అవునూ వారే స్వయంగా రోడేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం ఓ చిన్న చీమలపాడు పంచాయితీలో జీలుగులోవ గిరిజనగ్రామం. ఇది కొండ శిఖరంపై ఉంటుంది. ఇక్కడ పది కుటుంబాలు. మాడుగుల నియోజకవర్గం అవురువాడ పంచాయతీ కొండ శిఖర గ్రామమైన పశువులు బంద గ్రామంలో 7 కుటుంబాలవారు 38 మంది జనాభా కలిగిన కొందు ఆదివాసి గిరిజనులు కొండ శిఖర్‌ గ్రామం పై జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని రోడ్డు మార్గం నుండి వెళితే రెండు రోజుల సమయం పడుతుంది. బైకు రాకపోకల కోసం రోడ్డు ఏర్పాటు చేసుకుంటే మంచిదని గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ని సంప్రదించి తమకు ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని, రోడ్డు పనులు చేసుకుంటామని వేడుకున్నారు. చాలాసార్లు కలెక్టర్‌ చుట్టూ తిరిగి బతిమాలారు. నర్సీపట్నం ఆర్డిఓ గిరిజన గ్రామాన్ని సంద ర్శించి వారికి ఉపాధి కార్డులు ఇస్తామని చెప్పారు. కార్డులు ఇచ్చినట్టు రిపోర్టులో రాసుకున్నారే తప్ప ఇంతవరకూ ఎవ్వరికీ ఉపాధి హామీ కార్డులేవీ అందలేదు. కనీసం పాదం పని కూడా ఇవ్వలేదు. ఎంత విన్న వించుకున్నా.. అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో గిరిజనులంతా నడుం బిగించారు. వారే సొంతంగా గత 15 రోజుల నుండి శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేసు కుంటున్నారు. అధికారులు గిరిజన ఉత్స వాల పేరు మీద, టూరిజం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప తమ గిరిజన గ్రామాలకు కనీసం నడవడానికి తోవలేని పరిస్థితి ఉందని గుర్తించడం లేదంటూ గిరిజనులు వాపోయారు. ఈ మధ్య కాలంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ గర్భిణీ స్త్రీలను డోలిలో తీసుకురావడానికి వీల్లేదని అన్నారు. మండల అధికారి బృందం వచ్చి గిరిజనుల గ్రామాన్ని సందర్శించారు. రోడ్డు మార్గం దగ్గరగా ఉందని..కొర్ర సంధ్య (20) గర్భిణీ స్త్రీ అమ్మగారి ఊరైన ఎదురిపల్లి వెళ్ళి పోయింది. కానీ ఈ గిరిజన గ్రామంలో ఎవ రికైనా అనారోగ్యం వస్తే, ఇతర నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా శనివారం పెట్టే సంతనాడు మాత్రమే వెళ్ళాలి మిగతా సమ యాల్లో వెళ్లాలంటే కనీసం 15 కిలోమీటర్లు కాలి నడకన కొత్తకోటకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసి తమ కోసం తామే నడుం బిగించారు. పలుగూ పారలు పట్టుకున్నారు. నిర్విరామంగా 15 రోజులు కష్టపడుతూ రోడ్డు మార్గాన్ని సరిచేసు కుంటున్నారు. 3 నెలల్లోపు ఈ రోడ్డు నిర్మా ణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో తీర్మానం చేసుకున్నారు. ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ తమ గ్రామానికి ఉపాధి పథకం ద్వారా రోడ్డును మంజూరు చేయాలని ఆ గిరిజనులు కోరుతున్నారు. తమకు ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ని వేడుకుంటున్నారు.-జిఎన్‌వి సతీష్‌