ఆడబిడ్డలకు రక్షణ కరువు
‘‘ దేశంలో మహిళలు, చిన్నారులపై ఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు ఆగడాలు కొనసాగుతున్నాయి. చిన్న పిల్లలపై కూడా కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి, లైంగిక దాడులకు పాల్పడు తున్నారు. ఆడపిల్లలను గౌరవించేవారు కానీ…వారిని రక్షించేవారుకానీ….వారి హక్కు లను పరిరక్షించేవారు కానీ…. నేటికాలంలో నానాటికీ తగ్గిపోతూ ఉండటం,ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతుండడం చాలా దుర దృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై సామూహిక అత్యాచార ఘటనలు,లైంగిక వేధింపులు పెరుగుతుండటం బాధకరమైన విషయం ’’ – జి.ఏ.ఎస్.కుమార్
‘మాకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి అమ్మ గర్భం, సమాధి మాత్రమే’ – నైతిక విలువలకు నిలువునా పాతరేస్తూ, ఆడబిడ్డలకు అడుగడుగునా నరకం చూపిస్తున్న సమాజంపై ఓ చిన్నారి ఛీత్కరింపు ఇది! గతేడాది డిసెం బరులో చెన్నరుకి చెందిన ఆ పదకొండో తరగతి విద్యార్థినిని ఒక ఉపాధ్యాయుడి కొడుకు అను నిత్యం వేధింపులకు గురిచేస్తుండగా.. సహించ లేక ఆత్మహత్య చేసుకుంది. బలవన్మర ణానికి ముందు భావోద్వేగంతో రాసిన లేఖ సమాజం లో మహిళల దుస్థితికి దర్పణం పట్టింది. ఆ చిట్టితల్లి మాటలను నిజం చేస్తూనే గుడిలో, బడిలో,బంధుమిత్రుల ఒడిలో,ఇప్పుడు ఆసు పత్రుల్లో,ఎక్కడైనా సరే,ఆడపిల్లలకు భద్రత లేని దౌర్భాగ్యపూరిత వాతావరణానికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అద్దంపడుతోంది. తరతరాలుగా అమ్మ దేవతలను ఆరాధిస్తూ,పరాయి స్త్రీల వంక కన్నెత్తి చూడటమే మహాపాపంగా భావించాలని చెప్పే నీతులన్నీ ఏమైపోతున్నాయి? దేశంలో మహిళ లకు రక్షణ కల్పించడమే ఒక ప్రధాన సమస్యగా మారిపోవడం సిగ్గుచేటు. మగపిల్లలను ముద్దు చేస్తూ ఆడపిల్లలను ఆంక్షల పంజరంలో బంధి స్తున్న పితస్వామ్య భావజాలం, వ్యక్తిత్వానికి వన్నెలద్దడంలో విఫలమవుతున్న విద్యా విధానం, నేరాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగపు ఘోర వైఫల్యాలు కలిసికట్టుగా మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోవడానికి కారణ మౌతున్నాయన్న నిపుణుల మాటలు అక్షర సత్యాలు. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి దారు ణాలు జరగనివ్వబోమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలోనే దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు,దిశ యాప్ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటన్నింటి లోనూ ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలు కానరావు. ఆదిశ బిల్లు నేటికీ చట్ట రూపం దాల్చలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి అకత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. విచ్చల విడిగా సంచరిస్తున్న మానవ మగాల మాయల్లో చిక్కి విలవిల్లాడే మహిళలకు,చిన్నారులకు లెక్కే లేదు.దేశవ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నాపెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, ఎంత గట్టి శిక్షలు అమలవుతున్నా అత్యంత పైశాచిక ప్రవత్తి కలిగిన మానవ మగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు పాలకులు భావించడం వల్లే నేరస్తులు విచ్చలవిడిగా రాకాసి ప్రవత్తిని కొనసాగి స్తున్నారు. ఇలాంటి ఘటనల్లోని దోషులకు ఎలాంటి కాలయాపనా లేకుండా కఠినశిక్షలు పడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికైనా ప్రభుత్వాలు చేపట్టాల్సి వుంది. అలాగే నానాటికీ సమాజంలో విచ్చలవిడితనానికి ముకుతాడు వేసే చర్యలు చేపట్టాలి. పెడమార్గాలు పట్టిన యువత మత్తు పదార్ధాల ఊబిలో పడిపో తోంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా,ఆట బొమ్మగా పరిగణించే అత్యంత హేయమైన విష సంస్కతి నుంచి యువతను బయటపడేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, తరచూ బాలల అదశ్యం వంటి సంఘటనల్లోనూ వాటి వెనుకనున్న అరాచక శక్తుల పీచమణిస్తే తప్ప ఇలాంటి ఘోరాలు తగ్గవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన అసాధారణమైనది. ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యం ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జనంతో రద్దీగా ఉండే ఆసు పత్రిలో ఒక గదిలో సామూహిక అత్యాచారానికి దుండగులు ఒడిగటుతుండే అక్కడ యంత్రాం గం ఏమైపోయింది? బాధిత తల్లిదండ్రులు ఆ బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరు క్షంతవ్యం కాదు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో నిర్బంధించబడిరదన్న విషయం ఆమె తల్లిదండ్రులు చెబితే తప్ప గుర్తించలేని స్థితిలో ఆసుపత్రి, పోలీసు అధికార యంత్రాం గం మిన్నకుండడం దారుణం. వ్యవస్థలోని ఈ లోపాలన్నిటిని సరి చేస్తేనే మహిళలకు, చిన్నారు లకు రక్షణ దక్కేది. ఇలాంటి దురాగతాలు వెలుగులోకి వచ్చినప్పుడు హడావిడి చేయడం, నష్టపరిహారం ప్రకటించడంతో పాలకులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మహిళల రక్షణకు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇద్దరు పోలీసు అధికారులతోనే పరిమితం కాకుండా విజయవాడ దారుణ ఘటనటకు బాధ్యులైన వారందిరి పైనా కఠిన చర్యలు చేపట్టాలి.
స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు.
నేటి బాలికలే రేపటి స్త్రీమూర్తులు. స్త్రీ లేనిదే సమాజానికి అతీగతీ లేదు. స్త్రీ లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. ఇవన్నీ అందరికీ బాగా తెలిసిన విషయాలే. తెలియనిదల్లా ఏమైనా ఉందంటే.. వారిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్నదే. ప్రపంచ మంతటా పురుషాధిక్యత పెరిగిపోయిన నేటిరోజుల్లో, ఆడపిల్లల పరిస్థితి నానాటికీ మరింత దయనీయంగానే ఉంటోంది. నేటికీ ప్రపంచంలో బడి చదువులకు దూరమైన బాలికలు కనీసం 40 మిలియన్ల మందికి పైగానే ఉన్నారని నిపుణుల అంచనా. అంతేకాదు బాల్య వివాహాలతో నరకప్రాయమైన జీవితాలను అనుభవిస్తున్నవారు ప్రపంచంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారని కూడా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎంతో ఘనమైన సంస్కృతి సంప్రదాయలున్న మన దేశంలో కూడా స్త్రీల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల ఎంతోకాలం నుంచి అంతులేని వివక్ష కొనసాగు తూనే ఉంది. ఆడపిల్లలు పుడితే పెద్ద భారంగా పరిణ మిస్తారని, వారిని పెంచి పెద్దచేయడం ఒక సమస్య అని, వారికి పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం మరింత కష్టమని భావించే వారు పెద్దసంఖ్యలోనే ఉంటున్నారన్నది నిష్టుర సత్యం. మన కుటుంబవ్యవస్థలో బాలికల పట్ల చిన్నచూపు చూసేవారే అధికంగా ఉంటుండం బహిరంగ రహస్యం. అంతేకాదు మనదేశం లోనూ బాలికల పట్ల..మహిళలపట్ల లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై నేరాలు ఘోరాలు,దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై కూడా అమానుషాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుక్షణం అభద్రతాభావంతో తల్ల డిల్లే పసిమొగ్గలు ఎందరో!..ఈ బాధలు పడలేక..’ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టినా బావుణ్ణు’..అని మహిళాలోకం కన్నీరుపెట్టుకునే దుస్థితి ఎప్పటికి పోతుందో ఏమో!..ఆడపిల్లగా పుట్టడమే ఒక పాపంగానో, ఒక శాపంగానో భావించే దుర్గతి ఇలా ఇంకా ఎంతకాలం?పసిపాపగా పుట్టి..చెల్లిగా, ఇల్లా లిగా,తల్లిగా..ఈ కాఠిన్యపు ప్రపంచానికి ఆత్మీ యతాను బంధాలను ప్రేమానురాగాలను నేర్పేం దుకు వచ్చిన దేవతకు..ఈ లోకంలో ఎన్ని కష్టాలో..ఎన్ని కన్నీళ్ళో! చిన్నతనం నుంచే ఆడపిల్లలకు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వారిపై అధికారం చెలాయించడం, బాలికలు కదా అని చులకనగా చూడడం అనేక కుటుంబాల్లో సర్వ సాధారణ కృత్యమైపోతోంది. సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల చులకనభావమే కనపడుతోంది. అంతేకాదు, పుట్టినప్పుడే ఆడశిశువులను ఏ చెత్తకుప్పలోనే పారవేసే దయనీయ సంఘటనలు.. దృశ్యాలు కూడా మనం అప్పుడప్పుడూ వింటున్నవే..చూస్తున్నవే. బాలికలను అమానవీయంగా వ్యభిచారగృహాలకు తరలించే దౌర్భాగ్య ముఠాలకు కూడా కొదవ లేదనే సంగతి కూడా మనం వింటున్నదే. ఇక పేదింట్లో పుట్టిన ఆడపిల్లల సంగతి మరింత దారుణంగా ఉంటోంది. ఆడపిల్లగా పుట్టి చాకిరీకి, వంటింటి పనులకే పరిమి తమయ్యే వారి సంఖ్య లెక్కకు మిక్కుటంగానే ఉంటోంది. కుటుంబ పోషణను కూడా నెత్తినేసుకుని కూలిపనులకు కూడా వెళ్ళేవారు ఎందరో?.. సరైన పోషకాహారం కూడా లేక చిక్కి శల్యమ వుతున్న బాలికల సంఖ్య కోట్లల్లోనే ఉంది. కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలకు ప్రత్యేకస్థానంతో పాటు మంచి గౌరవం ఇవ్వడం, ఆప్యాయతానురాగాలతో వారిని పెంచి పెద్దచేయడం,వారి జీవితాలకు ఎల్ల వేళలా అండగా ఉంటూ వారిని సంరక్షించుకునే మంచిమనుషులు కూడా సమాజంలో లేక పోలేదు. అయితే పేదరికంతోనో,అవిద్య వల్లనో, అసమానత వల్లనో దేశంలో మరెంతోమంది బాలికల భవిష్యత్తు నేటికీ అంధకారమయంగానే ఉంటోంది.ప్రభుత్వాలు, పాలకులు ఎంతో మంచిమనసుతో బాలికల కోసం,మహిళల కోసం,స్త్రీల కోసం అనేక పథకాలు, వారి రక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటి కప్పుడు అనేకానేక చట్టాలు చేస్తూనే ఉన్నా.. సమాజంలో ఆడపిల్లల పట్ట, మహిళామతల్లుల పట్ల వివక్ష..అఘాయిత్యాలు తొలగిపోవడం లేదు. ఇకనైనా ఈ దుస్థితి..ఈ దుర్గతి మారాలి. ఆడపిల్ల లంటే మన ఇంటికి జీవనజ్యోతులని గ్రహించుకోవాలి. ఆడపిల్లలంటే కేవలం అబలలు కాదని,కాస్తంత ఆత్మవిశ్వాసాన్ని-ప్రోత్సాహాన్ని అందిస్తే చాలు..వాళ్ళు మనల్ని, మన కుటుంబగౌరవాన్ని,దేశ సౌభగ్యాన్ని కూడా నిలబెట్టే ధీరవనితలవుతారని,సమాజాన్ని ఆదర్శ వంతంగా,ప్రతిభావంతంగా తీర్చిదిద్దే ప్రతిభా మూర్తులని కూడా తెలుసుకోవాలి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఇవన్నీ చూసుకోవాలనే ఆలోచనలు మానుకుని..మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను, ముఖ్యంగా బాలికలను సంరక్షించుకోవాలి. ఆడపిల్ల పుట్టిందంటే మన ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాలి. వారి మనసును కష్టపెట్టకుండా మంచి చదువులు చెప్పించి, ఇష్టపడే రంగాల్లో ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలి. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిండుమనసుతో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. బాలికల పట్ల ఇలాంటి సదవగాహన, సద్భావనలు కలిగించేందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ప్రకటిం చింది. అందుకు సార్థకత చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషిచేసినప్పుడే మన జీవితాలూ సార్థకమవుతాయి. ముఖ్యంగా.. బాలికలు, మహిళలపట్ల మానవీయతతో.. ఆత్మీయతతో ఉంటూ, వారికి అన్నివిధాలా రక్షణ కలిగించాలి. అప్పుడు వారే కాదు మనం, మన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం, మన దేశం..మొత్తంగా ప్రపంచమంతా కూడా ఆనందంతో పల్లవిస్తుంది.. ఎనలేని సంతోష పౌభాగ్యాలతో వెల్లివిరుస్తుంది.కానీ నేటి ఆధునీక సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైంది. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా ఆచరణకు నోచుకోవడంలేదు. మహిళలు హక్కులను పరిరక్షించే నాధుడు కరువయ్యారు.-