ఇది అందరి పండుగ
రంగు రంగుల హరివిల్లులతో, రివ్వురివ్వున ఎగిరేగాలిపటాలతో, ఇంటికొచ్చే హరిదాసు లతో,అందంగాఅలంకరించిన బసవన్నలతో కనువిందు చేసే తెలుగువెలుగుల కాంతి మన రంగవల్లుల సంక్రాంతి. ఆప్యాయతలతో అనురాగాలతో ప్రేమాను బంధాలతోఅసలు సిసలైన ఆనందాల పూతోట మన ప్రియమైన సంక్రాంతి. వన్నెలద్దుకున్న గుమ్మాల వింత కాంతులతో కళకళలాడే నట్టింటి సోయగం మన ముచ్చటైనసంక్రాంతి. మావిడాకులతో, పూబంతీ చామంతులతో, తోరణాలతో అలం కరించుకున్న పందిరి మనపచ్చదనాల సంక్రాంతి. కొత్త అల్లుళ్ళతో, కొంటెమరదళ్ళతో మేళవించుకున్న సన్నాయి రాగంమన ఆట పాటల సంక్రాంతి. కోళ్ల పందాలతో,ఎడ్ల పందాలతో ఊరంతా హ్రోరెత్తిపోయే సంతో షాల వడిఈ సంబరాల సంక్రాంతి. నేతి అరిసె లతో కొబ్బరిబూరెలతో కలగలపు కూర లతో ఘుమఘుమలాడిరచే అరిటాకు భోజనం మన కమ్మనైనసంక్రాంతి. ఊరంతా పేరంటాల తో వాడంతా ఉత్సవాలతో ఇళ్లన్నీ కొత్త కాంతు లతో అంబరాన్నంటే ముంగిళ్ల కాంతి మన తెలుగు ఇంటి మమకారాల సంక్రాంతి. సంక్రాంతి సిసలైన రైతుల పండగ. శ్రామికుల పండగ. అల్లుళ్ల పండగ.–గునపర్తి సైమన్
గిరిజన పల్లెకు ..సంక్రాంతి పల్లకి..
గిరిజన గూడెల్లో ముందస్తు సంక్రాంతి సందడి నెలకొంది..! ఏజెన్సీ గ్రామాల్లో అడవి బిడ్డలు సంబరాల ఊపందుకున్నాయి. జనవరి నెల వచ్చిందంటే చాలు..ఏజెన్సీ వ్యాప్తంగా సందడి వాతావరణం మొదలౌతుంది. ముఖ్యంగా మన్యంలోని గిరిజనుల సంప్ర దాయ సంక్రాంతి పండగను పుష్య పౌర్ణమి నుంచి ప్రారంభించారు. ప్రతి ఏడాది పుష్యమాసం ఆఖరు రెండు వారాల్లో ఎక్కడో చోట సంక్రాంతి పండగను గిరిజనులు ఉత్సా హంగా జరుపుకొంటారు. పుష్యమాసం వచ్చిన రెండో వారం తర్వాత గిరిజనులు భోగి చేసు కుంటారు. గ్రామంలోని పాత వస్తువులు, చీపుర్లు, కర్రలను భోగి మంటలో వేస్తారు. కొత్త కుండలో కొత్త బియ్యం, పప్పులతో పులగం తయారు చేసి గ్రామంలో అందరికీ పంచుతారు.భోగి రోజు నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో డప్పు వాయిద్యాలు,థింసా నృత్యాలతో సందడిగా ఉంటుంది. వ్యవసా యాధారంగా జీవనం సాగించే గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించే రోజునే సంక్రాంతిగా భావిస్తారు. దీంతో భోగి మరుసటి రోజు సంక్రాంతి పండగ నిర్వహించుకుని, తమ పనిముట్లకు పూజలు చేస్తారు. మైదాన ప్రాంతంలో కనుమగా నిర్వహించే మూడో రోజును ఏజెన్సీలో పప్పల పండగ అంటారు. ఈ పం డగను కేవలం పశువుల కోసమే చేస్తారు. పశువులను శుభ్రంగా కడిగి,వాటి కొమ్ములకు రగ్గులు పూసి,అరెశలు,బూరెలు,గారెలతో చేసిన దండలను వాటికి వేస్తారు. ప్రత్యేకంగా పులగాలను వండి వాటికి ఆహారంగా పెడతారు.
పుష్యమాసాంతం వరకు సందడి
గిరిజనులు సంప్రదాయం ప్రకారం పుష్య మాసం రెండో వారం(పౌర్ణమి) నుంచి పక్షం రోజులు సంక్రాంతి పండగను నిర్వహి స్తారు. దీనిని స్థానిక భాషలో ’పుష్య పోరోబ్’ అంటారు. జనవరి 17 నుంచి 31వ తేదీ వరకు ఏజెన్సీ పల్లెల్లో సంక్రాంతి సందడి కొనసాగుతుంది. ప్రధానంగా ఇతర గ్రామాల్లో వారి బంధువులను తమ గ్రామాలకు ఆహ్వానించుకుంటారు. వారికి మద్యం, మాంసంతో విందు భోజనాలు పెడతారు. అలాగే కొత్త బట్టలను పెడతారు. అలాగే పుష్యమాసం ముగిసే వరకు ప్రతి రోజు రాత్రుళ్లు మహిళలు థింసా నృత్యాలు, పురు షులు డప్పువాయిద్యాలతో సందడి చేస్తారు. పురుషులు మాత్రమే వివిధ వేషధారణలతో గ్రామాల్లో తిరుగుతుంటారు. దీంతో పుష్య మాసంలో ఏజెన్సీలోని వారపు సంతలు సైతం జనంతో కళకళలాడతాయి. సంక్రాంతి నాడు పండిరచిన తొలిచూరి బియ్యంతో పులగం తయారు చేస్తారు. తమకు వ్యవసాయ జీవనాధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు..ఇప్పటికే కొన్ని గిరిజన పాడేరు మండలం వనుగుపల్లి పంచాయితీ లో సంక్రాంతి సందడిగా సాగుతోంది. క్యాలెండర్‌తో సంబంధం లేకుండా సాధా రణంగా అందరూ జరుపుకునే సంక్రాంతికి ముందు గ్రామ దేవతకు గంగాలమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ గిరిజనులు. అదే రోజు రాత్రి భోగి మంటలు వేసి భోగి పండగ జరుపుకుంటారు.పండిన వ్యవసాయ జీవనా ధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొత్త వస్త్రం…కొత్త కన్నె..తాడు.. పూజలు నిర్వహిస్తారు. ఏడాది పండిరచిన కొత్త ధాన్యాన్ని పులగం ఆహారంగా తయారుచేసి పశువులకు తినిపిస్తారు.పశువుల మెడలో దుంపల్ని కడతారు.అంతా సందడిగా సంబరాలు చేసు కుంటారు.మరుసటి రోజు కనుమ పండుగ చేసుకుంటారు ఇక్కడే ఆదివాసీలు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని, సాంప్రదాయాలను గిరిజనులు ఇప్పటికీ పాటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గిరిజన మహిళలు ప్రత్యేక వస్తదారణతో ఆకట్టుకుంటారు. థింసా నృత్యం చేస్తూ ఆడి పాడతారు.
మైదాన ప్రాంతాల్లో ఇలా…
పిల్లల పండగ.పెద్దలు,వృద్ధుల పండగ. బీదాబిక్కి పండగ. కళకళలాడుతున్న పంట పొలాలను, పండబోయే దిగుబడిని తలుచు కొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంప దకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండు గను బీద,గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకు కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. సంక్రాంతికి విడుద లయ్యే సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. సంక్రాంతి నాడు చేసే స్నాన, దాన, జపా దులు విశేష ఫలదాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. సంక్రాంతి నాడు స్నానం చేయని వారికి వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రోక్తి. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగిం చాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చిం చిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోక బాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం.భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి.చక్కెర పా నువ్వులు కలిపి చేసిన మిఠాయిలు తినడం, వాటిని చుట్టుపక్కల వారికి, స్నేహి తులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మకర సంక్రాంతి పితృపూజలకు అనుకూలమైన దినం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణ విడవాలి. పితృదేవతలకు పుణ్యప్రదమైన ఈ సంక్రమణం కాలంలో ఒకపూట భోజనం చేయడం మంచిది.
అనుబంధాల పెన్నిధి
బిడ్డలు..ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ..వేర్వేరుప్రాంతాలకు వెళ్లి స్థిరపడు తుంటారు.పల్లెకు,తల్లిదండ్రులకు అది బాదైనా..ఎక్కడున్నా తమ బిడ్డలు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు.అలా వెళ్లిన వారంతా ఈ పండగకు సొంత ఊళ్లకు తరలి రావడం..పల్లెకు,ప్రతి ఇంటికి సంక్రాంతే.
సమైక్యతల సన్నిధి
సంక్రాంతి..ప్రజల సమైక్యతను చాటుతుంది.దాన గుణాన్ని పెంపొందిం చడంతోపాటు ధని,పేద తారతమ్యం మరచి,ప్రతి ఇంట పౌష్యిలక్ష్మీని ఆహ్వానిస్తూ,జరిగే కార్యక్రమాలు గ్రామాలకు నూతన శోభను తెస్తుంటాయి.ఏడాది పొడవునా వచ్చే పండుగలు ఆ రోజుకు ఆరోజే చేసుకుంటారు. సంక్రాంతికి మాత్రం ముందుస్తు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ప్రధానంగా అరిసెల తయారీ ఇరుగుపొరుగువారందరూ కలసిమెలసి చేసుకోవడం ఆకట్టుకుంటుంది.
చెక్కు చెదర‘నిధి’
మకర సంక్రాంతిని అత్యంత విశిష్టంగా భావిస్తుంటారు.తమ ఇంట కాలం చేసిన పెద్దలను పితృదేవతులుగా భావిస్తూ,వారిని నూతన వస్త్రాలునివేదించి..తమున్నతికి వారుచేసిన కృషిని గుర్తు చేసుకుంటూ భాష్పాంజలి సమర్పిస్తుంటారు.తమ హృదయాల్లో కొలువైన తమ వారి గురించి సంతానానికి తెలిపి,తర్వాత తరానికి దిశా నిర్ధేశం చేయడం అబ్బురమనిపిస్తుంది. ప్రకృతి వేళ ఆలయాల్లోనే కాదు..వేపచెట్టు మహాలక్ష్మీ,పోలేరమ్మ ప్రతిరూపాలుగా భావిస్తూ పూజలు చేయడం మన ఆన వాయితీ.సాప్ట్‌వేర్ ఇతర ఉద్యోగాల కోసం నగరాలు,ఇతర సుదూరాలకు వెళ్లినవారు సైతం గ్రామాలకు వచ్చిన తర్వాత ఈ ఉత్స హాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పంక్తి భోజనాలతోపాటుకనుమనాడు తమజీవన గమనంలో తోడుగా నిలిచిన పశువులను అలంకరించి..గౌరవించడం ఎంతో ప్రత్యేకం.
సాంప్రదాయ వారధి
గతంలో పుష్యమాసంలో హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల విన్యాసాలు,పిట్టల దొరల గొప్పలు..కాలక్రమంలో కనుమరుగవుతున్నా.. సంక్రాంతి సంప్రదాయం నిర్వఘ్నంగా కొనసాగుతోంది.అప్పట్లో చెడుగుడు,కబడ్డీ పోటీలు జరిగేవి.ఇప్పుడు వాటి స్థానంలో క్రికెట్,వాలీబాల్ చేరాయి.ఇంటి ముంగిళ్లలో ముగ్గులు,గొబ్బిళ్లు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
శాంతి,సౌభాగ్యం,ఐకమత్యం కలగ లిసినదే పండుగ. అందరూ పండుగగా వ్యవహరించే ఉత్సవాలు వ్యక్తిగతంగాను, కుటుంబ పరం గాను, బంధుగతంగాను జరుపుకుంటూ ఉం టాము. అంతవరకు వున్న కష్టాలు మరచి అందరితో కలసి మెలసి ఆనందం పంచుకునే దినమే పండుగ. ఈపండుగల క్రమంలో వచ్చే ముఖ్య మైన పండుగలలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశినుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనుస్సురాశినుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తే మకర సంక్రమణం సంభవించి, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయి, మనం ఆచరించే ‘‘సంక్రాంతి’’ పండుగ వస్తుంది. సూర్యగమనం ఉత్తరాయణ, దక్షిణాయనాలు నిర్ణయిస్తే, చంద్రగమనం మాసాలు నిర్ణయిస్తుంది. సూర్యుడు ధనుస్సురాశిలో సంచరిస్తుండగా ధనుర్మాసం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ముగియగానే సంక్రాంతి శోభలు ప్రారం భమవుతాయి. కాలచక్రంలోని రాశులలో మకరరాశి సర్వశ్రేష్టమైనది. శ్రవణానక్షత్ర ములో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభునిగా బ్రహ్మకు సాక్షాత్కరిం చినది శ్రవణానక్షత్రములో. ఈ నక్షత్రము మకర రాశికి చెందినది.ఈకారణం చేత శ్రీమహా విష్ణువుని యొక్క రాశి మకరరాశి. దీనిని మానవుని శిరస్సుగా భావిస్తారు. అటువంటి మకరరాశిలోకి సహస్రకిరణుడైన సూర్యభగ వానుడు ప్రవేశించే మహత్తర పుణ్యదినం కాబట్టి, ప్రతీవ్యక్తిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించటానికి అత్యంత అనువైన కాలం. వేదకాలంనుంచి శిష్యులు సరైన గురువు కోసం అన్వేషించటం, గురూ పదేశం పొందడం, వేదపారాయణలు సాగించటం వంటివి ఈ సమయంలోనే ఆరంభమవుతాయి. జగత్తు జలమjైునప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహమూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి. వామనావతార ఘట్టములో వామనుడికి బలిచక్రవర్తి మూడడుగుల భూమిని దానం చేసినది, వామనుడి పదఘట్టనతో పాతాళానికి చేరినది ఈరోజే. దీనికి సంకేతంగా మనం సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. ఈపండుగ భోగి, సంక్రాంతి, కనుము అని మూడు రోజులుగా జరుపుకునే పర్వదినం.
భోగిపండుగ
భోగి పండుగ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి భోగిపళ్ళు, భోగిమంటలు. ఆవుపేడతో పిడకలు తయారుచేసి యఙ్ఞ దేవతను తలుచుకుంటూ, పాపప్రక్షాణన జరిపించమని వేడుకుంటూ, ధర్మమార్గ పయనానికి సమాయత్తమవుతూ మంటలలో సూర్యోదయం సమయంలో వీటిని వేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ మంటల చుట్టూ చేరి ఆనందోత్సాహలలో మునిగిపోతారు. ఈ మంటలలోనే పాతపడిన సామానులను కూడా వేసే సాంప్రదాయం కూడా కనబడుతుంది. నూతనత్వానికి ఆహ్వానం పలుకాలంటే పాతదనాన్ని విడనాడాలి.ఈ మంటలు వేదకాలమునాటి ఋషులు తాము సంవత్సరారంభములో వ్రేల్చిన ‘ఆగ్రాహాయణి’ హోమాగ్నికి ప్రతి రూపం. హోమ భస్మం మంత్రసారము, అతి పవిత్రమైనది. మంటలు శాంతించిన తరువాత ఈ హోమ భస్మాన్ని దైవప్రసా దంగా భావించి నుదుటిన ధరిస్తారు. పిల్లలకుకూడా నుదుటిమీద ఉంచి వారి ఆయురారోగ్యాలకై ప్రార్థిస్తారు. దేవతారాధన, నూతన వస్త్రధారణ, పిండివంటలతో భోజనము వగైరా పూర్తిచేసుకుని సాయంకాలం ‘‘భోగిపళ్ళ’’ వేడుక జరుపుతారు. పిల్లలను ఆశీర్వదిస్తూ పెద్దలంతా వారి శిరస్సుపై రేగిపళ్ళను పోస్తారు. రేగిచెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అని పిలుస్తారు. ఈవృక్షం విష్ణు ప్రీతికరమైనది. ఈ రేగిపళ్ళతోపాటు చిల్లర పైసలు, నానపెట్టిన శనగలు, పువ్వులు పిల్లల తలలపై పోస్తూ, శ్రీమహావిష్ణువులాగా తేజరి ల్లాలని ఆశీర్వదిస్తారు. తరువాత ముతై దువు లకు తాంబూలాలు ఇచ్చి సంతోషపరు స్తారు.
సంక్రాంతి పండుగ
రెండవ రోజైనది సంక్రాంతి పండుగ. పండుగలలో ప్రతీ రోజుకు ఒకప్రత్యేకత ఉంటుంది, వ్యవహార నియమ నిబంధన లుంటాయి. స్నానాదికాలు ఎలా ఆచరిం చాలి, ఎటువంటి పూజలు ఆచరించాలి, ఎటువంటి దానధర్మాలు చేయాలి అనేవి మన శాస్త్రాలు విపులంగా వివరించాయి. ఇవిశారీరిక ధారు ఢ్యాన్ని పెంపొందించి, వాతావరణ సమతుల్యత కాపాడుతూ, సమతలను పెంపొందిస్తాయి.నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం శారీరిక రుగ్మతలను నివారిస్తుంది. నువ్వులు సేవించటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఈరోజు జరిపే శాంతి హోమాలు, మృత్యుంజయ హో మాలు, అభిషేకాలు, వివిధ దైవారాధనలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, భగవ దానుగ్రహానికి తోడ్పతాయి. పితృదేవతల స్మరణ వారి అఖండ ఆశీర్వచనానికి దోహదం చేస్తాయి. ఇది పగటి పూట వస్తే ప్రశస్తము. మధ్యాహ్నమునకు పూర్వమే సంభవించే అర్ధోదయకాలమే పూర్తి ఫలితాన్ని స్తుంది. గొబ్బిళ్ళ సందడి సంక్రాంతి పం డుగు వేడుకలలో మరొక ప్రధానమైనది. కన్నె పిల్లలు చక్కటి వస్త్ర ధారణతో, తమకు కలిగిన ఆభరణాలతో చూడచక్కగా అలంక రించు కుంటారు. తెలుగుదనం ఉట్టి పడే కన్నె పిల్లలను చూచి కుటుంబ సభ్యులు మురిసి పోతారు. వివాహ వయస్సుకు వచ్చినారని చెప్పకనే చెబుతారు. పెద్దవారికి ఇది ఒక హెచ్చరికలాటిది. ఆవుపేడతో గుండ్రముగా బంతులవలె తయారుచేసి, ఇంటి ముంగిటి రంగవల్లుల మధ్య అమరుస్తారు. వాటిపై బంతిపూవులు, ఇతర రంగు రంగు పూలను అలంకరించి, వాటి చుట్టూ తన తోటివారితో, స్నేహితులతో వలయాకారంగా తిరుగుతూ, గొబ్బిపాటలు పాడుతూ,లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఇది సంధ్యా సమయంలో జరిగే కనుల పంట. చూచిన వారిదే భాగ్యం. మహాలక్ష్మికి ప్రీతిపాత్ర మైనది. ఈవిధంగా చేయటం వలన కన్నెపిల్ల లకు త్వరలోనే చక్కటి వరుడు లభించి వివాహం జరుగుతుందని విశ్వాసం. లయ బద్దంగా చిడతలు వాయిస్తూ, భుజము పైనున్న వీణను స్వరబద్ధముగా మీటుతూ, అడుగు అడుగులో గజ్జెల సవ్వడి నింపుతూ విలాసంగా సాగిపోయే హరిదా సులు మన సంప్రదాయ చిహ్నాలు. హరి నామ సంకీ ర్తన తప్ప మరొక మాయ వారి నోటి వెంట వెలు వడదు. రంగు రంగుల వస్త్రధారణతో, మెడలో పూదండతో హుందాగా నడుస్తూ సాగిపోతారు.
కనుమ
మూడవ రోజైన పండుగ కనుమ పండుగ. కనుమ నాడు మినుము తినాలంటారు. అందుకే ఆవునేతితో తయారుచేసిన మినపసు న్నెలు, బెల్లం గారెలు వంటిని తయారుచేసు కుంటారు.నోరూరించే పదార్థాలు జిహ్వను మరింత పెంచగా మానసిక సంతృప్తితో కడుపారా అస్వాదిస్తారు. వ్యవసాయదారులు తమ తమ పశువులను అలంకరించి వాటిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తారు. బలవర్థకమైన దాణావేసి విశ్రాంతిగా ఉండేలా చేస్తారు. వ్యవసాయ క్షేత్రములో వాటి అవసరం లేకుండా పంటలు పండవు.నాగరిక ప్రపంచ ములో యంత్రాల విని యోగం ఎక్కువైనప్ప టికి, పశువుల వినియోగం లేకుండా సాగదు. మనకు జీవనాన్ని,జీవి తాన్ని ఇచ్చిన ప్రతీ ప్రాణిని గౌరవించాలనే సత్సాంప్రదాయము మనది. కనుమనాడి కాకి కూడా కదలదు అనే నానుడి ప్రచారంలోఉంది. శాస్త్రపద్దతిలో ఆలోచిస్తే దీనికి తగిన కారణం కనబడు తుంది. దైనం దిన కార్యక్ర మాలకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యు లతో కలసి మెలసి ఆనందంగా జీవించటానికి అవకాశం కల్పించేవే కొన్ని కట్టుబాట్లు, ఆచారవ్య వహారాలు. బయటకు వెళ్ళకోడదు అనే నియమం పెడితే చక్కగా ఇంటి వద్దే వుండి సంతోషంగా గడుపుతారని దీని ముఖ్యోద్ధే శము. అంతేకాకుండా మరుసటి రోజున బంధువులు తమతమ స్వస్థాలకు వెళ్ళిపోతారు కనుక వారి వీడ్కోలుకు కావలసిన కార్యక్రమ నిర్వహణకు దోహదం చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కోడిపందేలతో మగవారు ఆనందిస్తారు.
బొమ్మల కొలువు ప్రతీ ఇంటా కొలువుదీరుతుంది. సంవత్సరం పొడవునా సేకరించిన రకరకాల బొమ్మలను పలు వరుసలలో అలంకరించి హృద్యమైన వాతావరణాన్ని తయారుచేస్తారు. వస్తుగ్రహ ణాశక్తిని పెంపొందించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. సిరిసంపదలు కలుగుతాయని విశ్వాసం. బొమ్మల కొలువు పేరుతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. పలువురు విచ్చేసి అలంకరణలను వీక్షించి ముగ్దులౌతారు. ఇంటిని అలంకరించిన మామిడి తోరణాలు, నూతన వస్త్ర ధారణలు,వాకిట భోగి మంటల వింత శోభలు,నట్టింట్లో నిండు గర్భిణిలా ధాన్యపు గాదెలు, వాకిట్లో హరిదాసులు ఆలపించే హరిభ జనలు, తోటల్లో కోడిపందేలు, పెరట్లో పశువుల అలంకా రాలు,అత్తింట్లో అల్లుడు గారు ఎక్కే అలక పాన్పులు, వంటింట్లో అత్తగారు చేసే నేతి అరిసెల ఘుమఘుమలు, అంగట్లో వస్త్రాల సంబరాలు, ఆలయాలలో దైవ పూజలు, ముంగిట్లో వయ్యారి భామలు దిద్దే ముత్యాల రంగవల్లులు, రంగవల్లులపై శోభిల్లే గొబ్బిళ్ళు, దాన ధర్మాల తృప్తిపొందిన దానగ్రహీ తలు.. కలగలసి మన సంక్రాంతి. ఈవిధంగా మూడు రోజులు నూతన వస్త్రాలు ధరించి, యథాశక్తి పూజలు, హో మాలు సలిపి, దానాలు చేసి, పశువులను అలంకరించి అందరితో కలసియధాశక్తి పిండివంటలు భుజించి అత్యంత ఆనందంగా గడుపుకుని, సంవత్సరమంతా పండుగలా గడవాలని కోరుకుంటారు.