అసైన్డ్ చట్ట సవరణ ఎవరి కోసం?
పేదలకిచ్చిన అసైన్డ్ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరత రాలుగా అనుభవించాలేగానీ అమ్మకూడదు. ఇతరు లు కొనకూడదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 20సంవత్సరాల తరువాత అమ్ముకోవచ్చని సవరిస్తే. …ఇప్పటి వైసిపి ప్రభుత్వం పదేళ్ళకు కుదించింది. అమ్ముకోవచ్చని చట్టమే సవరిస్తే పేదల చేతుల్లో ఉన్న చారెడు భూమి కూడ మిగలదు.
‘భూమి అనేది కేవలం ఆర్థిక వనరే కాదు. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, సమాజంలో హోదాని అందిస్తుంది. వీటితోపాటు భూమి అంటే అధికారం’ అని చెప్పేవారు ఎస్.ఆర్.శంకరన్. అందుకేనేమో పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములు చేజారిపోకుండా, ఒకవేళ పోయినా తిరిగి ఆ పేదలకు చెందేలా 9/77 అసైన్డ్ చట్టాన్ని తెచ్చారు. నాటి పాలకవర్గం దీనిని తొలత తీవ్రం గా వ్యతిరేకించినా పట్టుబట్టి ఈ చట్టాన్ని సాధిం చారు. ఇంతటి ప్రాధాన్యత కల్గిన అసైన్డ్ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు పరచాల్సింది పోయి నేటి పాలకులు రోజు రోజుకూ నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం 9/77 చట్టం సెక్షన్ 3ను సవరించి పేదలకిచ్చిన ఇళ్ళ స్థలాలు,ఇళ్లు 10సంవత్సరాల అనుభవం తరువాత అమ్ము కోవచ్చని తీర్మానించింది. పేదలకిచ్చిన అసైన్డ్ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరతరాలుగా అనుభవించాలేగానీ అమ్మ కూడదు. ఇతరులు కొనకూడదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 20సంవత్సరాల తరువాత అమ్ము కోవచ్చని సవరిస్తే…ఇప్పటి వైసిపి ప్రభుత్వం పదే ళ్ళకు కుదించింది. ఈ చట్టం ఇంత పగడ్బందీగా ఉన్నప్పటికీ పేదలకిచ్చిన భూములను పలుకుబడి కలిగినవారు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపా రులు, చివరకు ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరుతో అసైన్డ్ భూములనే బలవంతంగా లాక్కుంటుంది. ఇక అమ్ముకోవచ్చని చట్టమే సవరిస్తే పేదల చేతుల్లో ఉన్న చారెడు భూమి కూడ మిగలదు.
స్వాతంత్య్రానికి ముందు ఆ తరువాత ‘దున్నే వానికే భూమి’ నినాదంతో దేశ వ్యాపితంగా జరిగిన భూ పోరాటాలవల్ల పాలక వర్గాలకు ఇష్టం ఉన్నా, లేకపోయినా భూసీలింగ్ చట్టం, రక్షిత కౌలుదారీ చట్టాలు, 1/70చట్టం,9/77 అసైన్డ్ చట్టాలు సాధించబడ్డాయి. ఈ చట్టాల వల్ల పేదల చేతుల్లోకి కొంతైనా భూమి వచ్చింది. ఆ భూమిని పొందిన దళితులు, బలహీన వర్గాల కుటుంబాలు తమ పిల్లలను చదివించుకుని ఇపుడిప్పుడే సమా జంలో మెల్లమెల్లగా తల ఎత్తుకుని తిరిగే స్థాయికి చేరుకుంటున్నారు. దీనిని కూడా సహించని పాలక వర్గాలు పేదలను భూమి నుండి వేరు చేసి వీరికున్న కొద్దిపాటి చట్టబద్ద హక్కులను కూడా లేకుండా చేస్తున్నాయి. ఇందులో భాగమే మన రాష్ట్ర మంత్రి వర్గం చేసిన అసైన్డ్ చట్ట సవరణ. స్వాతంత్య్రానికి పూర్వం నుండి కమ్యూనిస్టులు చేసిన పోరాటాల వల్లగాని లేదా ల్యాండ్ సీలింగ్ చట్టంవల్ల భూస్వా ముల చేతుల్లో ఉన్న మిగులు భూమిగాని, ప్రభుత్వ బంజర్లు, ఇనాం భూములు మొదలగు 16 రకాల భూములు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 55 లక్షల ఎకరాలకుపైగా పేదలకు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ లెక్కలు తెలియచేస్తున్నాయి. ఈ రూపంలో పేదలు పొందిన భూములను తిరిగి పెత్తందార్లు, పలుకు బడి కలిగినవారు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్ర మించుకుంటుంటే….పేదలకు పావలో, పాతికో ఇచ్చి లాగేసుకుంటుంటే…పేదల చేతుల్లో ఉన్న భూములు చేజారిపోకుండా ఉండడానికే నాడు సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న ఎస్.ఆర్ శంకరన్ 9/77అసైన్డ్ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఎవరైనా పేదలు తమ అవసరాల కోసం భూమిని అమ్మినా లేదా ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా భూమి కోల్పోయిన పేదలు మా భూమి తిరిగి ఇప్పించమని ప్రభుత్వానికి విన్నవించుకుంటే సెక్షన్ 4 ప్రకారం తిరిగి కోల్పోయిన పేదలకే ఇవ్వాలి. సెక్షన్ 5ప్రకారం అసైన్డ్ భూములు రిజిష్టర్ చేయ కూడదు. అసైన్డ్ భూములు పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు. అసైన్డ్ భూములు పొందాలంటే ప్రభుత్వం ఇచ్చేది, సొంత భూమి కలుపుకొని 5ఎకరాలు మెట్టగానీ లేదా రెండున్నర ఎకరాలు మాగాణి మించకుండా ఉండాలి. అనర్హులు అసైన్డ్ భూములు కొంటే 6 నెలలు జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించాలని సెక్షన్ 6 చెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసైన్డ్ భూములకు ఈ చట్టం కవచకుండలం లాంటిది.
ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల ఒత్తిడితో వైఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2005లో కోనేరు రంగారావు నాయకత్వంలో ఏడు గురు ఐఎఎస్ అధికారులతో భూకమిటీని వేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాపితంగా పర్యటించి భూసమస్య పరిష్కారం కోసం 104సిఫారసులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 90ఆమోదించింది. 12 తిర స్కరించింది.2పెండిరగ్లో ఉంచింది. ఆమోదిం చిన 90 సిఫారసులను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలక్టర్లకు, సంబంధిత అధికారులకు జీవో నెంబర్ 1049,1191 విడుదల చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములతో పాటు భూస్వాముల దగ్గర ఉన్న మిగుల భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న పదహారు రకాల భూములు మొత్తం కలుపుకుంటే ఈ రాష్ట్రంలో భూమిలేని ప్రతికుటుంబానికి ఎకరం భూమి పంచవచ్చని భూకమిటీ చెప్పింది. ఇది అమలు కావాలంటే అన్యాక్రాంతమైన అసైన్డ్ భూ ములు తిరిగి పేదలకు ఇప్పించాలి. సాగు నీటి వనరులు వచ్చిన చోట భూమి పున:వర్గీకరణ చేసి భూస్వాముల చేతుల్లో ఉన్న మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలి. దేవాలయ భూములు పేదలకే లీజుకివ్వాలి. కౌలుదారీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. 1/70 చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయాలని కోనేరు రంగారావు భూ కమిటీ 104 సిఫారసులు చేసింది. వీటిని అమలు చేయవలసిన రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం… అసైన్డ్ చట్టం సెక్షన్ 4 సవరించి అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నవారు విద్యాలయాలు, పరిశ్రమలు, ఉద్యానవనాలు నిర్మించుకుని ఉంటే వారికే రెగ్యులర్ చేస్తూ చట్టసవరణ చేసి భూకమిటీ సిఫారసులకు ఆదిలోనే తిలోదకాలిచ్చి పేదలకు తీరని అన్యాయం చేసింది. అయినా నేటికీ 90 సిఫారసులు అమలు లోనే ఉన్నాయి. కానీ కోనేరు రంగారావు తో పాటు ఆయన సిఫారసులను కూడా కాంగ్రెస్, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు కోనేటి లోకి కలిపేశాయి.
స్వాతంత్య్రానంతరం పాలక వర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా పేదలకు అనుకూలంగా కొన్ని చట్టాలయినా చేశాయి. 1991 నూతన ఆర్థిక విధా నాలు అమలు చేసిన తరవాత పేదలకు వ్యతి రేకంగా రివర్స్ భూసంస్కరణలు మొదలుపెట్టారు. నాడు పేదలకు అనుకూలంగా భూ పంపిణీ కోసం చట్టాలు చేస్తే నేడు పేదల భూములు పెద్దలకు కట్టబెట్టడానికి చట్టాలను అనుకూలంగా మారుస్తు న్నారు. ఇప్పటికే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. నేడు అసైన్డ్ చట్టాన్ని మారుస్తున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి మాటున భూ బ్యాంక్ పేరుతో అసైన్మెంట్ భూములనే లక్ష్యంగా చేసుకుని 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి చట్టబద్దమైన నష్టపరిహారం పేదలకివ్వ కుండా బలవంతంగా భూసేకరణకు పూనుకు న్నారు. నాడే చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్ భూము లు అనర్హులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళస్థలాలు, ఇళ్ళు 20సంవత్సరాలు అనుభవం ఉన్న వారు అమ్ముకోవచ్చని పేదలను నమ్మబలికించి చట్టసవరణ చేసింది. దీనివల్ల పేదలు లబ్ధి పొంద డం సంగతి పక్కనపెడితే రాష్ట్రంలో అక్రమంగా, దౌర్జన్యంగా పొందిన అనర్హులు తప్పుడు అగ్రి మెంట్లు సృష్టించి క్రమబద్దీకరించుకుని పేదలకు ద్రోహం చేశారు. నేడు వైసిపి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 10 సంవత్సరాలు అనుభవం ఉంటే చాలు అమ్ముకోవచ్చని అసైన్డ్ చట్టం సెక్షన్ 3ను సవరిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీనివల్ల పేదలు లాభపడేదేమోగానీ దీనిమాటున అనర్హులకు మాత్రం రాజమార్గం ఏర్పడనుంది. ఏ ప్రభుత్వాలైనా పేదలకు భూములు ఇచ్చి వాటికి నీటి వనరులు, పరపతి సౌకర్యాలు కల్పించి వారిని దారిద్య్రంలో నుంచి బయటకి లాగి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి విరు ద్ధంగా పేదలకిచ్చిన సెంటో,కుంటో భూమిని కూడా అమ్ముకోమని ప్రభుత్వాలే పేదలను బికా రులుగా మార్చడం అత్యంత బాధాకరమైన విష యం.రాష్ట్ర వ్యాపితంగా భూముల విలువ పెరిగిన తరువాత రకరకాల అభివృద్ధి పేరుతో అసైన్డ్ భూ ములనే లక్ష్యంగా చేసుకొని బలవంతంగా లాక్కుంటున్నారు. ఎదిరించినవారిపై దౌర్జన్యం చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలే భూమాఫి యాగా మారాయి. రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, తుంగభద్ర,సోమశిల,వంశధార,తోటపల్లి,హంద్రీ నీవా,గండికోట,మొదలగు ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్యం వచ్చింది. 1975 భూసీలింగ్ చట్టం ప్రకారం ఈ భూములన్నీ పున:వర్గీకరణ చేసి భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను తీసుకొని తిరిగి పేదలకు పంపిణీ చేయాలి. కానీ గడచిన నాలుగు దశాబ్దా లుగా కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు ఒక్క భూస్వామి దగ్గర ఒక్క సెంటు భూమి తీసుకున్న దాఖలాలు లేవు.
దీనిని బట్టి ఈ ప్రభుత్వాలు ఏ వర్గ ప్రయోజనాలు కాపాడతాయో అర్థం అవు తుంది. దీనికి భిన్నంగా బెంగాల్, కేరళ రాష్ట్రాలలో భూస్వా ముల చేతుల్లో ఉన్న మిగుల భూములను తీసుకుని లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర వామ పక్ష ప్రభుత్వాలకు ఉంది. ప్రస్తుతం పేదలకు భూ పంపిణీ మాట ఏమో గానీ పేదల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూమిని కూడా వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలే లాగేసుకుం టున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గం చేసిన అసైన్డ్ చట్ట సవరణ వల్ల పేదలకు లాభం లేదు. ఆక్రమణ దారులకు రాజమార్గం ఏర్పాటు చేయడానికి కొద్దో, గొప్పో దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను లాక్కోవడానికి తప్ప మరొకటి కాదు. నాడు ‘’దున్నే వానికే భూమి’’ కావాలని పోరాడి సాధించుకున్న భూ చట్టాలను నేటి ప్రభుత్వాలు ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. సంక్షేమ పథకాల వల్ల దారిద్య్ర నిర్మూలన జరగదు. కేవలం ఉపశమనం మాత్ర మే. పేదలకు భూపంపిణీ చేయడం ద్వారానే దారిద్య్రాన్ని రూపుమాపడానికి దోహదపడుతుంది. కాబట్టి ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించు కున్న భూ చట్టాలను అదే స్ఫూర్తితో పోరాడి రక్షించు కోవాలి.
వ్యాసకర్త ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి-వి.వెంకటేశ్వర్లు