ఉక్కు పిడికిలి బిగుస్తోంది

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కులి పోరాటం గడచిన 950 రోజులుగా కార్మికులు చేస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం అమ్మేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. లిఉక్కు రక్షణ కోసం సి.పి.ఎం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాలు 1050 కిలో మీటర్లు బైక్‌ యాత్ర జరుగుతున్నదిలి. ఈ నేపద్యంలో విశాఖ ఉక్కు ను ఎందుకు కాపాడుకోవాలో..! ఒకసారి ఈ వ్యాసం చదవండి..` కె.లోకనాథ్‌
ఉక్కునగరం ఉద్యమిస్తోంది.విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జెండాతో పనిలేకుండా సింగిల్‌ ఏజెండాతో అన్ని పార్టీలు కదం తొక్కుతున్నాయి. కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చ రిస్తున్నారు.ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం సెగలు పుట్టి స్తుంది. వైజాగ్‌ స్టీల్‌ ఫ్యాక్ట రీని ప్రయివేట్‌ పరం చేయ కుండా ఆపడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి రాజకీయ పార్టీలు,తెలుగు ప్రజలు సన్నద్ధం అవుతు న్నారు. ఈ విష యంలో ఒక్క బీజేపీ తప్పా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తు న్నాయి. 32 మంది బలిదా నాలు, వందలాది మంది నిర్బంధాలు, లక్ష లాది మంది ఆందో ళనలు.. వారందరీ త్యాగాల ఫలితమే..విశాఖ ఉక్కు కర్మా గారం..ఈ ఉక్కు ప్లాంట్‌ 22వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. 17 వేల మంది పర్మి నెంట్‌, 16వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్య మంలో భాగంగా ఈబైక్‌ యాత్ర విజయ వంతం చేయాల్సిన అవశ్యకత ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల ప్రజలపై ఎంతైన ఉంది.!
రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృ ద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషి స్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌పరం చేయడమంటే దళితులు,గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకా శాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడు తుంది.విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మివేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని… తెలుగు ప్రజలు పోరాడి…32 మంది ప్రాణ త్యాగాలతో,16 వేల మంది రైతుల త్యాగ ఫలంగా సాధించుకున్న ఈ ప్లాంట్‌ను రక్షించుకుని తీరతామని… స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు గత వెయ్యి రోజులుగా పోరాడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు సరికదా దీనిని అమ్మడం సాధ్యం కాకపోతే మూసివేస్తామని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపులకు పూనుకున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజలు,కార్మికులు నీరసపడిపోయి,ఉద్యమాన్ని వదిలేస్తారని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది. అయితే వారి అంచనాలకు భిన్నంగా రెట్టిం చిన ఉత్సాహంతో,పట్టుదలతో కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, దేశవ్యాప్తంగా కూడా వీరి పోరా టానికి మద్దతు లభిస్తోంది. మన దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి ఇంత విశాలమైన మద్దతు లభించడం చాలా అరుదు. విభజిత ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇటువంటి సంస్థను రక్షించుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. కానీ దీనికి భిన్నంగా, చాలా విచిత్రంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార వైసిపి మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది. కానీ రాష్ట్ర ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కనీస ప్రయత్నం కూడా చేయడంలేదు. ప్రతిపక్ష టిడిపి రాష్ట్ర వైసిపిని విమర్శించడం తప్ప ప్లాంటును అమ్మేస్తామని తెగేసి చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. ఇక ప్రశ్నిస్తానని బయలుదేరిన జనసేన అధినేత ఆ పని వదిలేసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వ పంచన చేరారు. తమలో తాము కలహించు కోవడం తప్ప రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఎంతో ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడానికి కూడా ఈ మూడు పార్టీలు సాహసించడం లేదు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి ఎజెండాను అమలు చేసేవిగా వున్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం లేవనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఇదే అవకాశంగా భావించి కేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ పట్నం స్టీల్‌ప్లాంటును అష్టదిగ్బంధనం చేస్తోంది. ఉత్పత్తిని ఏకపక్షంగా తగ్గించి వేసింది. మూడవ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నిలిపివేసింది. విడివిడిగా ముక్కలు చేసి అమ్మాలని కుట్రలు పన్నుతోంది. ఉన్నత స్థాయి అధికారులతో సహా ఉద్యోగుల ఖాళీలను నింపడం లేదు. రోజువారీ పనులకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా లేకుండా చేస్తోంది. దేశంలోని ప్రైవేట్‌ రంగంతో సహా అన్ని స్టీల్‌ ప్లాంట్లకు సొంత ముడి సరుకులను, గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం సొంతగనులు కేటాయించడానికి ససేమిరా నిరాకరిస్తోంది. దీనికి తోడు ఇప్పటి వరకు తక్కువ ధర చెల్లించి ఇనుప ఖనిజాన్ని కొంటున్న ఛత్తీస్‌గఢ్‌ లోని ఎన్‌ఎండిసి నుండి ఇక మీదట కొనుగోలుకు అనుమతించకుండా, దూర ప్రాంతంలోని కర్ణాటక నుండి కొనుగోలు చేసుకోమని తెలిపింది. తద్వారా రవాణా ఖర్చులు పెరిగి స్టీల్‌ప్లాంట్‌ మరింత కష్టాల్లోకి నెట్టబడుతుంది. మరోపక్క విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ముడి సరుకులు అన్‌లోడ్‌ చేయకుండా పక్కనే ఉన్న అదానీకి చెందిన గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ఇబ్బందులు పెడుతూ, పెనాల్టీలు విధిస్తోంది. ప్లాంట్‌ లోని కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తున్నారు. మొత్తం ప్లాంట్‌ విలువను తగ్గించి చూపి, కారుచౌకగా తమ కార్పొరేట్‌ మిత్రులకు ధారాదత్తం చేయజూ స్తున్నారు. 1400 ఎకరాల స్టీల్‌ప్లాంట్‌ భూమిని ఇప్పటికే గంగవరం పోర్టుకు ఇచ్చేశారు. ఇప్పుడు మరలా మరింత భూమిని అమ్మేయడానికి పావులు కదుపుతున్నారు. అదానీ పోర్టుకి వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది.
ఈ రకంగా అన్ని విధాలుగా స్టీల్‌ప్లాంట్‌ను బలహీనపరిచే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాల్పడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని రాష్ట్రం లోని ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ఎదుర్కోలేవని, అంతే కాకుండా ఈ మూడు పార్టీలు కేంద్ర బిజెపికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నాయని కూడా తేటతెల్లమై పోయింది. అందువల్ల పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కేవలం తెలుగు ప్రజల చైతన్యం మీదనే నేడు ఆధారపడి ఉంది. తెలుగు ప్రజల పౌరుషాన్ని మరొకసారి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి సహేతుకమైన కారణం కూడా లేదు. ప్రపంచంలోనే అగ్రగామి స్టీలు ఉత్పత్తి చేసే సంస్థగా మన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉంది. అతి తక్కువ మంది కార్మికులతో దేశంలోనే అత్యధిక ఉత్పాదకత కలిగిన ప్లాంట్‌ మనదే. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేవలం రూ.4500 కోట్ల పెట్టుబడికిగాను ఇప్పటివరకు మన ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల ద్వారా రూ.45 వేల కోట్లకు పైగా చెల్లించింది. అందువల్ల నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని అమ్మేస్తున్నామనే వాదన పూర్తి అసంబద్ధం. లాభాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా తెగనమ్మడమే నేటి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానంగా ప్రకటించింది. రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలస ప్రాంతంగా వుండేది. విశాఖ ఇండిస్టియల్‌ హబ్‌గా ఏర్పడిన తరువాత ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులు, కూలీల కుటుం బాల నుండి అనేకమంది యువకులకు విశాఖ పట్నం స్టీల్‌ప్లాంట్‌ ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌ పరం చేయడమంటే దళితులు, గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడుతుంది. ఇప్పటికే కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి కూడా ఆచరణలో నిరాకరిస్తోంది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ఒక ప్రహసనంగా మార్చివేసింది. ఫలితంగా ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకపోగా మరింత వెనుకబాటులోనికే నెట్టబడిరది. పేదరికం పెరిగింది. వలసలు పెరిగాయి. ఇవి చాలదన్నట్లు రాష్ట్ర విభజన చట్టంలోని విద్యాసంస్థల నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ శంకుస్థాపనకే ఇంత కాలం పట్టింది. ఇక నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. పెట్రో యూనివర్సిటీ ఇప్పటికీ పిట్టగోడల స్థితిలోనే ఉంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప నేటికీ ఆచరణ రూపం దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఊసే మరిచింది. ఈ విధంగా అన్ని రకాలుగా మన రాష్ట్రానికి, ప్రాంతానికి ద్రోహం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టకపోవడం రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే అవుతుంది. రాష్ట్రాభివృద్ధితో పాటు, ఈ ప్రాంత అభివృద్ధిలో విశేష పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించు కోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈ పని చేయలేవని ఇప్పటికే స్పష్టమైంది. అందువల్ల తెలుగు ప్రజలు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ప్లాంటును పరిరక్షించుకోవడానికి కూడా ప్రజలే ముందుకు రావాలి. ఈ కర్తవ్య నిర్వహణలో ప్లాంట్‌ పరిరక్షణకు విస్తృతమైన ప్రజా మద్దతు కూడగట్టాలనే లక్ష్యంతో సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టింది. ఇచ్చాపురం నుండి పాయక రావుపేట వరకు మైదాన, పట్టణ, గిరిజన ప్రాంతాల గుండా ఈ యాత్ర ఈనెల సెప్టెంబర్‌ 20 నుండి 29 వరకు పది రోజుల పాటు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదని, ఇంత ద్రోహానికి పాల్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, వారికి మద్దతిచ్చే పార్టీలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే హెచ్చరిక ఈ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజలు చేయాలి.
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు(ప్రజాశక్తి సౌజన్యంతో..)