అపరిచితుల సుపరిచితుల దర్పణం వనవీరులు

ప్రసిద్ధమైన చరిత గల దేశం మన భారతదేశం, నిర్మాణ భౌగోళిక సాంప్రదాయ రైతుల్లో సైతం అందరికీ ఆదర్శంగా నిలిచే రతగర్భమైన మన దేశం కారణాలు ఏవైనా ఎక్కువకాలం పరాయి పాలకుల ఏలుబడిలో సన్నబడటంతో పాటు తురష్కుల దండయాత్రలో ఎన్నో విలువైన మన సాంప్రదాయ కట్టడాలు, శిల్పాలు సిధిలం చేయబడ్డాయి.
ఈ విధంగా అణచబడి పీడిరచటం ద్వారా చైతన్యం రగిలి తిరుగుబాట్లు పెరిగి స్థానికంగా జాతీయంగా అనేకమంది నాయకులు, వీరులు, పుట్టుకొచ్చి భరతమాత ఆత్మగౌరవాన్ని కాపాడారు అటువంటి వీరుల్లో మన మూలవాసులుగా చెప్పబడే ఆదివాసుల్లో అనేకమంది వీరోచితంగా ముందుకు వచ్చి పరపాలనను అంతం చేసే దిశగా అడుగులు వేసి అమరులైన వారు కొందరు,విజయం సాధించిన వారు మరికొందరు.
నేటి యువతకు చైతన్య స్ఫూర్తి పంచడమే లక్ష్యంగా నాటి మన వనవీరుల పోరాట స్ఫూర్తిని త్యాగాలను కళ్ళకు కట్టినట్టు అందించే ప్రయత్నంలో భాగంగా వనవాసి కళ్యాణాశ్రమం వెలువరించిన అత్యంత విలువైన పుస్తకం ‘‘వనవీరులు మన వీరులు’’, జోషుల మల్లీశ్వరిగారి కలం సాయంతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకంలో అందరికీ సుపరిచితులైన అల్లూరి, కొమరం భీమ్‌, పూజ్యశ్రీ గురూజీ,లతో పాటు చరితపుటల్లో మరుగున పడిపోయిన బుధు భగవత్‌, తలక్కల్‌ఓ చందు,చక్ర బిసోయి, వంటి అపరిచిత సమరయోధుల వివరాలు క్షుణ్ణంగా పొందుపరచబడ్డాయి.
బికడ భీం మొదలుకొని కొమరం భీమ్‌ వరకు గల మొత్తం 24 మంది వనవీరుల వివరాలు పరాయి పాలన పై వారు చేసిన వీరోచితమైన సాహసాలు ఇందులో మనం చదువుకోవచ్చు పరాయి పాలనపై తిరుగుబాటు చేసిన వారు కొందరైతే, తమ గిరిజన జన జాతిలో గల మూఢవిశ్వాసాల నిర్మూలన, మద్యం, మాంసం, వంటి వ్యసనాల నుంచి దూరం చేసి ఆధ్యాత్మిక భావం వైపు పయనింపజేసినవారు మరికొందరు,
ఈ రెండు వర్గాలకు చెందిన వారిలో ఒకరు ‘‘దితియాబాప్ప’’ గుజరాత్‌ రాజ్యంలోనే మారుమూల గిరిజన గ్రామం అయిన వీరవన్లో జన్మించిన ఈ గిరిజన వీరుడు తన ప్రాంతంలోని అత్యంత వెనుకబడ్డ గిరిజనులను వ్యసనాల నుంచి దూరం చేసి భక్తి భావం అలవర్చి అన్య మతాల ఊబిలో పడకుండా కాపాడిన ఆధ్యాత్మిక సంస్కర్తగా చెప్పవచ్చును. ఈ గిరిజన ఋషి చేసిన ఆధ్యాత్మిక కృషి ఆ ప్రాంతంలో నేటికి అలరారడం విశేషం 111 సంవత్సరాల పాటు జీవించిన ఈ సంస్కర్త తన యావత్‌ జీవితాన్ని భక్తి ప్రచారానికి సమాజ హితానికి అంకితం చేశారు.
నాటి చోటా నాగపూర్‌ కు చెందిన మరో వనవీరుడు ‘‘బుధుభగత్‌’’ కూడా తన కృత్యాలతో తన జనజాతి పై ఎంతగానో ప్రభావితం చేసి నాటి బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటు చేసిన వీరుని గానే కాక ప్రథమ స్వాతంత్ర సమరం కన్నా ముందే స్వరాజ్య పోరాటం చేసిన వనవీరునిగా ఆయనను ఇందులో అభివర్ణించారు,ఇలా స్వరాజ్య సమరంలో పాల్గొని చరిత్ర పుటలకు చిక్కనిఎందరో సమరయోధులు మనకు ఉన్నారు.
అటువంటి అజ్ఞాత సమరయోధులు అందున వనవాసులైన యోధుల వివరాలు అరుదుగా ఉన్నాయి, ఈ పుస్తకంలో మున్నెన్నడు వినని సమరయోధుల జీవిత వివరాలు సమగ్రంగా సేకరించి వ్యాసాల రూపంలో అందించడం అభినందనీయం.
కేరళలోని వాయినాడు ప్రాంతానికి చెందిన వనవీరులు దేశ స్వరాజ్యం కోసం పోరాడిన సంతతికి చెందినవారుగా నేటికీ సగర్వంగా జీవిస్తున్న వైనం ఇందులో చెప్పారు, అంతేకాక స్వానుభవంతో కూడిన వారి గత అనుభవాలను గానం చేసుకుంటూ నేటికీ కేరళ అడవుల్లో సహజంగా ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ అందులోనే ఆనందం అనుభవిస్తూ జీవిస్తున్న తీరును కూడా వ్యాస రచయిత ఇందులో సమగ్రంగా పేర్కొన్నారు, ఆధునిక కేరళ రాష్ట్ర చరిత్రలో సర్వోత్తమ పౌరుష పరాక్రమాలకు పేరుగాంచిన ‘‘కేరళ వర్మ ‘‘అక్కడి వనవాసీలను గొరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరులుగా తీర్చిదిద్దిన వివరాలు కూడా మనం ఇందులో చదవవచ్చు.
ఈ వ్యాసపరంపరలో మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న గిరిజన జాతులు నాయకులు వారి వారి పోరాట పఠిమల గురించి సవివరంగా తెలుసుకోవచ్చును.
ఇక గిరిజన నాయకులు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే….అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌, రాణి దుర్గావతి, సేవాలాల్‌ మహారాజ్‌, తదితరుల వ్యాసాలు ఇందులో పొందుపరచబడ్డాయి,
గిరిజనేతరుడైన సీతారామరాజు అడవి బిడ్డలకు అండగా నిలిచి పోరాటం చేయడానికి గల కారణం, అందుకు స్ఫూర్తిగా నిలిచిన సంఘటనలు ఇందులో మనం గమనించవచ్చు.
అదేవిధంగా కొమరం భీమ్‌ సాయుధ పోరాటంలోనికి రావడానికి గల నేపథ్యం అప్పటి భౌగోళిక అంశాలు చాలా కూలంకషంగా వ్యాసకర్త వివరించిన వైనం ఆసక్తిదాయకంగా ఉంది, విషయ అవగాహన చక్కగా సాగింది.
ఈ వ్యాస సంపుటలోని వనవీరుల వివరాలు రెండు వర్గాలుగా విభజించారు, పరాయి పాలనకు కారకులైన బ్రిటిష్‌ వారిపై ప్రత్యక్ష తిరుగుబాట్లు చేసి స్వాతంత్రోద్యమ సమరయోధులైన వనవీరులు ఒక వర్గం అయితే గిరిజన సామాజిక వర్గంలో చైతన్యం తీసుకువచ్చి సంస్కరణలకు చేయూతగా నిలిచిన గిరిజన సంఘ సంస్కర్తలు మరో వర్గంగా విభజించారు ,ఆయా రంగాలలో వారు ప్రవేశించడానికి గల కారణం అనంతరం వారి కృషి సాధించిన విజయాలు గురించి సవివరమైన సంక్షిప్త సమాచార వేదికగా నిలిచింది ఈ ‘‘వనవీరులు మన వీరులు’’వ్యాస సంపుటి,
ఈ పుస్తకానికి నేపద్యం వివరిస్తూ ప్రకాశకులు అందించిన ప్రత్యేక సమాచారంలో, మన దేశంలో జరిగిన స్వాతంత్రోద్యమానికి దారులు వేసింది మొదట వనవాసులే…అనే చారిత్రక విషయం ఆవిష్కరించడంతోపాటు అనేక భారతీయ ఇతిహాసాలకు ఆనవాళ్లుగా నిలుస్తున్న మన దేశంలోని ప్రాంతాల సమాచారం కూడా ఇందులో పొందుపరిచారు .
శత్రు రాజ్యాలతో స్వరాజ్య సమరం సాగించి అమరులైన ఆదివాసి వీరుల సమాచారంతోపాటు, వనవాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాలరాచి వారిలో విభేదాలు సృష్టించి వారిని భారతీయ సంస్కృతికి దూరం చేస్తున్న సంస్కృతి శత్రువులపై పోరాటం చేసి సఫలమైన సంస్కృతి పరిరక్షక సంస్కర్తల కృషిని కూడా ఇందులో వివరించారు, అంతేకాక భారతదేశ భూభాగంలోని విభిన్న ప్రాంతాల్లోని వివిధ తెగలకు చెందిన మూలవాసులైన వనవాసుల వివరాలు సైతం సహేతుక రీతిలో వివరించిన వైనం ఉపయుక్తంగా ఉంది.
పరిశోధకుల పాలిట కరదీపకగా నిలిచే ఈ పుస్తకం విలువ వెలకట్టలేనిది అనడంలో అతిశయోక్తి లేదు.
సమీక్షకుడు:- డా: అమ్మిన శ్రీనివాసరాజు,
వనవీరులు మన వీరులు
(వ్యాస సంపుటి)
రచయిత్రి : జోష్యుల మల్లీశ్వరి పేజీలు : 272, వెల : 40/- రూ, ప్రతులకు : వనవాసి కళ్యాణ పరిషత్‌ 119,బి.సిరి సంపద రెసిడెన్సి,విద్యానగర్‌, హైదరాబాద్‌-44,ఫోను : 040-27091299.