ప్రయోజనాలూ, లాభాలవేటే ఏకైక లక్ష్యం అన్నదాంట్లో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ ప్రభుత్వసంస్థలకు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వరంగం విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే విస్మరిస్తోంది నేటి ప్రభుత్వం. పైగా పెట్టుబదిదారులే సంపద సృష్టికర్తలంటూ వారికి సాగిలపడుతోంది. సర్కారువారి అంతరంగమేంటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
పారిశ్రామికరంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్‌ సవరణ చట్టాన్నీ తెచ్చిందీ ప్రభుత్వం. రైతును భూమినుండి తరిమేసి విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసగా నిలబెట్టే కుట్ర చేస్తున్న సర్కారు, ఉద్యోగ, కార్మికవర్గాలను బజారుకీడ్చే కుతాంత్రాన్ని కూడా ఇప్పుడు మరింత వేగవంతం చేసింది. ఇది పసిగట్టిన రైతాంగం మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహరుద్దుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికసంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. అయినా తాము దేశాన్ని అమ్మేయడానికే కట్టుబడివున్నామని నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ దేశానికి ఉరి బిగించడానికి పాలకులు అమ్ముడు పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఇలా ప్రభుత్వరంగమన్నదే లేకుండా పోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు? అన్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతోపాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతోపాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమరాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగమన్నదేలేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా..?! దేశంలో మేడిపండు స్వాతంత్య్రమే వర్థిల్లు తోంది…! కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడంలో సందేహం లేదు!
సైమ‌న్ గున‌ప‌ర్తి