ఆస్తుల అమ్మకంలో ఆంతర్యమేమి?
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విశాఖ నగరం లోని భూములను వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. దీని కనుగుణంగా ‘నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ వారు మార్చి 30వ తేదీన నగరంలోని ఐదు ప్రదేశాలలో ఉన్న 17.48 ఎకరాల భూమిని వున్నది వున్నట్లుగా అమ్మాలని ‘ఇ టెండర్ల’ను ఆహ్వానించారు. నగరం నడిబొడ్డున ఆర్కే బీచ్‌ను ఆనుకుని ఉన్న 13. 59 ఎకరాల భూమి కూడా ఇందులో ఉంది. ప్రభుత్వం భూములు ఎందుకు అమ్ముతోంది అన్నది ఒక అంశం కాగా, అలా అమ్మడం సహేతుకమేనా అన్నది మరొక అంశం. వాస్తవానికి గత సంవత్సరమే ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేసినా హైకోర్టు ఆర్డర్ వల్ల నిలిచిపోయింది.
అధికారంలోనికి వఛ్చిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ ఎ.పి మిషన్’ అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్ లెవెల్ మోనిటరింగ్ కమిటీని (ఎస్‌ఎల్‌ఎంసి) జీఓ నెం. 447 (తేదీ 5.11.02019) ద్వారా ఏర్పాటు చేసింది. అందులో మూడు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ‘నవరత్నాలు, నాడు-నేడు’ వంటి పథకాల అమలుకు నిధులు సమకూర్చుకోవడం, రెండవది రాష్టంలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను అమ్మడం ద్వారా ఆ నిధులు రాబట్టడం, మూడవది ఈ పనిని సమర్ధవంతంగా చేయడానికి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బిసిసి) అనే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమతో ఒప్పందం చేసుకోవడం. ఇప్పుడు ఈ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ అమ్మకాల జాబితాలో ఉండడం గమనార్హం.
గత సంవత్సరం మార్చి 2వ తేదీన జరిగిన ఎస్‌ఎల్‌ఎంసి సమావేశంలో సుమారు పది వేల కోట్ల రూపాయల విలువచేసే 1400 ఎకరాల భూమి 250 ప్రాంతాలలో ఉందని గుర్తించారు. ఈ భూమిని వివిధ దశలలో అమ్మాలని ప్రతిపాదించారు. మొదటి దశలో విశాఖపట్నం జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 7 మొత్తం 40 స్థలాలను అమ్మవచ్చని ఎన్బిసిసి ఎంపిక చేసింది. ఈ స్థలాల నుండి అత్యధిక రాబడి సాధించేందుకు అవసరమైన సహకారానికి కెనడా రాజధాని టోరొంటో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘కొలియర్స్ ఇంటర్నేషనల్ ప్రవేట్ లిమిటెడ్’, అమెరికా లోని చికాగో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘జెఎల్ఎల్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్’ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచం లోనే అతి పెద్ద కంపెనీలు.
ఇలా అమ్మకానికి పెడుతున్న స్థలాలు ఎపిఐఐసి, ఇరిగేషన్, మునిసిపల్, రెవిన్యూ, ఆరోగ్య, జైళ్ల శాఖలకు చెందినవి ఉండడంతో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా అమ్మకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, జిల్లా జాయింట్ కలెక్టర్ కన్వీనరుగా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు.
అసలు ఇలా భూములు అమ్మడం వివేకమేనా అనే ప్రశ్న అలా ఉండగా ఇంకా విచిత్రమైన రెండు విశేషాలు ఇందులో ఉన్నాయి. ఒకటి స్థలాల విలువ కట్టడమైతే, రెండోది ఈ స్థలాలలో ప్రస్తుతం ఏమున్నాయనేది. మార్కెట్ విలువ కంటే అన్ని స్థలాలలోనూ తక్కువే వస్తుందని వారు పేర్కొన్నారు. అదే సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేట్ల కంటే కూడా వీరు తక్కువ మార్కెట్ రేటును పొందుపరిచారు. దీనర్ధమేమిటంటే భూములను చవకగా అమ్మడం. వీరు అమ్మాలనుకున్న కొన్ని స్థలాలలో ప్రధానమైన ప్రభుత్వ డిపార్ట్మెంట్లు పని చేస్తున్నాయి. ఉదాహరణకు గుంటూరు నగరంలోని అరండల్ పేటలో వున్న తహసీల్దార్ ఆఫీసు, జైలును ఖాళీ చేయించి ఆ స్థలాన్ని అమ్మేయాలని నిర్ణయించారు. అలాగే విశాఖ నగరం లోని సీతమ్మధారలో ఉన్న తహసీల్దార్ ఆఫీసు, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్లను ఖాళీ చేయించి అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా విచిత్రంగా, అక్కడే ఉన్న ప్రభుత్వ కంటి ఆసుపత్రిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా తరలించి, ఆ పదకొండు ఎకరాల స్థలాన్ని కూడా వేలానికి పెట్టాలని నిర్ణయించారు.
ఇంకో విశేషమేమిటంటే గత ప్రభుత్వం విశాఖ నగరంలోని 13.59 ఎకరాల భూమిని ‘లులు మాల్’ కు కేటాయించింది. ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వం దీనిని ప్రజావసరాలకు వినియోగిస్తుందని భావించి ప్రజలు ఈ రద్దును హర్షించారు. కానీ వారికి దిమ్మదిరిగేలా ప్రభుత్వం నేడు ఆ భూమిని కూడా అమ్మకానికి పెట్టింది. ఆ కాడికి పాత కేటాయింపును రద్దు చేయడమెందుకు? ‘లులు మాల్’ కే వదిలేస్తే పోయేది కదా అనే భావనతో ఇప్పుడు ఆ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘బిల్డ్ ఎ.పి” అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడం కాకుండా అమ్మకానికి పెట్టడంలా ఉంది. ఒక పక్క అమ్మేస్తూ, ఇదెలా నిర్మించడం అవుతుందో ఆ పేరు పెట్టిన వారికే తెలియాలి.
ఈ మొత్తం వ్యవహారం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వివేచనను ప్రశ్నించేలా చేస్తోంది. ఇలా అమ్ముకుంటూ పోతే ఆస్తులు తరుగుతాయే కానీ పెరగడానికి ఇదేమీ ఊరే జల కాదు కదా! ఈ అమ్మకాలలో విదేశీ బడా రియల్ ఎస్టేట్ సంస్థలను భాగస్వామ్యం చేయడం వెనుక ఏమైనా మతలబుందా అనే సందేహం కూడా సామాన్యులకు కలగడం సహజం. ప్రభుత్వ ఆఫీసులను కూడా ఖాళీ చేయించి మరీ అమ్మకానికి పెట్టడంలో ఆంతర్యమేంటనే సందేహం కూడా కలుగుతుంది. ఇటువంటి సందేహాలను కొట్టిపారేయకుండా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంటి రోజువారీ ఖర్చులకు ఆదాయ మార్గాలను వెతుక్కోకుండా ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకుంటూ పోతే, ఆ ఇల్లు ఎలా దివాళా తీస్తుందో మన రాష్ట్ర పరిస్థితి కూడా అక్కడికే చేరుకుంటుందనడం అతిశయోక్తి కాదు.
సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే కానీ, ఆ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం వివేకవంతమైన ఆలోచనేనా? అలా అమ్ముకుంటూ పోతే కొన్నాళ్ళకు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోతే అప్పుడు ఏం చేస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేయడమే తమ విధానమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బాట లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనిస్తోందా అనే భావం కూడా ప్రజలకు కలుగుతుంది. ఇప్పుడు విశాఖ భూములతో ప్రారంభించి అనేక ప్రాంతాలలో భూములను అమ్మడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా అవగతమవుతోంది.
ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో పునరాలోచించి స్థిరంగా వచ్చే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించాలి. కేంద్రం నుండి రావలసిన మన వాటా నిధులకై అవసరమైతే అందరినీ కలుపుకుని ఒత్తిడి తేవాలి. అంతేకాని ఇలా ఆస్తులను అమ్ముకోవడం రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విజ్ఞత అంతకంటే అనిపించుకోదు.
–ఎ. అజ శర్మ /వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి