ఆడవి తల్లిని అమ్మకన్నా మిన్నగా కాస్తున్న స్త్రీమూర్తులు

‘అ.. అమ్మ! తర్వాత ఆ.. ఆవు!’ అనే చాలామందికి తెలుసు. కొందరు మాత్రమే.. అమ్మ తర్వాత అమ్మలాంటి ‘అడవి’ అని అక్షరాలు దిద్దుతారు. ఆ పదాన్ని అక్కడితో మర్చిపోరు. ఎక్కడికి వెళ్లినా తలుచుకుంటారు. తమ చుట్టూ పచ్చగా ఉండాలని భావిస్తారు. అడవిని ఆడపడుచుగా గౌరవిస్తారు. ఆమెకు మొక్కలు చదివిస్తూ ఆలనా పాలనా చూస్తారు. అలాంటి వాళ్లే ఈ స్త్రీమూర్తులు. కుంచించుకుపోతున్న అడవులను చూసి చింతించి ఊరుకోకుండా.. తమ వంతుగా చెట్లు నాటుతూ పచ్చదనం పెంచుతూ అడవితల్లిని అమ్మకన్నా మిన్నగా కాస్తున్న ఈ స్త్రీమూర్తుల కథలు తలుచుకుందాం..!!

ఐదువేల చెట్లకు అమ్మ
పడమటి కనుమల్లో మరింత పచ్చగా ఉంటుంది కేరళ.ఆరాష్ట్రంలోని అలెప్పి జిల్లా ముత్తుకుళం గ్రామంలో 1934లో జన్మించింది కొల్లక్కయిల్‌ దేవకి.బాల్యంలో తాత చెప్పిన అన్ని కథలూ అడవి చుట్టూ తిరిగేవి. దీంతో ఆమెకు వనమెంతో ఘనంగా కనిపించేది. దేవకి వివాహం గోపాలకృష్ణ అయ్యర్‌తో జరిగింది. అతను ఇంగ్లిష్‌ టీచర్‌. వారసత్వంగా వాళ్లకు ఐదెకరాల పొలం వచ్చింది.చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన అనుభవం ఉండటంతో పెండ్లయ్యాక సాగు కొనసాగించింది. అయితే ఓ ప్రమాదంలో ఆమె కాళ్లు దెబ్బతిన్నాయి. కొన్నాళ్లకు కోలుకున్నప్పటికీ మునుపటిలా ‘పొలం పని చేయలేన’ని దేవకికి అర్థమైంది. బాల్యం నుంచి తన మనోఫలకంపై చిత్రించుకున్న వనాన్ని తన చేనులో కొలువు దీర్చా లని భావించింది.ఆనాటి నుంచి మొక్కలు నాటడం పనిగా పెట్టుకుంది. అప్పుడు ఆమె వయసు నలభై ఏండ్లు! రకరకాల మొక్కలు పెరిగి పెద్దవడంతో కొన్నేండ్లలోదేవకి సాగుభూమి దట్టమైన వనమైంది. ఇందులో వేప,చింత,రావి తదితర జాతుల వృక్షాలు ఉన్నాయి.ఇప్పుడు దేవకీ అమ్మ వయసు 90 ఏండ్లు.ఆమె పెంచి పోషిస్తున్న చెట్ల వయసు ఆమె వయసులో సగం! ఎన్నెన్నో పురస్కారాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి వరించాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా‘నారీశక్తి’ అవార్డునూ అందుకున్నది.అవేం ఆమెకు అంతగా పట్టవు! పెందరాళే లేచి అడవికి వెళ్లి.. తన బిడ్డలను చూసుకోవడమే ఆమెకు అసలు తృప్తి!
తులసి వనం
పొడవైన సముద్ర తీరమున్న కర్ణాటకలో అడవులూ ఎక్కువే! అలాంటి చిక్కటి అటవీ ప్రాంతంలో జన్మించింది తులసి గౌడ. ఆమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. బడి ముఖం చూసింది లేదు. అడవే ఆమెకు పాఠశాల అయింది. చిన్నప్పుడు ఇంటి పరిసరాల్లో తులసి రకరకాల చెట్ల విత్తనాలు చల్లుతూ ఉండేది. స్థానికంగా ఉండే అటవీశాఖ అధికారుల దగ్గర సహాయకురాలిగా ఉండేది. వాళ్లు డ్యూటీ ఏం చేసేవారో తెలియదు కానీ, తులసి మాత్రం మొక్కలు నాటడమే దినచర్యగా మార్చుకుంది.ఆమె ఉత్సాహాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు తులసికి ‘వనమాలి’ఉద్యోగాన్ని ఇచ్చారు.కొత్తగా రెక్కలు తొడిగినట్లయింది. వన మంతా విహరిస్తూ ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు మొక్కలు నాటేది. అలా నాటి వదిలే యకుండా.. అవి వేళ్లూనుకునేదాకా రక్షణచర్యలు చేపట్టేది. ఏకంగా 30వేల మొక్కలు నాటి పశ్చిమ కనుమ లకు పచ్చని కానుకను సమర్పించింది. ‘వృక్షలక్ష్మి’ గా పేరు తెచ్చుకుంది. వన విస్తరణకు ఆమె చేసిన కృషికిగాను ఎన్నో అవార్డులు అందుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం పొందారు.
వనప్రభజి
అడవికి,ఆవిడకు అవినాభావ సంబంధం. ప్రభాదే విది ఉత్తరాఖండ్‌లోని కుగ్రామం. పచ్చదనంలోనే ఆమె బాల్యమంతా సాగింది.బాల్యంలో ఊయల లూగిన తరులు..పెద్దయ్యేసరికి కనిపించకుండా పోయాయి. ఇంటి వసారాలోంచి కనుచూపు మేర లో కనువిందు చేసే పచ్చదనం తను ఎదిగేకొద్దీ తగ్గుతూ పోయింది. తన అడుగులకు మడుగు లొత్తిన అడవితల్లి ఎందుకో బక్కచిక్కిపోయిందని అనుకునేది! పెద్దయ్యాక వనదేవతను కబళిస్తున్నది మనుషులేనని తెలిసి బాధపడిరది. ఆమె మాత్రం ఏం చేయగలదు! కూలిపోతున్న చెట్లను చూసినప్పు డల్లా దిగాలుగా ముఖం పెట్టడం తప్ప! అభివృద్ధి పేరుతో విస్తరిస్తున్న కాంక్రీట్‌ జంగిల్‌ను చూసి మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడటం తప్ప!! రోజులు గడిచిపోయాయి..పర్యాటక కేంద్రంగా విస్తరించే కొద్దీ ఉత్తరాఖండ్‌లో అటవీ విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది.రుద్రప్రయాగ జిల్లాలోని ప్రభా దేవి వాళ్ల గ్రామం సమీపంలోనూ ఇదే ధోరణి. అప్పటికే ఆమెకు పెండ్లయింది.ఊరికి అల్లంత దూరంలో వారికి కొంతపొలం ఉంది.అక్కడ మరో అడవికి జన్మనివ్వాలని ఆఆడకూతురు నిశ్చయించు కుంది. భర్తకు చెబితే సరేనన్నాడు. ఓరోజు వెళ్లి కొన్ని మొక్కలు నాటింది.ఆతర్వాతి రోజు మరికొన్ని నాటింది.అప్పట్నుంచి అదేపని! మొక్కలే ఆమె లోకమయ్యాయి. ఇంటిపట్టున విశ్రాంతి తీసుకునే వయసులో మొక్కల సంరక్షణ భుజానికెత్తుకుంది. చూస్తుండగానే ఆమొక్కలు చెట్లయ్యాయి, మానుల య్యాయి. 500 చెట్లు..అడవితల్లి సిగలో పచ్చల పతకంగా ఇప్పుడు మెరిసిపోతున్నాయి.80 ఏండ్ల వయసులోనూ నిత్యం తమను పలకరించడానికి వస్తున్న ప్రభాదేవి ఆ మానులకు అమ్మ కన్నా ఎక్కు వంటే ఎవరు కాదనగలరు?
అభివందనం..
హిమాలయ పర్వత పాదాల దగ్గరున్న డూన్‌ లోయ వందనా శివ జన్మస్థలం. ఆమె బాల్యమంతా మంచుకొండలను చూస్తూ గడిచిపోయింది. హిమగిరుల నుంచి వీచే గాలి పైన్‌ చెట్ల మీదుగా తనను తాకినప్పుడు పులకించిపోయేది. 1970లో మొదలైన చిప్కో ఉద్యమం నాటికి వందన యువతి. కుంచించుకుపోతున్న హిమాలయ అడవులపై గడ్వాల్‌ వాసులు ఎత్తిన పిడికిళ్లలో ఆమె చేయీ ఉన్నది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఆమెకు మరింత బలాన్నిచ్చింది. సహజంగా ఉన్న ధైర్య స్వభావం ప్రకృతి ప్రేమికురాలిని కాస్తా.. పర్యావరణవేత్తగా, ఉద్యమకారిణిగా తీర్చిదిద్దింది. ప్రభుత్వాలు వన సంరక్షణ చర్యలు తీసుకునేలా ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. ‘నవధాన్య’ సంస్థను స్థాపించి తన పోరాటాన్ని వివిధ రంగాలకు విస్తరించింది. స్త్రీ సాధికారత, సుస్థిర వ్యవసాయ విధానాలతోపాటు అటవీ సంరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నది.
ఆకుపచ్చని అడవి..
అడవులు భూగోళపు ఊపిరితిత్తులు. అడవి చల్లగా ఉంటేనే మానవాళి భవిత భద్రంగా ఉంటుంది.కీకారణ్యమైనా,చిట్టడవిjైునా, నాలుగు చెట్లు ఒకచోట ఉంటే భూగోళానికి చేసే మేలు ఇంత అంత కాదు! కానీ, అంతులేని లాభాపేక్షతో కార్పొరేట్లు అడవులను కబళించడానికి ఎప్పటిక ప్పుడు విరుచుకు పడుతుంటారు. తమ చెప్పుచేత ల్లోని ప్రభుత్వాలతో అనుకూల చట్టాలను తయారు చేయించుకుంటారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశలో భారత అటవీ (సంరక్షణ) చట్టం 1980ని సవరించడానికి చేసిన ప్రయత్నా నికి అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యంగా గత ఏడాది అడవుల నిర్వచనాన్ని మారుస్తూ తీసుకువచ్చిన చట్ట సవరణను తాత్కాలికంగా నిలిపివేసింది. 1996లోవెలువరించిన టిఎన్‌ గోదావర్మన్‌ తిరు ములపాడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో నిర్దేశించిన అటవీ నిర్వచనానికి అనుగు ణంగా నడుచుకోవాలని ఆదేశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వం లోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆహ్వానించదగిన పరిణామం. నిఘం టవుల్లోని అర్థాన్ని అడవికి ప్రామాణికంగా తీసు కోవాలని ఈ తీర్పులో ధర్మాసనం పేర్కొంది. వర్గీక రణలు, యాజమాన్యాలతో సంబంధం లేకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అడవులుగా భావించే ప్రాంతాలను (డీమ్డ్‌ ఫారెస్ట్స్‌) గుర్తించడానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇన్ని కీలక మైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టే ఆ తీర్పును ఒక మైలురాయిగా భావిస్తారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1951నుండి 75వరకు దేశ వ్యాప్తంగా 40లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది.ఆ నేపథ్యంలోనే భారత అటవీ (సంరక్షణ) చట్టాన్ని రూపొందించి 1980లో ఆమోదించారు.ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇతర అవసరాలకు అటవీ భూమిని మళ్లించడం గణనీయంగా అదుపు లోకి వచ్చింది.గతంతో పోలిస్తే 1981నుండి 20 22 వరకు అటవీ భూముల నిర్మూలన పది శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయిన ప్పటికీ, చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని అడవుల నరికవేత కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని గూడలూరులో చోటుచేసుకున్న కలప అక్రమ నరికివేతకు సంబం ధించి దాఖలైన టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమలనపాడ్‌ కేసులో అటవీ ప్రాంతాల రక్షణను ప్రధానంగా చేసుకుని సుప్రీం ఇచ్చిన తీర్పులో ‘అడవి’ని విస్తృ తంగా నిర్వచించింది. ఇదికార్పొరేట్లకు ఆటంకం గా మారింది.ఈ నిబంధనలను మార్చాలన్న ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో వారి కనుసన్నల్లో నడిచే మోడీ ప్రభుత్వం గత ఏడాది ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన భూమిని మాత్రమే అడవిగా గుర్తిస్తూ అటవీ చట్టానికి సవరణ తీసుకు వచ్చింది. ప్రస్తుత మున్న నిబంధనల ప్రకారం అడవుల పరిధిలోకి వస్తాయన్న భయంతో ప్రైవేటు వ్యక్తులు ప్లాంటేష న్లు,తోటలు పెంచడం లేదని తన చర్యను ప్రభుత్వం సమర్ధించుకుంది.(నవతెలంగాణ సౌజన్యంతో..)-(కందుకూరి సతీష్‌ కుమార్‌)