ఆదివాసీ జీవనం విధ్వంసం
సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులుగా, అడవుల సంరక్షకులుగా వాసికెక్కిన వనవాసుల జీవనం ఆధునికులకు ఆశ్చర్యంగా ఉన్న అసలైన మానవ సంస్కృతి వారి వద్దేఉంది అన్నది వంద శాతం నిజం.అటువంటి అడవి బిడ్డల జీవన సంస్కృతుల గురించి ఇంతకాలం వారిని పరిశీలించిన దగ్గరగా జీవించిన వారే వ్రాయడం చూసాం చదివాం కానీ 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక మార్పుల్లో భాగంగా అడవి బిడ్డల్లో అక్షరాస్యత విరివిగా పెరగడంతో వీధి బడి చదువులో నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి ఆదివాసుల చదువులు ఎదిగాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడువాయి మండలం కామారం గిరిజన గ్రామానికి చెందిన మైపతిఅరుణ్ కుమార్ అనే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తన గిరిజన జన జాతికి చెందిన జీవనం గురించి,దాని విధ్వంసం గురించి కూలం కశమైన గ్రంథం వ్రాశారు. ఒక గిరిజన యువకుడు అందున పోరాట నాయకుడు, అయిన అరుణ్ కుమార్ ఈ రచన చేయడానికి 2012లో సుమారు నెలరోజుల పాటు 5848 కిలోమీటర్ల దూరం పర్యటించి తెలుగు ప్రాంతాలే కాక పక్క రాష్ట్రాల్లోని గిరిజన గ్రామాలను సందర్శించి స్థానిక చరిత్రలతో పాటు అక్కడి భౌగోళికత, గిరిజనజీవన స్థితి గతులు, ఆధునిక ప్రపంచీకరణ ద్వారా ఆదివాసులకు జరుగుతున్న నష్టాలు, భావితరం తీసుకోవలసిన జాగ్రత్తలు, గురించి, సవివరంగా సచిత్రంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.502 పేజీలు గల ఈ బృహత్తర రచనను 30 అధ్యాయాలుగా విభజించారు, ఆదివాసి స్వయం పాలన ఉద్యమ సారథి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారికి అంకితం ఇవ్వబడ్డ ఈ గ్రంథం నాటి వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యం, మొదలుకొని దేవాదుల ప్రాజెక్టు, కమలాపురం కాగిత పరిశ్రమ, అశ్వాపురంభార జల కర్మాగారం, భద్రాచలం పేపర్ బోర్డు, మొదలుకొని.. రంప రాజ్యం రంప పితూరి శ్రీకాకుళం గిరిజన ఉద్యమం దాని కారకుడు సత్యం మాస్టారు వాకపల్లి అమాను షత్వం, బొండా,భగత,గిరిజన జీవన విధానాలు మర్రి కొమరయ్య పోరాటం ఇలా అనేక విషయాలు ఇందులో వివరించబడ్డాయి. అలాగే నల్లమల చెంచుల జీవితాలు, చెంచుల చెరవిడిన శ్రీశైల క్షేత్రం, చెంచుల జీవావరణ వ్యవస్థ, ప్రమాదంలో చెంచుల మనుగడ, గురించి కూడా ఇందులో హెచ్చరించారు రచయిత, ఇక ఆదిలాబాద్ గుండులు తొలి పోరాటయోధుడు రాంజీ గోండు,కేస్లాపూర్ నాగోబా జాతర,బాసర క్షేత్రం,గోండ్వానా రాజ్య పాలన చరిత్రతో పాటు గోండుల ఆరాధ్య దైవం హైమన్ డార్ప్,గుస్సాడి నృత్యం, తదితర జగద్వితమైన విషయాలను భిన్నకోణాల్లో క్షేత్ర పర్యటనల అనుభవసారం జోడిరచి, అనేక ప్రామాణిక విషయాలు, విశేషాలతో ఈరచన చేయబడిరది,
గిరిజన ప్రాంతాలలోని వాస్తవాలతో పాటు, చరిత్ర, గణాంకాలు, చిత్రపటాలతో ఈ బృహత్తర గ్రంథం పరిపూర్ణ ప్రామాణికత సాధించింది అనడంలో అతిశయం అనిపించదు.
రచన శైలి కూడా సరళమైన బాణీలో ఉండి పాఠకులకు అనుకూలంగా చదివించే విధంగా ఉంది.
అచ్చమైన ఆదివాసి జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర పూర్వకథ తోపాటు పూజా విధానాలు వారి ఆచారాల ప్రకారం ఎలా చేస్తారు వివరిస్తూ నీటి ఆధునిక సమాజం గిరిజన ఇతరులు జాతరను హస్తగతం చేసుకుని అసలు సాంప్రదాయాన్ని ఎలా కనుమరుగు చేస్తున్నారో చెబుతూ రచయిత అరుణ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్వంచ అటవీ ప్రాం తానికి చెందిన గిరిజన పోరాట యోధుడు, చరిత్ర విస్మరించిన వీరుడు, అయిన ‘‘సోయం గంగులు’’ పోరాటతీరు అమరుడైన వైనం, గురించి ఇందులో పేర్కొనడం ద్వారా రచయిత అరుణ్ లోని సూక్ష్మ పరిశీలన, పరిశోధన దృష్టి అర్థమవుతుంది, ఇలా వ్యక్తులే కాకుండా ప్రాంతాలు ఆచారాలు, ఆహారాలు, పండుగలు, మొదలైన అనేక విషయాలు, విశేషాలు, గురించి భిన్నకోణంలో ఇందులో వ్యక్తీకరించబడి తద్వారా అనేక నూతన విషయాలు సంఘటనలు ఆవిష్క రించ బడ్డాయి.కేవలం గిరిజన ప్రాంతాల్లో ప్రపంచీకరణ సాయంగా జరుగుతున్న యుద్ధం, గురించి విమర్శించి వదిలేయలేదు, కానీ నిలుపుదలకు తీసుకోవలసిన చర్యలు చట్టాలు అమలుకు తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి కూడా నిర్మొహమాటంగా వివరించి జాగృతంతో కూడిన హెచ్చరికలు చేశారు రచయిత.
ఒక గ్రామాన్ని షెడ్యూల్ ఏరియాగా గుర్తించడానికి ఉండాల్సిన అర్హతలు గురించి చెబుతూ ప్రధాన లక్షణాలైనా అధిక శాతం ఆదివాసీలు ఉండటం,
ఆ గ్రామ అభివృద్ధి స్థాయి,ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటందుకు గల విస్తీర్ణం,వంటి ప్రాథమిక మార్గదర్శకాలు ఇందులో చెప్పారు, అలాగే చాలా గిరిజన గ్రామాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా షెడ్యూల్ గ్రామాలుగా ఎంపిక చేయబడక, అక్కడ గిరిజనులు అయిదవ షెడ్యూల్ హక్కులు ఎలా కోల్పోయి నష్టపోతున్నారో కూడా ఇందులో వివరించారు.
వాకపల్లి అడవితల్లి ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం, భూపతిపాలెం ప్రాజెక్టు, కన్నెధార గ్రానైట్ పరిశ్రమ వల్ల అక్కడి ఆదివాసీల జీవనానికి వాటిల్లుతున్న ముప్పు,
గుర్తు చేస్తూనే శ్రీకాకుళం ప్రాంత సవర గిరిజనుల నృత్యాలు, ఆచారాలు, తో పాటు వారి ఉన్నతికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి గురించి కూడా గుర్తు చేశారు.
అలాగే ఆదిలాబాద్ ప్రాంతానికే వన్నెతెస్తున్న ‘‘కుంటాల జలపాతం’’ ఎలా కనుమరుగు కాబోతున్నదో కూడా చెబుతూ ఇది శకుంతల దుష్యంతుల విహార కేంద్రమని, మొదట దీనిని ‘‘శకుంతల జలపాతం’’గా పిలిచేవారని కాలక్రమంలో ‘కుంటాల’గా రూపాంతరం చెందిందనే చారిత్రిక విషయాలను కూడా ఇందులో వివరించారు.
అదేవిధంగా కొమరం భీమ్ పోరాట క్షేత్రం జోడేఘాట్ గురించి, పోరాటం యొక్క నేపథ్యం గురించి కూడా ఆసక్తికర విషయాలు విశేషాలు ఇందులో పొందుపరిచారు.
గోండుల గుస్సాడి గురించి, నాగోబా జాతర నేపథ్యం వివరాలు ఇలా… ప్రసిద్ధ, అప్రసిద్ధ అనే తేడా లేకుండా సంపూర్ణ గిరిజన సమాచారం వెలికి తీసి అక్షరీకరణ చేయడమే లక్ష్యంగా అరుణ్ కుమార్ అక్షర కృషి కొన సాగింది అనడానికి నిండు నిదర్శనం ఈ బృహత్తర పుస్తకం.
ఆదివాసి జీవనం గురించి తెలుసుకోవాలి అనుకునే పాఠకులే కాదు, గిరిజన విజ్ఞాన పరిశోధకులు విధిగా చదివి తీరాల్సిన ఉత్తమ పొత్తం ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్ : 7729883223)