ఆదివాసీల హీరో బిర్సా ముండా

తెల్లవారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన విప్లవ కారుడు..బిర్సా ముండా..స్వాతంత్య్ర సమరయోధుడు.. గిరిజిన నాయకుడు అయిన ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..కొందరు ప్రముఖుల పేర్లు తప్ప ఈయన పేరును ఈ తరం యువత పెద్దగా విని ఉండరు.. దేశం కోసం నెత్తురు చిందించిన మహానుభావులలో ఒకరు.ఈయన గురించి తెలుసుకోవడం మన భాధ్యత. ఈసందర్భంగా బిర్సా జీవితంలోని పలు కీలక ఘట్టాలను తెలుసుకుందాం..!
ఆదివాసీ పోరాటాల వారసత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన యోధుడు బిర్సా ముండా. ఆదివా సీలపై జరుగుతున్న అణచివేతను చిన్నతనం నుంచీ చూసిన బిర్సాముండా అగ్రవర్ణాల దోపిడీపై గళం విప్పాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సమరశం ఖం పూరించాడు. ఆదివాసీల ప్రాథమిక హక్కుల కోసం, జల్‌, జంగ్‌, జమీన్‌ కోసం విల్లంబులు అందుకుని పోరుబాట పట్టాడు. ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమైన ఆదివాసీ రాజ్యాలను చూసి తట్టుకోలేకపోయిన బిర్సాముండా నల్ల దొరలతోపాటు, తెల్ల దొరలపైనా ఆయుధాలు ఎక్కుపెట్టాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతా ల్లో సాగిన ‘మిలినేరియన్‌’ ఉద్యమానికి నాయ కత్వం వహించాడు. బిర్సాను దొంగ చాటుగా బంధించిన తెల్ల దొరలు 1900 జూన్‌ 9న రాంచీ జైలులో హత మార్చారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బిర్సాముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం. నేటి పాలకవర్గ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఆదివాసీ సమాజాన్ని అంతం చేస్తోంది. పరి శ్రమలు, ప్రాజెక్ట్‌ల పేరు మీదు లక్షలాది ఆదివాసీ కుటుంబాల వారు నిర్వాసితుల య్యారు. దేశం లోని 570 గిరిజన తెగలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ లెక్కల ప్రకా రం 75వరకు తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వీటిలో 19 తెగల ఆదివాసీ జనాభా వెయ్యికంటే తక్కువ. ఈ తెగలు కనుమరు గయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో అగ్రకులాలను ఎస్టీ జాబితాలో కల పాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే లంబా డీలు ఆదివాసీల రిజర్వేషన్లను దోచుకున్నారు. ఇందుకు దళారీ పాలకవర్గ విధానాలే కారణం. ఈ నేపథ్యంలో బిర్సాముండా పోరాట స్ఫూర్తిని అందిపు చ్చుకుని, ఆదివాసీలను చైతన్యపరిచి, వారి ప్రజాస్వా మిక హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మేధా వులు, విద్యావంతులపై ఉంది…..!
భూమికోసం, భుక్తి కోసం గిరిపు త్రుల స్వేచ్ఛా, స్వతంత్రాల కోసం సమరశం ఖాన్ని పూరించి, శతాబ్దాల బ్రిటిష్‌ ఆరాచక పాలనపై ఉక్కు పిడికిలి బిగించిన సాయుధ విప్లవ కొదమ సింహం,మన్యం వీరుడు అల్లూరి కంటే ఐదు దశాబ్దాల ముందే ఆయుధం పట్టిన ధీరుడు బిర్సా ముండా. బ్రిటిష్‌ దొరల అండదండలతో గిరిజన ప్రాంతాలను భూస్వాములు, జాగీర్‌ దారులు ఆక్రమించి గిరిజనుల భూమిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి. బ్రిటీష్‌ ప్రభుత్వ అరాచక పాలనలో ఆదివాసులకు అడవిపై హక్కు ఉండేది కాదు.19వ శతాబ్దం చివరలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని ఈ క్రూర మైన దోపిడీకి, ఆధిపత్యానికి, దురాగ తాలకు వ్యతిరేకంగా గిరిపుత్రులు మారణ యుద్ధం చేశారు. ఇటు వంటి ఎన్నో అణిచి వేతలకు గురికాబడిన చోటానాగ్‌పూర్‌ ప్రాంత ప్రజలకు బిర్సా ఆరా ధ్యుడు. నిత్యం పేదరికం, బాధలతో ఉండే చోటానాగ్‌పూర్‌ ప్రాంతం, ఒకవైపు ఆకలి, మరోవైపు భూస్వాములు,బ్రిటీష్‌ పాలకుల దోపిడీ,అణిచివేతలతో కారు చీకట్లతో కప్పబడి ఉండేది.ఈ ప్రాంతంలోని ఉలిహాటు అనే గ్రామంలో నవంబర్‌ 15,1875లో సుగు ణా ముండా, కార్మిహటు అనే దంపతులకు బిర్సా జన్మించాడు. తన బాల్యం మొత్తం తీవ్ర మైన పేదరికం, ఆకలితో గడిపాడు. తన తల్లి దండ్రుల అతి పేదరికం కారణంగా బిర్సా కొన్నిరోజులు తన మేనత్త దగ్గర, మరికొన్ని రోజులు తన మేనమామ దగ్గర ఉండాల్సి వచ్చింది. తన మేనమామ దగ్గర ఉండే రోజు లలో జయపాల్‌నాగ్‌ అనే ఉపా ధ్యాయుడి సహకారంతో బిర్సా ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆతరువాత ప్రాథమికోన్నత విద్యాభ్యాసం కోసం మిషనరీ పాఠశాలలో ప్రవేశం పొందాడు. ఆరోజులలో చదువుతో పాటు,మత మార్పిడి కూడా జరిగేది.తన చదువు కోసం బిర్సా అతని తండ్రి బాప్తిజం స్వీకరించారు. పాఠశాలలో బిర్సా చురుకుద నాన్ని,మేధస్సుని గుర్తించిన ఉపా ధ్యాయులు, చారుభాషా పట్టణంలోని జెర్మన్‌ లూథరన్‌ మిషనరీ స్కూల్‌కు ఉన్నత చదువుల కోసం పంపించారు. అయితే బ్రిటిష్‌ వారు భారతీ యులకు చదువు నేర్పించడానికి ప్రధాన కారణం,వారి ఆజ్ఞ ప్రకారం పని చేసే సేవకు లను తయారు చేసుకోవడానికి మాత్రమే. ఏదే మైనప్పటికీ ఆ విద్య వలన ప్రజలతో నూతన ఆలోచనల వ్యాప్తి పెరిగింది. ఆచదువు ప్రజా హక్కులను వారిపై జరుగుతున్న అన్యాయాలను, అణిచి నేతలను తెలుసుకునేలా చేసింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల సహకారంతో మిషనరీలు గిరిజనుల భూములను ఆక్రమించు కునే పనిని మొదలు పెట్టాయి. ఈ యుక్తులకు వ్యతిరేకంగా ముండా తెగ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. బిర్సా తనఉపాధ్యాయుల ద్వారా యూనియన్‌ ప్రజలు తమ భూమి మీద అతి తక్కువ శిస్తులు చెల్లిస్తారని తెలుసుకొని, శిస్తులను బహిష్కరించాలని తన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఒక రోజు మిషనరీ మతపెద్ద బిర్సా తరగతి గదిలో ముండాల పోరాటాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా,బిర్సా ఒక్క ఉదుటున లేచి నిరసన వ్యక్తం చేశాడు. తన బాల్యంలో చదువుకోవాలనే తపనతో మిషనరీ పాఠశాలో చేరిన బిర్సా,చట్టబద్దమైన ముండా తెగ ప్రజల పోరాటాన్ని మిషనరీలు ధిక్కరించడాన్ని జీర్ణిం చుకోలేక అక్కడి నుండి బయటకొచ్చాడు. 1894లో బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కు చట్టం-8(1882), భూస్వాములకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాలమూ,మన్‌భమ్‌, చోటానాగ్‌పూర్‌ ప్రాంతాలలోని గిరిజన భూము లను బలవంతంగా స్వాధీనపర్చుకొని వారిని ఇండ్ల నుండి తరిమికొట్టారు.ఈ దురా గతాలకు వ్యతిరేకంగా బిర్సా ఆరు గ్రామాల ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వానికి మెమో రాండం అందించారు. కానీ ప్రభుత్వం వారి డిమాం డ్లను పూర్తిగా తిరస్కరించింది.ఈ పరి ణామా లను గమనిస్తున్న బిర్సా కేవలం,భూస్వా ములు,జాగీర్‌దారుల మీద పోరాటం చేస్తే సరిపోదని, ఈ పోరాటం వలసవాద బ్రిటిష్‌ ప్రభుత్వం మీద కూడా చేయాలని నిర్ణయించు కున్నాడు. ఆధునిక విద్యా,శాస్త్రీయ విద్య అభ్య సించిన కారణంగా బిర్సా మూఢ నమ్మకాలను ఎప్పుడు వ్యతిరేకించేవాడు.తన జాతిలోని వివిధ సంఘాలను,మత విశ్వాసా లను ఏకం చేయాలని,తన ప్రజలకు ఆధునిక విద్య అందకపోవడం వలనే ప్రకృతి వైపరి త్యాలను, వ్యాధులను ఎదుర్కోలేక పోతున్నారని భావించాడు. మూఢ నమ్మకాలు,క్షుద్ర పూజలను,అసంఖ్యాకంగా ఉన్న దేవుళ్లని అరాధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత తక్కువ వ్యవధిలో ఈ ఉద్యమం ముండా తెగ ప్రజలలో నూతన విశ్వాసం నింపడంతోపాటు ఉద్యమ సైద్ధాంతిక శక్తిని కూడా పెంచింది. చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలతో చల్‌కాడ్‌ ప్రాంతం జనసంద్రం కాగా, 20ఏండ్ల ఆ యువకుడిని ప్రజలు వారి నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రజా ఐక్యతను పెను ముప్పుగా భావించిన భూస్వాములు, మిషనరీలు బిర్సా మీద వ్యతిరేక ప్రచారం చేశాయి. ఈనేపథ్యంలో బిర్సాను, తన అను చరులను 24 సెప్టెంబర్‌ 1895లో అరెస్ట్‌ చేయించారు. రెండేండ్ల తర్వాత జైలు నుండి విడుదలైన బిర్సా సాయుధ బలగాన్ని నిర్మిం చాల్సిన ఆవశ్యకతను గుర్తించాడు. రాత్రి పగలు తేడా లేకుండా తీవ్రమైన కరువు, వ్యాధుల మీద ఆయన చేసిన పోరాటం అక్కడి ప్రజలను ఎంతో ఆలోచింపజేసింది. పీడిత ప్రజలు బిర్సా పోరాట పటిమను గుర్తించారు. ఆయన అనుచరులు చాలా గోప్యంగా బిర్సా సిద్ధాం తాలను జనంలోకి తీసుకెళ్లారు. జన సంచారం లేని దట్టమైన అడవుల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు. సంఘం పని బాధ్యతలను విభజించి తన ప్రధాన శిష్యులైన డొంక, గయాముండా, డిరకాముండా, తైత్రౌం ముండా, రిషిముండాలకు అప్పగించారు. అనవసరంగా ఎవరినీ చంపకూడదని, తన అనుచరులకు ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయుధ తిరుగుబాటు చేసి, దోపిడీకి గురికాబడే పీడిత వర్గాలను ఏకం చేసి దీర్ఘకాలిక ఉద్య మాన్ని నడపాలని పిలుపునిచ్చాడు. డిసెంబర్‌ 24,1899న రాంచీ, చారుభాషా ప్రాంతాలలో మొదలైన తిరుగుబాటు అత్యంత తక్కువ వ్యవధి లో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిం చింది. పోలీసులను, భూస్వాములను, వ్యాపారు లను తనను హింసించిన వారినందరినీ కసి తీరా కడతేర్చారు. జనవరి 7,1900నాడు రెండు కంపెనీల మిలటరీ బలగాలతో బ్రిటీష్‌ ప్రభుత్వం గిరిపుత్రుల మీద తూటాల వర్షం కురిపించింది. అక్కడితో ఆగకుండా గ్రామాల మీద దాడులు చేశారు. లైంగికదాడులు, హత్యలు, దోపిడీ… ఒక విధంగా చెప్పాలంటే ఊళ్లను వళ్లకాడులా మార్చేశారు. బిర్సా ముండాను పట్టుకోవడానికి ఎంతోమంది అమాయక గిరిజనులను హింసించారు. అంతిమంగా డబ్బుకు అమ్ముడుపోయిన ఒక ద్రోహి ద్వారా బిర్సాను పట్టుకోగలిగారు. 3మార్చి 1990 నాడు తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు వేలాది మంది గిరిజనులు చారుభాషా జైలుకు తరలివెళ్లారు. బిర్సాను ఉరితీస్తే పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన అధికారులు, కేసు కోర్టులో ఉండ గానే ఆహారంలో విషం కలిపి చంపేశారు. బయటి ప్రపంచానికి మాత్రం కలరా వ్యాధితో చనిపోయాడని నమ్మించారు. ఆనాడు దురాగ తాలకు, దోపిడీకి, అన్యాయానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన ఆ అమ రుడి త్యాగం,గొప్పతనం,నేడు దోపిడీకీ,అణివేతలకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. ఆయన మరణం కేవలం ఒక తెగ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసమే కాదు. బాధిత, పీడిత వర్గాల ఐక్యత కోసం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దోపిడీ మాత్రం కొనసాగుతూ ఉంది. జనాభా ప్రాతిపాదికన మా రిజర్వేషన్లు మాకివ్వం డయ్యా..అని అడిగిన గిరిజనులపై లాఠీలు రaలిపించారు. మన వెలమ దొర పాలనలో దళిత, గిరిజన, బహుజనులపై జరుగుతున్న దురాగతాలు కోకోల్లలు. బిర్సా స్ఫూర్తితో అధిక సంఖ్యలో ఉన్న బాధిత, పీడిత ప్రజానీకం ఏకమై మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి. –(మూడ్‌ శోభన్‌నాయక్‌)