ఎటు చూసినా నిరసనలే..

రాష్ట్రం ఇప్పుడు ఉద్యమాంధ్రగా మారింది. ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా వర్కర్లు, ఇంకోవైపు మున్సిపల్‌ కార్మికులు జగన్‌ సర్కారుపై ధ్వజమెత్తుతున్నారు. సమస్య లు పరిష్కరించాలంటూ ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ముందు జగన్‌ గొప్పగా ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ… వాటిని నిలబెట్టుకోవాలంటూ నాలుగు రోజులుగా అంగన్వాడీలు సమ్మె బాట పట్టారు. సమస్యల పరిష్కారం కోసం 36 గంటల దీక్ష చేసిన ఆశావర్కర్లు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మున్సిపల్‌, పారిశుధ్య కార్మిక సంఘాలు తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 27 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే హెచ్చరించాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షమంది అంగన్వాడీలు సమ్మెబాట పట్టడంతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలు తెరిపించి బెదిరింపులకు పాల్పడినా అంగన్వాడీలు వెనక్కి తగ్గడం లేదు. చాలా చోట్ల అంగన్వాడీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపడంలేదు. ఇక ఆశావర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నాలుగున్నరేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌, పారిశుధ్య కార్మికుల గోడునూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జగన్‌ ఉద్యోగులనే గాక తమనూ మోసం చేశారని ప్రభుత్వ రంగ కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల నుంచి క్రమబద్ధీకరణ వరకూ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగులు హక్కుల కోసం ఆందోళన బాట పడితే ప్రభుత్వం కేసులతో భయపెట్టేది. నాలుగున్నరేళ్లుగా విసిగిపోయిన కార్మికులు, ఉద్యోగులు కేసులకు భయపడకుండా సమ్మె బాట పడుతున్నారు.
అక్కాచెల్లెమ్మల ఆక్రోశం
‘బటన్‌’ నొక్కుడు అయినా, బహిరంగ సభ అయినా సీఎం జగన్‌.. ‘నా అక్కాచెల్లెమ్మలు’ అని సంబోధిస్తుంటారు. అయితే వారి సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరీ మాట తప్పారంటూ అంగన్వాడీ సిబ్బంది ఆక్రోశిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మరోవైపు తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఇప్పటికే ధర్నాలు, నిరసనలు చేపట్టిన ఆశావర్కర్లు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జగనన్నా.. మాటిచ్చి మరిచారే?

తాను అధికారంలోకి వస్తే తెలంగాణలో కంటే అంగన్వాడీ వర్కర్లకు రూ.1000 ఎక్కువ జీతం ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు రూ.13,650 ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.11,500 మాత్రమే ఇస్తున్నారు. ఎన్నికల హామీ ఏమైంది జగనన్నా అంటూ అంగన్వాడీ సిబ్బంది మండిపడుతున్నారు.
కార్మికుల కష్టాలు
మున్సిపల్‌, పారిశు?ధ్య కార్మికులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు. జీతాలు పెంపు, ఇతర ప్రయోజనాలు, క్రమబద్ధీకరణ కోసం నాలుగున్నరేళ్లుగా ఎన్నోసార్లు నిరసనలు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
మా గోడు వినండి
సీఎం మానసపుత్రికగా చెప్పుకొనే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. దాదాపు 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో శాఖకు సంబంధించిన ఒక్కో రకమైన సమస్య ఉన్నా ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదు. సరెండర్‌ లీవ్‌లు ఎన్‌క్యాష చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. తమకు ‘ఖాకీ’ వద్దని మొత్తుకుంటున్నా సచివాలయ ఉద్యోగులను మహిళా పోలీసులుగా మార్చారు. దీంతో వారు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పనిభారం తీవ్రమైందంటూ డిజిటల్‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖలో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లు, సచివాలయాల ద్వారా నియమితులైన ఏఎన్‌ఎంలు, ఇతర శాఖల ఉద్యోగులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.అంగన్వాడీలు మొత్తం సిబ్బంది: దాదాపు లక్ష మంది జగన్‌ హామీ ఇదీఅంగన్వాడీ సిబ్బందికి తెలంగాణలో ఇస్తున్న జీతాల కంటే కనీసం రూ.1000 ఎక్కువగా ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ
తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు రూ.13, 650, హెల్పర్లకు రూ.7,800, మినీ వర్కర్లకు రూ.7,800 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500 హెల్పర్లకు రూ.7,000, మినీ వర్కర్లకు రూ.7000 ఇస్తున్నారు. జగన్‌ సర్కారు వచ్చాక అంగన్వాడీలకు రూ.1000 పెంచి చేతులు దులుపుకొంది. ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచలేదు. జీతాలు పెంచాలని అంగన్వాడీ సిబ్బంది అనేకసార్లు వినతులు ఇచ్చారు. రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అయినా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా… వారి కుటుం బ సభ్యులకు సంక్షేమ పథకాలు కట్‌ చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు.
అంగన్వాడీల డిమాండ్లు
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలి.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి.
రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలి. ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వాలి.
చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యో గం ఇవ్వాలి.
మిని సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి.
ఉపాధి సిబ్బందికి ‘హామీ’ ఏదీ?
గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే సెర్ప్‌ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయగా, ఉపాధి హామీ పథకం సిబ్బందికి మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. అంతేగాక ఉపాధి సిబ్బందికి రిటైర్మెంట్‌ వయో పరిమితి పెంచలేదు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్‌, ఔట్‌సో ర్సింగ్‌ ఉద్యోగులు అన్ని శాఖల్లో అరకొర జీతాలతో పనిచేస్తున్నారు. జగన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత వేతనాలు పెంచలేదు.పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేస్తా మన్న హామీని కొందరికే పరిమితం చేశారు. దీంతో లక్షల మంది సిబ్బంది లబోదిబో మంటున్నారు. ప్రభుత్వంపై గళమెత్తితే ఉద్యో గాలు పోతాయన్న భయంతో కొందరు ఉండ గా, మరి కొందరు ఏదో ఒక రూపంలో నిరస నలు తెలియజేస్తున్నారు. మున్సిపల్‌ కార్మికులు మొత్తం సిబ్బంది: 65 వేల మంది సమస్యలు పట్టని సర్కారు మున్సిపల్‌, పారిశుధ్య కార్మికు ల సమస్యలు పరిష్కరించడంలో జగన్‌ సర్కార్‌ విఫల మైంది. జీతాలు పెంచాలని, క్రమబ ద్ధీకరణ చేయాలని నాలుగున్నరేళ్లుగా ఎన్నో సార్లు కార్మికులు వినతులు ఇచ్చినా, నిరసనలు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్‌ 27 నుంచి సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. మున్సిపల్‌ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ(జేఏసీ) కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
కార్మికుల డిమాండ్లు ఇవీ
8 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజేషన్‌ చేయాలి. అప్పటి వరకు కనీస వేతనంగా రూ.20 వేలు, బేసిక్‌, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిపి ఇవ్వాలి. జీవో నంబరు 308ను సవరించి స్కిల్‌, అన్‌స్కిల్డ్‌ వారీగా సూపర్‌వైజర్ల వేతనాలు చెల్లించాలి. టైమ్‌ స్కేల్‌తో పాటు ఉద్యోగ, కార్మికులను రెగ్యులరైజేషన్‌ చేస్తూ 1992లో ఇచ్చిన జీవో 212ను సవరించాలి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వర్కర్లు మరణించినా, ప్రమాదాల బారిన పడినా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.పర్మినెంట్‌ కార్మికులకు జీపీఎఫ్‌ ఖాతాలు తెరవాలి. హెల్త్‌కార్డులు ఇవ్వాలి. ఆశావర్కర్లు మొత్తం సిబ్బంది: 42 వేలమంది నిరసనలు చేపట్టినా… జగన్‌ సర్కార్‌లో ఆశావర్కర్లకూ అన్యాయం జరిగింది. సమస్యల సాధన కోసం ఎన్నోసార్లు నిరసనలు తెలిపారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. తమకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తు న్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళ నలను ఉధృతం చేస్తామని ఆశావర్కర్లు హెచ్చరిస్తున్నారు.
ఇవీ డిమాండ్లు
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలి. పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలి. చనిపోయిన ఆశావర్కర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలి.-సైమన్