ఆ విషయంలో నిర్లక్ష్యం వద్దూ

కిశోర బాలికలో మొదటిసారి సంభవించే రుతుక్రమం సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. కొన్నిసార్లు తొందరగా ఎనిమిది సంవత్సరాలకు లేదా చాలా ఆలస్యంగా పందొమ్మిది సంవత్సరాల వరకు అవుతుంది. దేశంలో 70శాతం తల్లులు బహిష్టును మలినముగా భావిస్తున్నారు. బహిష్టు అంటే సిగ్గుపడే అంశమని, దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనే సంస్కతి ప్రజల్లో వుంది. మనదేశంలో 6కోట్ల 30 లక్షలమంది కిశోర బాలికలు మరుగు దొడ్డి సౌకర్యంలేని ఇళ్లల్లో నివసిస్తున్నారు.


ఋతుస్రావం అనేది నూతన శిశువులకు జన్మనిచ్చే అత్యంత కీలకమైన మానవ ప్రత్యుత్పత్తికి చెందిన అంశం, ప్రపంచ వ్యాపితంగా మే 28వ తారీఖుని బహిష్టు ఆరోగ్య,పరిశుభ్రతా దినోత్సవంగా జరుపు తున్నారు. 2021 సంవత్సరాన్ని బహిష్టు ఆరోగ్యం, పరిశుభ్రతపై కార్యాచరణ, నిధుల వెచ్చింపు అనే అంశంగా ప్రకటించారు, 2014 సంవత్సరంలో జర్మనీకి చెందిన ‘వాష్‌ యునైటెడ్‌’ సంస్థ ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా జరిపింది. ఈ కొవిడ్‌ సంక్షోభ కాలంలో బాలికలు,మహిళలు శానిటరీ నాప్కిన్లపై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతున్నాయి.
బాలికలలో బహిష్టుపై మూఢనమ్మకాలు,అపోహలు ప్రజల్లో బహిష్టుపై మూఢనమ్మకాలు ప్రచారంలో ఉండడంతో నిశ్శబ్ద వాతావరణం ఆవహించి ఉంది. అందువల్ల బాలికలు బహిష్టు పరిశుభ్రతపై తెలుసుకోవడం గాని చర్చగాని జరగకుండా మూఢనమ్మకాలు అవరోధంగా ఉన్నాయి.మనదేశంలో అవగాహన లేక డబ్బయిశాతం తల్లులు బహిష్టును మలినంగా భావిస్తున్నారు. పాలు, పెరుగు, మాంసాహారము, పచ్చళ్ళు,పండ్లను బహిష్టు సమయంలో తినకూడదని ఇంకా నమ్ముతున్నారు. భారతదేశంలో నలభైకోట్ల మంది మహిళల్లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే నాప్కిన్లని వాడుతున్నారు. అందు లోనూ పట్టణ ప్రజలే ఎక్కువగా శానిటరీ నాప్కిన్లను ఉపయోగిస్తున్నారు, గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ ఇది చర్చించదగని విషయంగానే భావిస్తున్నారు. ఇంకా డబ్బయి ఒక్క శాతం బాలికలకు రజస్వల అయ్యేంతవరకూ తమ శరీరంలో జరిగే మార్పుల గురించి కానీ, నెలసరి గురించి కానీ అవగాహన లేదు.
కౌమార ప్రాయం అయోమయపు సందేహాల దశ. బాలకల శారీరక, మానసిక పెరుగుదలలో కీలకమైన మార్పులు ఈ దశలోనే ఏర్పడతాయి.పిల్లలు శారీరకంగా, మానసికంగా,భావోద్వేగపరంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్ధ్యాలను పెంపొందించుకొనే దశ కౌమారదశ. ఈ దశలో ఉన్నవారిని కౌమార బాలికలు అంటారు. మొదట ఋతుస్రావం యవ్వన ప్రారంభానికి సూచిక. ఈ మార్పుల్లో చాలాభాగం లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్యం,పోషణ మొదలైనవి. ఈ దశలో పాఠశాలలు, కళాశాలల్లో వారికి సరైన కౌస్సిలర్ల అవసరం పడుతుంది. బాలికలకు పాఠశాల స్థాయిలో ఈ అంశాలపట్ల సక్రమంగా అవగాహన కలిపించకపోవడం వలన పెద్దలు చెప్పిన మాటలే ఆచరిస్తూ బహిష్టు అపరిశుభ్రత వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
బహిష్టు కు సంబంధించిన సాధారణ ఆరోగ్యం లోపించి శారీరక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రక్తహీనత, యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. తరచుగా రక్తస్రావం వల్ల పునరుత్పత్తి నాళ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అసాధారణ రుతుక్రమం వల్ల చాల వరకు రక్తస్రావం ఉండడంతో దీర్ఘకాలంలో గర్భాశయ ముఖద్వారా కాన్సర్‌ వచ్చే అవకాశమూ ఉంది. చిన్న వయసులో బాలికలకు వివాహం, క్రమంలో లేని బహిష్టుతో గర్భం దాల్చడం వలన దుర్భలమైన సమస్యలు తలెత్తుతాయి. బాలికలలో భయము,ఆందోళన,సిగ్గు,బిడియం, ఆత్మన్యూనతకు గురై మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.
కౌమార ప్రాయంలోని వారు తరచుగా వివిధ సమస్యలు, అలజడులు, తిరుగుబాటు ధోరణులతో ఉంటారు. వాని బెంగ అంతా ‘అన్ని తప్పులను ఒప్పుగా చేయడం’ ‘న్యాయం కోసం పోరాటం’ సరైనదే చేయడం పైనే సమాజానికి ఉపయోగ పడే,సమాజ ఉత్పాదకతకు దోహదం చేసి, భాగస్వామ్య పౌరులుగా గుర్తింపు పడాలనే కోరిక వారిలో ఉంటుంది.
నివ్వెరపరిచే వాస్తవాలు, సవాళ్లు. బాలికలు, మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య వంతమైన భవిష్యత్తరాన్ని ఈ సమాజానికి అందించవచ్చని వైద్య నిపుణుల అభిప్రాయం. బాలికల,మహిళారోగ్యంలో ప్రధానంగా చెప్పుకోవలసినది బహిష్టు పరిశుభ్రత. ఇది కేవలం బాలికల,స్త్రీల సమస్యేకాదు, దేశసుస్థిర ఆదాయం,దేశ సర్వతో ముఖాభివృద్ధితో ముడిపడిన సమస్య. కనుక ఈ సమస్యను ఎటువంటి లింగ వివక్ష లేకుండా బాలికలందరికీ విద్య, ఆరోగ్యము,పోషకాహారము, స్వచ్ఛమైన త్రాగు నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత,మౌలిక సదుపాయాల కల్పన,నిరంతర అవగాహన కార్యక్రమాలతో అధిగమించవచ్చు. దీనిలో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు మే 28 న అంతర్జాతీయ బహిష్టు పరిశుభ్రత దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుతున్నారు. అయితే మన ముందున్న వాస్తవాలు,సవాళ్లు ఇలా వున్నాయి.
ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కల్గిన మన దేశంలో సుమారు 355 మిలియన్ల మహిళల్లో నెలసరి రుతుక్రమం జరుగుతున్నది. కిశోర బాలికలలో సుమారు 23% బాలికలు తను మొదటిసారి ఋతుస్రావం కాగానే బడికి వెళ్ళడం మానివేస్తున్నారు.
కిశోర బాలికలో మొదటిసారి సంభవించే రుతుక్రమం సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. కొన్నిసార్లు తొందరగా ఎనిమిది సంవత్సరాలకు లేదా చాలా ఆలస్యంగా పందొమ్మిది సంవత్సరాల వరకు అవుతుంది. దేశంలో 70శాతం తల్లులు బహిష్టును మలినముగా భావిస్తున్నారు. బహిష్టు అంటే సిగ్గుపడే అంశమని, దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనే సంస్కతి ప్రజల్లో వుంది. మనదేశంలో 6కోట్ల 30 లక్షలమంది కిశోర బాలికలు మరుగు దొడ్డి సౌకర్యంలేని ఇళ్లల్లో నివసిస్తున్నారు.
ఒక సంవత్సరంలో పాఠశాలలు పనిచేసే రోలలో 20శాతం దినాలు బాలికలు మొదటి కారణమైన ఇంటిపని,రెండవ కారణమైన బహిష్టు వలన పాఠశాలకు గైర్హాజరవు తున్నారు.బహిష్టు సమయంలో పరిశుభ్రతను సరిగ్గా పాటించక పోవడం వలన మహిళల్లో మరియు బాలికల్లో పునరుత్పత్తి నాళ ఇన్ఫెక్షన్స్‌ 70శాతం పెరిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార కాన్సర్లలో 27శాతం మన దేశంలో ఉండటం ఇంకో విషాదం.
సంస్థల, ప్రభుత్వాల పరిష్కారాలు
యాక్షన్‌ఎయిడ్‌ అనే స్వచ్ఛంద సంస్థ మురికివాడలలోని కౌమారబాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ అందజేస్తోంది.ఇంకా ఇతర అంతర్జాతీయ సంస్థలు సయితం ఈ అంశంపై పనిచేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలల్లో నాడు ` నేడు కార్యక్రమం చేపట్టి మౌలిక సదుపాయాల కల్పనను చేపట్టింది ఇందువల్ల బాలికలు బడిమానివేసే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్‌ను అందజేస్తున్నారు అయితే ఇవి అన్ని గ్రామీణ, గిరిజన పాఠశాలలకూ అందజేయాలి. ‘గర్ల్స్‌ ఫ్రెండ్లీ టాయ్‌లెట్‌’లను నిర్మించాలి, బాలికల కోసం శానిటరీ ప్యాడ్స్‌, సబ్బు, నీటివసతితో ఒక గది ప్రత్యేకంగా కేటాయించాలి. పనిచేసే ప్రదేశాలలో కాలేజీలలో కూడా ఈ సదుపాయాలు కల్పించాలి. పర్యావరణానికి హాని కల్గించని విధంగా తయారచేసిన శానిటరీ నాప్కిన్‌లను మాత్రమే వాడాలి. కౌమార బాలికల కోసం పాఠశాల, కళాశాలల్లో మహిళా కౌస్సిలర్లను నియమించాలి. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు చేయాలి.
-హరి వెంకట రమణ