ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం గొంతు నులమొద్దు

ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47 మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేకపోవడం…ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చుకుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది. – (ఉదయ్‌భాష్కర్‌ రెడ్డి)
మోడీ ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌) గొంతు నులిమేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తూనే వుంది. ఆర్థిక వ్యవస్థ మరింత ‘సమర్ధవంతంగా’, ‘ఉత్పాదకంగా’ పని చేసేలా మార్గనిర్దేశనం చేయాలంటే ప్రైవేటు రంగాన్ని అనుమతించాలని, అందుకుగాను ప్రభుత్వ వ్యయంలో కోత పెట్టాలని నయా ఉదారవాద సిద్ధాంతం పేర్కొంటున్నది. దీనికి కట్టుబడిన మోడీ ప్రభుత్వం క్రమం తప్పకుండా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా వివిధ సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత పెడుతూ వస్తోంది. అంతేకాకుండా పథకాల గొంతు నులిమేందుకు ఇతర మోసపూరిత చర్యలను కూడా చేపడుతోంది.
ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ విషయానికి వస్తే, 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు కేటాయింపులు జరపాలని ప్రతిపాదించబడిరది. కానీ, వాస్తవానికి రూ.89,400 కోట్లు ఖర్చు చేసి వుంటారని అంచనా. అంతకు ముందు సంవత్సరం 2021-22లో ఖర్చు పెట్టిన రూ.98,467.85 కోట్లలో దాదాపు పది శాతం తక్కువ. అయితే 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపులో ఏకంగా 33 శాతం కోత పెట్టారు.
ప్రభుత్వం ఈ పథకానికి కేటాయింపులు తగ్గించడం ఒక్కటే కాదు. పలురకాల కొర్రీలు పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో, ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు తప్పనిసరిగా అటెండెన్స్‌ (హాజరు) నమోదు చేయాలంటూ నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సర్వీస్‌ (ఎన్‌.ఎం.ఎం.ఎస్‌) పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో కార్మికులు తమ హాజరును నమోదు చేయడం కోసమే గంటల తరబడి ప్రయాస పడాల్సి వస్తోంది. హాజరు పడకపోతే, ఆ రోజుకు వారి వేతనం నష్టపోతారు కాబట్టి ఇది వారికి జీవన్మరణ సమస్యగా మారింది. పథకంలో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనడానికంటూ ఈ తరహా హైటెక్‌ చర్యలను కార్మికులపై బలవంతంగా రుద్దడం ప్రభుత్వ కుట్ర మినహా మరొకటి కాదు. పిడిఎస్‌ పంపిణీలో కూడా గతంలో ఇదే పద్ధతిని రుద్దారు. ప్రభుత్వ పాఠశాల టీచర్ల హాజరు విషయంలోనూ ఇలాగే చేశారు. వీటన్నిటివల్లా ప్రజలకు గందరగోళ, విచారకర పర్యవసానాలే కలుగుతున్నాయి. కనెక్టివిటీ సమస్యలతో పాటుగా ఆధార్‌ సరిపోలడం లేదని,బ్యాంక్‌ ఖాతా నెంబరు కలవడం లేదని,చేతి వేళ్ళ గుర్తులు పడడం లేదని, ఇంకా ఇలాగే అనేక సమస్యల కారణంగా పిడిఎస్‌ రేషన్‌ వేలాది మందికి అందకుండా పోయింది. ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు సైతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నిబంధనల కారణంగా కార్మికులు పని కోసం ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ ను ఆశ్రయించడం తగ్గిపోతున్నది.
వేతనాల్లో నిరంతరం జరుగుతున్న జాప్యం కార్మికులకు ఎదురవుతున్న మరో సమస్య. ఒకోసారి అనుమతించిన 15 రోజుల వెసులుబాటును కూడా మించి జాప్యం జరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 15 అంతకుమించి రోజుల జాప్యం తర్వాత రూ.3630 కోట్ల వేతనాలు చెల్లించారు. ఇంకా రూ.1010 కోట్ల వేతనాలు పెండిరగ్‌లో వున్నాయని ప్రభుత్వ డేటా పేర్కొంటోంది. చాలా తక్కువ కూలికి పని చేసే కార్మికులకు ఈ స్థాయిలో ఇలా వేతనాలు పెండిరగ్‌లో పెట్టడమనేది ఏ మాత్రమూ సహించరాని విషయం. దీంతో వారు తరచుగా తక్షణమే డబ్బులు చేతికి అందివచ్చే పనులను ఎంచుకుంటున్నారు. ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాల కన్నా తక్కువే వచ్చినా వారు దానికే మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను 2 నుండి 10 శాతం మధ్య పెంచుతున్నట్లు చాలా అట్టహాసంగా ప్రకటించింది. అంటే రోజుకు రూ.7 నుండి రూ. 26 వరకు పెరుగుతాయి. గత అనేక మాసాలుగా ద్రవ్యోల్బణం 6-8 శాతం మధ్యలో వుంది. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా 8-10 శాతం మధ్య వుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ అధిక ద్రవ్యోల్బణం తగ్గుతుందని విశ్వసించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదు. ఇక కార్మికుల వేతనాల పెంపు అమలు కూడా రాబోయే ఆర్థిక సంవత్సరం నుండే. వాస్త వానికి, వ్యవసాయ కార్మికులకు అలాగే వ్యవసాయేతర కార్మికులకు ప్రస్తుతమున్న వేతనాల రేట్ల కన్నా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాలు చాలా తక్కువగా వున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌ పనులకు సంబంధించి సగటు దినసరి వేతనం కేవలం రూ.217.87. అదే సమయంలో పురుష వ్యవసాయ కార్మికులకు రూ.349.77 అని ఆర్‌బిఐ పేర్కొంది. అలాగే ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేక పోవడం…ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చు కుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది.
అధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పని దొరికిన వారు 8.6 కోట్ల మంది వుండగా, గతేడాది ఈ సంఖ్య 10.6 కోట్లుగా వుంది.అంటే గతేడాది కన్నా 2 కోట్లు (దాదాపు 20శాతం) తగ్గింది. పైగా ఈ పథకంలో పని కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 1.6 కోట్ల మంది కార్మికులు తర్వాత పని లోకి వెళ్లకుండా వెనుదిరిగారు. అలాంటి వారిని పరిగణన లోకి తీసుకోకుండా వేసిన లెక్క ఇది.
తక్కువ వేతనాలు, సరిపడా పని దినాలు లేకపోయినా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ అనేది కోట్లాదిమంది కుటుంబాలకు జీవనాధారంగా వుంది. ఈ పథకంలో ఇచ్చేది అతి తక్కువ వేతనాలే అయినప్పటికీ అవే వారికి ఎంతో విలువైనవి. ఎందుకంటే దేశంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పైగా పెరుగుతున్న ధరలు కుటుంబాల బడ్జెట్‌ను ధ్వంసం చేస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభమనేది ఎడతెగకుండా వుంది. వేతనాలు, పని దినాలు పెంచుతూ, పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ, ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఇప్పుడు నెలకొంది. దీనితో పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటంగా మారిన ఆటకు అంతం పలకాలి.
ఉపాధిపై కుంటిసాకులుయూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఉపాధి హామీ పథకానికి గడచిన ఎనిమిది సంవ త్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పైగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత తగ్గిందంటూ వితండవాదన చేస్తోంది. నిజానికి ఈ పథకం పనులకు గిరాకీ తగ్గి 34 నెలల కనిష్ఠానికి చేరింది. పనులకు గిరాకీ తగ్గడం వల్ల నిరుద్యోగం తగ్గినట్టేనని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనలో లాజిక్‌ ఉన్న మాట నిజమే కానీ, గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగార్థులకు చేతినిండా పని దొరకుతోందా? అలా దొరికితే గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు నగరాలు, పట్టణాలకు ఎందుకు తర లివస్తున్నారు. గతంలోకంటే పట్టణాలు, నగరాలకు గ్రామాల నుంచి వచ్చిన, ఇప్పటికీ వస్తున్న జనాభా పెరు గుతోంది. వీరంతా గ్రామాలలో పనులు దొరకకపోవ డంవల్లనే పట్టణాలు, నగరాలకు తరలివస్తున్నారు. గ్రామాల్లో హుందాగా, గౌరవంగా జీవించే యువత, ముఖ్యంగా ఉద్యోగార్థులు నగరాలు, పట్టణాలలో అమా నవీయ వృత్తులకు సైతం సిద్ధపడుతున్నారు. ఉపాథి హామీ పనులకు గిరాకీ తగ్గిందన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు. గత ఏప్రిల్‌లో 3 కోట్ల 23 లక్షల మంది ఈ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా, జూన్‌లో వారి సంఖ్య 4 కోట్ల 32 లక్షలకు చేరింది. అంతకుముందు రెండు సం వత్సరాలు కరోనా దెబ్బవల్ల ఉపాథి హామీకి గండిపడిన మాట వాస్తవమే. కరోనా తగ్గిన తర్వాత గ్రామాలలో వ్యవసాయ, చేనేత వస్తు కళా రంగాలలో పనులు పుంజు కుంటున్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో పనులు పెరుగుతూండడమే ఇందుకు ఉదాహరణ. గ్రామీణ ఉపాథికి డిమాండ్‌ తగ్గిందనుకుంటే అందుకు కారణం వెంటనే బిల్లులు చెల్లించకపోవడమే. నైపుణ్యం అవసరం లేని పనులలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పాటు పని కల్పించాలి. కానీ 2021-22 సంవత్సరంలో 60.70 రోజులు మాత్రమే పనులు కల్పించారు. నిధుల కేటా యింపును బట్టే పనుల కకేటాయింపు ఉంటుంది. అంటే నిధుల కేటాయింపు తగ్గడం వల్లనే ఇలా జరుగు తోంద న్నమాట. ఈ విషయాన్ని మరుగుపర్చి ఉపాధి కోరేవారి డిమాండ్‌ తగ్గిపోయిందంటే నమ్మడానికి ప్రజలు అంత అమాయకులా? పెద్ద పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన బ్యాంకు రుణాల బకాయిలను వందల కోట్లలో మాఫీ చేసిన, ఇప్పటికీ చేస్తున్న ప్రభుత్వం ఉపాధి పనుల నిధులలో కోత విధించడం ముమ్మాటికీ తప్పే. పైగా ఉపాథి పనులకు గిరాకీ తగ్గిందనడం ఓ కుంటిసాకు మాత్రమే. ఉపాథి హామీ పనులకు 15 రోజుల లోపు నిధు లు విడుదల చేయాలి. కానీ అలా జరగడం లేదు. నిధుల విడుదల అనేది నిరంతర ప్రక్రియ. దానికోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రోజుల తరబడి ఢల్లి%స%లో తిష్టవేసి లాబీయింగ్‌ చేయాల్సి వస్తోంది. అలా చేసినా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కావడం లేదు.
కూలీలకు ‘ఉపాధి’ కష్టాలు
పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వాలు పనులు కల్పిస్తుంది. కాని కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల్లో ఎన్‌ఎంఎంఎస్‌ నూతన సాంకేతకత యాప్‌ ప్రవేశ పెట్టడంతో ఉపాధి కూలీలకు కష్టాలు తప్పడం లేదు. వాస్తవంగా పనులు చేసిన గ్రామం నుండి వేతనదారుల పనులకు సంబంధించి కూలీల హాజరు, ఫోటో తప్పనిసరిగా ఆయా సంఘాల మెట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు యాప్‌ ద్వారా పంపించాలి. సిగల్‌ సమస్య తలెత్తడంతో పాటుగా మేట్లు కొన్ని సందర్భాల్లో తప్పుడు నివేదిక ఇవ్వడంతో ఈ యాప్‌ ద్వారా ఎన్నో గ్రామాల్లో పనులు చేస్తున్న కూలీలు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేసినప్పటికీ బ్యాంకు ఖాతాలో కూలి జమ కాలేదని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 ముందు వేతనదారులకు తాగునీటి అలవెన్స్‌, టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అప్పటి ప్రభుత్వాలు అందించేవని, గత ఏడాది నుంచి ఎంఎంఎస్‌ యాప్‌ కొత్త విధానం రావడంతో ఉపాధి కూలీలకు పనులు వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవని కూలీలు వాపోతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలు మండల, డివిజన్‌, జిల్లా కేంద్రాలకు స్పందనలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ యాప్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.. దీంతో ఉపాధి కూలి అందక వేతన దారులు లబోదిబోమం టున్నారు.
సుదీర్ఘకాల డిమాండ్‌
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ కల్పించే చట్టం చేయాలని సుదీర్ఘకాలం పాటు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. మధ్యలో పనికి ఆహార పథకం వంటి కార్యక్రమాలు కొంత మేరకు అమలు చేశారు. చివరకు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2005లో పార్లమెంటులో చట్టం రూపొందించి 2006 నుంచి అమలు ప్రారంభించారు. ఆ సంవత్సరం ఫిబ్రవరి నుంచి దేశంలో వెనకబడిన 200 జిల్లాల్లో మొదట అమలు చేశారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే కరువు సమస్యతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా బండ్లపల్లి వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. స్థానికుల రాగి సంకటి ఆరగించి సంతృప్తి వ్యక్తం చేయడం అందరినీ ఆకట్టుకుంది.