అల్లుకుపోతున్న అంతర్జాలం

రోజుకు సగటున ఆన్‌లైన్‌లో కుర్రకారు విహరిస్తున్న
సమయం.. 101.4 నిమిషాలు
ఒక సెకనుకు సామాజిక మీడియాలో తెరుస్తున్న ఖాతాలు.. 12
విశ్వవ్యాప్తంగా సామాజిక మీడియాలో ఖాతాలు.. 210 కోట్లు
‘ఫేస్‌బుక్’లో నడుస్తున్న ఖాతాలు.. 100 కోట్లు
‘ఫేస్‌బుక్’లో ఒక్కో ఖాతాదారుడి సగటు స్నేహితుల సంఖ్య.. 200
స్మార్ట్ఫోన్లలో ‘ఫేస్‌బుక్’ వాడుతున్నవారు.. 189 మిలియన్లు
వాట్సాప్ వినియోగదారుల
సంఖ్య.. 91 కోట్లు
‘నెటిజన్ల’లో ట్విట్టర్ వాడుతున్న
వారు.. 23 శాతం
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పంచుకున్న’
ఫొటోల సంఖ్య.. 400 కోట్లు
అతిపెద్ద ‘ప్రొఫెషనల్ నెట్‌వర్క్’గా
అవతరించిన ‘లింక్డ్‌ఇన్’ విస్తరించిన
ఏరియా.. 200 దేశాలు


… ఇవన్నీ అతిశయోక్తులు కావు, అభూత కల్పనలు అంతకన్నా కావు. కుగ్రామాల ముంగిళ్లకు సైతం ‘అంతర్జాల’ సేవలు అందుబాటులోకి రావడంతో అన్నివర్గాల వారినీ సామాజిక మీడియో సమ్మోహన పరుస్తోంది. ‘ఆన్‌లైన్’ను వినియోగించుకోవడం ఇపుడు హోదా కాదు, నిత్యావసరమై పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల జీవనశైలిలో అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి. ‘కంప్యూటర్, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్’ అన్న మాటకు కాలం చెల్లింది. స్మార్ట్ఫోన్లను వాడుతూ అరచేతిలో అంతర్జాలాన్ని వీక్షించడం ఇపుడు సర్వత్రా కనిపిస్తున్న దృశ్యం. విజ్ఞానం,వినోదం, కెరీర్, వ్యాపారం, క్రయవిక్రయాలు.. ఇలా జీవితంతో ముడిపడిఉన్న ప్రతి విషయానికీ ‘ఆన్‌లైన్’ను ఆశ్రయించడం సర్వసాధారణమైంది. మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులు కావడం.. వీటన్నిటికీ సోషల్ మీడియా ప్రధాన వేదిక అవుతోంది. ముఖ్యంగా నేటి యువత ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్థిక పరిస్థితులు, విద్యార్హతలతో సంబంధం లేకుండా కుర్రకారు సామాజిక మీడియాతో మమేకం అవుతోంది. కాలేజీలో చదువుల సంగతేమో కానీ- సెల్‌ఫోన్ వాడని వారే లేరు. ‘టెక్స్ట్‌బుక్’ల ఊసెత్తని వారు నిత్యం ‘ఫేస్‌బుక్’తో బిజీగా కాలక్షేపం చేస్తుంటారు. వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, గూగుల్ సెర్చి.. వీటిని వాడని వారు అరుదు. సోషల్ మీడియా ‘సమ్మోహన శక్తి’కి యువత ఇంతలా దాసోసం అవుతోంది. అందుకే- ‘జీవితమంటేనే సామాజిక మాధ్యమం’ అనంతలా పరిస్థితి మారిపోయింది.


కబుర్లు చెప్పుకోడానికో, కాలక్షేపానికో కాదు.. సోషల్ మీడియాతో కెరీర్‌ను మేలిమలుపు తిప్పుకున్నవారు, సొంత ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్నా వారూ ఉన్నారు. ‘ఉద్యోగాలను వదిలేస్తాం.. సొంత వ్యాపారాలతో సత్తా చూపుతాం’ అంటూ సంకల్పబలంతో గెలుపుతీరాలకు చేరినవారూ ఉన్నారు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో, స్టార్టప్‌లతో తాము ఆర్థికంగా ఎదుగుతూ, ఇతరులకు ఉపాధి చూపుతున్న వారూ ఉన్నారు. అనుకూల వాతావరణం తోడవడంతో ‘అంకుర పరిశ్రమల’ను (స్టార్టప్స్) ప్రారంభించేందుకు యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అరకొర వసతుల మధ్య ప్రారంభమైన స్టార్టప్‌లు అనతికాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్టెట్, ఓలా క్యాబ్స్, పేటీఎమ్.. వంటి స్టార్టప్‌లు అద్భుత విజయాలను సాధించి యువతలో కొత్త ఆశలను చిగురింపజేశాయి.


‘నెట్’లో పడితే జాగ్రత్త..!
ఔను. రోజులు మారిపోయాయి. ‘అంతర్జాలం’లో చిక్కుకుని మనిషి తననితాను మర్చిపోతున్నాడు. ‘నెట్’ను మరిచిపోతే జీవితం నరకప్రాయమవుతుందని భయపడుతున్నాడు. ఇంటర్‌నెట్‌ను వదలలేక, వదలకుండా ఉండలేక ఆన్‌లైన్ జీవితానికి అలవాటుపడిపోతున్నాడు. జీవితంలో మనిషి చేయాల్సిన పనుల్లో చాలామటుకు కంటి ఎదుట కంప్యూటర్ లేదా ఓ స్మార్ట్ఫోన్ పెట్టుకుని, మీటనొక్కి కానిచ్చేస్తున్నాడు. ఆటలు, పాటలు, సినిమాలు, చిందులు ఒక్కటేమిటి సరదా జీవితమైనా, సీరియస్ పనీపాటా అయినా మీటింగులైనా, డేటింగులైనా ‘టింగురంగా’ అంటూ మీటలపైనే మీటవుతున్నారు. కావలసిన వస్తువుల ఖరీదు చేయడమూ, అమ్ముకోవడమూ ఆన్‌లైన్‌లోనే. ఆధునిక జీవితానికి ఇంటర్నెట్ ఓ సాధనమైపోయింది. తప్పనిసరిగా దానిపై ఆధారపడేలా చేసేస్తోంది. సంప్రదాయ జీవనవిధానాన్ని మెచ్చుకునేవారూ దీనిపై ఆధారపడక తప్పడం లేదు. లేదంటే దూసుకువెళుతున్న ఈ విశ్వప్రపంచంలో మనం అంతేవేగంగా వెనకబడతాం. మానవసంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఆన్‌లైన్ శకం నడుస్తోంది. ముఖ్యంగా గడచిన ఏడాది (2015) ఈ ఆన్‌లైన్ మార్కెట్‌లో అనూహ్య, అప్రతిహత ప్రగతి సాకారమైంది. కొత్తసంవత్సరంలో సరికొత్త మార్కెట్‌ను సృష్టించబోతోంది. ఇంటర్నెట్ ఆధారంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న సామాజిక మాధ్యమాలు, వాటి పోకడపై మన జీవనవిధానం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే రూఢీ అయింది. ఇక కొత్తసంవత్సరంలో ఆ అధునాతన వేదికలపై మనం ఏ చేయచ్చో, ఏం చేయబోతున్నామో తెలుసుకోవడం తప్పనిసరి.


వేషభాషలు మారిపోతున్నాయ్…
ఆధునిక జీవితంలో మనిషి పోకడ పూర్తిగా మారిపోయింది. హావభావ విన్యాసాలనుంచి జీవనశైలిలో వినూత్న, వింతైన ధోరణి కన్పిస్తోంది. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపాలు ఎక్కువైపోయాయి. మనిషి మాట మరిచి మీటపై ప్రేమ పెంచుకున్నాడు. మాటామంతీ కరువైపోయింది. అప్పుడప్పుడు మాట్లాడినా ఆ భాషలోనూ కొత్తకొత్త పదాలు చేరిపోతున్నాయి. కొత్త సాంకేతిక పరిభాషను పాతతరం వారూ ప్రేమిస్తున్నారు. అలాగని ద్వేషిస్తున్న వారూ లేకపోలేదు. ‘లైకులట..కామెంట్లట, షేరింగ్ అట.. ఒకడు ఎఫ్‌బి అంటాడు. మరొకరు వాట్సాప్ అంటాడు. ఇంకొకరు ట్విట్టర్ అంటారు. రీట్వీట్ అట.. ఏమిటీ గోలంతా.. నలుగురం కలిసి మనసువిప్పి మాట్లాడుకోవటం అన్నది లేకుండా పోయింది. ఇదేం జీవితం.’ అని విసుక్కునే వారి వేదనలో కొంత నిజం ఉంది. నిత్యం ఆ ‘నెట్’లో మునిగిపోతే బయటపడటం అంత తేలిక కాదు. ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ‘అదేదో టాబ్లెట్ అట. ఆ మాట వింటే భయపడి చచ్చాను. ఏం రోగమని దాన్ని వాడాలన్నారో తెలీలేదు. తీరా చూస్తే అదీ ఓ యంత్రమే. బాగుంది వరస..’ అనే వారూ ఎక్కువే. ఆధునిక సాంకేతిక పరికరాలూ, వాటి పేర్లూ కొత్తతరానికి వింతగానూ, పాతతరానికి రోతగానూ అన్పిస్తే అన్పించవచ్చు. కానీ, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా వాటిని వాడుకోవలసిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అవసరం లేకపోయినా వాడుకోవడం తప్పంటూ తప్పుపట్టే తరాన్ని నవతరం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకూ ఈ ఇంటర్నెట్, దాని ఆధారంగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఇతర మాధ్యమాలూ, సదుపాయాలూ కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులకు లోనవుతాయో, మన జీవితాలను ఎలా మారుస్తాయో అంచనావేయడం తక్షణ కర్తవ్యం. ఈ కొత్తజీవితాన్ని స్వాగతిస్తారా…విసుక్కుంటూ అలవాటుపడతారా అన్నది వేరే విషయం. కానీ ఏం జరగబోతోందో తెలుసుకోకతప్పదు.


ఇంటర్నెట్
కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ఉన్నవారికి ఇంటర్నెట్ ఉండటం నేడు పరిపాటైపోయింది. దీనిద్వారా దేనికి సంబంధించిన సమాచారమైనా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి ఎన్నోమార్గాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. మనదేశం ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. 2014 డిసెంబర్ నాటికే మనదేశంలో 30.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారుంటే 2015 జూన్ నాటికి ఈసంఖ్య 35.4కోట్లకు పెరిగింది. ఇది అమెరికా జనాభాతో సమానం. 2017 నాటికి ఈ సంఖ్య 40కోట్లకు చేరుతుందని అంచనా. ఇక ఇంటర్నెట్‌ను కంప్యూటర్ ద్వారా (డెస్క్‌టాప్) వినియోగిస్తున్నవారికంటే మొబైల్, స్మార్ట్ఫోన్ల ద్వారా వినియోగిస్తున్న వారే అధికం. భారత్‌లో 35.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదార్లుంటే వారిలో 15.9 కోట్లమంది మొబైల్‌ఫోన్లద్వారా నెట్‌ను వాడుతున్నవారే ఉన్నారు. ఆ సంఖ్య డిసెంబర్ 2015నాటికి 21.3కోట్లకు పెరిగిందంటే ఫోన్ ద్వారా నెట్ వినియోగానికి ఎంత ప్రాధాన్యం లభించిందో అర్థమవుతుంది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 31.4 కోట్లకు పెరుగుతుందని ‘అసోచామ్’ అంచనావేస్తోంది. ఇప్పుడు పట్టణాల్లో విస్తృతంగానూ, పల్లెల్లో ఒకమోస్తరుగాను ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మున్ముందు పల్లెపల్లెకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలన్న ప్రభుత్వ ఆలోచనకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. కొత్త సంవత్సరంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి భారతావని ఇంటర్నెట్ సామ్రాజ్ఞిగా మార్చేసే అవకాశం ఉంది.


గూగుల్ ముందంజ
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్‌కు కొత్త సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంటర్నెట్ సెర్చ్ ట్రాఫిక్‌లో 64.9 శాతం మార్కెట్‌ను గూగుల్ సొంతం చేసుకుంది. యాహు, బింగ్ వంటివి గూగుల్‌కు దరిదాపుల్లో లేవు.


ఫేస్‌బుక్
కబుర్లు, మాటామంతీ, వ్యాఖ్యలు, వీడియో, ఫొటో షేరింగ్, చాటింగ్‌కు వీలుగా జనం చేతిలో వేదికగా మారిపోయిన ఫేస్‌బుక్ మున్ముందు సరికొత్త సౌలభ్యాలను అందించనుంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారిలో 56శాతంమంది విధిగా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. డిసెంబర్ -2014 నాటికి ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 11.8 కోట్లమంది అయితే గత ఏడాది డిసెంబర్ 2015నాటికి ఈ సంఖ్య 13.2కోట్లకు చేరింది. సోషల్ నెట్‌వర్క్ వినియోగంలో 54.4 శాతంతో ఫేస్‌బుక్ ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. కొత్త సంవత్సరంలోనూ ఇదే పోకడ ఉంటుంది. కొత్త ప్రాంతాల్లో, ముఖ్యంకా చైనాలో ఫేస్‌బుక్ కొత్త మార్కెట్‌ను సృష్టించుకునే అవకాశాలున్నాయి.


వాట్సాప్
భారత్‌లో ఇప్పుడు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య అక్షరాలా 90కోట్లు. టెక్స్ట్, ఫొటో షేరింగ్ యాప్‌ను చిన్నాపెద్దా నిరంతరం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మిగతా సామాజిక మాధ్యమాలు చిన్నబోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లు బిజీ అయిపోయాయి. స్నాప్‌చాట్, వియ్‌చాట్, లైన్ వంటి ఇతర ఫొటోషేరింగ్ యాప్‌లు పోటీలో ఉన్నప్పటికీ అది పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. వాట్సాప్ ఇప్పుడు కేవలం, మెసేజింగ్, ఫొటో షేరింగ్, చాటింగ్‌కే పరిమితమైంది. మున్ముందు వీడియో ఛాటింగ్ అవకాశంకూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. అదే జరిగితే ప్రభంజనమే. ఇప్పటికే అనేక సేవలు, చాలావరకు ఉచితంగా అందిస్తున్న యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు యాప్‌ల వల్ల ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని పుంజుకుంటున్నాయి. ఏ సమాచారాన్నైనా, సేవలనైనా యాప్స్‌ద్వారా చాలావరకు ఉచితంగా పొందే అవకాశాన్ని అందించి తద్వారా వ్యాపారాన్ని వృద్ధిచేసేలా కొత్తరకం యాప్‌లను రూపొందిస్తున్నాయి.


యూ ట్యూబ్
వీడియోషేరింగ్ అవకాశం ఉన్న ఈ మాధ్యమానికి ఆదరణ ఉన్నప్పటికీ ఫేస్‌బుక్ కన్నా వెనుకబడే ఉంది. నిజానికి మనదేశంలో 7 నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలు సైతం యూ ట్యూబ్ వినియోగంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంగీతం, గేమింగ్, జంతువులకు సంబంధించిన దృశ్యాలను వీరు వీక్షిస్తున్నారు. యూ ట్యూబ్ ఖాతా తెరవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. కానీ, ఈ జనరేషన్ పట్టించుకోవడం లేదు. వివిధ వెబ్‌సైట్లలో వీడియో యాడ్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. యూ ట్యూబ్ సహాయంతో వీడియోయాడ్ మార్కెట్ మున్ముందు మరింత విస్తృతం కానుంది. బింగ్, యూట్యూబ్ వంటి సంస్థలు ఇప్పటికే వీడియోయాడ్ ప్యాకేజీలు ప్రకటించాయి. వాటికి మంచి స్పందనకూడా లభిస్తోంది. గూగుల్‌కూడా ఇప్పుడు ‘ఇన్-సెర్ప్’ వీడియో అడ్వర్టయిజింగ్ విధానాన్ని తీసుకొస్తున్నది.


ఇన్‌స్టాగ్రామ్
ఈ ఫొటోషేరింగ్ యాప్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య మనదేశంలో 40 కోట్లు. రోజుకు 80 మిలియన్ ఫొటోలను వీరు ఒకరికొకరు పంపించుకుంటున్నారు. ట్విట్టర్ కన్నా దీని వినియోగదారులే ఎక్కువ. మున్ముందు ఈ యాప్ మరికొన్ని సౌకర్యాలు కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయాన్ని, మార్కెట్‌ను పెంచుకున్న ఈ సంస్థ సరికొత్త ప్రయోగాలకు వేదికకాబోతోంది.


ట్విట్టర్
ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్‌లో 17శాతంమంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఎక్కువమంది ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నవారితో జపాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 2.6 కోట్లమంది నెట్ వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు. 2.2 కోట్లమందితో భారత్ రెండోస్థానంలో ఉంది. మనదేశంలో గతేడాది 1.7 కోట్లమంది ట్విట్టర్ వినియోగదారులుంటే డిసెంబర్-15నాటికి 2.2కోట్లకు ఆ సంఖ్య పెరిగింది. మరో మూడేళ్లలో 16కోట్లమంది ట్విట్టర్ ఖాతాదారులుంటారని అసోచామ్ అంచనావేసింది. గతేడాది ట్విట్టర్‌కు పెద్దగా కలిసివచ్చిందేమీలేదు. వినియోగదారుల సంఖ్య పెరిగిందికానీ ఆదాయంలో గణనీయమైన మార్పు లేదు. కొత్త ఫీచర్లు ప్రవేశపెడితే దశ తిరగవచ్చు. కొత్త ఎమోజీ టూల్స్, అభివృద్ధి చేసిన ‘ఎంగేజ్‌మెంట్ ఆప్షన్స్’ తీసుకొస్తే మంచిరోజులే. ట్విట్టర్‌ను ఈ ఏడాది గూగుల్ కొనుగోలు చేస్తుందని, గూగుల్ ప్లస్‌కు బదులు దీనిని ప్రమోట్ చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.


ఏటేటా ఎంతో వృద్ధి..
అంతర్జాల వినియోగం, అంకుర పరిశ్రమల (స్టార్టప్స్) ఆవిర్భావం, సామాజిక మీడియా జోరు, ఇ-కామర్స్‌లో క్రయవిక్రయాలు వంటి విషయాల్లో 2015 సంవత్సరానికి సంబంధించి మన దేశంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోగా, కొత్త సంవత్సరంలో వీటి వృద్ధి మరింత అధికం కాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటికీ ‘అంతర్జాలం’ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. మన దేశంలో అంతర్జాల వినియోగం 2014లో కంటే 2015లో దాదాపు 49 శాతం వృద్ధి చెందింది. ‘నెట్’ వినియోగదారుల్లో 60 శాతం మంది మొబైల్ ఫోన్ల ద్వారానే ఈ సేవలు పొందుతున్నారు. 2015 అంతానికి ‘నెటిజన్ల’ సంఖ్య 213 మిలియన్లు దాటుతుందని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా టెలికామ్ నెట్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం విస్తరింపజేసింది. మన దేశంలో కళాశాల విద్యార్థులు రోజుకు కనీసం 8 గంటలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు 5 నుంచి 8 గంటల సేపు, పాఠశాల విద్యార్థులు వారాంతపు సెలవుల్లో 3-4 గంటలు ‘అంతర్జాలం’తో గడుపుతున్నారు. ఇంటాబయటా ‘నెట్’ వినియోగం పెరగడంతో కార్యాలయాల్లోనే కాదు, పార్కులు, పర్యాటక కేంద్రాల్లో, బస్సుల్లో, రైళ్లలో ‘వైఫై’ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ వద్ద వసతి పొందేవారికి ‘ఉచిత వైఫై సౌకర్యం’ అంటూ హోటళ్లు, ఉమెన్స్ హాస్టళ్లు ప్రచారం చేస్తున్నాయంటే ‘నెట్’ వాడకం ఎంతగా అనివార్యమైందో ఊహించవచ్చు. ‘నెట్’ సౌకర్యం కల్పించే టెలికామ్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రైవేటు సంస్థల మధ్య పోటీ పెరగడంతో వినియోగదారులన్ని తమ వలలో వేసుకునేందుకు ప్యాకేజీల ఆఫర్లు, రాయితీల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ‘కొత్త’ అనుకుంటున్నది రేపటికి ‘పాత’ అయిపోతోంది. వేగవంతమైన ‘నెట్’ సేవలు అందించేందుకు 2జి,3జి, 4జి.. ఇలా ఎప్పుడు ఏ ‘ప్రోడక్టు’ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేస్తుందో, ఏది ఎంత తొందరగా అదృశ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోదారులను మెప్పించడానికి ‘ప్రచార యుద్ధం’ జోరుగానే సాగుతోంది. విజ్ఞానం, వినోదంతో పాటు పలురకాల సేవలందించేందుకు విభిన్న ‘యాప్స్’ రంగప్రవేశం చేస్తున్నప్పటికీ గూగుల్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా వంటి బ్రౌజర్ల హవా మాత్రం ఇంకా కొనసాగుతోంది. ‘నెటిజన్ల’ సంఖ్యతో పాటు వారి ఆకాంక్షలు, అవసరాలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో స్టార్టప్స్, ఇ-కామర్స్, సోషల్ మీడియా వృద్ధి భారీగానే ఉంటుందన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తృత వినియోగంలోకి వచ్చాక అత్యధిక జనాభా ఉన్న భారత్ ఐటీ సంస్థలకు కల్పతరువుగా కన్పిస్తోంది. ప్రభుత్వాల ప్రాధామ్యాలు కూడా వాటికి అనుకూలంగానే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌వంటి సంస్థలు ధారాళంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఫలితంగా భారత్‌లో మేలిమార్పులు తప్పవు. కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక వాటి వినియోగంలో విచక్షణ పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. విపరీతపోకడలకు పోయి దుర్వినియోగం చేస్తే మిగిలేది అనర్థమే.

జీవితంలో చాలా మార్పులు
ఇప్పుడు కరోనా కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పిల్లల చదువు లు కూడా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. అరచేతిలో అంతర్జా లంతో ప్రపంచం కుగ్రామమైంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన జీవితంలో విషాదం చోటు చేసుకోక మానదు. అంతర్జాలం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూ టర్లను కలిపే వ్యవస్థ. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్‌.

వ్యక్తుల, సంస్థల నుండి ప్రభుత్వపరిపాలన దాకా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది టివి ఛానళ్లు, వార్తా పత్రికలు, అలాగే విద్యార్థుల చదువ్ఞలు, ఫలితాలు, కౌన్సిలింగ్‌, మీసేవా లాంటి సేవలన్నింటిని అంతర్జాలంలో సంబంధం లేకుండా ఊహించలేం. అపరిమిత డేటా ఆఫర్లు వచ్చాక మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. అదే సమయంలో గుర్తింపు, భద్రత లేని యాప్స్‌ ద్వారా మొబైల్‌ యూజర్ల డేటా లీక్‌ అవ్ఞతోంది. ‘మీరు వాడే ప్రోడక్ట్స్‌కు డబ్బులు చెల్లించకపోతే మీరే ప్రొడక్ట్‌ అవుతారు.

అంటే ఏదైనా ఉచితంగా ఉపయోగించాలని చూస్తే మనమే ప్రొడక్ట్స్‌గా మారాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ లను మనం దాదాపు ఉచితంగానే ఉపయోగిస్తున్నాం. మరి ఇవి నిజంగానే ఉచితంగా సేవలు అందిస్తున్నాయా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది. మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటూ ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు డబ్బులు సంపాదిస్తుంటాయి. భారత్‌లో వాట్సాప్‌కు సుమారు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జర్మనీ డేటా సంస్థ స్టాటిస్టా చెబుతోంది. ఈ దరిమిలా ఇటీవల వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానం వివాదానికి తెరలేపింది.

భారత్‌తోపాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో వాట్సాప్‌ మార్పులు చేసింది. దీనితో వాట్సాప్‌ తమ ఖాతాదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకొని సొమ్ము చేసుకోవాలనే కుయుక్తికి తెర లేపిందని సైబర్‌నిపుణుల అభిప్రాయం. ఈ పాలసీ వినియోగదారులను సమస్యల సుడిగుండంలోకి లాగుతుందని సైబర్‌ చట్టాల నిపు ణుడు ‘వాట్సాప్‌ లా పుస్తక రచయిత వ్యాఖ్యానించారు. భారతీయుల వ్యక్తిగత గోప్యతా హక్కులతోపాటు భారతీయ చట్టాలను సైతం ఈ కొత్త పాలసీ ఉల్లంఘిస్తోందని ఆయన వివ రించారు.ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల నకిలీ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

నకిలీ ఫోన్‌ నెంబర్లను ఉపయోగించి గిఫ్ట్స్‌ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరు ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, కోల్‌కతాలో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి సిమ్‌కార్డులు తీసుకొని ఓఎల్‌ఎక్స్‌లో సరసమైన ధరలకు వాహనాలు, ఫోన్లు, ఇతరత్రా వస్తువ్ఞలు ఇస్తామంటూ డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాక ఫోన్‌ ఆఫ్‌ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా ఆర్మీ అధికారుల ఫొటోలు, పేర్లను ఉపయో గిస్తుంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసా లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగురెట్లు పెరిగాయని పోలీసులు వెల్లడించారు.

‘మీకు కోట్ల విలువైన బహుమతి వచ్చింది. పదివేలు పంపితే మీఇంటికి చేరుతుంది. మేము మీ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం మీ ఆన్‌లైన్‌ ఖాతాలను సరిచేస్తున్నాం, ఓటిపి చెప్పండి. అని నిన్నమొన్నటి వరకు హర్యానా, రాజ స్థాన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు దోపిడీలకు పాల్పడే వారు. ఇప్పుడు పంథా మార్చి అందమైన అమ్మాయిలతో హనీట్రాప్‌ చేయిస్తున్నారు. అంతర్జాలంలో అనవసర విషయాల పట్ల మన అమూల్యమైన సమయం వృధా అవుతుంది. కావున మంచి, అవసరమైన విషయాల కోసం మాత్రమే అంతర్జాలాన్ని ఉపయో గించాలి. మీ ఖాతా కోసం పాస్‌ వర్డ్‌ను సృష్టించేటప్పుడు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, చిహ్నాలు, అంకెల మిశ్రమాన్ని ఉపయోగించాలని నిర్దారించుకోండి. గుర్తుంచుకోవడం కష్టమైనా అది మీ డేటాను రక్షిస్తుంది.

నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాం కింగ్‌, మొబైల్స్‌, సోషల్‌ మీడియాలకు ఒకే పాస్‌ వర్డును వాడకుండా చూసుకోవాలి. మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడే ఫోన్‌లో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం మంచిది. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు లేదా మీ ఆన్‌లైన్‌ బ్యాంకుఖాతాకు లాగిన్‌ అయినప్పుడు యుఆర్‌ఎల్‌కు బదులుగా హెచ్‌టిటిపితో ప్రారంభమవేతుందని గమనించండి.శాస్త్ర సాంకే తిక విజ్ఞ్ఞానాన్ని సరైనరీతిలో ఉపయోగించడం వల్ల గణనీయ మైన అభివృద్ధిచోటు చేసుకుంటుంది.కాని దానిని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించినప్పుడే అనర్థాలకు దారి తీస్తుంది.
-మధురిమ/గుండు కరుణాకర్