ఇటుకల బట్టీల్లో వలసల బతుకులు

రాష్ట్రంలో భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన వ్యాపారులు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటుకలను తయారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు.అక్కడ నుంచి వలస వచ్చిన కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోగా,కనీససౌకర్యాలుకూడా యజమానులు కల్పించడం లేదు. బట్టీల వద్దనే చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీవనంసాగిస్తున్నారు. పగలనకా,రాత్రనకా ఇటుకలు తయారు చేయిస్తున్న కష్టపడి పనిచేస్తున్న వలస కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఇటుకల బట్టీ యజమానులు కోట్లరూపాయలు గడిస్తున్నారు.బట్టీల నిర్వహణకు మైనింగ్‌,కార్మికశాఖల నుంచి అను మతులు తీసుకోవలసి ఉన్నా ఆనిబంధనలేవీ అమలు కావడం లేదు.
ఇటుక బట్టీల ఏర్పాటుకు ఆయా గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూశాఖ,కాలుష్య నియంత్రణమండలి నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలి, కానీకొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడంలేదు.అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోనూ బట్టీలు నిర్వహిస్తున్నారు.విశాఖపట్నం,విజయనగరం,అనకాపల్లి,భీమిలితదితర మండలాల్లో రోడ్డుల పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడంవల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గాలికి బూడిద కొట్టుకువచ్చి కండ్లల్లో పడడం,బట్టీలనుంచి వెలువడుతున్న పొగతో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఇక అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు మట్టి పెళ్లలను పెకిలిస్తున్నాయి.పలకలు పట్టాల్సిన చేతులు ఇటుకలు మోస్తున్నాయి. నిరుపేదలుగా పుట్టటమే వారికి శాపమయ్యింది.ఆడుతూ పాడుతూ స్కూల్‌కి వెళ్లాల్సిన వయస్సులో బాలకార్మికులుగా వెట్టిచాకరి చేయిస్తున్నారు. ఈడు పిల్లలు బడిలో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నా,స్థానిక గ్రామ సచివాలయ వ్యవస్థ, విద్యాశాఖ, రెవెన్యూ కార్మికశాఖ ఈచిన్నారుల అవస్థలు నిత్యం చూస్తున్నా..ఒక్క అధికారి కూడా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.బాల కార్మికులతో ఇటుకలు పేర్చటం,మట్లిపోయడం,ఇటుకలు ఆరబెట్టడం,వంటి పనులు చేయిస్తున్నారు.పని చేస్తున్నకార్మికులకు కనీసవేతనం చట్టం నిబంధనలప్రకారం శ్రమతగ్గా వేతనాలు చెల్లించడంలేదు.ఆ నిబంధనలను ప్రభుత్వం పట్టించుకున్న దాఖాలు లేవు. దీంతో కార్మికులే కాకుండా వారి పిల్లల బ్రతుకులు ఇటుక బట్టీలోనే నలిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గిరిజన కుటుంబాలతో ఎక్కువ పనిచేయించుకొని తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమ ను దోచేస్తున్నారు.
ఇటుక బట్టీల అక్రమార్కులు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై బట్టీలను నిర్వహించడంతో అధికారులు వారివైపు చూడటానికి భయపడుతున్నారు.బట్టీ యజమానులు అక్రమంగా మట్టిన త్రవ్వి వాల్దా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇటుక బట్టీ యజమానులు ఇన్నిరకాల నేరాలకు పాల్పుడుతుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.నిర్మాణరంగం పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అక్రమార్జనకే అధికప్రాధాన్యత ఇస్తుందే తప్పా వలస కార్మికులు,బాలకార్మికుల బతుకులను పట్టించు కోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారికి కనీసం నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బడిఈడు పిల్లల్ని బడికి పంపించేలా విద్యాశాఖ అధికార్లు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.!- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్,