ఆర్టీఐ స్పూర్తికి తూట్లు
పౌరులే అసలైన పాలకులని, ప్రభుత్వానికి వారే యజమానులని సమాచార హక్కు చట్టం ఉద్గాటిస్తోంది. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారాన్నే ప్రజలు నిక్కచ్చిగా పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిందే. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)2005 అక్టోబరు 12న విజయదశిమి నాడు అమలులోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందుతుందని ఈ చట్టం ఆశలు రేకెత్తించింది. లోపభూయిష్ట భారత ప్రజాస్వామ్యం నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా ఎదగడానికి సమాచార హక్కు చట్టం(సహ)చట్టం తోడ్పడుతుందని చాలామంది ఆశించారు. `– సైమన్ గునపర్తి
సమాచార హక్కు చట్టానికి అధికార యంత్రాంగం తూట్లు
‘హమార పైసా హమారా హిసాబ్’ అంటూ రాజస్థాన్ లో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమమై సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెంది ప్రస్తుతం దేశవ్యాప్తమైంది. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనంను పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గదర్శిగా నిలిచింది. గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు ఒక్క దరఖాస్తుతో కావాల్సిన సమాచారం పొందే హక్కును కల్పించింది. కానీ అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం, సమాచార కమిషన్ చట్టాన్ని చట్టబండలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. పెండిరగ్ దరఖాస్తులు, అప్పీళ్లు, ఫిర్యాదులతో సామాన్యుడికి సమాచారం అందడం గగనంగా మారింది. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం సవరణలతో సహ చట్టానికి తూట్లు పొడుస్తుంటే మరోపక్క సమాచార కమిషన్ ఉదాసీన వైఖరి వల్ల చట్ట స్ఫూర్తికి భంగం వాటిల్లుతున్నది.
సవరణలతో బలహీనపరిచే యత్నం
ప్రభుత్వ పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి 2005 అక్టోబర్ 12 నుంచి సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు ఇస్తే ప్రజా సమాచార అధికారులు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైతే ఆ శాఖలోని సీనియర్ అధికారులకు మొదటి అప్పీల్ చేస్తారు. అక్కడ కూడా స్పందన లేకపోతే సమాచార కమిషన్ కు రెండో అప్పీలు చేసుకుని సమాచారం పొందవచ్చు.
జవాబుదారీతనం పెంచాలి
సహ చట్టం అమలుకు కొత్తగా సమాచార కమిషన్లను నెలకొల్పారు.సమాచారం గురించి పౌరులకు,అధికారులకు మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ఈ కమిషన్లకే అప్పగించారు. మినహాయింపులు ప్రకటించిన పది విభాగాల సమాచారాన్ని తప్ప మిగతాదాన్ని ప్రభుత్వం పౌరులతో పంచుకోవలసిందేనని చట్టం చెబుతోంది. పౌరుడు కోరిన సమాచారాన్ని 30రోజుల్లో అందించాలని పేర్కొంది. సమాచారాన్ని అందించడంలో చేసిన జాప్యానికిగాను ప్రభుత్వ ఉద్యోగికి రోజుకు రూ.250చొప్పున జరిమానా విధించవచ్చు. ఆ మొత్తం జరిమానా రూ.25వేలు మించకూడదు.దీన్ని సంబంధిత ఉద్యోగి జీతం నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్టీఐ చట్టం గురించి ప్రజల్లో అవగాహణ పెరగడం తో మొదట్లో దాన్ని ఉత్సాహంగా ఉపయో గించుకున్నారు.అయితే,అధికారంలో ఉన్నవారి నుంచి మాత్రం వ్యతిరేకత పెరిగింది.ఎక్కువగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులనే సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నందువల్ల వారు సమాచారాన్ని అందించడానికి మొండికేసే ఉద్యోగులకు జరిమానా విధించడానికీ మొగ్గు చూపడం లేదనే విమర్శలున్నాయి. సమాచార కమిషనర్ల నియామకంలోనూ పారదర్శకత కరవైంది. వారి అలసత్వంవల్ల సహాచట్టం సరిగ్గా పౌరుల ప్రాథమిక హక్కులను గౌరవించాలనే స్పృహ వారిలో కనబడటం లేదు. అందుకే నిర్ణయాలు తీసుకోవడంలో ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తున్నారు. సహచట్టం పకడ్బందీగా అమలు కావడానికి కొన్ని రకాల పద్దతులు పాటించాలి. సమాచార కమిషనర్ల నియామకానికి నిర్ధిష్ట అర్హతలు,అనుభవాలను ప్రమాణాలుగా నిర్ణయించి,వాటిని కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ప్రభు త్వం పరిష్కరిస్తున్న కేసుల సంఖ్య ఏడాదికి సగటున రెండువేల లోపుగానే ఉంటోంది. ఒక్కో కమిషనర్ ఆరువేలదాకా,వీలైతే అంతకన్నా ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. కేసులను 90రోజుల్లోగా పరిష్కరించాలనే నిర్ధిష్ట పరిమితుల్నీ విధిం చాలి.ప్రతి కమిషనర్ పనితీరును ఆరు నెలలకు ఒకసారి సమీక్షించాలి. తదుపరి రెండేళ్లలో సమాచారం కోసం అందే దరఖాస్తులు,వాటి పరిష్కారం గురించి అంచనా వేయాలి.దాన్ని వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెలా అందుకుముందు నెలలో కమిషనర్ పనితీరు గురించి వెల్లడిచేయాలి. అవసరాన్ని బట్టి ఎందరు సమాచార కమిషనర్లను నియ మించవలసిందీ ప్రభుత్వం ఆరునెలల ముందే ప్రకటించాలి. ఈ పదువులకు ప్రముఖులు నుంచీ దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఇతరులు నామినేట్ చేసినవారినీ పరిశీలించి ఎంపిక చేయవచ్చు.అందుబాటులో ఉన్న సమాచార కమిషనర్ పదవులకు మూడురెట్లు ఎక్కువ పేర్లతో జాబితాను రూపొందించే పనిని యూపీఎస్సీ సభ్యులతో ఏర్పాటయ్యే కమిటీకి అప్పగించాలి. లేక మరేదైనా పద్దతినీ అనుసరించవచ్చు. ఆజాబితా నుంచి ఎవరిని ఎందుకు ఎంపిక చేసిందీ స్పష్టంగా వివరిం చాలి. పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సంబంధిత అన్వేషణ కమిటీ బహిరంగంగా ముఖాముఖి నిర్వహించాలి. పౌరులు,మాధ్యమాల అభిప్రాయాలనూ స్వీకరించాలి. తర్వాత అందుబాటులో ఉన్న సమాచార కమిషన్ పదవులకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేయాలి. ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రితో కూడిన కమిటీ ఈ జాబితా నుంచి తుది నియామకాలు జరపాలి. సమాచార కమిషనర్లలో సగం మంది వయస్సు 60ఏళ్లకన్నా తక్కువ ఉండాలి. సమాచార హక్కు అమలుకు పాటుపడుతున్న ఉద్యమాకారులలో అరునలైన వారిని కమిషనర్లుగా నియమించాలి. సమాచార కమిషనర్ల ఎంపికను పారదర్శక ప్రక్రియను పాటించి,వారు తమ విధులను పకడ్బంధిగా నెరవేర్చలా నిరంతరం ఒత్తిడి తెస్తూ జవాబు దారీతనం పెంచినట్లుయితే సహచట్టం నుంచి మెరుగైన ఫలితాలను సాధించగలుగుతాం. అలాంటి ప్రక్రియనే ఇతర అనేక కమిషన్లకూ వర్తింపచేయవచ్చు.
సరైన ఫలితాలు శూన్యం
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పనితీరును తనికీ చేసి,పొరపాటు జరిగితే సరిదిద్ది సమతూకం సాధించే బాధ్యత సంబంధిత కమిషన్లపై ఉంది. ప్రస్తుతం పలు కమిషన్లు ఆశించిన స్థాయిలో విధులను నిర్వహించడం లేదు. చాలా కమిషన్లు సీనియర్ పౌరుల క్లబ్బుల్లా తయారయ్యాయి. పనిలేకుండా పదివిని, దాంతోపాటు వచ్చే సౌకర్యాలు,పారితోషకాలను అనుభవించే మార్గాలుగా మారాయి. నేడు మానవ హక్కుల కమిషన్,మహిళా కమిషన్, లోకాయుక్త వంటి కమిషన్లు ఉన్నా..వాటి నుంచి ఆశించిన ఫలితాలు లభించడం లేదు. సము చిత అర్హతలున్న వ్యక్తులను కమిషన్లుగా నియమిస్తూ,వారి పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ సమాచార కమిషన్లను సమర్ధంగా పనిచేయించడంపై దృష్టి కేంద్రీకరించాలి.
సమీక్ష అవసరం
పౌర సమాజం సైతం సమాచార కమిషనర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేయాలి. వారి నిర్ణయాలను ప్రతినెలా పారదర్శకంగా సమీక్షించాలి. ప్రతి కమిషనర్ పనితీరుపై మూడు నెలలకు ఒకసారి మూల్యాంకన పత్రాన్ని ప్రచురించాలి. సమాచార కమిషనర్ల నిర్ణయా లను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ మూల్యాం కన పత్రాన్ని రూపొందించే పనిని న్యాయ కళాశాల విద్యార్ధులకు అప్పగించ వచ్చు.
జీవోలు ఇచ్చి వెనక్కి తగ్గిన సర్కారు
తెలంగాణ ప్రభుత్వం నిరుడు అక్టోబర్లో విడుదల చేసిన మెమో నంబర్ 3476 ప్రకారం సహ చట్టం కింద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులకు సమాచారం ఇవ్వాలంటే సదరు ప్రజా సమాచార అధికారి వారి ప్రభుత్వ విభాగానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హైకోర్టు ఆ ఉత్తర్వు లను నిలిపివేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం వివరణ కోరడంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసి వాటి స్థానంలో నవంబర్12 న అంతర్గత ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకా రం కోరిన సమాచారం తన వద్ద పూర్తిగా లేదని ప్రజా సమాచార అధికారి భావిస్తే ఉన్నతాధికారుల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు ఉత్తర్వుల్లో కొన్ని పదాలు మారినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం ఒకటే అన్నది స్పష్టమవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఆర్థిక వనరు లను,నిధుల వివరాలను పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జీవోలను దాస్తూ పారదర్శకతకు తిలోదకాలు ఇస్తున్నది. అలాగే సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్ర సమాచార కమిషన్ లో11 నుంచి-12 మంది సమాచార కమిషనర్లు పనిచేయాలి. కానీ మన రాష్ట్ర కమిషన్ లో ప్రస్తుతం కేవలం ఆరుగురు సమాచార కమిషనర్లు మాత్రమే ఉన్నారు. మిగతా కమిషనర్లను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.
పనితీరు సరిగా లేక..
2017 సెప్టెంబర్లో కొత్తగా తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటైంది. బదిలీ అయిన పిటిషన్లు 6,825 కలుపుకొని మొత్తం38 వేల పిటిషన్లు కమిషన్?కు అందగా ఇప్పటివరకు 31 వేల పిటిషన్లను పరిష్కరించామని కమిషన్ చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో లెక్కలు మరోలా ఉన్నాయి. కొందరు సమాచార కమిష నర్ల షోకాజ్ నోటీసులు, జరిమానాల విషయం చూస్తే అర్థమవుతుంది. 2017 సెప్టెంబర్ నుంచి జూన్ 2022 వరకు సమాచార కమిషన్ 27,877 కేసుల్లో 753 కేసులకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వాటిలో కేవలం 38 మంది ప్రజా సమాచార అధికారులపై రూ.1,13,000 జరిమానాలు మాత్రమే విధించారు. ఒక్క కేసులో కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అప్పీళ్లు, ఫిర్యాదులు పరిష్కరించడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుందని ‘సతార్కు నాగరిక్ సంఘటన్’ నిరుడు అక్టోబర్ నెలలో విడుదల చేసిన తన నివేదికలో స్పష్టం చేసింది. కమిషన్ ఏర్పడిన ఈ ఐదేండ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్ ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. చట్టం అమలుకు సంబంధించి కమిషన్ ఏటా వార్షిక నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం కేసులు, పరిష్కరించినవి ,పెండిరగ్లో ఉన్నవి, జరిమానాలు విధించినవి, క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయాలను ప్రస్తావించాలి. కానీ కమిషన్ ఏర్పడిన ఐదేండ్ల లో ఒక్కసారి కూడా వార్షిక నివేదికను విడుదల చేయలేదు.
స్వచ్ఛంద సమాచార వెల్లడి ఎక్కడ?
సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 4(1)బి చట్టానికి గుండెకాయ వంటిది. ఇందులో 17 అంశాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల వివరాలు వారి విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆ కార్యాలయానికి వస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు వీటన్నిటిని సంబంధిత ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా ప్రజలకు తెలియజేయాలనేది నిబంధన. రాష్ట్రంలో దాఖలవుతున్న దరఖాస్తులు 60 శాతం ఈ సెక్షన్ పరిధిలో సమాచారం కోరుతూ వస్తున్నవే. కానీ చాలా ప్రభుత్వ కార్యాల యాల్లో అయిదారేండ్ల కిందటి పాత సమాచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ శాఖలను ప్రశ్నించాల్సిన సమాచార కమిషన్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. ప్రజా సమాచార అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కార్యాలయ సమాచారాన్ని సరైన విధంగా డిజిటలైజ్ చేయలేకపోతున్నారు.అన్ని ప్రభుత్వ విభాగాలు తమ బడ్జెట్లో ఒకశాతాన్ని డిజిటలైజేషన్తో పాటు,సమాచారం మెరుగ్గా నిర్వహించడానికి వ్యయం చేయాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దాన్నెవరూ పట్టించుకోవడం లేదు.జాగృత జన వాహిని పిడికిలి బిగించకుంటే సమాచార హక్కుకు గ్రహణం తథ్యమని యూఎఫ్ఆర్టీఐ రాష్ట్ర కో కన్వీనర్ అంకం నరేష్ అభిప్రాయపడ్డారు.
సహ చట్టాన్ని నీరుగారుస్తున్నారు – నార్నె వెంకట సుబ్బయ్య
ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు,అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు తెలియచెప్పేం దుకు, పౌరులకున్న హక్కును చట్టబద్దం చేసేందుకు సమాచార హక్కు (సహ) చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం పెద్ద పోరాటమే జరిగింది. ఈ చట్టం రాకముందు ఆఫిస్కి వెళ్ళి బల్ల మీద చెయ్యి పెట్టడానికి కూడా వుండేది కాదు. ఈ చట్టం వచ్చిన తరు వాత ఖచ్చితంగా అడిగిన సమాచారం ఇవ్వా ల్సిన అవసరం వచ్చింది. పౌరునికి చదువు రాకపోయినా వారు కోరినవిధంగా అధికారులే ఫిర్యాదు రాసి అప్లికేషన్ పూర్తిచేసి పెట్టాలి. ఒకవేళ ఫిర్యాదులో అచ్చుతప్పులు దొర్లినా, భాషా పరిజ్ఞానం లేకపోయినా విషయం అర్ధమైతే చాలు. సమచారం ఇవ్వాలి.అలాంటి చట్టం వున్నప్పటికీ ఈరోజు అధికారులు కావల సిన సమాచారం ఇవ్వకుండా తప్పించు కుంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది అధికారులు కావాలని, ‘మీరు అడిగింది సెక్షను 8.1లోకో రెండు లోకో వస్తుంది కనుక సమాధానం ఇవ్వం’ అంటూ తప్పించుకుంటున్నారు. దేశ రక్షణకు సంబంధించినది అయితే ఇవ్వకూడదు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అవి నీతి గురించి మీరేం చర్యలు చేపట్టారు,సదరు పని జరగకపోవటానికి కారణాలు తెలపండి అనడిగితే అవి చెప్పటానికి ఇష్టంలేక ‘దీనికి సమాధానం మా కార్యాలయంలో లేదు. మా పరిధి లోకి రాదు’ అని తిప్పి పంపుతున్నారు. వారి దగ్గర లేకపోతే ఎవరి దగ్గరవుందో, వారికి ఫిర్యాదు పంపి, ఐదు రోజులలోపు ఆ సమాచారం ఫిర్యాదుదారునికి తెలపాలి. అంతేగాని ఇవ్వకుండా వుండకూడదు. దీనికంతటికి కారణం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన ఆర్టిఐ కమిషన్ వారు సరైన చర్యలు తీసుకోకపోవటం. దీంతో అధి కారులు తప్పుడు సమాచారం ఇచ్చి సహ కార్య కర్తలను నిరుత్సాహ పరుస్తూ, చట్టాన్ని నీరుగారు స్తున్నారు. కనుక ఇకనైనా చట్టాన్ని, అందులోని సెక్షన్లను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకొని జరిమానా విధించాలి. అప్పుడే సహ చట్టం బతుకుతుంది.