ఊరు ఉండమంటున్నది.. గోదారి పొమ్మంటున్నది…!
ఊరు ఉండమంటున్నది,గోదారి పొమ్మం టున్నది. ఊరు ఏరు రెండు ఉనికిని ఇచ్చేవే. కానీ రెండూ ఇపుడు వేలాది మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ఊరు మునిగి పోయింది, గోదావరి వరదై ముంచేసింది. ఇది మనసును ముల్లులా గుచ్చే సమస్య. చిత్రమయిన సమస్య. పోలవరం ప్రాజక్టు నిర్వాసితులు ఎదుర్కొం టున్న హృదయ విదారకమయిన సమస్య. కొన్ని వేల మంది ప్రజలు పోలవరం ప్రాజక్టు వల్ల నిర్వాసితుల య్యారు. వాళ్ల పునరావాసం మాత్రం జరగడం లేదు. వాళ్ల కోసం కొన్ని పునరావాస కాలనీలు కట్టారు. లెక్క ప్రకారం వాళ్లు ప్రాజక్టు ముంపునకు గురవుతున్న గ్రామాలు వదిలేసి, ఈ పునరావాలస కాలనీలలో స్థిరపడాలి.ఇది చెప్పుకునేందుకు చక్కటి మాట. అయితే,ఈ వేలాది మంది ప్రజలు.ఊ .ర్లొదలడానికి సిద్ధంగా లేరు. వరద ముంచుకొస్తున్నది. అధికారులు ఊర్లలోకి వచ్చి వెంటనే ఖాళీచేయండని హెచ్చరి స్తున్నారు.
అయినా వాళ్లు పునరావాస కాలనీలకు వెళ్లడంలేదు. కాదు,వెళ్లేందుకు భయపడు తున్నారు. ఎందు కంటే,ఈ పునరావాస కాలనీలో ఎలాంటి వసతులు.నీళ్లు లేవు.రోడ్లు లేవు.బతకు దెరువుకు చాలాదూరం. అందుకే పునరావసం బతుకుదెరువు చూపడానికి బదులు ఛిద్రం చేసే పరిస్థితి ఏలూరు జిల్లా పోలవరం ముంపు ప్రాంతాలలో ఎదురవుతూ ఉంది. అందుకే ప్రజలు ఈ తమ ఊర్లలోనే ఉండి పోతున్నారు. పాత ఊరు తల్లి లాగా ఇంకా అక్కున చేర్చు కుంటూనే ఉంది. ఎంత వరకు గోదారి వరదగా వచ్చి పొమ్మనే దాకా.‘‘వరద రాదు,మీరు ఇక్కడే ఉండండి,’’ అంటుంది వూరు. ‘‘వరద వస్తుంది, మీరు వెళ్లిపొండి,’’ అంటుంది గోదావరి.వరద నీరు ఊర్లోకి రాదనే నమ్మకంతో ఇక్కడి ప్రజలు చివరి క్షణం దాకా ఉత్కంఠతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదరుచూస్తుంటారు. వరద రావడం మొదలవుతుంది. అధికారులు వెళ్లిపోండి అంటుంటారు.‘‘ఎక్కడికి వెళతారు,పునరావాస కాలనీలలో ఏముందని వెళతారు? ఇక్కడే ఉం డండి,’’ అని ఊరు బతిమాలుతుంది.
ఇలా ఊరినే నమ్ముకుని చివరిక్షణం వరకు ఉంటారు. ఊర్లలోకి నీరు ప్రవేశిస్తుంది. మెల్లి మెల్లిగా ఊరిని గోదారి వరద అక్రమి స్తుంది. ఇళ్లలోకి నీళ్లొస్తాయి. ఇంకా ఆశ చావదు. వరద తగ్గుతుందేమోననే అశ కాదు,అత్యాశ. గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఇళ్లు మునిగే పరిస్థి వస్తుంది. అపుడు మం చాలు, కంచాలు, మోసుకుని హడా విడిగా పారిపోతారు.
ఎక్కడికి పోవాలి?
ప్రభువులు కట్టించిన పునరావాసల కాలనీలకు కాదు,కొండల్లోకి,గుట్టల్లోకి. ఆపునరావస కాలనీల కంటే కొండల్లో గుట్టలో గుడిసో గుడారమో వేసుకుని జీవించడానికి వీళ్లు ఇష్టపడతారు. అంటే వీళ్ల జీవనశైలికి ఏమాత్రం ఈ పునరావాల కాలనీలు అనుకూలంగా లేవనే కదా అర్థం. ప్రాజక్టుకు భూములను, ఊర్లను త్యాగం చేసిన వాళ్లమీద ఎవరికీ శ్రద్ధలే దెందుకు? ఇది కొత్త ప్రశ్న కాదు.భారీ ప్రాజ క్టులు కట్టిన ప్రతిచోట నోరు లేని,రాజకీయ అండ లేని పేదవాళ్ల పరిస్థితి భూమండల మంతా ఇంతే. హామీలతో కళ్లు కప్పి, కట్టు కథలతో కడుపు నింపి వీళ్లని కూకటి వేర్లతో పెకలిస్తారు. ఒక ఊరు పోయిందంటే ఒక లైబ్రరీ మూత పడినట్లు లెక్క. ఊరంటే కేవలం ఇళ్లూ ప్రజలే కాదు.సంస్కృతి.ఊరి చుట్టూ కమ్మటి కథలుంటాయి. జ్ఞాపకాల మేఘాలు ఎగురుతుంటాయి. ఊర్లో ప్రతిమనిషి అను భవాల గనిలా లోతుగా ఉంటాడు.ఇక్కడి చెట్లకే కాదు, కటుంబాలకు వేర్లుంటాయి. అవి ఊర్లో చాలా లోతుకు పాతుకుపోయి ఉంటాయి.ఊరొ దిలి రావాలంటే ప్రాణంఊసూరు మం టుంది..భూమిని,అడవిని,ఏటిని నమ్ముకున్న ప్రతివాడికి. దేశం కోసం ప్రాజక్టు కడుతున్నాం. దేశం పచ్చబడుతుంది, బంగారు మయం అవు తుందని చెప్పి ఈఊర్లతో ఉన్న బంధానికి కసకసా కోసి మనుషిని నిర్వాసితులను చేసి, పునరావాస కాలనీలకు తరిమేస్తుంటారు. చాలా సార్లు బలవంతంగా ఊర్లను ఖాళీ చేయిస్తారు నిర్వాసితులూ అయిష్టంగా వెళ్తూ ఉంటారు. ఈ పోలవరం నిర్వాసితుల్లో చాలా మంది మాత్రం పునరావాస కాలనీలకు వెళ్లడానికి సుముఖంగా లేరు. అయితే, మరొక విచిత్రం జరిగింది. ఈ పునరావాసకాలనీలుకూడా ఈ సారి వరదల్లో మునిగి పోయాయి. ముంపు ప్రమాదం ఉన్న చోటే ముంపు గ్రామాల ప్రజ లకు కాలనీలు కట్టించారని ఇపుడు అర్థ మవు తుంది. ఇది వరద బెడద వుండే ఈ కాలనీలు పునరావాసానికి ఎలా పనికొస్తాయని చాలా మంది అడుగు తున్నారు. ఏలూరు జిల్లా కూకు నూరు మండలం కివ్వాక లో కట్టించిన పునరా వాస కాలనీది.సమస్యని నలుగురికి తెలి సేలా చేయమని కొంతమంది కోరారు. అందుకే ఈ సారినేను పోలవరం నిర్వాసితుల పక్షాన నిలబడతున్నాను. ఇక్కడి ప్రజలతో మాట్లాడేం దుకు చాలా కష్టపడ్డాను. చాలా చోట్ల వాళ్లకి కరెంటు అందుబాటులో లేదు. మొబైల్ ఫోన్ దినాలుగా చార్జింగ్ కాలేదు. అతికష్టం మీద జంగారెడ్డి గూడెంలో ఉండే ఒక్క అడ్వకేట్ నంబర్ సంపాదించాను. నిర్వాసితులు హక్కుల కోసం పోరాడుతున్న ఈ న్యాయవాది పేరు జువ్వాలబాబ్జీ. ఆయన ద్వారా చాలా విష యాలు తెలిశాయి. కొందరు బాధితులతో మాట్లాడ గలిగాను. వాళ్లు రోధించారు. ఎవరికయినా కష్టాలు ఒక సారి రెండు సార్లు రావాలి, పోవాలి. కానీవాళ్ల జీవితం అక్షరాలా కష్టాల కడలిలో పడిపోయింది.ఉన్న నీడ పోయి దశబ్దాలవుతున్నా నిలువ నీడ దొరకడం లేదు. దీని బాబ్జీ ఏంచేప్పారంటే…‘‘ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంవత్సరాల పాటు కాయ కష్టం చేసి, రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇండ్లు నీటముని గాయి. అదొక్కటే అయితే ఫర్వాలేదు కానీ ఇంటి సామాన్లు, మంచాలు, కంచాలు, కుర్చీలు, ఫ్యాన్లు, మోటార్ సైకిళ్ళు,బ్యాంకు రుణం మీద కొన్న ట్రాక్టర్ లు..చాలా కోల్పోయారు.ఎవరి నోట విన్నా మా ఇంటి సామానులు అక్కడే వదిలి కట్టు బట్టలు,దుప్పట్లు పట్టు కొని పిల్లా పాప లతో ఇక్కడకు పరిగెత్తు కుంటే వచ్చినమని వాపోతున్నారు. సుమారు 250 గ్రామాలూ మునిగిపోయాయి. మండలాల వారీగా పోల వరంలో19,కుకునూరు 73,వేలేరు పాడు 36, చింతూరు 24,ఎటపాక 40,కూనవరం 78, వరా రామచంద్రా పురం 73పూర్తిగా ముని గాయి.ప్రభుత్వం నుండి నాలుగు రోజులు పాటు ఏ విధమైన సహాయం అందక,తిండికి దూరమై, నిద్ర కరువై ఉన్నారు. కనీసం గుక్కెడు నీళ్ళు కూడాతాగటానికి (అంతా కలుషిత నీరు) దొరక లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. గుట్టల పై గుడారాలు వేసుకుని ఉన్న వారికి,వంట చేసి పిల్లలకు పెట్టాలంటే, కిరోసిన్ లేదు,తడిసిన కట్టె పుల్లలు. రాత్రి పూట కరెంట్ లేదు, కటిక చీకటి, పడుకుంటే,పామే వస్తుందో …తేలు వస్తుందో తెలియని భయం,తెల్లారక ఎవరైనా బోటు వేసుకుని ఇటురాక పోతారా అని ఆశగా ఎదురు చూపులు.సెల్ ఫోన్లు పని చేయవు. నిర్వాసితులు నిజంగా నరకం అనుభ వించారు. మేము దాచారం గ్రామంలో ఉన్న భాధితుల వద్దకు వెళ్ళి కొంత మందికి భోజన పదార్ధాలు అందించాము. ఆ సమయంలో ఆ ప్యాకెట్ లకోసం ఎగబడిన వారిని చూసినప్పుడు నాకు దుఖం వచ్చింది. వారిలో కొందరు రైతులు ఉన్నారు, ఎందరికో అన్నం పెట్టే ఉం టారు. కొందరు పేదలు ఉన్నారు, కానీ కష్ట పడి బతుకు తుంటారు. అడుక్కు నే వారైతే కాదు.అందరూ ఆత్మ గౌరవంతో బ్రతికే వారు.కానీ ఆరోజు వారు భోజనం కోసం ఎదు రు చూస్తూ ఉండిన తీరు చాలా బాధాకరం.’’ ఇంకా చాలా మంది,నిర్వాసితుల కోసం కట్టిన కివ్వాక, మర్రిపాడు, వెంకటాపురం,దాచారం వరదనీటిలో ఉన్న పునరావాస కాలనీలలో వానకు జడిసి తలదాచుకున్నారు. వారిలో చలికి తట్టుకో లేని,ముసలి వారు,చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారు. కొన్ని సంస్థలు,సంఘాలు ప్రజల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. ‘‘ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి.కుకునూరు మండల కేంద్రం ఎత్తులో వుంటుంది కదా అని ఆ గ్రామ ప్రజలు మన ఊరు మునగదని ధీమా తో ఉన్నారు.రాత్రి పూట చడీ చప్పుడూ లేకుండా గ్రామం అంతా తెల్ల వారే సరికి నీటి మయమైంది. అప్పుడు ఆరాత్రిలో గ్రామ ప్రజలు సొంతంగా ప్రక్క గ్రామాల నుంచి ట్రాక్టర్లు (తెలంగాణా గ్రామాలు సరిహద్దు లో ఉన్నాయి) తెప్పించి కొంత మందిని సురక్షిత ప్రాంతాల కు తరలించారు. రెవెన్యూ అధికారు లు కేవలం7ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. లేదం టే చాలా ప్రాణనష్టం జరిగేది. ఎందుకిలా జరిగింది ?
ఇలా చేయడం వల్ల పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు వరద కష్టాల బారిన పడితేనే రేపు వారికై వారే పునరావాస కాలనీలకు వెళతారనే ప్లాన్ ఇందులో ఉందని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం వైపున తప్పు లేదని ఇది ప్రకృతి వైపరీత్యం అనీ, ఎవరూ ఏమీ చేయలేరు అని అధికారులు చెబుతున్నారు. 1986 వచ్చిన గోదావరి వరదల కుఇప్పటి వదరలకు పొంతన లేదు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాక ముందు ఎప్పుడు వరదలు వచ్చినా అవి కొన్నిరోజులుపాటు ఉండి తర్వాత దిగువకు నీరు వెళ్ళేది. ఇప్పుడు అలా జరగ లేదు,కాఫర్ డామ్ నిర్మాణం వలన నీళ్లు నిలిచి బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి దూసుకువస్తున్నది. అక్కడే నిలిచి పోతున్నది.తప్పెవరిదెయినా, ఇది మానవ తప్పిదమయినా,ప్రకృతి వైపరీత్యామ యిన,ఈ బ్యాక్ వాటర్‌వల్ల వచ్చే ముంపు ఇప్పట్లో పోయే పరిస్థితి లేదేమో నని ఇక్కడి ప్రజల్లో అందోళన ఉంది.చిన్నపిల్లలు చదువు కు దూరమయ్యారు. సర్వం మునిగిపోయాయి. పిల్లల బుక్స్,బట్టలను కూడా వదిలేసి వచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా జాప్యం అవుతుంది. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను కేంద్రం పొడిగించిందని న్యాయ వాది బాబ్జీ చెప్పారు.అంటే,ఈ కష్టాకా లం ఇప్పట్లో ముగింపు లేదన్నమాట.1986లో లాగానే వరద నీరు వస్తుందని ఎవరూ అనుకో లేదు. కానీ ఎంత వరద వచ్చిందంటే,ఈ విపరీ తం వెనక విదేశీ హస్తం ఉందేమో అనే అను మానాలను కూడా పెద్ద వాళ్లు వ్యక్తం చేశారు. ముందు ముందు ఇంత కంటే ఎక్కువ కూడా రావచ్చు.రాదనే గ్యారంటీ లేదు. ప్రాజెక్ట్ నిర్మా ణం పూర్తయితే,నీరునిలిచి బ్యాక్ వాటర్ వస్తుం ది..పెరుగుతుంది.పునరావాస కాలనీలను ముం చేస్తుంది.ఈ కోణం నుంచి కూడా సమస్యకు పరిష్కారం కనుగొనాలి.పునరావాస కాలనీల కంటే భయపడిపోయి, మునిగిపోయినా పర్వా లేదు,మేము మాఊర్లోనే ఉంటామని పరిస్థితి ఎందుకొస్తున్నదో గమనించిచర్యలు తీసుకోవాలని న్యాయవాది బాబ్జీ కోరుతున్నారు.
వ్యాసకర్త :- (న్యాయవాది జువ్వాల బాబ్జీ,జంగారెడ్డి గూడెంకి ధన్యవాదాలు)