ఉద్దానం ప్రజల కల..నెరవేరిన వేళ..
ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని సము ద్రపు ఒడ్డునున్న కళింగపట్నంలో మహిళల ఆవేదన. తరచుగా మీడియావాళ్లు ఈ గ్రామా న్ని సందర్శిస్తుండటంతో వారి స్పందన ఇది.
ఉద్దానం అంటే ఉద్యానవనం!
పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం ఒక వైపున సముద్ర తీరం, మరో పక్క కొబ్బరి, జీడి మామిడి, పనస, మామిడి తోటలు, మరో వైపున నాగావళి, వంశధార, మహేంద్ర తనయ వంటి జీవ నదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉండ టంతో ఈ ప్రాంతా నికి ఉద్దానం అనే పేరొచ్చింది.అయితే ఆకుపచ్చని ఉద్దానం, ఇప్పుడు కిడ్నీ వ్యాధు లతో వణికిపోతోంది. అంతుపట్టని సమస్య లతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడు తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండ లాలను కలిపి ఉద్దానం ప్రాంతం గా పిలుస్తారు.ఈ ప్రాంతంలోని సోంపేట, కవిటి, కుసుంపురం, కుత్తుమ, కళింగ పట్నం సహా ఏ గ్రామానికి వెళ్లినా, ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతు న్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకో వచ్చు.ప్రభుత్వ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలలో ఇప్పటి వరకు 15,623 మంది ఇలా తీవ్రమైన కిడ్నీ జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13, 093 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం: సీఎం జగన్
‘ఉద్దానం అంటే ఉద్యానాలవనం అటువంటి ఈ పచ్చని ప్రాంతాన్ని కిడ్నీ మహమ్మారి రూపంలో ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది.ఈ పరిస్థితిని నా పాదయాత్రలో కళ్లారా చూశా.‘‘నేను చూశాను. నేను విన్నాను. నేను ఉన్నాను’’ అన్న మాట నాకు గుర్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 200 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు గర్వపడు తున్నా.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉద్దా నం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం రూ.85 కోట్లతో నిర్మించిన డా. వైఎ స్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, రూ.700 కోట్ల ఖర్చుతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టను సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం జగన్ మాట్లా డుతూ ఉద్దానం ప్రాంతంలో ఈ సమ స్య ఉందని తెలిసినా గతంలో ఏ పాల కుడూ ఆలోచన చేయని సమస్యను రూ.785 కోట్లు ఖర్చు చేసి పరిష్కరిం చామని పేర్కొన్నారు.
కిడ్నీ బాధితులకు నిరంతర వైద్యసహాయం
ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి మెరుగైన వైద్యం అందుతోం దని సీఎం జగన్ గుర్తు చేశారు. వైఎస్సార్ కిడ్సీ రీసెర్చ్ సెంటర్లో ఫిబ్రవరి నాటికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేసి దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్ కోసం అన్ని విభాగాలతో పాటు డయాలసిస్ సెంటర్లు, ఆపరేషన్ థియేటర్లు మెరుగైన ప్రమాణాలతో ఏర్పాటు చేశామని, ఇక మీ ఆరోగ్య అవసరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఈ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు మొదలు ఇతర సిబ్బంది 375 మంది ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిం చనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కిడ్నీ వ్యాధు లను గుర్తించేందుకు ఏడు మండలాల్లో స్క్రీనింగ్ చేయిస్తామని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన 37 రకాల ఔషదాలను స్థానికంగా ఉన్న అన్ని పీహెచ్ సీల మొదలు, రీసెర్చ్ సెంటర్ వరకు అందు బాటులో ఉంచి ప్రతి పేదవాడికి ఉచితంగా ఇంటి వద్దకే అందిస్తామని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మందుల అందజేత కొనసాగుతుందంటూ భరోసా ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2,500గా ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్ ను ఏకంగా రూ. 10,000 వేలకు పెంచామన్నారు. గత ప్రభుత్వంలో కిడ్నీ పేషెంట్ల కింద పెన్షన్ అందుకున్న వాళ్లు 3,076 మంది ఉండగా వారి కోసం గత ప్రభుత్వం నెలకు కేవలం రూ.76లక్షలు ఖర్చు చేసేవాళ్లని, మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా 13,140 మందిని పెన్షన్ల జాబితాలో చేర్చా మని కేవలం పెన్షన్ల కోసమే నెలకు రూ.12. 54 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రజలకు వివరించారు. ఉద్ధానంలో అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో మన ప్రభు త్వం కేంద్ర సంస్థలు ఐసీఎంఆర్‌తో కలిసి సమగ్ర ఆధ్యయనం చేసిందని వివరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఎక్కువ ఉన్న వారిని గుర్తించి మెరుగైన ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హార్వర్డ్, నార్త్ కరోలినా యూనివర్సిటీతో మన ప్రభుత్వం ఈ అంశంపై కలిసి పనిచేసిందన్నారు. ఇలాంటి సమస్యే ఉన్న మార్కాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ స్థాపించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం నెఫ్రాలజీ, యూరాలజీ విభాగా లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నా కమిట్మెంట్ ఇదీ..
ఉద్దానం కిడ్నీ సమస్య శాశ్విత పరిష్కారం కోసం ఏ నాయకుడూ ఊహించని విధంగా రూ.700 కోట్లు ఖర్చు చేసి హీరమండలం రిజర్వాయర్ నుంచి 130 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించామని సీఎం జగన్ అన్నారు. ఇదీ తమకున్న కమిట్మెంట్ అని పేర్కొన్నారు. 7 మండలాల్లోని 807 గ్రామాలకు సురక్షిత నీరు అందించే వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు ద్వారా సురక్షిత నీరు అందిస్తున్నట్లు తెలిపారు. రెండో దశ కింద ప్రాజెక్టు ద్వారా మరిన్ని గ్రామాలకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కూడా ఉద్దానం సమస్య ఉండేదని. కానీ సమస్య పరిష్కారం మాత్రం ఈ ప్రభుత్వంలో జరిగిందని గుర్తుంచుకోవాలని విజ్ణప్తి చేశారు. చంద్ర బాబుకు పేదల ప్రాణాలంటే లెక్కేలేదని విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లివ్వలేదన్నారు.
పొత్తులు, ఎత్తులు, చిత్తులు, కుయుక్తులు మాత్రమే..14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్ర బాబు తన వల్ల ప్రజలకు జరిగిన మంచి ఇది అని చెప్పుకునే ఒక్క పథకమైనా.. పనైనా ఉందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఇలాంటి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి పొత్తుల మీద, ఎత్తుల మీద, చిత్తుల మీద, కుయుక్తుల మీద ఆధారపడతారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు కలిసి పొత్తు లతో సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఉద్దానం కిడ్నీ సమస్య ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. విశాఖను పరిపాలనా రాజ ధానిగా చేస్తామని మీ బిడ్డ అంటూ ప్రతి పక్షంలో ఉంటూనే అడ్డుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో ఓబిల్డింగ్ కట్టినా, అభివృద్ధి చేసినా.. సీఎంగా ఇక్కడే వచ్చి ఉంటానన్నా మెడికల్ కాలేజీలు, పోర్టులు,ఎయిర్ పోర్టులు కడతామంటే ఏడుస్తారని విమర్శించారు. పక్క రాష్ట్ర నాన్ లోకల్స్ మన సీఎం ఏం చేయాలి, మన రాజధాని ఎక్కడ ఉండాలో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.
కదిలిస్తే కన్నీళ్లే…
‘’అయిదేళ్లుగా నేను,నా భర్త సీతారాం కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాం. ఏడాది క్రితం ఆ జబ్బు ముదిరి ఆయన మాకు దూరమయ్యాడు. ఇపుడు నా కొడుకే కూలీ పనులు చేస్తూ నన్ను పోషిస్తున్నాడు. మందులకు నెలకు రూ. రెండు వేలకు పైగా ఖర్చవుతుంది. వాటికోసం అప్పులు చేయాల్సి వస్తోంది’’ అంటూ దీనంగా చెప్పారు కుసుంపురం గ్రామానికి చెందిన బత్తిన మాలక్ష్మి.
‘’ఏడాది నుంచి ఈ రోగంతో కుదేలయిపోతున్నాను. కొడుకు తప్ప మాకు ఏ దిక్కూ లేదు. సముద్రంపై వేటకు వెళ్లి నాలుగు డబ్బులు తెచ్చేవాడు. ఈ మధ్య యాక్సిడెంట్‌లో చేయి కోల్పోయి వాడు మూలనపడ్డాడు. ఇపుడు మందులు కొనుక్కునే స్తోమత లేదు, ఎవరూ ఆదుకునే దిక్కులేదు’’ అంటూ కళింగపట్నంకు చెందిన శివకోటి దానమ్మ విలపించారు. ఇదే గ్రామానికి చెందిన ఈగ కోమలమ్మ మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కూలీనాలీ చేసుకొని బతుకుతూ, సగం ఆదాయం డాక్టర్ల చుట్టూ తిరగడానికే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
డాక్టర్లు బలవర్ధకమైన ఆహారం, క్రమం తప్పకుండా మందులు వాడమన్నారు. కానీ ఆర్థిక స్తోమతలేక డబ్బులున్నపుడే మందులు వాడుతున్నారు కోమలమ్మ. సోంపేటలో కర్రి గణపతి, కాసమ్మ, కవిటిలో అర్జి శశి, తెప్పల తులసమ్మ, కంచిలిలో నారాయణ…ఇలా ఎవరిని కదిలించినా హృదయాన్ని పిండేసే దీన గాథలే వినిపిస్తాయి.పేదరికం కారణంగా కొందరు ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ గుర్తించిన ప్పటికీ నాటు వైద్యుల వద్దకు వెళ్లి, తాత్కాలి కంగా నొప్పి నివారణకు మందులు వేసుకో వడంతో ఈ జబ్బు మరింత తీవ్రమైపో తోంది.ఆ సమస్య ఏమిటో.. అది ఎందు కొచ్చిందో వీళ్లకే కాదు, పరిశోధకులకు, ప్రభుత్వాలకు కూడా అంతుపట్టడం లేదు.
సామాజిక కోణం
ఉద్దానం ప్రాంతంలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేవు. డయాలసిస్ చేయించుకునే రోగికి మరొకరు తోడు ఉం డాలి. రోజుకూలీతో పొట్ట నింపుకునే పేదలకి అది పెద్ద భారమే. ఈ కారణంగా డయా లసిస్ వాయిదా వేసుకునేవారు, మందుల ఖర్చు భరించలేక క్రమ పద్ధతిలో వాడనివారు అనేకమంది ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో తక్షణం వ్యాధి లక్షణాలు తగ్గితే చాలు అనుకుంటారు. పైపెచ్చు నాటు వైద్యులు మిడిమిడి జ్ఞానంతో ఇచ్చే మందులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ సంబంధాలపై ‘ఉద్దానం సమస్య’ ప్రభావం తీవ్రంగా ఉంది.‘’కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చాక మా ప్రాంతపు వారితో చుట్టరికం కలుపుకోవడానికి వెనకాడుతున్నారు. కొబ్బరి, మామిడి పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు’’ అని కుత్తుమ(కంచిలి మండలం) రైతులు చెప్పారు.
ఒక్క గ్రామంలో 500 రోగులు
కవిటి మండలం, కుసుంపురం గ్రామం కొబ్బరి, జీడిమామిడి తోటలతో పచ్చగా ఉం టుంది. కానీ ఇక్కడి మనుషుల్లో ‘జీవం’ కనిపించదు. ఈ గ్రామంలోకి అడుగు పెట్టిన మమ్మల్ని కిడ్నీబాధితులంతా చుట్టుముట్టారు.
‘’మా ఊరి జనాభా 4 వేలు. ఐదొందలకు పైగా కిడ్నీ రోగులున్నారు. అపుడపుడు అధికారులు వచ్చి మా వివరాలు అడిగి పోతుంటారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. అందరం ఉపాధి హామీ పనుల మీద ఆధారపడి బతుకుతున్నాం. కిడ్నీ సమస్యలున్న మాకు ఉపాధి కూలీ రెట్టింపు చేస్తే, మందులు కొనుక్కొని ప్రాణాలు నిలుపు కుంటాం’’ అని అన్నారు డ్వాక్రా పొదుపు సంఘం నాయకురాలు సిందుల ఇంధిర.
సమస్యను గుర్తించిన డాక్టర్లు వీళ్లే
ఇక్కడి ప్రజలు విచిత్రమైన కిడ్నీ వ్యాధికి గురవుతున్నారని సోంపేటలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ వై. కృష్ణమూర్తి, డాక్డర్ శివాజీ 1993లోనే అనుమానం వ్యక్తం చేశారు. ‘’సాధారణంగా వచ్చే కిడ్నీ వ్యాధికి భిన్నంగా ఇక్కడి ప్రజలకు ఈ వ్యాధులు ఉండడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ వ్యాధి వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఆ రెండూ లేనివారికి కూడా రావడం అంతుపట్టని విషయం. రోజూ మా ఆసుపత్రికి ఆరవై మందికి పైగా పేషెంట్లు వస్తారు. వారిలో కనీసం 3 నుంచి ఐదుగురు వరకు కిడ్నీ రోగులు ఉంటారు’’ అని డాక్టర్ కృష్ణ మూర్తి చెప్పారు. ఈ ప్రాంత ప్రజల్లో 37% మందికి కిడ్నీ వ్యాధి ఉందని ఇండి యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడా సంఖ్య 40 శాతానికి చేరిందని ఆయన వివరించారు. సోంపేట పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమంలో డాక్టర్ కృష్ణ మూర్తి కీలక పాత్ర వహించారు.
ఏడు మండలాలకు రెండే డయాలసిస్ కేంద్రాలు!
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఈ ప్రత్యేక వ్యాధికి ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ అని పేరు పెట్టింది.‘’ఉద్దానం నెఫ్రోపతి’’ అని కూడా దీనిని పిలుస్తున్నారు.ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో 13,093 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండగా..కొత్తగా రోజుకు 9 నుంచి 12 కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 5 ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఉద్దానం ప్రాంతం మొత్తంలో.. అంటే 7 మండలాలకు కలిపి 2 కేంద్రాలు ఉన్నాయి.కిడ్నీ వ్యాధి స్క్రీనింగ్ కేంద్రాలు రెండు ఉన్నాయి. 361 మంది కిడ్నీ బాధితులు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకుంటున్నారు. ‘’మేం 2017లో లక్ష మందికి పరీక్షలు చేయగా 13,900 మందికి కిడ్నీ వ్యాధులున్నట్టు తేలింది. ప్రభుత్వ అసు పత్రుల్లో డయాల్సిస్ చేయించుకునే వారికి మాత్రమే రూ. 2,500 పెన్షన్ ఇస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాలకు కలిపి రెండు డయాల్సిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఒకటి పలాసలో, రెండోది సోం పేటలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెండు, టెక్కలిలో మరోటి ఉన్నా యి. ఉద్దానం ప్రాంతానికి సమీపంలోనే టెక్కలి ఉంది. కాబట్టి బాధితులు అక్కడికి కూడా వెళ్లి డయాలసిస్ చేయించుకోవచ్చు’’ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డా.ఎస్.తిరు పతిరావు చెప్పారు.
పుష్కరాలకు ఖర్చు చేస్తారు కానీ ఇది పట్టదా?
‘’ఇరవై ఏళ్లుగా ఒకే ప్రాంతంలో విస్తరించిన కిడ్నీవ్యాధి, కేవలం వైద్యరంగ సమస్య మాత్రమే కాదు, ఇది ఆందోళనకరమైన సామాజిక సమస్య. పుష్కరాలకూ, ఇతర కార్యక్రమాలకూ కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒలింపిక్ విజేతలకు కోట్ల రూపాయలు నజరానాలు ఇస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన సమస్య పట్ల మాత్రం ఎందుకు ఇంత అలక్ష్యం?’’ అని ప్రశ్నిస్తున్నారు తిరుపతిలోని ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ అధ్యక్షురాలు,డాక్టర్ పి. కృష్ణ ప్రశాంతి.‘’న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చంఢీగడ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన అండ్ రీసెర్చ్ సంస్థల్లో 40సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధుల మీద విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సంస్థల సేవలను ఉద్దానంలో వినియోగించు కోవచ్చు’’ అని కృష్ణ ప్రశాంతి అన్నారు.
మొదలైన పరిశోధన
కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు విశాఖ విమ్స్ ఆసుపత్రిలో జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆధ్వ ర్యంలో పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. కిడ్నీ సమస్యలు పెరుగుదలకు కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, చుట్టు పక్కల ప్రాంతాలకు, ఉద్దానం ప్రాంతా నికి గల తేడాలను పరిశీలిస్తామని పరిశోధ కులు అంటున్నారు.ముఖ్యంగా ఫ్లోరైడ్, జీడితోటలకు ఉపయోగించే రసాయనాలు సమీపంలోని నీటిలోకి చేరడం తదితర కారణాలతో కిడ్నీ వ్యాధుల సంఖ్య పెరుగుతు న్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
పరిష్కార మార్గాలు
ఈ సమస్య పరిష్కారానికి వైద్యులు, పరిశోధ కులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్ధానిక సర్పంచ్‌లు, పాత్రికేయులు తమ సూచనలను పంచుకున్నారు. అవి..మైక్రోబయాలజీ, పాథా లజీ, బయోకెమిస్టీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల పీజీ విద్యార్ధుల సేవలను ఆ ప్రాంతంలో వినియోగించు కోవాలి.వంశధార, మహేంద్రతనయ నదీ జలాలను పైపు లైన్ల ద్వారా ఉద్దానం ప్రాంత వాసులకు అందించాలి. రసాయనాలు లేని సేంద్రీయ పంటలను రైతులు పండిరచాలి. జంతువులలో కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయా?, ఆవులు, గేదెలు, వాటి పాలద్వారా సంక్రమిస్తున్న రోగాల గురించీ పరిశోధనలు చేయాలి. కోళ్ళు, చేపలు, మేకలు వాటి మాంసం మీద పరిశోధనలు జరగాలి. ఉద్దానం ప్రాంతంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి, నిపుణులను నియమించాలి. కోటి రూపాయల ఖర్చుతో పది డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయవచ్చని వైద్యులంటున్నారు.పౌష్టికాహార నిపుణుల పర్యవేక్షణలో ఉద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రత్యేక ఆహారం అందే ఏర్పాటు చేయాలి.కిడ్నీ రోగులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలి.
-(జి.ఎ.సునీల్ కుమార్)